చైనా: మంకీ బీ వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి? దీని నుంచి తప్పించుకోవడం ఎలా?

ఫొటో సోర్స్, NURPHOTO/GETTY
చైనాలో మంకీ బీ అనే వైరస్‌తో ఒక వ్యక్తి మరణించినట్లు వార్తలు వచ్చాయి. చైనా అధికార వార్తా సంస్థ గ్లోబల్ టైమ్స్ దీనిని ధ్రువీకరించింది కూడా.
బీజింగ్‌కు చెందిన ఓ పశు వైద్యుడికి ఈ మంకీ వైరస్ సోకిందని, కానీ ఆయనతో సన్నిహితంగా ఉన్నవారంతా క్షేమంగానే ఉన్నారని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. 53 ఏళ్ల ఈ వైద్యుడు ఒక పరిశోధనా సంస్థలో పరిశోధనలు చేస్తున్నారు.
ఈ ఏడాది మార్చిలో ఆయన రెండు చనిపోయిన కోతులపై పరిశోధనలు చేశారని, నెల తర్వాత ఆయనలో వికారం, వాంతుల లక్షణాలు కనిపించాయని ఈ వార్తలో పేర్కొన్నారు.
చైనాలో సెంటర్ ఫర్ డిసీజ్(సీడీసీ) కంట్రోల్ శనివారం విడుదల చేసిన వీక్లీలో ఈ సమాచారం ఉంది. సదరు వైద్యుడికి పలు ఆసుపత్రులలో చికిత్స జరిగిందని, కానీ ఆయన మే 27న మరణించారని ఈ వీక్లీ పేర్కొంది.
సీడీసీ వీక్లీ పేర్కొన్న వివరాల ప్రకారం మనుషులలో ఈ వైరస్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి కేసులు రాలేదు. మంకీ బీ వైరస్ కారణంగా ఓ వ్యక్తి మరణించడం ఇదే మొదటిసారని ఆ వీక్లీ పేర్కొంది.
సదరు పరిశోధకుడి ఎముకల మూలకణ నమూనాలను పరీక్షించడంతో అది మంకీ బీ వైరస్ అని తేలింది. అయితే, ఇతరులెవ్వరికీ అది సోకక పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఫొటో సోర్స్, BARCROFT MEDIA/GETTY
ఎప్పటి నుంచి ఉంది?
మంకీ బీ వైరస్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. 1932లో దీన్ని తొలిసారి గుర్తించారు. నేరుగా తాకడం లేదంటే శరీరం నుంచి వెలువడే స్రావాలు, ద్రవ, ఘన పదార్ధాల ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
మంకీ బీ వైరస్ సోకిన రోగులలో మరణాల రేటు 70 నుంచి 80 శాతం వరకు ఉంటుందని అంచనా. మంకీ బీ వైరస్‌తో ప్రమాదం ఉందని, దానిని పరిష్కారం కనుక్కోవాల్సి ఉందని సీబీసీ వీక్లీ పేర్కొంది.
అసలు ఏమిటీ మంకీ బీ వైరస్
మంకీ బీ వైరస్‌ను హెర్పెస్ బీ వైరస్ అని కూడా అంటారు. సాధారణంగా మకాక్ జాతి కోతుల ద్వారా ఇది ప్రధానంగా వ్యాపిస్తుంది. రీసస్ మకాక్, పిగ్-టెయిల్డ్ మకాక్, సైనో మోల్గస్ రకం కోతులు కూడా ఈ వైరస్‌ను వ్యాపింపజేస్తాయి.
ఇది మనుషులకు వ్యాపించడం చాలా అరుదు. ఒకవేళ మనుషులకు సోకితే అది నాడీ వ్యవస్థ, మెదడు, వెన్నుపూసలపై ప్రభావం చూపుతుంది.

