Zombie: 50,000 ఏళ్ల కిందట సమాధైన ఈ వైరస్ మళ్లీ ఇప్పుడెలా ఉనికిలోకి వచ్చింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పృథ్వీరాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వేల ఏళ్ల కిందట, ఆధునిక మానవులు ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోని కాలం నాటి ప్రాచీన వైరస్‌లు కొన్ని ఇప్పుడు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి.
ఇప్పటికే కరోనావైరస్ మహమ్మారి సృష్టించిన విలయం నుంచి ఇంకా తేరుకోని మానవాళిని.. కొత్తగా బయట పడుతున్న పురాతన వైరస్‌లు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.
వాతావరణ మార్పు వల్ల ప్రాచీన మంచు ఫలకాలు (పెర్మాఫ్రాస్ట్) కరిగిపోతుండటం మానవాళికి సరికొత్త ముప్పుగా పరిణమించగలదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
అలాంటి పెర్మాఫ్రాస్ట్‌లో దాదాపు 50 వేల సంవత్సరాల కిందట సమాధి అయిన కొన్ని రకాల వైరస్‌లను రష్యా, యూరప్ శాస్త్రవేత్తలు తాజాగా కనుగొని వాటిని పునరుజ్జీవింపజేశారు.
ఈ అధ్యయనాన్ని బయాలజీ పరిశోధనలకు సంబంధించిన biorxiv.org లో ప్రచురించారు. ఈ జాంబీ వైరస్ వార్త వైరల్‌గా మారింది. ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో మీమ్‌లు వెల్లువెత్తాయి.
ఏమిటీ జాంబీ వైరస్?
సైన్స్ ఫిక్షన్ హర్రర్ సినిమాల్లో జాంబీ అనేది ఒక జానర్.
ఏదో ఒక ప్రమాదకరమైన వైరస్ సోకి మనుషులంతా మరణం లేని జీవచ్ఛవాల్లా మారిపోవటం, అది మానవాళి మొత్తాన్నీ కబళించటం, ఆ విధంగా మానవ నాగరికత అంతమైపోవటం అనేది ఆ కల్పనల సారాంశం.
అలా మరణం లేకుండా వేల ఏళ్లుగా బందీలుగా ఉన్న వైరస్‌లను జాంబీ వైరస్‌లు అని అంటుంటారు.
అలాగే ఆ వైరస్‌ల వల్ల.. జాంబీ కల్పనల తరహాలో మానవాళికి పొంచి ఉన్న పెను ముప్పును సూచించటానికి కూడా ఈ మాటను వాడుతుంటారు.

ఫొటో సోర్స్, CNRS-AMU
ఎక్కడిదీ జాంబీ వైరస్?
రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఒక మంచు సరస్సు కింద దాదాపు 48,500 సంవత్సరాల కిందట సమాధి అయిన కొన్ని ‘జాంబీ వైరస్’లను యూరోపియన్ శాస్త్రవేత్తలు తాజాగా పునరుద్ధరించారని ఏఎన్ఐ వార్తా సంస్థ ఒక కథనంలో తెలిపింది.
న్యూయార్క్ పోస్ట్ కథనాన్ని ఉటంకిస్తూ ఏఎన్ఐ వివరించిన దాని ప్రకారం.. సైబీరియా ప్రాంతంలోని పెర్మాఫ్రాస్ట్ కింద దాదాపు అర లక్ష సంవత్సరాల కిందట సమాధి అయిన 13 కొత్త రకాల వైరస్‌ల నమూనాలను శాస్త్రవేత్తలు సేకరించారు. రష్యా, జర్మనీ, ఫ్రాన్స్‌లకు చెందిన శాస్త్రవేత్తల బృందం.. ఈ వైరస్‌లను పరిశీలించి, వాటిని పునరుద్ధరించి, వర్గీకరించింది.
ఇంతకుముందు ఇదే శాస్త్రవేత్తల బృందం సైబీరియాలో 30,000 ఏళ్ల కిందట సమాధి అయిన వైరస్‌లను గుర్తించింది. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొడుతూ 48,500 ఏళ్ల కిందటి వైరస్‌లను వెలికి తీసి, పునరుద్ధరించింది.
పాండోరావైరస్ పేరు ఎందుకు?
తాజాగా గుర్తించిన 13 వైరస్‌లలో ఒక వైరస్‌ను.. గ్రీకు పురాణాల్లోని ‘పాండోరా’ అనే స్త్రీ పేరుతో ‘పాండోరావైరస్ ఎడోమా’ అని పిలుస్తున్నారని అవుట్‌లుక్ ఒక కథనంలో చెప్పింది.
ఆ పురాణాల ప్రకారం గ్రీకు దేవతలు సృష్టించిన తొలి స్త్రీ పాండోరా. ఆమె ఒక జాడీని తెరిచి మానవాళిని పట్టి పీడించే చెడులన్నిటినీ విడుదల చేసింది.
