సిరాజుద్దౌలా: ‘146 మంది బ్రిటిష్ సైనికులను కలకత్తాలోని చీకటి గదిలో రాత్రంతా బంధిస్తే తెల్లవారేసరికి 23 మందే మిగిలారు’

చీకటి జైలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రేహాన్‌ ఫజల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇంగ్లండ్‌లోని ఏ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకైనా భారతదేశం గురించి మూడు విషయాలు కచ్చితంగా తెలుస్తాయని చెబుతారు. అవి.. చీకటి చెరసాల ఉదంతం, ప్లాసీ యుద్ధం, 1857 తిరుగుబాటు.

1707లో ఔరంగజేబు మరణం తరువాత మొఘల్ సామ్రాజ్యం వేగంగా పతనం కాసాగింది.

అయితే, అప్పటికి బెంగాల్, మొఘల్ సామ్రాజ్యంలో భాగమైనప్పటికీ ఒక తరహా స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండేది.

అక్కడ ఫ్రెంచ్, బ్రిటిష్ వారు తమ కంపెనీలను బలోపేతం చేయడం ప్రారంభించారు.

నవాబు సిరాజుద్దౌలాకు ఇది నచ్చలేదు. పాశ్చాత్యులు హక్కుల దుర్వినియోగం చేస్తున్నారని భావించారు. దీనిపై వివరణ ఇమ్మని బ్రిటిష్‌వారిని కోరారు.

వారు సమాధానం ఇచ్చారు కానీ దానితో సిరాజుద్దౌలా సంతృప్తి చెందలేదు. 1756 జూన్ 16న కలకత్తా(ప్రస్తుతం కోల్‌కతా)పై దండెత్తారు.

ఈ యుద్ధంలో బ్రిటిష్ వారి ఓటమి ఖాయం అని తెలిసిన మరుక్షణమే గవర్నర్ జాన్ డ్రేక్ తన కమాండర్, ఇతర అధికారులు, పరివారంతో సహా హుగ్లీ నదిలో ఆగి ఉన్న ఓ పడవలో తప్పించుకుని పారిపోయారు.

కలకత్తా గారిసన్ కో-కౌన్సిల్ జూనియర్ సభ్యుడు జోనాథన్ హాల్‌వేల్‌పై బాధ్యతలు వదిలిపెట్టారు.

సిరాజుద్దౌలా

ఫొటో సోర్స్, BLOOMSBURY PUBLICATION

ఆంగ్లేయుల లొంగుబాటు

1756 జూన్ 20న సిరాజుద్దౌలా సైనికులు ఫోర్ట్ విలియం గోడలను పగలగొట్టి లోనికి ప్రవేశించారు. దాంతో బ్రిటిష్ సైన్యం మొత్తం వారికి లొంగిపోయింది.

అప్పటికప్పుడే ఫోర్ట్ విలియం నడిబొడ్డున సిరాజుద్దౌలా తన దర్బారును ఏర్పాటు చేసి, కలకత్తా పేరును 'అలీనగర్‌'గా మారుస్తున్నట్లు ప్రకటించారని ఎస్. సి. హిల్ తన 'బెంగాల్ ఇన్ 1857-58' పుస్తకంలో రాశారు.

"రాజా మానిక్‌చంద్‌ను కోట రక్షకుడిగా ప్రకటించారు. బ్రిటిష్ వారు నిర్మించిన ప్రభుత్వ గృహాన్ని కూల్చివేయమని ఆదేశాలు జారీ చేశారు. ఈ భవనం రాజకుమారుల కోసం కానీ వ్యాపారులకు కాదు అని వ్యాఖ్యానించారు. తరువాత, తన విజయానికి దేవునికి కృతజ్ఞతలు తెలిపి నమాజు చేశారు."

సిరాజుద్దౌలా

ఫొటో సోర్స్, Aleph

ఫొటో క్యాప్షన్, సిరాజుద్దౌలా

బ్రిటిష్ సైనికుడు తుపాకీతో కాల్చాడు

ఈ విషయాలన్నిటినీ జే జెడ్ హాల్‌వేల్ 'ఇంటరెస్టింగ్ హిస్టారికల్ ఈవెంట్స్ రిలేటెడ్ టు ప్రావిన్స్ ఆఫ్ బెంగాల్ ' (బెంగాల్ ప్రావిన్స్‌కు సంబంధించిన ఆసక్తికరమైన చారిత్రక సంఘటనలు) అనే వ్యాసంలో వివరించారు.

