మహిళలు మితిమీరి వ్యాయామం చేస్తే సంతానోత్పత్తి సమస్యలు తప్పవా

జిమ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ శైలజ చందు
    • హోదా, బీబీసీ కోసం

చిన్నతనం నుంచి ఆమెకు క్రీడలంటే ప్రాణం. ఆమె ఆసక్తిని తలిదండ్రులు కాదనలేదు. ప్రోతహించారు కూడా.

దాంతో ఎన్నో విజయాలు, మరెన్నో పతకాలు సాధించింది.

కోచ్ పర్యవేక్షణలో, రోజుకు నాలుగు గంటల పాటు శిక్షణ తీసుకుంటుంది.

పదకొండేళ్లుగా ఒక్క రోజుకూడా కూడా ప్రాక్టీసు మానలేదు.

ఉదయం వ్యాయామానికి టైము తప్పలేదు.

కఠినమైన వ్యాయామం. రుచి లేని ఆహారం. సరదాలు లేని జీవితం.

ఆ త్యాగాలు, తనని లక్ష్యానికి చేర్చే మెట్లనుకుంది.

ఓసారి పాదంలో ఎముక ఫ్రాక్చర్ అయితే విశ్రాంతి తీసుకోవలసివచ్చింది.

డాక్టర్ మాట్లాడుతూ, ఆమె ఒక ఆరోగ్య లోపంతో బాధ పడుతోందన్నారు.

ఫ్రాక్చర్ కూడా ఆ సమస్య వల్లనే అని తేల్చారు.

పౌష్టికాహారం, ప్రతి రోజూ వ్యాయామం, నియమబద్ధమైన జీవితం... ఇన్ని మంచి అలవాట్లున్న తనకు ఆరోగ్య సమస్య ఏమిటో, ఆ లోపమేమిటో ఆమెకర్థం కాలేదు.

జిమ్

ఫొటో సోర్స్, Getty Images

వ్యాయామం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి.

బరువు తగ్గుతారు. రక్త పోటు, షుగర్ వ్యాధి అదుపులోకి వస్తాయి. ఎముకలు పటిష్టంగా వుంటాయి. అంతే కాదు ఆత్మ విశ్వాసం పెరగడానికి, మానసికారోగ్యానికి వ్యాయామం అవసరం.

ఇవే ఇంతవరకూ మనకు తెలిసిన సత్యాలు.

కానీ స్పోర్ట్స్‌ని కెరీర్‌గా ఎంచుకుని, కఠినమైన వ్యాయామం చేసే స్త్రీల విషయంలో కూడా ఇవే ప్రయోజనాలుంటాయా?

ఆశ్చర్యం కలిగించే నిజం ఏమిటంటే,

తీవ్రంగా చేసే శారీరక వ్యాయామం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది.

ఎక్సర్‌సైజ్

ఫొటో సోర్స్, Getty Images

Relative Energy Deficiency in Sport

స్పోర్ట్స్ మహిళలు , తాము తీసుకునే ఆహారాన్ని మించి వ్యాయామం చేస్తుండడం వలన శక్తి సమతుల్యత లోపిస్తుంది.

తక్కువ ఆహారం, ఎక్కువ పరిశ్రమ వల్ల, శరీరానికి తగినంత శక్తి లభించదు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే , శరీరంలో కీలకమైన వ్యవస్థలు దెబ్బ తింటాయి.

శారీరిక దృఢత్వం కోసం శ్రమించే స్త్రీలు ఎక్కువ కాలం పాటు ఆ లోపంతోనే బాధపడడం వల్ల , కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

జిమ్‌లో మహిళ

ఫొటో సోర్స్, Getty Images

Relative Energy Deficiency in Sport (RED‐S) వల్ల దుష్పరిణామాలు

నొప్పిని వోర్చుకునే శక్తి , కండరాల్లో బలం తగ్గుతుంది.

