సిరియా: ‘ఇస్లామిక్ స్టేట్’కి పనిచేసిన బ్రిటిష్ యువకుడి స్మార్ట్‌ఫోన్‌లో ఏముంది

ఫొటో సోర్స్, BBC/MENTORN MEDIA
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) తరఫున పోరాడుతున్న కొంత మంది బ్రిటన్ యువకుల స్మార్ట్‌ఫోన్‌లలోని డేటాను జర్నలిస్టు ముబీన్ అజహర్ విశ్లేషించారు.
అసలు ఆ యువకులకు ఏమైంది? వారెందుకు ఐఎస్‌తో చేతులు కలిపారు? అనే అంశాలను ముబీన్ విశ్లేషించారు. ఆ యువకుల సోషల్ మీడియా ఖాతాల్లోని సమాచారాన్ని కూడా ఆయన పరిశీలించారు.
ఇస్లామిక్ స్టేట్‌తోపాటు ఇతర అతివాద సంస్థల్లో చేరేందుకు ఇప్పటివరకు బ్రిటన్ నుంచి 900 మంది వెళ్లినట్లు అంచనాలు ఉన్నాయి.
దాదాపు 14,000 మంది హత్యలకు ఇస్లామిక్ స్టేట్ కారణం. దీని తరఫున పనిచేస్తున్న చాలామంది బ్రిటన్ యువకుల వివరాలు ఇప్పటికీ అధికారులకు తెలియదు.

స్థానిక అనువాదకుడి సాయంతో..
సిరియాలో ఇస్లామిక్ స్టేట్ పోరాటం కొనసాగిస్తున్న ప్రాంతాలకు ‘‘సండే టైమ్స్’’ పశ్చిమాసియా ప్రతినిధి లూయిస్ కొల్లాజన్ వెళ్లారు. ఓ అనువాదకుడి సాయంతో అక్కడ ఆయన ఓ హార్డ్‌డిస్క్ సంపాదించారు. దీనిలో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లలోని డేటా స్టోర్ చేశారు.
ఆ హార్డ్‌డిస్క్‌లోని ఫోటోలు, వీడియోలు, స్క్రీన్‌గ్రాబ్‌లపై బీబీసీ ఓ డాక్యుమెంటరీ తీసింది.
బ్రిటన్‌లోని ఇళ్లను వదిలి సిరియా వెళ్తున్న యువకులు, అక్కడ ఎలా జీవిస్తున్నారు? వారు చివరకు ఏమయ్యారు? లాంటి అంశాలను ఈ డాక్యుమెంటరీలో చూపించారు.
ఆయుధాల శిక్షణపై వీడియో
ఐఎస్ తరఫున పోరాడే వారి వ్యక్తిగత జీవితాల గురించి దాదాపు ఎవరికీ తెలియదు. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ల డేటా సాయంతో అక్కడ బ్రిటిష్ యువత ఎలా పనిచేస్తున్నారో కొంతవరకు తెలుసుకోవచ్చు.
ఇస్లామిక్ స్టేట్‌లో చేరకముందు, చోక్రీ అల్ ఖలీఫీ.. లండన్‌లోని ఎగ్మోర్ రోడ్‌లో ఉండేవాడు. తీవ్రమైన నేరాలకు పాల్పడినట్లు ముందే ఇతడిపై ఆరోపణలు ఉన్నాయి. 22ఏళ్ల వయసులో సిరియాలో పోరాడుతూ ఇతడు మరణించాడు.
ఉత్తర సిరియాలోని ఓ స్విమ్మింగ్ పూల్ దగ్గర చోక్రీ నవ్వుతూ, చేతిలో తుపాకీ పట్టుకున్న దృశ్యాలు హార్డ్‌డ్రైవ్‌లో కనిపించాయి. ఈ దృశ్యాల్లో చోక్రీ సంతోషంగా కనిపిస్తున్నాడు.
