రెండో ప్రపంచ యుద్ధం: తైవాన్ రాగి గనుల్లో యుద్ధ ఖైదీలను బానిసలుగా హింసించిన చీకటి చరిత్ర

కింకాసేకి రాగి గనుల దగ్గర సంస్మరణ సభలో యుద్ధ ఖైదీలు

ఫొటో సోర్స్, Michael Hurst

ఫొటో క్యాప్షన్, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో సుమారు 1,100 మంది యుద్ధ ఖైదీలను కింకాసెకి రాగి గనుల దగ్గరున్న శిబిరాల్లో బంధించారు.
    • రచయిత, సిండీ సుయ్
    • హోదా, బీబీసీ న్యూస్

జింగ్వాషి కింకాసేకి యుద్ధఖైదీల శిబిరానికి నెలవుగా ఉండేది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఇక్కడ సుమారు 4,350 మంది శత్రుదేశాల సైనికులను బందీలుగా ఉంచారు.

అప్పటికి తైవాన్ జపాన్ పరిపాలనలో ఉండేది.

ఈ సైనికులను జపాన్ 1942-45 మధ్య ప్రాంతంలో బంధించి అక్కడున్న రాగి గనుల్లో దారుణమైన పరిస్థితుల మధ్య పని చేయించేది.

ఆ శిబిరాల్లో బందీలను చెరకు పండించేందుకు లోయలో ఉన్న భారీ రాళ్లను తొలగించమని ఒత్తిడి చేసేవారు. కేవలం అన్నం, ఉడకబెట్టిన కాయగూరల సూపు మాత్రమే ఇచ్చి వారితో చెరువును కూడా తవ్వించారు.

అందులో చాలా మంది బెరి బెరి అనే వ్యాధితో బాధపడేవారు. ఈ వ్యాధి వల్ల కాళ్ళు, వృషణాలు వాచిపోతాయి. అయినా కూడా వారిని పని చేయమని బలవంతం చేసేవారు.

వేసవిలో ఈ రాగి గనుల్లో పని చేసే బందీలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతల్లో పని చేసేవారు. శీతాకాలంలో అయితే, చలికి తట్టుకోలేక చాలా మంది మరణించారు.

వారికి నిర్దేశించిన రోజువారీ లక్ష్యాలను చేరుకోలేకపోతే, అక్కడుండే కాపలాదారులు వారిని గనులు తవ్వే సుత్తులతో కొట్టేవారు.

కొన్ని దశాబ్దాల వరకు, ఈ చీకటి గతం గురించి, అక్కడ బందీలుగా ఉన్న యుద్ధఖైదీల గురించి అందరూ మర్చిపోయారు.

కానీ, ఆ పరిస్థితిని మార్చేందుకు కెనడా చరిత్రకారుడు మైఖేల్ హర్స్ట్ కంకణం కట్టుకున్నారు

"ఇవన్నీ బానిసలను కార్మికులుగా వాడుకునే శిబిరాలు. ఈ ఖైదీలను కనుగొని, వారి కథ చెప్పాలని నాకు అకస్మాత్తుగా తట్టింది" అని హర్స్ట్ బీబీసీకి చెప్పారు.

ఆయనకిప్పుడు 73 సంవత్సరాలు. ఆయన 1988 నుంచి తైవాన్‌లోనే ఉంటున్నారు.

తైవాన్‌లో ఉన్న యుద్ధఖైదీల స్థావరాలన్నిటినీ కనిపెట్టేందుకు, అక్కడ సంస్మరణ ఫలకాలను ప్రతిష్టించేందుకు ఆయన గత రెండు దశాబ్దాల పాటు కృషి చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన కొన్ని వేల మంది బందీలను కూడా గుర్తించి అందులో 800 మందిని సంప్రదించారు.

వారితో జరిపిన సంభాషణలను ఆయన పుస్తకం 'నెవర్ ఫర్‌గాటెన్‌'లో పొందుపరిచారు.

వారంతా ఇప్పుడు ప్రాణాలతో లేరు. అందులో ఒక 100 సంవత్సరాల వ్యక్తి మాత్రం సజీవంగా ఉన్నారు.

"మరణించడం సులభం. రోజు రోజూ బ్రతకడమే కష్టం" అని వారు చెప్పినట్లు హర్స్ట్ బీబీసీకి చెప్పారు.

"వారి కథలు నన్ను కదిలించాయి. వారి పట్ల చూపించిన దారుణ వైఖరి నన్ను దిగ్బ్రాంతికి గురి చేసింది. అది విని ఒక్కోసారి ఏడ్చేసేవాడ్ని. తమ కుటుంబాలతో కూడా ఎన్నడూ చెప్పని కథలను నాకు చెప్పారు. మనసు విప్పి తాము అనుభవించిన బాధలను నాతో పంచుకున్నారు" అని అన్నారు.

