టిగ్రే రెబెల్స్ మాస్టర్ మైండ్ జనరల్ జిబ్రెటెన్సీ: ఇథియోపియా రాజధానిని ఎలా స్వాధీనం చేసుకున్నారంటే

ఫొటో సోర్స్, TSADKAN FAMILY
టిగ్రే పర్వత ప్రాంతాలు కేంద్రంగా ఇథియోపియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటు గ్రూపులో ఆర్మీ మాజీ జనరల్ ఒకరు మరోసారి కీలకంగా వ్యవహరిస్తున్నారు.
టిగ్రే తిరుగుబాటు దళాల కమాండర్ సడ్కాన్ జిబ్రెటెన్సీ ఆఫ్రికాలో ఈ తరానికి చెందిన గొప్ప మిలటరీ వ్యూహకర్తలో ఒకరని చెబుతుంటారు అంతర్జాతీయ భద్రతా నిపుణులు.
68 ఏళ్ల జిబ్రెటెన్సీ 1976లో ఆడిస్ అబాబా యూనివర్సిటీలో బయాలజీలో డిగ్రీ విద్యార్థిగా ఉన్నప్పుడు చదువు మధ్యలోనే వదిలి 'టిగ్రే పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్'(టీపీఎల్ఎఫ్)లో చేరారు.
అప్పటికి ఆ గ్రూపు టిగ్రే పర్వత ప్రాంతాల్లో ఉంటూ 'మెంగిస్తు హైలె మరియమ్' మార్క్సిస్ట్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తుండేది.
అందులో కొన్ని వందల మంది గెరిల్లాలు మాత్రమే ఉండేవారు.
తన విశ్లేషణా సామర్థ్యం, నైపుణ్యాలకు తోడు గ్రూపులోని సాయుధ గెరిల్లాల నమ్మకం సంపాదించుకోవడంతో 1980ల్లో ఆయన ఆ గ్రూపులో తిరుగులేని నాయకుడిగా చెలామణీ అవుతుండేవారు.
1991 నాటికి లక్ష మందికిపైగా సైన్యంతో ప్రబల శక్తిగా ఎదిగింది.
ఆ ఏడాది మేలో జనరల్ జిబ్రెటెన్సీ నాయకత్వంలో టీపీఎల్ఎఫ్.. ఎరిత్రియా బలగాలతో కలిసి దాడి చేసి ఇథియోపియా రాజధాని ఆడిస్ అబాబాను స్వాధీనం చేసుకుంది. మెంగిస్తు హైలె మరియమ్ పాలనకు ముగింపు పలికారు.

ఫొటో సోర్స్, Getty Images
టీపీఎల్ఎఫ్ సాయుధులు రాజధానిని స్వాధీనం చేసుకున్న తరువాత హిల్టన్ హోటల్ సమీపంలోని ఒక గెస్ట్ హౌస్‌ను జిబ్రెటెన్సీ కోసం తాత్కాలిక ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేశారు. పదిహేనేళ్ల తరువాత ఆ రోజు జనరల్ జిబ్రెటెన్సీ తొలిసారి ఒక బెడ్‌పై నిద్రించారని చెబుతారు.
మరోవైపు టీపీఎల్ఎఫ్ దళాలు రాజధానిని తమ చేతుల్లోకి తీసుకున్న తరువాత పాలన ప్రారంభించారు.
మే 28న వారు రాజధానిని స్వాధీనం చేసుకోగా అక్కడికి మూడు రోజుల్లోనే ఉద్యోగుల జీతాలు, విశ్రాంత ఉద్యోగుల పింఛన్లు అన్నీ చెల్లించారు.

ఫొటో సోర్స్, Getty Images
అల్‌ఖైదా స్థావరాలపై దాడి
ఆ తరువాత ఏడేళ్ల కాలంలో జనరల్ జిబ్రెటెన్సీ ఇథియోపియా ఆర్మీని సమూలంగా మార్చారు.
ఆయనకు మిలటరీ జనరల్ ర్యాంక్, చీఫ్ ఆఫ్ స్టాఫ్ హోదా ఇచ్చారు.
ఇథియోపియా నేషనల్ డిఫెన్స్ ఫోర్స్‌కు అధిపతిగా జిబ్రెటెన్సీ పదేళ్ల పాటు ఉన్నారు. ఆ సమయంలో మిలటరీలో టీపీఎల్ఎఫ్ మాజీ కమాండర్లదే ఆధిపత్యం కావడం, మిలటరీలో జాతుల సమతుల్యత లోపించడంతో విమర్శలు వచ్చాయి.
అనంతరం జిబ్రెటెన్సీ దూర విద్య ద్వారా ఎంబీయే చదివేందుకు చేరారు.

