భారత్, అమెరికా నేవీ డ్రిల్: చైనాకు ఇది హెచ్చరిక పంపడమేనా

ఫొటో సోర్స్, TWITTER.COM/USPACIFICFLEET
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత, అమెరికా నావికా దళాలు హిందూ మహాసముద్రంలో సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి. భారత్, చైనా మధ్య లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న ప్రస్తుత సమయంలో ఈ విన్యాసాలు చైనాకు భారత్ పంపుతున్న హెచ్చరికేనా?
ఈ విన్యాసాలు అండమాన్-నికోబార్ దీవుల వద్ద జరిగాయి. భారత నావికాదళం ఈస్టర్న్ ఫ్లీట్ అక్కడ ముందే మోహరించి ఉంది.
అప్పుడప్పుడూ ఇతర దేశాల నావికాదళాలతో కలిసి విన్యాసాలు చేస్తుంటామని, ఇదీ అలాంటిదేనని భారత నావికాదళం ప్రతినిధి చెప్పారు.
“అమెరికా భారీ విమానవాహక యుద్ధనౌక ‘యూఎస్ఎస్ నిమిట్జ్’ హిందూ మహాసముద్రంలోంచి వెళ్తోంది. అదే సమయంలో రెండు దేశాల నావికాదళాలు కలిసి ఈ విన్యాసాలు నిర్వహించాయి” అని ఆయన చెప్పారు.
ఇంతకు ముందు కూడా జపాన్, ఫ్రాన్స్ నావికాదళాలతో కలిసి ఇండియన్ నేవీ ఇలాంటి విన్యాసాలు చేసిందని ఆయన చెబుతున్నారు.
ఇది వాణిజ్య మార్గం కూడా కాబట్టి, హిందూ మహాసముద్రంలో ఈ ప్రాంతం చాలా ముఖ్యమైనదని వ్యూహాత్మక అంశాల నిపుణులు చెబుతున్నారు.
“అమెరికా లాంటి బలమైన దేశాలు దక్షిణ చైనా సముద్రంలో తమ యుద్ధనౌకలను మోహరించడానికి ఇదే మార్గంలో వెళ్తాయి. అలాంటి పరిస్థితుల్లో అండమాన్-నికోబార్ దీవులు వారికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యం” అంటున్నారు.

హిందూ మహాసముద్రం చాలా కీలకం
దీనిపై అమెరికా నావికాదళం ఏడో ఫ్లీట్ ఒక ప్రకటన జారీ చేసింది. “గగనతల భద్రతతోపాటూ, శిక్షణ మెరుగుపరుచుకోడానికి కూడా ఈ సంయుక్త విన్యాసాలు దోహదపడతాయి. దీనివల్ల వల్ల రెండు దేశాల సైనిక సామర్థ్యం మెరుగవుతుంది. సముద్ర మార్గంలో ఎదురయ్యే ప్రమాదాలు, సముద్రపు దొంగలు, తీవ్రవాదంపై పోరుకు ఇది తోడ్పడుతుంద”ని అడ్మిరల్ జిమ్ కిర్క్ చెప్పారు.
భారత నావికాదళం ఈ ఏడాది చివర్లోనూ ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ నావికాదళాలతో కలిసి పశ్చిమ బెంగాల్ తీరంలో విన్యాసాలు చేపట్టనున్నట్లు ఇండియన్ నేవీ చెబుతోంది.
“మొదట్లో, మనం ఇలాంటివి చేస్తున్నప్పుడు భారత్‌లో వ్యతిరేక గళాలు వినిపించేవి. కానీ, గల్వాన్ లోయలో చైనా దాడి తర్వాత వీటిని ప్రజలు స్వాగతించారు” అని వ్యూహాత్మక అంశాల నిపుణులు సుశాంత్ సరీన్ బీబీసీతో అన్నారు.
“భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక అంశాల్లో సాన్నిహిత్యం పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత్ అమెరికాతో ఎన్నో వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంది. జలాంతర్గాములను ఎదుర్కొనే టెక్నాలజీని కూడా తీసుకుంటోంది” అన్నారు.
హిందూ మహాసముద్రం ప్రతి దేశానికీ చాలా కీలకం. ముఖ్యంగా చైనా ఆధిపత్యం చలాయించాలని చూస్తున్న దక్షిణ చైనా సముద్రంలోకి అమెరికా, మిగతా బలమైన దేశాల యుద్ధనౌకలు చేరుకోవాలంటే హిందూ మహాసముద్రం మీదుగా వెళ్లాలి.