"నన్ను బంధించి నవాబు ముందు ప్రవేశపెట్టారు. నా కట్లు విప్పమని నవాబు ఆదేశించారు. నాతో ఎవరూ అనుచితంగా ప్రవర్తించరని మాటిచ్చారు. ఆంగ్లేయులు తనకు వ్యతిరేకంగా ప్రతిఘటించడంపై, గవర్నర్ డ్రేక్ ప్రవర్తనపై నవాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత, దర్బారు ముగించి, మరొక ఆంగ్లేయుడు వెడర్బర్న్ ఇంట్లో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లారు."

సిరాజుద్దీన్ సైనికులు లొంగిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని దోచుకోవడం ప్రారంభించారని, అయితే, వారికి ఎటువంటి హానీ తలపెట్టలేదని ఎస్. సి. హిల్ రాశారు.

"సిరాజుద్దీన్ సైన్యం బ్రిటిష్ వారిని బంధిచిందిగానీ కొంతమంది పోర్చుగీసువారిని, అర్మేనియన్లను విడిచిపెట్టింది. వారంతా ఫోర్ట్ విలియం నుంచి బయటపడ్డారు. అయితే, రోజు గడుస్తున్నకొద్దీ హాల్‌వేల్, ఇతర ఖైదీల పట్ల నవాబు సైన్యం తీరు మారిపోసాగింది. అసలేం జరిగిందంటే, తాగిన మత్తులో ఒక బ్రిటిష్ సైనికుడు పిస్టల్‌తో నవాబు సైనికుల్లో ఒకరిని కాల్చి చంపాడు.

ఈ విషయం సిరాజుద్దౌలా దాకా వెళ్లింది. ఆ కోటలో బ్రిటిష్ వారు ఉన్నప్పుడు తప్పు చేసిన సైనికులను ఓ చీకటి చెరశాలలో బంధిస్తారని నవాబుకు తెలిసింది."

చీకటి జైలు

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటిష్ సైనికులను చీకటిగదిలో బంధించారు

రాత్రి కావొస్తుండడంతో అంతమంది బ్రిటిష్ సైనికులను బయటే ఉంచడం మంచిది కాదని, వారందరినీ నిర్బంధించడం మేలని కొందరు అధికారులు నవాబుకు సలహా ఇచ్చారు.

ఆలాగే చేయమని సిరాజుద్దౌలా అనుమతిచ్చారు.

మొత్తం 146 మంది బ్రిటిష్ సైనికులను వారి పదవి, లింగ బేధాలు చూడకుండా 18 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు ఉన్న చీకటిగదిలో కుక్కేశారు.

ఆ గదికి రెండు చిన్న కిటికీలు మాత్రమే ఉన్నాయి. ముగ్గురు లేదా నలుగురు ఖైదీలను బంధించడానికి మాత్రమే ఆ చీకటిగదిని నిర్మించారు. అందులో ఈ 146 మంది కిక్కిరిసిపోయారు.

"బహుసా ఆ సంవత్సరంలో అదే అత్యంత వేడి, ఉక్కపోత ఉన్న రోజు. జూన్ 21 ఉదయం ఆరు గంటల వరకు ఖైదీలందరూ ఆహారం, నీరు, గాలి లేకుండా ఆ గదిలో బందీలై ఉన్నారు" అని హాల్‌వెల్ రాశారు.

"గది బయట కాపలా కాస్తున్న మొఘల్ సైనికులకు వీరు దుస్థితి చూసి బాధ కలిగినా అర్థరాత్రి నవాబును లేపి చెప్పే ధైర్యం లేదు. మర్నాడు ఉదయం సిరాజుద్దౌలా మేల్కొన్న తరువాత ఈ ఖైదీల సంగతి విచారించి, చెరశాల తలుపులు తెరవమని ఆదేశించారు. మొత్తం 146 మందిలో కేవలం 23 మంది మాత్రమే జీవచ్ఛవాల్లా బయటికొచ్చారు. చనిపోయిన మిగతా ఖైదీల శవాలను సమీపంలో ఒక గొయ్యి తవ్వి పూడ్చిపెట్టారు" అని ఎస్. సి. హిల్ తన పుస్తకంలో వివరించారు.

సిరాజుద్దౌలా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సిరాజుద్దౌలా విగ్రహం

రక్షకభటులకు లంచం ఇచ్చే ప్రయత్నం

అక్కడ ఉన్న వారిలో ఒక వృద్ధ సైనికుడు మాత్రమే తనపై కాస్త దయ చూపారని హాల్‌వెల్ రాశారు.