మైఖేల్ హర్స్ట్

ఫొటో సోర్స్, Michael Hurst

ఫొటో క్యాప్షన్, మైఖేల్ హర్స్ట్

ఈ ప్రాజెక్టు పట్ల హర్స్ట్‌‌కు వ్యక్తిగత ఆసక్తి కూడా ఉంది. ఆయన బంధువులు కొందరు యూరప్‌లో పని చేశారు. ఆయన యుద్ధ సైనికుల గౌరవార్ధం ఏదో చేయాలని అనుకునేవారు.

పసిఫిక్‌లో జరిగిన యుద్ధాలలో 3 కోట్ల మంది ప్రజలు మరణించినప్పటికీ వారిని గుర్తించేందుకు పెద్దగా ప్రయత్నాలు జరగలేదని ఆయన గుర్తించారు.

మేమెప్పుడూ ఆకలితోనే ఉన్నాం

జపాన్ పై దాడి చేస్తున్న దేశాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ సైనికులను ఆసియాకు పంపించారు.

తైవాన్‌లో ఉన్న క్యాంపులలో సీనియర్ ర్యాంకు ఉన్న అధికారులను అతి హీనంగా చూసేవారని హర్స్ట్ చెప్పారు.

ప్రాచీన జ్ఞాపికలు , యుద్ధ కాలం నాటి సాక్ష్యాలు, డైరీలు, తైవాన్ సైనికులు ఇచ్చిన సమాచారం, బందీలుగా ఉన్న వ్యక్తులు అందించిన వివరాల ఆధారంగా ఆయన పరిశోధన సాగించారు.

అందులో అమెరికా సైన్యానికి చెందిన సెర్జంట్ కార్ల్ ఏ పసుర్కా కూడా ఉన్నారు. ఆయన 24 ఏళ్ల వయసులో యుద్ధ సైన్యంలో చేరారు.

"మేమెప్పుడూ ఆకలితోనే ఉండేవాళ్ళం. ఎలాగోలా బతికి ఇంటికి తిరిగి వెళ్లాలనే ఆలోచనతోనే ఉండేవాళ్ళం" అని ఆయన హర్స్ట్‌కి రాసిన లేఖలో పేర్కొన్నారు.

కొంత మంది తైవాన్ అమ్మాయిలు ఈ యుద్ధ ఖైదీలకు ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు జపాన్ కాపలాదారులు వారిని కొట్టిన సంఘటనను ఆ లేఖలో ఆయన గుర్తు చేసుకున్నారు.

కార్ల్ ఏ పసుర్కా

ఫొటో సోర్స్, Lorrane Pasurka

ఫొటో క్యాప్షన్, కార్ల్ ఏ పసుర్కా

యూరప్‌లో జర్మన్లు, ఇటాలియన్లు నిర్వహించిన క్యాంపుల్లో కంటే, ఆసియాలో ఉన్న జపాన్ యుద్ధ ఖైదీల శిబిరాల్లో మరణాల రేటు ఎక్కువగా ఉందని అమెరికాలోని రెండవ ప్రపంచ యుద్ధ మ్యూజియంలో పొందుపరిచిన వివరాలు తెలియచేస్తున్నాయి.

పశ్చిమదేశాల వారికి అనుగుణంగా పని చేసిన ఆసియా ఖైదీలలో 27 శాతం నుంచి 42 శాతం మంది ఖైదీలు ఆకలి బాధ తట్టుకోలేక, జబ్బుల బారిన పడి చికిత్స లభించక, ఉరి తీయడం వలన మరణించారు.

యూరప్‌లో ఇలాంటి మరణాలు 1 - 2 శాతం మాత్రమే ఉన్నాయి.

యుద్ధ ఖైదీల గురించి జెనీవా సమావేశంలో జరిగిన ఒప్పందంపై జపాన్ కూడా సంతకం చేసింది కానీ, దానిని పాటించలేదు.

"వారి దృష్టిలో అది చట్టం కాదు" అని హర్స్ట్ అన్నారు.

"మేం లొంగితే, అది మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా చక్రవర్తిని అగౌరవపరిచినట్లేనని జపాన్ మిలిటరీ భావిస్తుంది. యుద్ధఖైదీలుగా ఉండటం అన్నిటి కంటే అవమానకరమైన విషయం. అందుకే ఖైదీలను జంతువుల్లా, విలువలేని వారిలా చూసేవారు" అని చెప్పారు.