ఫొటో సోర్స్, MLADEN ANTONOV/GETTYIMAGES
ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది?
మకాక్ కోతుల కాటు, అవి చేసిన గాయాల ద్వారా మనుషులకు ఈ వైరస్ సోకుతుంది. వైరస్ సోకిన కోతుల లాలాజలం, మల మూత్రాల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. వస్తువుల ఉపరితలాలపై కొన్ని గంటలపాటు ఈ వైరస్ జీవించగలదు.
బోస్టన్ పబ్లిక్ హెల్త్ కమిషన్ నివేదిక ప్రకారం, ప్రయోగశాలలలో పని చేసే పరిశోధకులు, పశు వైద్యులు లేదా ఈ కోతులకు దగ్గరగా పని చేసే వ్యక్తులు దీని బారిన పడే అవకాశం ఉంటుంది.
లక్షణాలు ఎలా ఉంటాయి?
ఈ వైరస్ బారినపడ్డ వ్యక్తులలో నెల రోజులలోపే లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు వారంలోపే కనిపించే అవకాశం కూడా ఉంటుంది. వైరస్ ఎంత వేగంగా శరీరంలోకి పాకుతుందనే దానిపై లక్షణాలు ఆధారపడి ఉంటాయి. అయితే, వైరస్ సోకిన వారందరిలో లక్షణాలు కనిపించకపోవచ్చు.
కొన్ని సాధారణ లక్షణాలు:
- వైరస్ సోకిన ప్రాంతంలో పొక్కులు
- గాయం దగ్గర నొప్పి, తిమ్మిరి, దురద
- జ్వరం వచ్చినప్పుడు కనిపించే ఒళ్లు నొప్పులు
- చలి, జ్వరం
- రోజంతా తలనొప్పి
- తీవ్రమైన అలసట
- కండరాలు పట్టివేయడం
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
లక్షణాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి మూడు వారాల వరకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపించవచ్చు. వైరస్ తీవ్రంగా ఉంటే మరణానికి దారి తీయవచ్చు.

ఫొటో సోర్స్, JEAN-FRANCOIS MONIER
చికిత్స ఏమిటి?
బోస్టన్ పబ్లిక్ హెల్త్ కమిషన్ నివేదిక ప్రకారం ఈ వైరస్ సోకిన వ్యక్తికి చికిత్స అందకపోతే 70% కేసులలో రోగి చనిపోవచ్చు.
కోతి కరిచిన, గాయపరిచిన బాధిత వ్యక్తి వైరస్ క్యారియర్ అవుతాడు. అందుకే వెంటనే చికిత్స తీసుకోవాలి.
గాయం ఏర్పడిన ప్రాంతాన్ని సబ్బు, నీళ్లతో బాగా శుభ్రం చేయడం ముఖ్యం.
ప్రస్తుతానికి వీటికి యాంటీ వైరస్ మందులు తప్ప టీకాలు బాటులో లేవు.
ఇవి కూడా చదవండి:
- విశాఖ జిల్లాలో 25 గ్రామాల ప్రజలు వారంవారం ఆ చెట్టు దగ్గరకు చేరుకుంటారు.. కారణం ఇదీ
- అఫ్గాన్ రాయబారి కుమార్తె కిడ్నాప్‌లో భారత్‌పై ఆరోపణలు చేసిన పాకిస్తాన్
- పెగాసస్ స్పైవేర్: మీకు తెలీకుండానే మీ ఫోన్‌ను ఎలా హ్యాక్ చేస్తుంది
- ‘ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నందుకు ఇంటికొచ్చి బెదిరించారు’
- సిరియా: ‘ఇస్లామిక్ స్టేట్’కి పనిచేసిన బ్రిటిష్ యువకుడి స్మార్ట్‌ఫోన్‌లో ఏముంది
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నదీ జలాలపై రివర్ బోర్డులకు పెత్తనం ఇస్తే ఏం జరుగుతుంది?
- డెల్టా వేరియంట్: ఈ ఆసియా దేశాలు ఎందుకింతగా భయపడుతున్నాయి
- 'చిన్న వయసులోనే తెల్లబడిన జుట్టును మళ్లీ నల్లగా మార్చొచ్చు'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