ఇథియోపియాలో అంతర్యుద్ధం ముగిసింది కానీ, 'హార్న్ ఆఫ్ ఆఫ్రికా'(సోమాలియా, ఇథియోపియా, ఎరిత్రియా, డిజిబౌటీ)లో అశాంతి ఇంకా కొనసాగుతూనే ఉంది.
1996లో జిబ్రెటెన్సీ సోమాలియాలోని అల్‌ఖైదా స్థావరాలపై దాడులకు సైన్యాన్ని పంపించారు.
అంతేకాదు.. సూడాన్‌లో అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న పక్షాలకు మద్దతుగా బలగాలను పంపించారు.
మిలటరీ నుంచి వెలి
ఎరిత్రియా నాయకుడు ఇసయాస్ అఫెవెర్కి వల్ల ఇథియోపియాకు ముప్పు అని జనరల్ జిబ్రెటెన్సీ హెచ్చరించగా అప్పటి ఇథియోపియా ప్రధాని, టీపీఎల్ఎఫ్‌లో జిబ్రెటెన్సీ సహచరుడు అయిన మెలెస్ జెనావీ పెడచెవిన పెట్టారు.
1998లో ఎరిత్రియాతో జరిగిన యుద్ధంలో జనరల్ జిబ్రెటెన్సీయే ఇథియోపియా సైనిక వ్యూహకర్తగా వ్యవహరించారు.
ఆ యుద్ధంలో నెత్తుటి వరద పారింది. రెండు వైపులా 80 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
2000 సంవత్సరం జూన్‌లో ఇథియోపియా దళాలు ఎరిత్రియా రక్షణ దళాలను వెంటాడి సరిహద్దులు దాటాయి.
ఎరిత్రియా రాజధాని అస్మారాను స్వాధీనం చేసుకునే దిశగా జనరల్ జిబ్రెటెన్సీ ముందుకు సాగిపోతున్నారు.
కానీ, ఇథియోపియా ప్రధాని మెలెస్ జెనావీ వెనక్కు వచ్చేయమని ఆదేశాలు పంపారు.
ఎరిత్రియాతో యుద్ధం చేయడం వెనుక ఉన్న లక్ష్యం నెరవేరిందని.. ఎరిత్రియా విధేయత ప్రదర్శించిందని చెబుతూ యుద్ధానికి ముగింపు పలికారు.

ఎరిత్రియాతో యుద్ధం తరువాత టీపీఎల్ఎఫ్‌లో చీలిక వచ్చింది. యుద్ధ లక్ష్యాలు, పార్టీ రాజకీయ మార్గంపై భేదాభిప్రాయాలతో చీలిపోయింది.
జనరల్ జిబ్రెటెన్సీని చీఫ్ ఆఫ్ స్టాఫ్ పదవి నుంచి తొలగించారు ప్రధాని మెలెస్ జెనావీ.
పార్టీ నుంచి బహిష్కరణ తరువాత అతనిపై నిత్యం నిఘా ఉండేది. ఒక సాధారణ పౌరుడిలా బతకడానికి జనరల్ జిబ్రెటెన్సీ చాలా కష్టాలు పడాల్సి వచ్చింది.
ఆ తరువాత హెచ్ఐవీని సైన్యాలు ఎలా నియంత్రించగలవో చెబుతూ ఒక నివేదిక తయారుచేశారు.
మరోవైపు దక్షిణ సూడాన్ కొత్త ప్రభుత్వానికి భద్రతా రంగ సంస్కరణలలో సలహాలు అందించేందుకు గాను యూకే డిపార్ట్‌మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెలవప్‌మెంట్ ఆయన్ను నియమించింది. సూడాన్ సైన్యాన్ని ప్రొఫెషనల్‌గా మార్చడానికి ఉద్దేశించిన ఒక విఫల ప్రయత్నం ఇది.
అనంతరం జిబ్రెటెన్సీ దక్షిణ టిగ్రేలోని తన సొంత జిల్లా రయాలో ఒక బ్రూవరీ ప్రారంభించడంతో పాటు హార్టీకల్చర్ బిజినెస్ కూడా ప్రారంభించారు.
అబీ అహ్మద్‌కు మద్దతు
2018లో ఇథియోపియా ప్రధానిగా అబీ అహ్మద్ నియామకాన్ని జిబ్రెటెన్సీ స్వాగతించడంతో పాటు ఆయనతో కలిసి పనిచేయడానికీ ముందుకొచ్చారు. ఆయన నిర్ణయంపై టీపీఎల్ఎఫ్ మాజీ సహచరుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.

