పారిపోయిన ఇద్దరు పిల్లలు తిరిగి తమ ఇంటికి చేరుకోవడానికి 13 ఏళ్ళు పట్టింది... ఇన్నేళ్ళూ వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేశారు?

పిల్లలు మిస్సింగ్, ఆగ్రా, దిల్లీ

ఫొటో సోర్స్, NARESH PARAS

ఫొటో క్యాప్షన్, తప్పిపోయిన పిల్లల ఫోటోలతో నీతూ కుమారి
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2010 జూన్‌, ఎండలు బాగా మండుతున్న రోజులు, తల్లిదండ్రులు కొట్టారని అలిగిన అక్క, తమ్ముడు ఇంటి నుంచి పారిపోయారు.

పదకొండేళ్ల రాఖీ, ఏడేళ్ల బబ్లూ తమ ఊరి నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న అమ్మమ్మ ఊరు వెళ్లాలని భావించారు. అయితే, కొన్ని ఊహించని మలుపులతో వాళ్లు దారి తప్పారు.

వాళ్లు తప్పిపోయిన దారిని తిరిగి కనుక్కోవడానికి 13 ఏళ్లు పట్టింది. ఆ అక్క, తమ్ముడి తల్లి నీతూ కుమారికి బాలల హక్కుల కార్యకర్త ఒకరు సాయం చెయ్యడంతోనే ఇది సాధ్యమైంది.

“మా అమ్మను ప్రతి క్షణం మిస్ అవుతూనే ఉన్నాను. తిరిగి నా కుటుంబ సభ్యులను కలవబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది” అనాథాశ్రమంలో పెరుగుతున్న బబ్లూ నాతో ఫోన్‌లో చెప్పాడు.

డిసెంబర్‌లో వాళ్లిద్దరూ తల్లిని కలిసినప్పుడు చిత్రీకరించిన దృశ్యాలలో నీతూకుమారి చెమ్మగిల్లిన కళ్లతో బబ్లూని కౌగిలించుకుని ఏడుస్తూ ఉండిపోయారు. “మా అబ్బాయిని తిరిగి నా దగ్గరకు చేర్చినందుకు ధన్యవాదాలు” అంటూ దేవుడికి కృతజ్ఞతలు చెప్పారు.

తర్వాత బబ్లూ తన కంటే రెండు రోజుల ముందే ఇంటికి వచ్చిన రాఖీని హత్తుకున్నాడు. వాళ్లు దాదాపు దశాబ్ధకాలం తర్వాత తిరిగి కలుసుకున్నారు.

ఆగ్రా, దిల్లీ

ఫొటో సోర్స్, NARESH PARAS

ఫొటో క్యాప్షన్, 13 ఏళ్ల తర్వాత వచ్చిన కొడుకుని చూసి కన్నీరు పెట్టుకున్న నీతూ కుమారి

ఎలా విడిపోయారు...

నీతూ కుమారి, సంతోష్‌ ఆగ్రాలో రోజువారీ కూలీ పని జీవించేవారు. వారి పిల్లలే రాఖీ, బబ్లూ.

2010 జూన్ 16న నీతూ కుమారికి పని దొరక్కపోవడంతో ఆమె ఇంట్లోనే ఉండిపోయారు. పని దొరక లేదనే అసహనంతో గిన్నెలు పట్టుకునే పటకారుతో కుమార్తె రాఖీని కొట్టారు. తల్లి పని మీద బయటకు వెళ్లడంతో రాఖీ, బబ్లూ ఇంటి నుంచి పారిపోయారు.

“నేను సరిగ్గా చదవకపోతే ఒక్కోసారి మా నాన్న కూడా కొట్టేవారు. రాఖీ వచ్చి మనం అమ్మమ్మ ఇంటికి వెళ్లి అక్కడే ఉందామని చెప్పగానే నేను సరే అన్నాను.

వాళ్లు ఇంటి నుంచి పారిపోయిన తర్వాత ఓ రిక్షా డ్రైవరు వాళ్లను రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు.

రైలు ఎక్కిన తర్వాత వాళ్లను పిల్లల స్వచ్చంధ సేవా సంస్థలో పని చేస్తున్న ఓ మహిళ గుర్తించారు.