"మాలో సగం మందిని వేరే గదిలో బంధించి ఈ దుస్థితి నుంచి కాపాడమని ప్రాథేయపడ్డాను. ప్రతిఫలంగా మర్నాడు ఉదయం వెయ్యి రూపాయలు ఇస్తానని ఆశజూపాను. ఆ వృద్ధ సైనికుడు ప్రయత్నిస్తానన్నారు. కాసేపటి తరువాత వచ్చి సాధ్యపడదని చెప్పారు. రెండువేలు ఇస్తానన్నాను. మళ్లీ వెళ్లి తన అధికారులను సంప్రదించి వచ్చారు. నవాబు ఆదేశాలు లేకుండా సొంతంగా నిర్ణయం తీసుకోలేమని, అర్థరాత్రి నవాబును మేల్కొలిపే ధైర్యం ఎవరికీ లేదని చెప్పారు."

భిక్షగాడు

ఫొటో సోర్స్, AlEPH PUBLICATION

ఊపిరాడక చనిపోయారు

బ్రిటిష్ సైనికులు ఆరోజు సాయంత్రం ఏడు గంటల నుంచి మర్నాడు ఉదయం ఆరు గంటల వరకు ఆ చీకటిగదిలో అల్లాడిపోయారు.

రాత్రి తొమ్మిది గంటలకు వారందరికీ గొంతెండిపోయి దాహం వేయడం ప్రారంభమైనప్పటి నుంచీ పరిస్థితి మరింత దిగజారిపోయింది.

ఒక వృద్ధ సైనికుడికి కొంచం జాలి వేసింది. ఒక చిన్న పాత్రలో నీరు తెచ్చి కిటికీలోంచి అందించారు.

"ఆ రోజు మా పరిస్థితి ఎలా ఉందో మాటల్లో చెప్పలేను. కిటికీలోంచి నీళ్లు రాగానే అందరూ తొక్కుకుంటూ, తోసుకుంటూ ఆ వైపు పరిగెత్తారు. రెండో కిటీకీలోంచి కూడా నీళ్లు వస్తాయేమోనని కొందరు అక్కడ గుమికూడారు. ఆ కొంచం నీరు దాహాన్ని మరింత పెంచింది. గాలి గాలి అంటూ అందరూ ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. చెరసాల బయట రక్షకభటులను రెచ్చగొడితే తమని కాల్చి చంపేసి ఈ దుస్థితి నుంచి తప్పిస్తారని, నోటొకొచ్చినట్లు తిట్టడం మొదలెట్టారు. కానీ రాత్రి పదకొండు అయేసరికి ఆ కాస్త ఓపిక కూడా నశించిపోయింది. ఊపిరి ఆడక ఒకరిపై ఒకరు పడి ప్రాణాలు వదిలారు" అని హాల్‌వేల్ తన వ్యాసంలో వివరించారు.

సిరాజుద్దౌలా

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, సిరాజుద్దౌలా

స్మృతి చిహ్నం

అనంతరం, చనిపోయినవారి జ్ఞాపకార్థం హాల్‌వేల్ అక్కడ ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు. కొన్నేళ్ల తర్వాత పిడుగు పడి ఆ స్తూపం దెబ్బ తింది.

1821లో ఇటుకలతో నిర్మించిన ఆ స్థూపాన్ని అప్పటి ఫోర్ట్ విలియం గవర్నర్ జనరల్ ఫ్రాన్సిస్ హేస్టింగ్స్ పూర్తిగా పడగొట్టించారు.

ఆ తరువాత 1902లో వైస్రాయ్ లార్డ్ కర్జన్, చెరశాల నుంచి కొంచెం దూరంలో డల్హౌసీ స్క్వేర్ (నేటి బినోయ్, బాదల్, దినేష్ బాగ్) వద్ద మరో పాలరాతి స్తూపం నిర్మించారు.

ప్రజల కోరిక మేరకు 1940లో దీన్ని సెయింట్ జార్జ్ చర్చి ప్రాంగణంలోకి మార్చారు. అది ఇప్పటికీ అక్కడే ఉంది.

అయితే హాల్‌వేల్ చెప్పిన వివరాలను కొందరు చరిత్రకారులు సందేహిస్తున్నారు.

చనిపోయారని చెప్తున్న 123 మందిలో కేవలం 56 మంది రికార్డులు మాత్రమే లభ్యమవుతున్నాయని ఎస్. సి. హిల్ అంటున్నారు.

స్మృతి చిహ్నం

ఫొటో సోర్స్, Getty Images

మరణాల సంఖ్యను ఎక్కువ చేసి చెప్పారనే రోపణలు

హాల్‌వేల్ మరణాల సంఖ్యను ఎక్కువ చేసి చెప్పారని భారత ప్రసిద్ధ చరిత్రకారులు జదునాథ్ సర్కార్ అభిప్రాయపడ్డారు.