శిక్షణ తీసుకుంటున్నా, స్పందన ఉండదు.

సమన్వయం, ఏకాగ్రత క్షీణిస్తాయి.

అంచనా వేయగల శక్తి లోపిస్తుంది.

గాయాల బారిన పడతారు.

అసహనం, నిరాశలతో కృంగిపోతారు.

ఎముకల్లో పటిష్టత తగ్గి, ఫ్రాక్చర్లు అవుతాయి.

ఇమ్యూనిటీ తగ్గడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్లకు గురి అవుతారు. మానసికోల్లాసం కరువవుతుంది. గుండె జబ్బులొచ్చే అవకాశం ఉంటుంది. సంతానోతత్పత్తికి సంబంధించిన వ్యవస్థ కూడా సాధారణ గతిలో పనిచేయదు.

గ్రాఫిక్

ఫొటో సోర్స్, Getty Images

రుతుక్రమంలో మార్పులు

సాధారణంగా స్త్రీలతో పోలిస్తే, మహిళా అథ్లెట్లు పీరియడ్స్ కు సంబంధించిన సమస్యలతో బాధ పడుతుంటారు.

స్పోర్ట్స్ కోసం కఠిన శిక్షణ పొందే ఆడపిల్లలకు పీరియడ్స్ ఆలస్యంగా మొదలవుతాయి.

కఠిన వ్యాయామం, ఆహార నియంత్రణ వలన ఈ స్త్రీలు వుండవలసిన బరువుకన్నా తక్కువగా వుంటారు. వారికి పీరియడ్స్ క్రమబద్ధంగా రావు. క్రమం తప్పి వస్తూ, కొంతకాలానికి పీరియడ్స్ ఆగిపోతాయి.

సుమారుగా 65 శాతం మంది మారథాన్ రన్నర్లలోనూ, 79 శాతం బాలే డాన్సర్లలో పీరియడ్స్ ఆగిపోతాయి.

ఆహారం తీసుకునే విషయంలో సమస్యలు..

క్రీడలలో పాల్గొనే మహిళలు, మెరుగైన అవకాశాలకోసం, కఠిన ఆహార నియమాలు పాటిస్తారు. ఆకలి లేకపోవడం, తినడానికి భయపడడం, ఎక్కువ ఆహారం తీసుకున్న రోజు, కావాలని వాంతులు చేసుకోవడం వంటి సమస్యలతో బాధ పడుతుంటారు. నిస్సత్తువతో బాధ పడతారు.

సంతానోత్పత్తి సమస్యలు

క్రీడలను కెరీర్‌గా ఎంచుకునే స్త్రీలలో, సరైన సంతానం పొందడానికి అనువైన వయసు, ప్రొఫెషనల్ సామర్థ్యం నిరూపించుకునే వయసు, ఒకటే కావడం గమనార్హం.

విజయం సాధించేవరకూ సంతానం వద్దని వాయిదా వేస్తారు. మూడు పదుల వయసు వరకు సంతానం పొందకుండా జాగ్రత్త పడతారు. కానీ, 37 ఏళ్ల తర్వాత అండంలో క్వాలిటీ తగ్గుతుంది. బిడ్డలలో అంగవైకల్యం, తక్కువ ఐక్యూ ఉండే అవకాశం ఉంది.

కఠినమైన వ్యాయామం వల్ల సంతానోత్పత్తికి సంబంధించిన హైపోథలమస్, పిట్యూటరీ గ్రంధులు, మరియూ అండాశయాలు తక్కువ స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తాయి.

కఠిన వ్యాయామమంటే, రోజుకు గంట కన్నా మించి వర్క్ అవుట్లు, చేస్తూ, నిముషానికి 6 కిలో కేలరీల శక్తి ఖర్చు చేసే వ్యాయామం. ఈ విధంగా వర్క్ అవుట్ చేసే స్త్రీలలో సంతానలేమి ఆరు రెట్లు ఎక్కువ.