యువకులు హాలిడేకు వచ్చినప్పుడు తీసుకునే దృశ్యాల్లా ఈ వీడియో ఉంది. పెద్దగా లోకజ్ఞానం తెలియని యువకుడిలా ఈ దృశ్యాల్లో చోక్రీ కనిపిస్తున్నాడు.
ఆ తర్వాత ఆయుధాల వాడకంలో చోక్రీ శిక్షణ తీసుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి. దగ్గర్లోని పొలాల్లోకి ఓ గ్రెనేడ్ విసురుతూ వీటిలో చోక్రీ కనిపిస్తున్నాడు. గ్రెనేడ్ విసిరిన అనంతరం అందరూ చోక్రీని లెజెండ్ అంటూ కొనియాడుతూ కనిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సినిమా తరహాలో
ఆన్‌లైన్‌లో ఇస్లామిక్ స్టేట్ పెట్టే కొన్ని వీడియోలు సినిమాల తరహాలో చిత్రీకరిస్తుంటారు.
తమతో చేతులు కలిపేలా ప్రోత్సహించేందుకు ఐఎస్ రూపొందించిన 15,000కుపైగా వీడియోలను విద్యావేత్త జేవియర్ లెస్కా విశ్లేషించారు.
‘‘తమ వీడియోల్లో వారు పాప్ కల్చర్, వీడియో గేమ్‌లు, సినిమాల గురించి కూడా మాట్లాడుతుంటారు. యువకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇలాంటి వీడియోలను తయారుచేస్తుంటారు’’అని జేవియర్ చెప్పారు.
అయితే, ఈ స్మార్ట్‌ఫోన్లలోని సమాచారంతో వారి జీవితంలోని మరిన్ని చీకటి కోణాలు కూడా చూడొచ్చు.

ఫొటో సోర్స్, BBC/MENTORN MEDIA
అతడి తల్లి ఏం చెబుతున్నారు?
ఈ చిత్రాల్లో బ్రిటన్‌కు చెందిన మెహ్దీ హసన్ కూడా కనిపిస్తున్నాడు.
అయితే, చోక్రీలా ఇతడు ఇస్లామిక్ స్టేట్‌లో చేరకముందు ఎలాంటి నేరాలకూ పాల్పడలేదు.
మెహ్దీ గురించి అడిగినప్పుడు అతడి తల్లి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మాది కష్టపడి పనిచేసే మధ్యతరగతి కుటుంబం. అయితే, మా అబ్బాయి ప్రవర్తన నెమ్మదిగా మారుతూ వచ్చింది’’అని ఆమె చెప్పారు.
ఓ ప్రైవేటు క్యాథలిక్ స్కూల్‌లో మెహ్దీ చదువుకున్నాడు.
చదువుకునేటప్పుడు, మెహ్దీకి పెద్దగా ఏమీ తెలియదని అతడి తల్లి వివరించారు.
నెమ్మదిగా..
మెహ్దీలో నెమ్మదిగా వచ్చిన మార్పు అతడి సోషల్ మీడియా ఖాతాల్లోనూ కనిపించింది.
మొదట్లో అతడు అతివాద భావజాలానికి పెద్దగా ఆకర్షితుడయ్యేవాడు కాదు. షర్టు లేకుండా జిమ్‌లో తీసుకున్న ఫోటోలు, కోక్ తాగుతూ తీసుకున్న ఫోటోలను అతడు పోస్ట్ చేసేవాడు.
తాను అతివాద భావజాలానికి వ్యతిరేకమని కూడా అతడు చెప్పాడు. ‘‘నేనొక బ్రిటిష్ ముస్లింను. ఇలాంటి చవకబారు పనులకు నేను వ్యతిరేకం’’అని అతడు సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
అయితే, లండన్‌లోని ఓ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తనవైపే చూసిన కొందరికి అతడు చీవాట్లు పెడుతూ ఓ పోస్ట్ చేశాడు. తానేదో రైలును పేల్చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వారు చూశారని రాసుకొచ్చాడు.
