వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ సభలో వైఎస్ షర్మిల: ‘తెలంగాణలో పేదరికం నుంచి బైటపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే’

- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
వై.ఎస్.షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీని ప్రకటించారు. జెండా ఆవిష్కరణతో తన పార్టీ పేరు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని వెల్లడించారు.
తెలంగాణలో వై.ఎస్.పాలనను తిరిగి తీసుకొచ్చేందుకే తాను వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు షర్మిల వెల్లడించారు.
సంక్షేమం, స్వయం సమృద్ధి, సమానత్వం తన పార్టీ ప్రధాన అజెండాగా షర్మిల తెలిపారు.
ప్రజలకు ఆత్మనిర్భరం, రేపటి గురించి భరోసా కల్పించడమే సంక్షేమమని ఆమె అన్నారు. ప్రజల సంక్షేమం కోసం రాజశేఖర రెడ్డి తాను చేయగలిగినంత చేశారని, ఆయన తన పథకాలతో కొన్ని తరాల పాటు జీవితాలు మారిపోయే నిర్ణయాలు తీసుకున్నారని షర్మిల అన్నారు.
పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోగలిగే పరిస్థితిని తెచ్చింది రాజశేఖర్ రెడ్డేనని షర్మిల స్పష్టం చేశారు.
‘‘తెలంగాణలో సంక్షేమం మాటలకే పరిమితమైంది. లక్షల కోట్లు అప్పులు చేసినా పేదరికం పోలేదు. పేదరికం నుంచి బైటపడింది కేవలం కేసీఆర్ గారి కుటుంబమే‘‘ అన్నారామె.
రాజశేఖర్ రెడ్డి పాలనను కోరుకునే వారు తెలంగాణలో ఇంకా ఉన్నారంటే దానికి కారణం, ఇక్కడ నెలకొన్న పరిస్థితులేనని ఆమె అన్నారు.
ప్రజలు స్వయం సమృద్ధితో తమ కాళ్ల మీద తాము నిలబడే పరిస్థితి తీసుకురావాలని, ప్రస్తుతం తెలంగాణలో సంక్షేమం అంటే రేషన్ బియ్యం చుట్టూనే తిరుగుతోందని ఆమె అన్నారు.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల గురించి ఎన్నికలు వచ్చినప్పుడే మాట్లాడతారని, చదువుకున్న వారు బర్రెలు, గొర్రెలు కాసుకోవడం కన్నా ఆత్మహత్య చేసుకోవడమే మేలనుకుంటారని షర్మిల అన్నారు. ''మీరు రైతు బంధువులయితే ప్రజలు వలసలు ఎందుకు వెళుతున్నారు'' అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మహిళా సాధికారితపై తెలంగాణ ప్రభుత్వం ఒట్టి మాటలు చెబుతోందని, తమ పార్టీ ఎన్నికల్లో సగం సీట్లు మహిళలకు కేటాయిస్తుందని, బీసీలకు జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరుపుతామని షర్మిల ప్రకటించారు. బీసీలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రక్షణ కవచంగా నిలుస్తుందన్నారు.
''రెండు సంవత్సరాలుగా కృష్ణా నది మీద ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ గారు ఇప్పుడే తెలివిలోకి వచ్చారా? పక్కరాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి ఆహ్వానించవచ్చు. కౌగిలించుకోవచ్చు భోజనాలు పెట్టొచ్చు. స్వీట్లు పంచుకోవచ్చు. ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువును ఓడించనూ వచ్చు. కానీ రెండు నిమిషాలు కూర్చుని నీటి పంచాయితీని మాట్లాడుకోలేరా?'' అని షర్మిల ప్రశ్నించారు.
ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఈ రోజు నుంచి వంద రోజుల తర్వాత పాదయాత్ర కూడా మొదలు పెడతామని షర్మిల అన్నారు.

పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు...
గురువారం ఉదయం షర్మిల కడప జిల్లా ఇడుపులపాయలో తండ్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించి నివాళులు అర్పించిన షర్మిల, ఆ తరువాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు.
విమానాశ్రయం నుంచి బయలుదేరిన షర్మిల వెంట పార్టీ అభిమానులు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. పంజాగుట్ట జంక్షన్‌లో ఉన్న వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అక్కడి నుంచి ఆమె జూబ్లీహిల్స్‌లోని కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్నారు. షర్మిల వెంట ఆమె తల్లి విజయలక్ష్మి, భర్త అనిల్ కుమార్ కూడా ఉన్నారు.
కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి తల్లితో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆ తర్వాత పార్టీ పేరును, లక్ష్యాలను వివరిస్తూ లేజర్ షో జరిగింది.
‘‘శత్రువులు కూడా ప్రేమించే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. అది ఆయన వ్యక్తిత్వం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తెచ్చిన నాయకుడాయన. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు ఆయనను తమ వాడు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఆయన మరణించిన తర్వాత ఆయన కుటుంబాన్ని ఎందుకు రోడ్డు మీదకు తెచ్చారు? అవినీతి కేసుల్లో ఆయన పేరు చేర్చితే ఎందుకు ఊరుకున్నారు’’ అని ఈ కార్యక్రమంలో ప్రసంగించిన వై.ఎస్.విజయలక్ష్మి ప్రశ్నించారు.
వై.ఎస్. తెలుగువారి గుండె చప్పుడని, ఆయన మార్గంలో నడిచేవారు తెలంగాణ రాష్ట్రానికి అవసరమని విజయలక్ష్మి అన్నారు.
''షర్మిలమ్మ రాజకీయాల్లోకి రావాల్సిన పని లేదు. కానీ, తండ్రి కల నెరవేర్చాలన్నది ఆమె పట్టుదల. అందుకే తెలంగాణలో పార్టీ పెడుతున్నారు'' అన్నారు విజయలక్ష్మి
''తన అన్న జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయాలని కోరినప్పుడు ఆమె 3,200 కిలోమీటర్ల దూరం నడిచించింది. ఇది చరిత్రలోనే ఒక రికార్డు'' అన్నారామె.
‘‘ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు దొంగలు కాదు..గజదొంగలు అంతకంటే కాదు. వారు దోచుకోవడానికి, దాచుకోవడానికి రాలేదు. ప్రజాసేవ కోసం వచ్చారు. వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాను’’ అన్నారు విజయలక్ష్మి.