చేదు తీపి కలిపిన విడుదల

వీరందరినీ విడుదల చేసినప్పటికీ కూడా వారి అంచనాలకనుగుణంగా సంపూర్ణ స్వాతంత్య్రం లభించలేదు.

"వారు బందీలవ్వడం గురించి, లోపాలతో కూడిన యుద్ధ వ్యూహాల గురించి బయటకు చెప్పవద్దని కొన్ని దేశాల ప్రభుత్వాలు వారికి చెప్పాయి" అని హర్స్ట్ చెప్పారు.

గనుల్లో తిన్న దెబ్బలకు, అనారోగ్యం బారిన పడి చాలా మంది మరణించారు. బందీలుగా ఉండటం వల్ల మిగిలిన మానసిక గాయాలు కొంత మందిని జీవితాంతం వెంటాడాయి.

"జ్యాక్ యుద్ధ ఖైదీగా ఉన్నట్లు నాకెప్పుడూ చెప్పలేదు" అని యూకే రాయల్ ఆర్టిల్లరీ లో పని చేసిన జాన్ ఏ ఫార్మర్ భార్య చెప్పారు.

ఆయన ఇంత బాధ భరించినట్లు తెలిసి నాకెంతో బాధ కలిగింది" అని ఆమె అన్నారు.

ఆయన బందీగా ఉన్న శిబిరాలను చూడటానికి ఆమె కూతురితో కలిసి రెండు సార్లు తైవాన్ వెళ్లారు.

కూతురుతో జాన్ ఏ ఫార్మర్

ఫొటో సోర్స్, Lin Mount

ఫొటో క్యాప్షన్, కూతురుతో జాన్ ఏ ఫార్మర్

చరిత్ర పై మచ్చ

ఈ శిబిరాలు తైవాన్ చరిత్రకే మచ్చ లాంటివి. కానీ, రెండవ ప్రపంచ యుద్ధ సమయం నాటికి దేశం జపాన్ పాలనలో ఉండేదని కూడా ప్రజలు గుర్తిస్తారు అని తైవాన్ భావిస్తోంది.

"రెండవ ప్రపంచ యుద్ధంలో తైవాన్ ప్రముఖ పాత్ర పోషించింది" అని హర్స్ట్ చెప్పారు.

తైవాన్‌లో కూడా రెండవ ప్రపంచ యుద్ధం గురించి పాఠ్యాంశాల్లో బోధిస్తున్నప్పటికీ, ఈ శిబిరాల గురించి తగినంత ప్రస్తావన లేదని విమర్శకులు అంటారు.

కొంత మంది తైవాన్ ప్రజలు జపాన్‌కు మద్దతుగా పని చేశారనేది కూడా వాస్తవమే అని హర్స్ట్ అన్నారు.

పసిఫిక్ ప్రాంతంలో మరణించిన సైనికుల కోసం వార్షిక సంస్మరణలు చాలా తక్కువగా జరుగుతాయని ఆయన అన్నారు.

ఆసియాలో పోరాడిన సైనికుల గౌరవార్ధం చరిత్రను నేర్పాలని ఆయన అంటారు. అలా చేయడం వల్ల అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఆయన భావిస్తారు.

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత శిబిరాల్లో ఉన్న జపాన్ ఆఫీసర్లు, తైవాన్ గార్డులకు యుద్ధ నేరాలపై జైలులో బంధించారు. కానీ, వారిలో 50 శాతం మందికి క్షమాభిక్ష పెట్టారు.

"కొంత మంది తైవాన్ కాపలాదారులు యుద్ధ ఖైదీలకు క్షమాపణలు కూడా చెప్పారు. వీరిని యుద్ధఖైదీలు క్షమిస్తే, కాపలాదారులు కూడా ప్రశాంతంగా మరణించగలరు. క్షమించడం చాలా అద్భుతమైన విషయం" అని హర్స్ట్ అన్నారు.

యుద్ధఖైదీల జీవిత చరమాంకంలో వారు చేసిన త్యాగాలకు, వారనుభవించిన కష్టాలను గుర్తించడమే వారికిచ్చిన అతి పెద్ద బహుమతి అని హర్స్ట్ అన్నారు.

"నేను మాట్లాడిన యుద్ధ ఖైదీలెవరూ తమ పట్ల ఎవరో శ్రద్ధ వహించారని చెప్పలేదు. అయితే, తమను మర్చిపోనందుకు గొప్పగా ఉందని చెప్పారు. ఈ రోజున మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం కోసం వారు పోరాడారు."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)