తమిళనాడు ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న సిలికాన్ వాలీ సీఈఓ కథ

- రచయిత, స్వామినాథన్ నటరాజన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
"నేను ఓ రిమోట్ సీఈఓను" అంటూ గాలికి అటూఇటూ ఊగుతున్న వరి పొలాలవైపు చూస్తూ చెప్పారు శ్రీధర్ వెంబు.
శ్రీధర్ తన సోదరుడితో కలిసి 1996లో సిలికాన్ వాలీలో జోహో కంపెనీని స్థాపించారు. సాంకేతిక ప్రపంచంలో వీరి కంపెనీ మంచి పేరు సంపాదించింది.
ఇది ఒక క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ కంపెనీ. 25 ఏళ్లుగా ఈ కంపెనీలో 9,500 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. వీరి ఆస్తి 150 కోట్ల డాలర్లు.
దాదాపు మూడు దశాబ్దాలుగా కాలిఫోర్నియాలో ఉంటూ తన కంపెనీని ముందుకు నడిపించిన శ్రీధర్ శేష జీవితం ప్రశాంతంగా, నిశ్శబ్దమైన వాతావరణంలో గడపాలని కోరుకున్నారు.
అలాంటి ప్రదేశం కోసం అన్వేషిస్తూ దక్షిణ భారతదేశంలోని ఒక మారుమూల ప్రాంతానికి చేరుకున్నారు.

రహదారి లేదు, నీటి వసతి, డ్రైనేజ్ వ్యవస్థ లేవు
ప్రస్తుతం శ్రీధర్ చెన్నైకు దక్షిణాన సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెంకాశి జిల్లాలోని ఒక గ్రామంలో నివసిస్తున్నారు.
అక్కడ ఎక్కువగా వరి పండిస్తారని శ్రీధర్ చెప్పారు.
గ్రామ జనాభా 2000 కంటే తక్కువ. రోడ్లు లేవు. ఇళ్లకు నీటి సరఫరా లేదు. మురుగుకాలువలు లేవు.
విద్యుత్ కూడా వస్తూపోతూ ఉంటుంది. అందుకే తాను డీజిల్ జనరేట్లను వాడుతున్నానని శ్రీధర్ చెప్పారు.
ఈ ప్రాంతం సిలికాన్ వాలీకి సుదూరంగా ఉంది. మరి ఇక్కడి నుంచి శ్రీధర్ ఎలా పని చేస్తారు?
ఈరోజుల్లో ఎవరైనా ఎక్కడి నుంచైనా పని చేసే అవకాశాన్ని ఇంటర్నెట్ కల్పిస్తోంది.
తన ఆఫీస్ పని కోసం శ్రీధర్ హై స్పీడ్ ఇంటర్నెట్ ఉపయోగిస్తారు.
పెద్ద కంపెనీకి అధిపతి కావడం వల్ల కొన్ని వెసులుబాట్లు ఉంటాయని శ్రీధర్ చెప్పారు.
"చాలా ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాలంటేనే నాదాకా వస్తారు. లేదంటే మా టీమ్ అన్నీ హ్యాండిల్ చేస్తుంది" అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, zoho corp
గ్రామీణ జీవనంలో ఉన్న సుఖం
"నా కింద ఒక టీం ఉంది. నేను ప్రోగ్రామర్లతో కలిసి పని చేస్తాను. పెద్ద పెద్ద టెక్ ప్రోజెక్టులలో పని చేస్తాను. నా సాఫ్ట్‌వేర్ టీంలో ప్రపంచం నలుమూలల నుంచి ఇంజినీర్లు పని చేస్తున్నారు" అని శ్రీధర్ చెప్పారు.
ఆయన తన కోసం ఒక డబుల్ బెడ్‌రూం ఫాం హౌస్ కట్టుకున్నారు. కారు వాడరు. ఎలక్ట్రిక్ రిక్షా లేదా సైకిలు వాడతారు.
అప్పుడప్పుడు ఊళ్లో ఉన్న టీ కొట్టుకు వెళ్లి, టీ తాగుతూ గ్రామస్థులతో ముచ్చటిస్తారు.
"నేనిక్కడ సుఖంగా ఉన్నాను. ఈ ఊర్లో చాలా మంది నాకు తెలుసు. చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్లు కూడా కొంతమంది పరిచయమయ్యారు" అని ఆయన చెప్పారు.
శ్రీధర్ ఊర్లో జీన్స్, టీ షర్ట్ వేసుకుని తిరుగుతుంటారు. అప్పుడప్పుడూ స్థానిక పద్ధతిలో లుంగీ, పంచె కట్టుకుంటారు.