రైలు మీరట్ చేరుకున్న తర్వాత ఆ మహిళ పిల్లలిద్దర్నీ పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు వారిని ప్రభుత్వ అనాధశ్రమంలో చేర్చారు.

“మేము ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నామని మేము పోలీసులతో చెప్పాం. మా తల్లిదండ్రుల గురించి చెప్పేందుకు ప్రయత్నించాం. అయితే పోలీసులు కానీ అనాధాశ్రమం వారు కానీ మా మాటలు పట్టించుకోలేదు. మా తల్లిదండ్రుల గురించి వెతికే ప్రయత్నం చెయ్యలేదు” అని బబ్లూ చెప్పారు.

ఏడాది తర్వాత అనాధాశ్రమంలోనూ అక్క తమ్ముడు విడిపోవాల్సి వచ్చింది. రాఖీని దిల్లీ సమీపంలో బాలికల కోసం ఓ స్వచ్చంధ సంస్థ నడుపుతున్న ఆశ్రయ కేంద్రానికి పంపించారు. రెండేళ్ల తర్వాత బబ్లూని లఖ్‌నవూలోని మరో అనాధాశ్రమానికి పంపించారు.

మళ్లీ కలుసుకున్న అక్క, తమ్ముడు

లఖ్‌నవూలోని అనాథ ఆశ్రమానికి ఉన్నతాధికారులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, జర్నలిస్టులు వచ్చినప్పుడు బబ్లూ తన అక్క రాఖీ గురించి చెబుతూ ఉండేవాడు. వాళ్లు సాయం చేస్తే ఆమెను మళ్లీ కలుసుకోవచ్చనేది అతడి ఆశ.

2017లో అతని కోరిక నెరవేరింది. బబ్లూ ఉంటున్న హోమ్‌కు కొత్తగా వచ్చిన కేర్ టేకర్ అతని ఆవేదన విన్నారు. రాఖీ దిల్లీకి సమీపంలోని ఓ ఆశ్రమానికి పంపించారని బబ్లూ ఆమెతో చెప్పారు.

ఆమె దిల్లీకి దగ్గర్లో ఉన్న అనాధ ఆశ్రమాలు, స్వచ్చంధ సంస్థలకు ఫోన్లు చేసి రాఖీ వివరాలు చెప్పి, అలాంటి వారు ఎవరైనా ఉన్నారా అని అడగడం ప్రారంభించారు.

“నోయిడా, గ్రేటర్ నోయిడాలోని అనేక ఆశ్రమాలకు ఫోన్లు చేసిన తర్వాత ఒక రోజు ఆమెకు రాఖీ ఉంటున్న హోమ్ గురించిన వివరాలు తెలిశాయి” అని బబ్లూ చెప్పాడు.

పోలీస్, ఆగ్రా కంటోన్మెంట్

ఫొటో సోర్స్, NARESH PARAS

ఫొటో క్యాప్షన్, 2010లో రాఖీ, బబ్లూ కనిపించడంలేదని తల్లిదండ్రులు ఇచ్చిన పోలీస్ రిపోర్ట్

“నేను ప్రభుత్వానికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. అక్క తమ్ముడ్ని విడదీయడం క్రూరమైన చర్య. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, ఒకే తల్లికి పుట్టిన బిడ్డల్ని ఆశ్రమాల్లో ఒకే చోట ఉంచాలి. వాళ్లను విడదీయడం న్యాయం కాదు” అనేది బబ్లూ వాదన.

రాఖీ గురించి తెలిసిన తర్వాత బబ్లూ తరచుగా ఆమెతో ఫోన్‌లో మాట్లాడేవాడు. వారి సంభాషణలో తల్లిదండ్రుల ప్రస్తావన వచ్చినప్పుడల్లా రాఖీ “ 13 ఏళ్లు తక్కువ సమయం ఏమీ కాదు. అమ్మను కలుస్తామని నాకు పెద్ద ఆశ లేదు” అని చెప్పేవారు.