ఫొటో సోర్స్, AFP
2019లో మళ్లీ ఆయన మరో గ్రూపులో చేరారు. ప్రధాని అబీ అహ్మద్, టీపీఎల్ఎఫ్ మధ్య మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించిన గ్రూప్ అది. అయితే, అబీ అహ్మద్ ఈ విషయంలో ఆసక్తి లేరంటూ జిబ్రెటెన్సీ ఆ గ్రూపు నుంచి బయటకు వచ్చేశారు.
ఇథియోపియా రాజధాని ఆడిస్ అబాబాలో టిగ్రే వ్యతిరేక సెంటిమెంట్ మళ్లీ మొదలుకావడంతో ఆయన టిగ్రే రాజధాని మెకెల్లేకు మకాం మార్చారు.
2020 నవంబరులో టిగ్రేలో యుద్ధం ప్రారంభం కావడంతో ఇతర టిగ్రే నాయకులతో తనకున్న అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి మరీ ఆయన సాయుధ తిరుగుబాటు దళాల్లో చేరారు.
జిబ్రెటెన్సీ పునరాగమనంతో పెద్దసంఖ్యలో యువత దళాల్లో చేరారు. గతంలో టీపీఎల్ఎఫ్ నుంచి బయటకువచ్చిన మాజీలు కూడా మళ్లీ చేరారు.
దీంతో ఇథియోపియా ప్రభుత్వం జనరల్ జిబ్రెటెన్సీ, ఇతర టిగ్రే నాయకులకు అరెస్ట్ వారంట్ జారీ చేసింది.
టిగ్రేలోని సైనిక స్థావరాలపై దాడులు చేయడం ద్వారా వారు యుద్ధాన్ని ప్రారంభించారని.. అది దేశద్రోహమని ప్రభుత్వంఆరోపించింది.

ఫొటో సోర్స్, AFP
ఇథియోపియా సైన్యానికి గట్టి దెబ్బ
టీపీఎల్ఎఫ్, టీపీఎల్ఎఫ్‌కు చెందకపోయినా కలిసి పనిచేస్తున్న సభ్యులు అంతా కలిసి 'టిగ్రే డిఫెన్స్ ఫోర్సెస్'(టీడీఎఫ్)గా ఏర్పడి ఇథియోపియా సైన్యంతో తలపడుతున్నారు.
జనరల్ జిబ్రెటెన్సీ ఈ టీడీఎఫ్ సెంట్రల్ కమాండ్‌గా వ్యవహరిస్తూ మిలటరీ అఫైర్స్ మొత్తం చూసుకుంటున్నారు.
''మేం మట్టి కరుస్తున్నాం. వాళ్లు ఉరికి వస్తున్నారు. దక్షిణ టిగ్రే పర్వత ప్రాంతంలోకి ప్రవేశించారు. మా యువ సాయుధులకు కాళ్లకు చెప్పులు కూడా లేవు. చేతితో పట్టుకునే ఆయుధాలు మాత్రమే వారి దగ్గర ఉన్నాయి'' అని జనరల్ జిబ్రెటెన్సీ జనవరిలో చెప్పారు.
కానీ, తమను చుట్టుముట్టిన ఇథియోపియా, ఎరిత్రియా దళాల నుంచి వారు బయటపడ్డారు. అయితే, టీడీఎస్ సాయుధులు ఎంతమంది చనిపోయారన్నది మాత్రం జనరల్ జిబ్రెటెన్సీ చెప్పలేదు.
నాలుగు నెలల పాటు టీడీఎఫ్ ఓ వైపు పోరాటం చేస్తూనే మరోవైపు తమ ఫైటర్స్‌కు శిక్షణ ఇచ్చింది.
మే నెలలో తమ ప్రత్యర్థులతో సమాన స్థాయికి చేరామని జనరల్ జిబ్రెటెన్సీ, ఆయన సహచరులు ఒక అంచనాకు వచ్చారు.
ఇటీవల జరిగిన జీ 7 దేశాల సదస్సులో టిగ్రేలో కాల్పుల విరమణకు పిలుపునిచ్చారు.
దానిపై టీపీఎల్ఎఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో సంధి ప్రస్తావన ఏమీ చేయలేదు కానీ విరామం ఇవ్వడానికి తాము సిద్ధమేనని చెప్పింది.
ఆ తరువాత జూన్ 17న టీడీఎఫ్ ఒక ప్రకటనలో... తాము వరుస యుద్ధాలతో ఇథియోపియాలోని కొంత భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నామని.. ఎనిమిది డివిజన్ల ఇథియోపియా ఆర్మీని మళ్లించామని చెప్పింది.
ఇథియోపియా ఆర్మీమాత్రం అదంతా అవాస్తవమని చెబుతోంది.
రెండు పక్షాలు చేస్తున్న క్లెయిములలో ఏది నిజం, ఏది అబద్ధమో చెప్పేందుకు ఆ ప్రాంతానికి జర్నలిస్టులు ఎవరూ వెళ్లలేదు.