'నేనెవరో వీళ్లకు తెలుసు '
శ్రీధర్‌కు ఉన్న మీడియా కవరేజీ కారణంగా స్థానికులకు ఆయనెవరో తెలుసు.
అయినా సరే తానేమీ సెలిబ్రిటీ కాదని ఆయన అంటున్నారు.
తన కథ చెబుతూ తాను ఉండే గ్రామం పేరు బయట పెట్టకూడదని బీబీసీకి షరతు పెట్టారు.
తాను ఉంటున్న ఊరు పేరు తెలిస్తే ఇంక అందరూ తనను కలవడానికి వచ్చేస్తారని, అది తనకు ఇష్టం లేదని ఆయన అన్నారు.
"గ్రామీణ జీవితం చాలా భిన్నమైనది. మంచి స్నేహాలు ఏర్పరచుకోవడానికి కావలసినంత సమయం ఉంటుంది. చుట్టు పక్కల గ్రామాల్లో కూడా నాకు స్నేహితులు ఉన్నారు.
నేను ఆడంబరాలకు చాలా దూరం. నేనెప్పుడూ గోల్ఫ్ ఆడలేదు. అంత సోషల్ కాదు. చాలావరకూ నా జీవితాన్ని పనికే అంకితం చేశాను. అందుచేత నగర జీవితాన్ని మిస్ అవుతున్నట్లు నాకేమీ అనిపించదు" అని శ్రీధర్ వివరించారు.
తాను పని చేస్తున్న పరిశ్రమలో కొత్త విషయాలను నేర్చుకునేందుకు సోషల్ మీడియా ఉపయోగిస్తానని చెప్పారు.

ఫొటో సోర్స్, ZOHO CORP
కరోనాకు ముందే వర్క్ ఫ్రం హోం
గత ఏడాది కోవిడ్ వ్యాప్తి మొదలైన దగ్గర నుంచి అనేకమంది వర్క్ ఫ్రం హోం బాట పట్టారు.
కానీ, శ్రీధర్ చాలా యేళ్ల నుంచే తన కార్యాలయానికి మైళ్ల దూరంలో ఉంటూ పని చేస్తున్నారు. తనే కాకుండా తన ఆఫీస్ సిబ్బందికి కూడా వర్క్ ఫ్రం హోం చేసే వెసులుబాటు కల్పించారు.
ఇది దీర్ఘకాలిక పరిష్కారం అని ఆయన విశ్వసిస్తున్నారు.
పది సంవత్సరాల క్రితమే ఆయన కంపెనీ జోహో తెంకాశిలో మొదటి గ్రామీణ కార్యాలయాన్ని తెరిచింది. అప్పటినుంచి జోహో 30 శాటిలైట్ ఆఫీసులను నిర్మించింది.
"ఈ ఆఫీసుల్లో పని విధానాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయంపై మాకు ఇంకా స్పష్టత లేదు. కానీ, మేము వీటిపై భారీ పెట్టుబడులు పెడుతున్నాం. ఆన్‌లైన్ టూల్స్ మీద కూడా పెట్టుబడులు పెడుతున్నాం.
మా టీంలో 20 నుంచి 30 శాతం ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పని చేయగలరు. వారికి మీటింగులకు శాటిలైట్ ఆఫీస్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. వీళ్లంతా చెన్నై రానక్కర్లేదు. తమ ఊర్లల్లోనే ఉండి పనిచేయొచ్చు.
మా ఉద్యోగులు ఎక్కువమంది ఉన్నచోట ఆఫీస్ ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. వారంలో 1-2 రోజులు ఆఫీస్‌కు రావొచ్చు. మిగిలిన రోజులు ఇంటి నుంచే పని చేయొచ్చు.
శాటిలైట్ ఆఫీస్‌లో 100 మంది ఒకేసారి జాయిన్ అయే అవకాశం ఉంది" అని శ్రీధర్ వివరించారు.
శ్రీధర్ పుట్టి పెరిగింది ఒక గ్రామంలోనే. చదువుకుని, ఉద్యోగ రీత్యా కాలిఫోర్నియా వెళ్లిపోయినా మళ్లీ తిరిగి భారతదేశంలోని గ్రామాలకు చేరుకోవాలని ఆశపడేవారు.
ఇప్పుడు తన ఆశను ఇలా నెరవేర్చుకుంటున్నారు.
విద్యా వ్యవస్థపై ఫిర్యాదులు
శ్రీధర్ మద్రాస్ ఐఐటీలో ఇంజనీరింగ్ చేశారు. అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో మాస్టర్స్, పీహెచ్‌డీ చేశారు.
అయితే, విద్యా వ్యవస్థల్లో శిక్షణ సరిగ్గా లేదని, జీవితానికి అవసరమైన పాఠాలు అక్కడ నేర్పట్లేదని ఆయన అంటున్నారు.