విజయమ్మ ప్రసంగం తర్వాత షర్మిల పార్టీ జెండాను ఆవిష్కరించారు.
నీలం, పాలపిట్ట రంగుతో ఉన్న జెండాపై తెలంగాణ మ్యాప్, అందులో రాజశేఖర్ రెడ్డి చిత్రాన్ని ఉంచారు. దాని కింద వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అని రాశారు.
జెండా ఆవిష్కరణ సందర్భంగా ‘జయహే జయహే తెలంగాణ జననీ జయకేతనం‘ పాటను నేపథ్యంలో వినిపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

సభకు ఏర్పాట్లు
సభా ప్రాంగణంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి కటౌట్లు ఏర్పాటు చేశారు. తెలంగాణవ్యాప్తంగా వై.ఎస్. విగ్రహాలను అలంకరించాలని అభిమానులకు పిలుపునిచ్చారు.
పార్టీ ఆవిర్భావ ఉత్సవాలకు రావాల్సిందిగా తెలంగాణలోని పలు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మేధో వర్గాలకు చెందిన నాయకులకు పార్టీ తరఫున ఆహ్వానం పంపారు. ఆర్.కృష్ణయ్య, కోదండరాం తదితరులు ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.
ఉదయం వై.ఎస్. సమాధి దగ్గర నివాళి కార్యక్రమంలో గతంలో కంటే భిన్నమైన దృశ్యం కనిపించింది. ఇంతకు ముందు షర్మిల, సోదరుడు వై.ఎస్.జగన్మోహన రెడ్డి ఒకేసారి నివాళి కార్యక్రమానికి వచ్చేవారు. ఈసారి మాత్రం వేర్వేరుగా వచ్చారు.
ఆమెతో పాటు పార్టీ నాయకులు రాఘవ రెడ్డి, రాంరెడ్డి, ఇందిరా శోభన్‌లతోపాటు తల్లి వైఎస్ విజయ లక్ష్మి, భర్త అనిల్ తదితరులు ఉన్నారు. పార్టీ జెండాను వై.ఎస్. సమాధిపై ఉంచారు షర్మిల.

ఫొటో సోర్స్, YS Sharmila/twitter
వరస సమావేశాలు
మార్చి-ఏప్రిల్ ప్రాంతంలో జిల్లాల వారీగా నాయకులతో షర్మిల హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తోందనీ, రాజశేఖర రెడ్డి అందించిన సంక్షేమ పాలన అందించడమే లక్ష్యంగా పార్టీ పెట్టబోతున్నట్టు ఆమె ఆ సందర్భంగా వారితో అన్నారు.
ఏప్రిల్‌లో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించారు. పార్టీ పెట్టబోయే తేదీ ప్రకటించారు. ఆ సభలో షర్మిలతో పాటు, విజయ లక్ష్మి కూడా పాల్గొన్నారు.
ఖమ్మం సభ వేదికగా నిరుద్యోగ సమస్యపై పోరాటానికి కార్యాచరణ ప్రకటించారు షర్మిల. ఆ క్రమంలో నిరాహార దీక్ష చేశారు. షర్మిల ఆందోళనను అడ్డుకుని పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
కరోనా కేసులు పెరగడంతో ఆమె కార్యాచరణ ముందుకు వెళ్లలేదు. కేసులు తగ్గిన తరువాత తిరిగి తెలంగాణలో పర్యటించారు షర్మిల. రైతులు, నిరుద్యోగులు లక్ష్యంగా పర్యటనలు జరిపి సమస్యలు తెలుసుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- అనకొండలు, పులులు, మొసళ్లను తప్పించుకుంటూ దట్టమైన అమెజాన్ అడవిలో 36 రోజులు గడిపాడు
- ‘కలకత్తాలోని చీకటి గదిలో 146 మంది బ్రిటిష్ సైనికులను బంధిస్తే తెల్లవారేసరికి 23 మందే మిగిలారు’
- డచ్ ప్రజలు ఎందుకంత పొడవుగా ఉంటారు? వాళ్లు వెల్లడిస్తున్న రహస్యాలేంటి
- ఇళ్ల మధ్యలో నెల రోజుల్లో వందకు పైగా భారీ గుంతలు ఏర్పడ్డాయి
- శ్రీలంక: ఆ రాతి చిత్రపటం పై విశ్వంలోకి అడుగుపెట్టే సీక్రెట్ కోడ్ ఉందా?
- ఏసీలు చల్లబరుస్తున్నాయా.. లేక వేడెక్కిస్తున్నాయా?
- ఇతను ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మానవుడు
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
- తొమ్మిది కోట్ల సంవత్సరాల కిందట డైనోసార్లు తిరిగిన ప్రాంతం ఇదే..
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- సూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