"ఆ యుద్ధంలో అనేకమంది బ్రిటిష్ వారు మరణించారు. కానీ, ఇంతమంది సిరాజుద్దౌలా చేతికి చిక్కారా అనేది సందేహమే. తరువాత కొన్నాళ్లకు భోలనాథ్ చంద్ర అనే ఒక జమీందారే 18 x 15 అడుగులలో ఓ వెదురు చట్రం తయారుచేసి కొంతమంది ప్రజలను కుక్కి చూశారు. ఎంత కుక్కినా అందులో 146 కన్నా చాలా తక్కువ మంది పట్టినట్లు తేలింది. చీకటిగదిలో మరణించారని హాల్‌వేల్ చెబుతున్నవారిలో చాలామంది అంతకుముందే లేదా యుద్ధంలో మరణించినవారు కావొచ్చు" అని సర్కార్ తన పుస్తకం 'ది హిస్టరీ ఆఫ్ బెంగాల్' లో రాశారు.

ప్రఖ్యాత చరిత్రకారుడు విలియం డాల్రింపిల్ రాసిన 'ది అనార్కీ' పుస్తకంలో.. "మొత్తం 64 మందిని చీకటిగదిలో బంధించారని, అందులో 21 మంది బతికి బయటపడ్డారని ఇటీవల పరిశోధనలు చెబుతున్నాయి. ఈ సంఘటన జరిగిన 150 సంవత్సరాల తరువాత కూడా భారతీయుల క్రూరత్వానికి ఉదాహరణ అంటూ బ్రిటిష్ పాఠశాలల్లో ఈ చరిత్రను బోధిస్తున్నారు. గులాం హుస్సేన్ ఖాన్‌తో సహా అప్పటి చరిత్రకారుల రచనల్లో ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలేవీ లభించడం లేదు" అని రాశారు.

పుస్తకం

ఫొటో సోర్స్, Bloomsbury

ఈ సంఘటనను అతిశయోక్తులతో చరిత్ర పుటల్లోకి ఎక్కించడం ద్వారా బ్రిటిష్ జాతీయతను ప్రోత్సహించే ప్రయత్నాలు జరిగాయని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.

"హాల్‌వేల్, కుక్ తదితరులు ఈ సంఘటన గురించి అతిశయోక్తులుగా వర్ణించారు. వీరు చెప్తున్నవారిలో చాలావరకు యుద్ధంలో మరణించినవారే" అని హెచ్. హెచ్ డాడ్వెల్ 'క్లైవ్ ఇన్ బెంగాల్ 1756-60' పుస్తకంలో రాశారు.

"ఈ సంఘటన జరిగిందిగానీ ఇందులో చాలా విషయాలు అసంబద్ధంగా కనిపిస్తున్నాయి. ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ సిరాజుద్దౌలా ఈ ఘటనకు బాధ్యులు కారు. బ్రిటిష్ ఖైదీలను ఏమి చేయాలన్నది తన అధికారులకే వదిలేశారు. ఆ చీకటిగదిలో బంధించమని నవాబు తన నోటితో ఆదేశించలేదు. కానీ, ఇలా జరిగినందుకు ఆయన తన అధికారులను శిక్షించనూ లేదు, జరిగినదాని పట్ల హర్షం వ్యక్తం చేయనూ లేదు" అని మరో చరిత్రకారుడు విన్సెంట్ ఎ. స్మిత్ తన పుస్తకం 'ఆక్స్ఫర్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రం ఎర్లియర్ టైమ్స్ టూ ది ఎండ్ ఆఫ్ 1911 ' లో రాశారు.

ఆంగ్లేయులు

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని సమర్థించే ప్రయత్నాలు

భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవాదం విస్తరించడానికి ఈ సంఘటనను ప్రధానంగా వాడుకోవడమే కాక దాని ప్రాతిపదికన, భారతదేశంలో బ్రిటిష్ పాలనను సమర్థించే ప్రయత్నాలు కూడా జరిగాయి.

క్లైవ్

ఫొటో సోర్స్, BLOOMSBURY PUBLICATION

ఫొటో క్యాప్షన్, రాబర్ట్ క్లైవ్

అయితే, బ్రిటిష్ పాలన అంతమొందడంతోనే ఈ సంఘటన కూడా చరిత్ర చీకటి పుటల్లోకి జారుకుంది.

ఇది జరిగిన ఏడాది లోపే రాబర్ట్ క్లైవ్ కలకత్తాను తిరిగి స్వాధీనం చేసుకోవడమే కాక, ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాను ఓడించి భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాదులు పటిష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)