అయితే బబ్లూకి అలాంటి సందేహాలు ఏమీ ఉండేవి కావు “రాఖీని కలుస్తానని నాకు ఎప్పుడూ నమ్మకం ఉండేది. అలాగే మా తల్లిదండ్రుల వద్దకు వెళతామని కూడా నమ్మకం ఉంది” అని బబ్లూ చెప్పాడు.

తాను ఉన్న అనాధాశ్రమాల్లో ఒక చోట తన కంటే పెద్ద పిల్లలు, ఆశ్రమంలో కేర్ టేకర్ తనను కొట్టేవారని, దీంతో ఆశ్రమం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినట్లు బబ్లూ మాతో చెప్పాడు. రెండుసార్లు పారిపోయినా భయంతో వెనక్కి వచ్చేశానని అన్నాడు.

రాఖీ మాత్రం తాను ఉన్న ఎన్జీవోలో తనను బాగా చూసుకున్నారని చెప్పింది. ఇంటి దగ్గర ఉంటే మీ జీవితం మరోలా ఉండేదని ఎప్పుడైనా అనుకున్నారా అని రాఖీని నేను అడిగాను.

“జరిగింది ఏదైనా మన మంచికే జరిగింది. ఇంటి దగ్గర ఉంటే జీవితం కచ్చితంగా మరోలా ఉండేది” అని ఆమె అన్నారు.

“నాకు వాళ్లకు ఎలాంటి సంబంధం లేకపోయినా, వాళ్లు నన్ను బాగానే చూసుకున్నారు. నన్ను ఎవరూ కొట్టలేదు. మంచి స్కూలులో చదివించారు. అక్కడ మెరుగైన వైద్య వసతులు ఉన్నాయి. పెద్ద నగరానికి దగ్గరలో మంచి జీవితం ఇచ్చారు” అని రాఖీ చెప్పారు.

అనాథఆశ్రమం, నోయిడా

ఫొటో సోర్స్, NARESH PARAS

ఫొటో క్యాప్షన్, వీడియో కాల్‌లో కుమారుడిని చూసిన తర్వాత కన్నీటి పర్యంతమైన నరేష్ పారస్

కుటుంబాన్ని కలిపిన బాలల హక్కుల కార్యకర్త

డిసెంబర్ 20న ఆగ్రాలో నవశించే బాలల హక్కుల కార్యకర్త నరేష్ పారస్‌కు బబ్లూ నుంచి ఫోన్ వచ్చింది.

“మీరు అనేకమంది పిల్లల్ని వారి తల్లిదండ్రులతో కలిపారు. నాకు కూడా అలాంటి సాయం చేయగలరా?” అని బబ్లూ ఆయననన ఫోన్‌లో అడిగాడు.

2007 నుంచి పిల్లల హక్కుల కోసం పోరాడుతున్న పారస్ బబ్లూ మాటలు విన్న తర్వాత అదంత తేలికైన వ్యవహారం కాదని చెప్పారు.

ఆ పిల్లలిద్దరికీ తమ తండ్రి పేరు గుర్తు లేదు. వాళ్లకు ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డులలో తండ్రి పేరు వేరుగా ఉంది. వాళ్లు ఏ జిల్లా నుంచి, ఏ రాష్ట్రం నుంచి అనాథ ఆశ్రమానికి వచ్చారనే దాని గురించి కూడా సరైన వివరాలు లేవు. చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుంచి వాళ్లిద్దరూ తప్పి పోయి వచ్చినట్లు రికార్డుల్లో ఉంది. పారస్ బిలాస్‌పూర్‌లో పోలీసులు, అనాథ ఆశ్రమాలకు ఫోన్ చేసినా ఎలాంటి స్పందన లేదు.

రైల్వే స్టేషన్ బయట ఒక డమ్మీ రైల్ ఇంజన్ ఉండేదని, దాన్ని తరచూ తాను ఎక్కేవాడిననే విషయం బబ్లూకి గుర్తు రావడంతో పరిస్థితి మారింది.

“అలా అయితే అది ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్ అయి ఉండవచ్చు. అక్కడే అలాంటి డమ్మీ ఇంజన్ ఒకటి ఉంది” అని పారస్ చెప్పారు.