పాండోరావైరస్‌ను యకుటియా సరస్సు అడుగు భాగం నుంచి సేకరించారు.
మిగతా వైరస్‌లను మామత్ తోలు, సైబీరియన్ తోడేలు పేగులు వంటి భాగాల నుంచి సేకరించారు. ఇవన్నీ వేల ఏళ్లుగా ఘనీభవించిన మంచు ‘పెర్మాఫాస్ట్’లో బందీలై ఉన్నాయి.
ఈ వైరస్‌లతో ఎంత ప్రమాదం?
ఈ 13 ప్రాచీన వైరస్‌లు వేల ఏళ్లుగా మంచు కింద బందీలుగా సమాధి అయి ఉన్నా కూడా వీటిలో సోకే గుణం అలాగే ఉందని గుర్తించారు.
భూ వాతావరణం వేడెక్కటం వల్ల పెర్మాఫ్రాస్ట్ కరిగి.. అప్పటివరకూ వేల ఏళ్లుగా వాటిలో బందీలుగా ఉన్న మీథేన్ వంటి గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలవుతాయని, అది వాతావరణ మార్పును మరింత తీవ్రం చేస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు.
అయితే.. అదే ప్రాచీన మంచులో సమాధి అయి ఉన్న వైరస్ వంటి జీవాల ప్రభావం ఎలా ఉంటుందనేది ఇప్పటివరకూ అంచనాలే కానీ, సరిగ్గా అర్థం చేసుకున్నది లేదు.
తాజాగా తాము అధ్యయనం చేసిన ప్రాచీన వైరస్‌లను పునరుద్ధరించటం వల్ల పెద్దగా ప్రమాదం లేదని.. అవి అమీబా సూక్ష్మజీవులకు సోకే రకాలని వీటిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తల బృందం చెప్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇంకా జాంబీ వైరస్‌లు ఉన్నాయా?
ఇప్పుడు కనుగొన్న వైరస్‌లు కేవలం ‘టిప్ ఆఫ్ ది ఐస్‌బర్గ్ (సముద్రంలో మునిగివుండే మంచుకొండ శిఖరం అంతవి మాత్రమే)’ అని.. కింద కనిపించకుండా ఇంకా కొండంత వైరస్‌లు, ఎన్నో రకాల వైరస్‌లు పెర్మాఫ్రాస్ట్‌లో బందీలుగా ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
మనుషులకు, జంతువులకు సోకగలిగే వైరస్‌లు గనుక బయటకు వచ్చి పునరుద్ధరణ అయితే.. అది చాలా సమస్యాత్మకమవుతుందని వారు చెప్తున్నారు. ఆ ప్రమాదం ఎలా ఉంటుందనేదానికి తాము చేస్తున్న పరిశోధనలను అన్వయించి చూపవచ్చునని పేర్కొన్నారు.
‘‘ప్రాచీన మంచు ఫలకాలు కరిగినట్లయితే వాటి నుంచి మనకు తెలియని ఈ వైరస్‌లు విడుదలయ్యే అవకాశం ఉంది. బయటి వాతావరణ పరిస్థితుల్లోకి వెలువడ్డాక ఈ వైరస్‌లు ఎంత కాలం సోకగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి, ఆలోగా తమకు అనువైన హోస్ట్‌కు సోకగలిగే అవకాశం ఎంత ఉంటుంది అనే విషయాలను ఇప్పుడే అంచనా వేయటం అసాధ్యం’’ అని వారు రాసిన సమర్పించిన ప్రాధమిక అధ్యయన పత్రంలో వివరించారు.
ఈ అధ్యయనాన్ని ఇంకా ఈ రంగానికి చెందిన సహ శాస్త్రవేత్తలు సమీక్షించాల్సి ఉంది.
మున్ముందు మహమ్మారులు పెరుగుతాయా?
కొత్తగా బయటపడిన వైరస్‌లకు అవి సోకే గుణం ఇంకా ఉంటుందని తేలింది కాబట్టి.. మరిన్ని వైరస్‌లు బయటకు వస్తే కోవిడ్ మహమ్మారి తరహా సంక్షోభాలు మరింతగా తరచుగా తలెత్తే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- సైకోపాత్ లక్షణాలు ఏమిటి? ఫిమేల్ సైకోపాత్ జీవితం ఎలా ఉంటుంది?
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
- వరల్డ్ ఎయిడ్స్ డే: భారత్‌లో తొలి కేసును గుర్తించిన నిర్మల గురించి మీకు తెలుసా?
- టిండర్‌లో మోసాలు: డేటింగ్ పేరుతో కిడ్నాప్‌లు- బాధితులుగా పురుషులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