ఫొటో సోర్స్, Tsadkan family
కానీ, టీడీపీ భారీ విజయం సాధించిందని... ఇథియోపియా మిలటరీకి గట్టి దెబ్బ తగిలిందని పరిస్థితులు చెబుతున్నాయి.
టీడీఎఫ్ బలగాలు టిగ్రే రాజధాని మెకల్లెలో ప్రవేశించాయి. ఇథియోపియా ప్రభుత్వం, ఆర్మీ కాల్పుల విరమణ ప్రకటించి అక్కడి నుంచి పలాయనం సాగించాయి.
మెకల్లెలో పెద్దమొత్తంలో చేజిక్కించుకున్న ఆయుధాలు, సైనిక సామగ్రి వాడుకుంటూ టీడీఎఫ్ ప్రస్తుతం ఎరిత్రియా సైన్యంతో తలపడుతోంది.
ఇథియోపియాకు మద్దతుగా ఎరిత్రియా సైన్యం 2020 నవంబరు నుంచి టీడీఎఫ్‌తో పోరాడుతోంది.
టీడీఎఫ్‌కు ఎరిత్రియా బలమైన శత్రువు. ఎరిత్రియా సైన్యం ఇంకా చెక్కుచెదరకుండా ఉంది. అయితే, ఉత్తర టిగ్రేలో తమ అధీనంలో ఉన్న నగరాలను వదిలిపెట్టి ఎరిత్రియా సైన్యం సరిహద్దు దిశగా వెనుకడుగు వేస్తోందని తాజా రిపోర్టులు సూచిస్తున్నాయి.
పోరాడాలా? వెనక్కు మళ్లాలా అని ఎరిత్రియా అధ్యక్షుడు ఇసయాస్ డోలాయమానంలో ఉన్నారు. అయితే, ఇసయాస్ అధికారంలో ఉండగా తాము సురక్షితంగా ఉండలేమని భావించే టీడీఎఫ్ ఈ పోరాటాన్ని కొనసాగించే అవకాశాలున్నాయి.
కాబట్టి మరో భారీ యుద్ధం తప్పకపోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- కోవాగ్జిన్: దేశీయంగా తయారుచేస్తున్నప్పటికీ ఈ వ్యాక్సీన్ ధర ఎందుకు అంత ఎక్కువగా ఉంది?
- ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి... వీటిని ఆపేదెలా?
- చైనాలో అతి సంపన్నులపై పెరిగిపోతున్న అసహనం... సంపద ప్రదర్శనపై చిర్రెత్తిపోతున్న జనం
- లైంగిక దోపిడీ: 'అయినవారే, ఘోరాలకు పాల్పడుతుంటే అన్నీ మౌనంగా భరించే చిన్నారులు ఎందరో' - అభిప్రాయం
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