ఆగ్రాలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పాత రికార్డులను తిరగేశారు. 2010 జూన్‌లో జగదీష్‌పుర పోలీస్ స్టేషన్‌లో వాళ్ల తండ్రి ఇచ్చిన కంప్లైంట్ కాపీ దొరికింది.

ఆ కాపీలో అడ్రస్ ఆధారంగా అక్కడకు వెళ్లిన పారస్‌కు అక్కడ వాళ్లు కనిపించలేదు. వాళ్లు అప్పట్లో అద్దెకు ఉండేవారని, తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లినట్లు తెలిసింది.

తర్వాత ఒక రోజు రాఖీ తన తల్లి పేరు నీతు కుమారి అని ఆమెకు మెడ మీద కాలిన మచ్చ ఉండేదని పారస్‌తో చెప్పింది.

పారస్ ఒక రోజు లేబర్ చౌక్‌కు వెళ్లారు. రోజువారీ కూలీలు ప్రతీరోజూ అక్కడకు వచ్చి పని కోసం వేచి చూసేవారు. అక్కడ ఆయనకు నీతూ కనిపించలేదు. అయితే కొంతమంది కూలీలు ఆయన చెప్పిన వివరాలు విని, ఆమె తమకు తెలుసని, ఆమెతో విషయం చెబుతామని పారస్‌కు చెప్పారు.

తన పిల్లలు ఉన్నారని తెలియడంతో నీతూ కుమారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. దీంతో పోలీసులు పారస్‌కు కబురు పంపించారు.

నీతూ కుమారి, పారస్

ఫొటో సోర్స్, NARESH PARAS

ఫొటో క్యాప్షన్, పిల్లలు, నరేష్‌ పారస్‌‌తో నీతూ కుమారి

13 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన కుటుంబం

పారస్ నీతు ఇంటికి వెళ్లి ఆమెను కలిశారు. ఆమె తన పిల్లల ఫోటోలతో పాటు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన కాపీని కూడా ఆయనకు చూపించారు. ఆయన వీడియో కాల్ ద్వారా బబ్లూ, రాఖీలను చూపించడంతో ఆమె వాళ్లను గుర్తు పట్టారు.

“రాఖీని కొట్టినందుకు చాలా సార్లు బాధ పడ్డాను” అని నీతు కుమారి పారస్‌తో చెప్పారు. పిల్లలు వెళ్లిపోయిన తర్వాత వాళ్లను కనుక్కునేందుకు అనేక రకాలుగా కష్టపడ్డానని, ప్రయత్నాలు చేసిన విషయం కూడా ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

“నా పిల్లలు పట్నా వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్నారని ఎవరో చెప్పడంతో డబ్బులు లేకపోతే అప్పు తీసుకుని పట్నా వెళ్లాను. అక్కడ గుళ్లు, మసీదులు, గురుద్వారా, చర్చ్‌లన్నింటి వద్దా వెతికాను. వాళ్లు క్షేమంగా వెనక్కి రావాలని ప్రతీ చోటా ప్రార్థించాను” అని చెప్పారు.

పిల్లలు తిరిగి వచ్చిన తర్వాత ఆమె వాళ్లను చూసి కన్నీటి పర్యంతం అయ్యారు. వాళ్లను హత్తుకుని ఏడ్చారు. తనకు ఇది మరో జీవితం అని చెప్పారు.

ఇదంతా ఏదో సినిమాలా ఉందన్నారు రాఖీ. ఎందుకంటే తన తల్లిని తాను మళ్లీ చూస్తానని ఎప్పుడూ అనుకోలేదని, తల్లిని కలిసిన తర్వాత చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

“పారస్‌తో నేను మాట్లాడిన వారం రోజుల్లోపే ఆయన నా కుటుంబాన్ని కనుక్కోవడం అద్భుతమైన విషయం. పోలీసులు, ఎన్జీవోలోని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వాళ్లు ఎప్పుడూ నన్ను పట్టించుకోలేదు. అమ్మతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. ఆమె ఏడుస్తూ నువ్వు ఎందుకు నన్ను వదిలి వెళ్లావు అని అడిగారు. నేను ఎప్పుడూ నిన్నొదిలి వెళ్లలేదు. కేవలం తప్పిపోయానంతే” అని బబ్లూ చెప్పాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)