వర్జిన్ బర్త్: మగ మొసలితో కలవకుండానే సొంతంగా గర్భం దాల్చిన ఆడ మొసలి

మొసలి అండం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పల్లబ్ ఘోస్
    • హోదా, బీబీసీ సైన్స్ కరెస్పాండెంట్

కోస్టా రికాలో ఓ జంతు ప్రదర్శనశాలలో మగ మొసలి సాయం లేకుండా ఒక ఆడ మొసలి సొంతంగా గర్భం దాల్చిన తొలి కేసు నమోదైందని తాజా అధ్యయనంలో తేలింది.

ఆడ మొసలి పిండంలోని అండంలో 99.9 శాతం దాని జన్యువులే ఉన్నట్లు వెల్లడైంది.

ఇలా సొంతంగా గర్భం దాల్చడాన్ని ‘వర్జిన్ బర్త్’ అని పిలుస్తారు. పక్షులు, చేపలు, ఇతర సరీసృపాల్లో ఇలాంటి ప్రత్యుత్పత్తులు జరుగుతూ ఉంటాయి. కానీ మొసలిలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు.

ఈ పరిణామ క్రమం వారసత్వంగా సంక్రమించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. డైనోసర్లు కూడా స్వీయ ప్రత్యుత్పత్తిని కలిగి ఉండేవేమోనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

2018 జనవరిలో పార్క్యూ రెప్టిలాండియాలో ఒక 18 ఏళ్ల ఆడ అమెరికా మొసలి గుడ్డు పెట్టింది.

లోపల పిండం పూర్తిగా ఏర్పడిన తర్వాత అది చనిపోయింది. అంటే ఇది పొదగకుండా మురిగిపోయింది.

గుడ్డు పెట్టిన ఈ ఆడ మొసలిని రెండేళ్ల వయసులో ఉన్నప్పుడే ఈ జంతు ప్రదర్శనశాలకి తీసుకొచ్చారు. ఇది జీవితాంతం ఇతర మొసళ్లకు దూరంగా ఉంది.

ఈ కారణంతోనే, శాస్త్రీయంగా పార్థెనోజెనిసిస్ అని పిలిచే వర్జిన్ బర్త్‌లో ప్రాముఖ్యత కలిగిన వర్జినియా పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలను పార్క్ సైన్స్ టీమ్ సంప్రదించింది.

ఈ ఆడ మొసలి పిండాన్ని వీరు పూర్తిగా పరిశోధించారు. దీనిలో 99.9 శాతానికి పైగా జన్యువులు తల్లివే ఉన్నట్లు గుర్తించారు. దీనికి తండ్రి లేడని వారు ధ్రువీకరించారు.

అమెరికా ఆడ మొసలిలో వర్జిన్ బర్త్

ఫొటో సోర్స్, Getty Images

ఇలా గర్భం దాల్చడం సాధారణమా?

మొసళ్లలో వర్జిన్ బర్త్‌లు సర్వసాధారణమని, కానీ ఇప్పటి వరకు వీటిని గుర్తించలేదని చెబుతూ ది బ్రిటీష్ అకాడమీ ఆఫ్ సైన్సస్‌కు చెందిన బయోలజీ లెటర్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ జర్నల్‌లో ఈ అధ్యయనాన్ని ప్రచురించారు.

ఎందుకంటే ఇలాంటి సంఘటనల కోసం ఎప్పుడూ పరిశోధించలేదన్నారు.

మగ జాతి లేనప్పుడు అండ సామర్థ్యం ఎలా ఉంటుందనే దాన్ని పరిశోధించాలని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు.

‘‘సామర్థ్యం కలిగిన ఆడ జాతుల్లో ఇలాంటి వర్జిన్ బర్త్‌లు జరుగుతున్నప్పటికీ, మగ జాతితో స్త్రీ జాతి పునరుత్పత్తి జరుగుతుండటంతో ఇలాంటి కేసులు లెక్కల్లోకి రాకుండా పోతుండొచ్చు’’ అని అన్నారు.

అయితే సరీసృపాల్లో ఎందుకు పార్థెనోజెనిసిస్ జరుగుతుందో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.

కానీ, శాస్త్రీయతలో ఇలాంటి కేసులు తరుచుగా జరుగుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. అసలు ఇలా ఎలా జరుగుతుందో తెలుసుకోవడం కోసం ప్రస్తుతం పరిశోధకులు పనిచేస్తున్నారు.

క్షీరదాలు కనుమరుగయ్యే దశలో ఉన్నప్పుడు, వీటి సంఖ్య తగ్గిపోయినప్పుడు పార్థెనోజెనిసిస్ ద్వారా క్షీరదాలలో వర్జిన్ బర్త్‌లు జరుగుతాయనే ఒక శాస్త్రీయ సిద్ధాంతం ఉంది.

‘‘అంతరించిపోతున్న మొసలి జాతులు ముఖ్యంగా డైనోసార్ల పునరుత్పత్తి సామర్థ్యాల గురించి ఈ కొత్త కేసు మరింత సమాచారాన్ని అందిస్తుంది’’ అని శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)