ఫొటో సోర్స్, TWITTER.COM/USPACIFICFLEET
భారత్ ఏం చెప్పాలనుకుంటోంది
“చైనా కూడా దక్షిణ చైనా సముద్రంపై తమ ఆధిపత్యం పెంచుకుంటోంది. కొన్ని రోజుల క్రితమే భారత నావికాదళం ఇండోనేసియా సమీపంలో చైనా యుద్ధనౌకలకు సవాలు విసిరింది. తర్వాత అవి వెనక్కు వెళ్లిపోవాల్సి వచ్చింది” అని సరీన్ చెప్పారు.
ప్రస్తుతం భారత్ ఏ పక్షానా నిలవడం లేదని, తన అలీన విధానాన్ని కొనసాగిస్తోందని వ్యూహాత్మక అంశాల నిపుణులు చెబుతున్నారు. విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ కూడా “భారత్ ఏ గ్రూపులోనూ భాగం కాదు” అన్నారు.
అయితే చైనాతో ఉద్రిక్తతలు ఏర్పడిన తర్వాత, భారత్ మిగతా దేశాలతో వ్యూహాత్మ బంధాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి పెట్టింది. అమెరికా నావికాదళంతో జరిగిన ఈ విన్యాసాలనూ అలాగే చూస్తున్నారు.
కానీ “భారత్ తను ఒంటరిగా లేదని, అమెరికా కూడా తనకు అండగా ఉందని ఇలాంటి ఎక్సర్‌సైజ్‌లతో చైనాకు సంకేతాలు పంపాలనుకుంటోంది” అని రక్షణ నిపుణులు రాహుల్ బేడీ భావిస్తున్నారు.
1991-92 నుంచే అమెరికా, భారత్ సంయుక్త సైనిక విన్యాసాలు చేస్తున్నాయని తెలిపారు.
కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు కూడా అమెరికా భారత్‌కు అండగా నిలిచింది.
కానీ ఈ విన్యాసాల వల్ల పెద్దగా ఏం సాధించలేమని బేడీ చెబుతున్నారు.
“ఎందుకంటే, భారత్ ఆందోళనకు ప్రధాన కేంద్రం నియంత్రణ రేఖ. అక్కడ చైనా తన సైనిక బలాన్ని పెంచుకోవాలని అనుకుంటోంది. అయినా, చైనా నావికాదళం కూడా చాలా బలంగా ఉంది. అది యుద్ధనౌకలను ధ్వంసం చేసే సుదూర క్షిపణులను కూడా అభివృద్ధి చేసింది. ఇటు భారత్ కూడా హిందూ మహాసముద్రంలో తన నావికాదళం గస్తీని మరింత పెంచింది” అని రాహుల్ బేడీ అంటున్నారు.
విమానవాహక యుద్ధ నౌక యూఎస్ఎస్ నిమిట్జ్
యుఎస్ఎస్ నిమిట్జ్ అమెరికా అతిపెద్ద విమానవాహక యుద్ధనౌక. దీనితోపాటు టికొండెరోగా-క్లాస్ మిసైల్ నౌక, యుఎస్ఎస్ ప్రిన్స్‌టన్, క్షిపణి విధ్వంసక యుద్ధనౌక యుఎస్ఎస్ స్టెరెట్, యుఎస్ఎస్ రాల్ఫ్ జాన్సన్ కూడా ఉంటాయి.
ఈ యుద్ధనౌకను ‘సూపర్ కేరియర్’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానవాహక యుద్ధనౌక.
అణు శక్తితో నడిచే ఈ యుద్ధనౌకను 1975లో అమెరికా నావికాదళం కమిషన్ చేసింది.
రెండో ప్రపంచ యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించిన అమెరికా నావికాదళం మూడో ఫ్లీట్ అడ్మిరల్ కమాండర్ చెస్టర్ నిమిట్జ్ పేరును ఈ యుద్ధనౌకకు పెట్టారు.
మొదట్లో నిమిట్జ్ నోర్‌ఫాల్క్ నావల్ స్టేషన్‌లో నిలిచి ఉండేది. ఇప్పుడు ఇది అధికారికంగా కిట్‌శాప్ నేవీ బేస్‌లో ఉంటోంది.
కానీ. ఏప్రిల్‌లో ఈ యుద్ధనౌకలో ఉన్నవారికి కూడా కరోనా వచ్చింది. దాంతో దానిని 27రోజులు క్వారంటీన్‌లో ఉంచారు. తర్వాత, ఈ నెల మొదట్లో నిమిట్జ్ యుద్ధనౌకను మళ్లీ దక్షిణ చైనా సముద్రంలో మోహరించారు.
ఈ యుద్ధనౌకను 2022లో అమెరికా నావికాదళం నుంచి తొలగించనున్నారు. ఆ తర్వాత దీనికంటే అత్యాధునికమైన గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ క్లాస్ విమానవాహక యుద్ధనౌక ‘జాన్ ఎఫ్ కెనెడీ’ దీని స్థానంలోకి వస్తుంది. కానీ ఇంకా దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదు.
ఇవి కూడా చదవండి:
- చైనా ఆట కట్టించాలంటే భారత్ ఏం చేయాలి
- అరుణాచల్ ప్రదేశ్: భారత్-చైనా మధ్య గొడవ ఎందుకు, దీని చరిత్రేంటి?
- కోవిడ్–19 రోగులకు ప్లాస్మా దానం చేసిన తబ్లిగీలు
- కరోనావైరస్: ప్లాస్మా థెరపీ అంటే ఏంటి? దీనితో కోవిడ్ వ్యాధి నయమవుతుందా? ఎంత ఖర్చవుతుంది?
- మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య
- 'శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడు.. అసలైన అయోధ్య నేపాల్‌లోనే ఉంది' - నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ
- చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.. ‘అయితే మీకు కెనాయిటిస్ వ్యాధి ఉన్నట్టే’
- శృంగారం వల్ల శరీరంలో చేరి ప్రాణాంతకంగా మారే 4 రకాల బ్యాక్టీరియాలు మీకు తెలుసా?
- వ్యాక్సిన్ త్వరలో వచ్చేస్తుందనుకుంటే అది అత్యాశే: ప్రపంచ ఆరోగ్య సంస్థ
- తూర్పుగోదావరి జిల్లాలో ఒక వ్యక్తి నుంచి 100 మందికి కరోనావైరస్.. ఎలా వ్యాపించింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