సంతానం కోసం చేసే వైద్య ప్రయత్నాలు సఫలం కావడానికి సమస్యలనెదుర్కొంటారు.

కఠిన శారీరిక వ్యాయామం చేసే స్త్రీలలో బిడ్డలు కలిగే అవకాశాలు 40 శాతం తక్కువ. ఒక వేళ ప్రెగ్నన్సీ వచ్చినా, అబార్షన్ కావడానికి రెండు రెట్లు అవకాశముంటుంది.

యూరిన్ లీకవడం..

మహిళా అథ్లెట్లు ప్రాక్టీసు చేసే సమయంలో పొట్టలో వత్తిడి ఎక్కువ కావడం వల్ల యూరిన్ లీకవడమనే సమస్య ఎదురవుతుంది. ఈ సమస్య గురించి బయటికి చెప్పుకోవడానికి, మహిళలు ఇబ్బంది పడతారు. వైద్యులే అర్థం చేసుకుని వారికి సహాయం అందించాలి.

స్పోర్ట్స్ మహిళలలో ఎదురయే ఆరోగ్య సమస్యలకు చికిత్స ఎలా చేయాలి.

ఇంటర్నేషనల్ ఒలెంపిక్ కమిటీ మరియు, అమెరికన్ స్పోర్ట్స్ కాలేజ్ సూచనల మేరకు, క్రీడా కారిణుల ఆరోగ్య స్థితిని అంచనా వేసేందుకు

ఎక్సర్‌సైజ్

ఫొటో సోర్స్, Getty Images

ఈ వివరాలు సేకరించాలి..

1. పీరియడ్స్ సక్రమంగా వస్తున్నాయా? ఎప్పుడైనా ఒక నెల రాకుండా మిస్ అవుతోందా?

2. పీరియడ్స్ ఆగడానికి, గర్భం రాకుండా , ఏవైనా హార్మోన్ల చికిత్స తీసుకుంటున్నారా?

3. బరువు గురించి దిగులు చెందుతుంటారా?

4. బాడీ మాస్ ఇండెక్స్ (BMI )18.5 కన్నా తక్కువ వుందా

5. ఆహారపు అలవాట్లలో తేడాలున్నాయా?

బరువు పెరుగుతానన్న భయంతో తగ్గించి ఆహారం తీసుకుంటున్నారా?

6. ఎప్పుడైనా మూడు నెలల కాలపరిమితిలో 5 కేజీల బరువు తగ్గా?

7. ఎప్పుడైనా ఎముకల పటిష్టత లోపాన్ని ఎదుర్కున్నారా? ఎముకలు చిట్లిన సందర్భాలున్నాయా?

8. మీ ట్రెయినింగ్ సమయంలోకానీ, పోటీల సమయంలోకానీ, యూరిన్ లీకయిందా?

9. సంతానం కోసం చేసే ప్రయత్నాలు విఫలం అవుతున్నాయా?

శారీరిక స్థితిని అంచనా వేసేందుకు సమగ్రంగా పరీక్ష చేయాలి. BMI అంచనా వేయడానికి అవసరమైన బరువు, పొడవు కొలతలు తీసుకోవాలి.

ఒక నెలలో 10% బరువు తగ్గినా, BMI 17.5 కన్నా తక్కువ వున్నా, వారు తీవ్రమైన ఎనర్జీ లోపంతో బాధ పడుతున్నారని గ్రహించాలి. హార్మోన్ల లోపాలను అంచనా వేయడానికి అవసరమైన రక్త పరీక్షలు చేయాలి.

ఆహారం తీసుకునే వివరాలు డైరీ రూపంలో సేకరించాలి. heart rate monitors, pedometers ద్వారా వ్యాయామంలో ఖర్చు అయే కేలరీలు లెక్కవేసి, వారు ఎనర్జీ అసమగ్రతకు గురి అవుతున్నారేమో అంచనా వేయాలి.