ఆ తర్వాత నెమ్మదిగా మరింత అతివాదిగా మారడం మొదలుపెట్టాడు. తాను జీవితంలో చేసిన తప్పులను సోషల్ మీడియా వేదికగా అంగీకరించాడు.
వారం తర్వాత, ఖురాన్‌లోని కొత్త విషయాలను తన ఫాలోవర్స్‌కు చెప్పడం మొదలుపెట్టాడు. అంతర్జాతీయ రాజకీయాల గురించి కూడా చర్చించేవాడు.

ఫొటో సోర్స్, Getty Images
పేరు కూడా మార్చేసుకున్నాడు..
ఆ తర్వాత తన పేరును మెహ్దీ హసన్ నుంచి అబూ దుజానాగా మార్చేసుకున్నాడు. తను బంగ్లాదేశ్ సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు అయినప్పటికీ, అరబిక్ సాహిత్యాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసేవాడు.
ఆ తర్వాత కొన్ని నెలలకు ఓ విమానాశ్రయంలోని సీసీటీవీ కెమెరాలో మెహ్దీ కనిపించాడు. అతడు అక్కడి నుంచే సిరియాకు వెళ్లిపోయాడు.
సిరియా వెళ్లిన తర్వాత కూడా అతడు ఆన్‌లైన్‌లో పోస్ట్‌లు చేసేవాడు. తన అడుగుజాడల్లో నడవాలని అనుకునే వారికి సూచనలు ఇచ్చేవాడు. ఆ తర్వాతి కాలంలో అతడు ఇస్లామిక్ స్టేట్‌కు యువకుల్ని తీసుకొచ్చే ప్రతినిధిగా మారాడు.
సిరియా వదిలి వెళ్లిపోవాలని అనుకున్నాడా?
తను సిరియా వెళ్లిన తర్వాత కూడా మెహ్దీ.. పోర్ట్‌మౌత్‌లోని తను ప్రేమించే అమ్మాయితో మాట్లాడేవాడు.
సిరియాలో ఆరు నెలలు గడిపిన తర్వాత, ఓ యూనివర్సిటీలో దరఖాస్తు చేసుకోవడం ఎలా అనే ప్రశ్నను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అతడు ఇస్లామిక్ స్టేట్‌ను వదిలిపెట్టాలని భావిస్తున్నట్లు అంతా అనుకున్నారు.
ఎవరైనా మంచి న్యాయవాదులు తెలుసా? అని కూడా తమను అడిగినట్లు మెహ్దీ బాల్య స్నేహితులు బీబీసీకి చెప్పారు. అయితే, వారు తమ పేర్లు వెల్లడించడానికి ఇష్టపడలేదు.
‘‘ఒకసారి నువ్వంటే ఇష్టమని చెప్పాడు. నాకు ఏం చెప్పాలో అర్థంకాలేదు’’అని అతడితో పనిచయమున్న ఓ అమ్మాయి చెప్పారు.
సిరియాలోని టర్కీ సరిహద్దుల్లో చోటుచేసుకున్న కాల్పుల్లో మెహ్దీ మరణించాడు. అయితే, చివరగా ఉన్న ప్రాంతాన్ని గమనిస్తే, అతడు ఐఎస్‌ను వదిలిపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ఫోటోల్లో కనిపిస్తున్న చాలా మంది ఇప్పటికే మరణించారు. మరికొంత మంది వివరాలు తెలియడం లేదు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- గోల్డ్‌ఫిష్: చైనాకు చెందిన ఈ అందమైన చేప రాక్షసిలా ఎలా మారుతోంది?
- తెలంగాణ: కరోనా లాక్డౌన్లో పెరిగిన బాల్య వివాహాలు
- వైఎస్ షర్మిల: కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా?
- మోదీ కేబినెట్: దళిత, ఓబీసీ మంత్రులు యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలరా
- ప్యూ రీసెర్చ్: మతం పట్ల భారతీయుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