ఎముకల పటిష్టతను బోన్ స్కాన్ ద్వారా అంచనా వేయాలి. ఒక వేళ Z score 1.0 కన్నా తక్కువ వుంటే పటిష్టత లోపించినట్లు. అదే Z score 2.0 కన్నా తక్కువగా వుంటే, సమస్య తీవ్రంగా వుందనీ, ఎముకలు గుల్లబారాయని, ఏ కారణం లేకుండా చిట్లే అవకాశముందని గ్రహించాలి.

ఆహార లోపాల్ని సరి చేయాలి. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు అందించాలి. ఆమె BMI 18.5 కు మించి పెరిగితే చికిత్సకు చక్కగా స్పందిస్తున్నారని అర్థం.

క్రీడా కారిణులు తీసుకునే ఆహారంలో కొన్ని సప్లిమెంట్స్ జతచేయాల్సిన అవసరం వుంది.

వారు ప్రతిరోజూ, 1.5 గ్రాముల కాల్షియం తీసుకోవాలి.

ఆహారం తీసుకునే విషయంలో కొన్ని సార్లు మానసిక వైద్యుల సహాయం అవసరమవుతుంది. బరువు పెరగడం ప్రారంభించగానే, పీరియడ్స్ కు సంబంధించిన లోపాలు సరి అవుతాయి.

పోటీ సమయాల్లో పీరియడ్స్ రాకుండా వుండేందుకు హార్మోన్ టాబ్లెట్లు వాడుతుంటారు. అందు కోసం ఎక్కువ మోతాదు ఈస్ట్రోజెన్ వుండే మాత్రల వాడకాన్ని తగ్గించాలి.

హెచ్చు మోతాదులో ఉండే ఈస్ట్రోజెన్ వల్ల ఎముకల్లో పటిష్టత దెబ్బ తింటుంది. ఈస్ట్రోజెన్ తో బాటు, ప్రోజెస్టిరోన్ కూడా అందించడం ద్వారా ఈస్ట్రోజెన్ తో బాటు, ప్రోజెస్టిరోన్ కూడా అందించడం ద్వారా ఎముకల పటిష్టత కోల్పోకుండా కాపాడవచ్చు.

సంతానం వద్దనుకున్నపుడు గర్భ నిరోధక నోటి మాత్రల వాడడం కన్నా, బారియర్ పద్ధతులు ( Condoms) , కాపర్ టీ వేయించుకోవడం,

చర్మం అడుగున పెట్టే హార్మోన్ ఇంప్లాంట్స్ వంటివి మెరుగైనవని పరిశోధనలు చెబుతున్నాయి.

వైద్యుల పాత్ర

పోటీలకు సన్నద్ధం చేయడం కోచ్ వంతైతే ఆమె అనారోగ్యం పాలవుతుందేమోనని గమనించాల్సిన బాధ్యత వైద్యులు స్వీకరించాలి.

చికిత్స నందించే సమయంలో , వారి క్రీడకు సంబంధించిన కోచ్, మేనేజర్లు, వైద్యులు, మానసిక నిపుణులు, ఫిజియోథెరపిస్టులు సమిష్టిగా కృషి చేయాలి.

కఠినమైన శరీర శ్రమకు ఆమె తట్టుకుంటున్నదోలేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వుండాలి. ఎనర్జీ సమతుల్యత ఏర్పడేలా చర్యలు తీసుకోవాలి.

(వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించడానికి రాసిన కథనం. ఇందులోని పాత్రలు, నేపథ్యం కల్పితం. నిజమైన వ్యక్తులతో, జీవించి ఉన్న లేదా చనిపోయిన ఎవరితోనైనా ఏదైనా సారూప్యం ఉన్నట్లయితే అది పూర్తిగా యాదృచ్ఛికం. రచయిత వైద్యురాలు)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)