"ఒక సిద్ధాంతం ఉంటే, అది నిజ జీవితంలో ఏ సందర్భాల్లో ఉపయోగపడుతుందో చెప్పట్లేదు. అర్థం కాకపోయినా సిద్ధాంతాలను బట్టీ పట్టిస్తున్నారు" అని శ్రీధర్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, ZOHO CORP
జోహో స్కూల్
శ్రీధర్‌కు పాఠశాల విద్యా విధానం పట్ల చాలా ఆసక్తి ఉంది. అందుకే ఆయన జోహో స్కూల్ స్థాపించారు.
సంప్రదాయ విద్యా విధానాలకు అతీతంగా ఇక్కడ విద్యా బోధన జరుగుతుంది.
ఇలాంటి పాఠశాలలు తమిళనాడులో రెండు ఉన్నాయి. తెంకాశిలో ఒకటుంది. శ్రీధర్ రోజూ ఆ స్కూల్‌కు వెళ్లి చూసి వస్తుంటారు.
జోహో స్కూల్‌లో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, డిజైనింగ్, క్రియేటివ్ రైటింగ్ వంటి అంశాల్లో రెండేళ్ల కోర్సులు ఉన్నాయి.
ఈ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల వయో పరిమితి 17 నుంచి 20 వరకు ఉంటుంది.
ఇంటర్ పాస్ అయిన వారికి ఇందులో ప్రవేశం లభిస్తుంది.
"మా స్కూల్లో ప్రోగ్రామింగ్ నేర్పిస్తాం. మా పిల్లలు సొంతంగా యాప్ తయారు చేయగలరు. ఫ్లూయిడ్ డైనమిక్స్ తెలియకుండా ఒక మంచి ప్లంబర్ కావొచ్చు. అలాగే కంప్యూటర్ సైన్స్ తెలియకపోయినా మంచి ప్రోగ్రామర్ కావొచ్చు. ఇది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం" అని శ్రీధర్ వివరించారు.
జోహో స్కూల్లో ఉత్తీర్ణులైన 900 మంది విద్యార్థులు శ్రీధర్ కంపెనీలోనే పని చేస్తున్నారు.
బిల్ గేట్స్, వారెన్ బఫెట్‌లాంటి బిలియనీర్లు తమ ఆస్తిలో కొంత భాగాన్ని ఛారిటీ పనుల కోసం కేటాయిస్తారు.
కానీ, శ్రీధర్ అందుకు భిన్నంగా "సామాజిక బాధ్యత తన వ్యాపారంలో భాగం" అని నమ్ముతారు.
"ఒక వ్యక్తికి ఉచితంగా స్కిల్స్ నేర్పించి, మన కంపెనీలోనే ఉద్యోగం ఇస్తే, అది కంపెనీకీ ఉపయోగపడుతుంది, ఆ వ్యక్తి జీవితానికీ ఉపయోగపడుతుంది. దీన్ని ఛారిటీ అనడానికి నేను ఇష్టపడను" అని శ్రీధర్ అంటున్నారు.
పాఠశాలలతో ఆగిపోకుండా 250 పడకలు ఉన్న ఆస్పత్రిని నిర్మించాలని శ్రీధర్ ఆలోచిస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా ఈ ఆస్పత్రిని తీర్చిదిద్దాలని యోచిస్తున్నారు.
ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం శ్రీధర్‌ను "పద్మశ్రీ" పురస్కారంతో సత్కరించింది.
ఆయన్ను జాతీయ భద్రత సలహాదారుల కమిటీలో సభ్యునిగా నియమించారు. ఇందులో భాగంగా దేశ ఆర్థిక, భద్రత అవసరాలకు తగిన శాస్త్రీయ మార్గాలను కనుగొనడం ఆయన విధి.
కరోనా ముగిసిన తరువాత అమెరికా వెళ్లి వస్తానని శ్రీధర్ చెప్పారు.
అయితే, మళ్లీ శాశ్వతంగా అమెరికా వెళిపోయే ఉద్దేశం లేదని ఆయన అన్నారు.
"నేనొక పెద్ద కంపెనీ నడుపుతున్నాను. కానీ ఆ కంపెనీ వలన వచ్చే వెలుగుజిలుగుల జీవితంపై నాకు ఆసక్తి లేదు. సాదాసీదాగా జీవితం గడపాలని నా కోరిక. డబ్బు అన్ని సమస్యలను పరిష్కరించగలదని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. మనిషికి సామాజిక స్పృహ చాలా ముఖ్యం" అని శ్రీధర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- లవ్ జిహాద్: మతాంతర ప్రేమను భయపెడుతున్న భారత చట్టం
- జీవితాంతం గుర్తుండిపోవాల్సిన పెళ్లి పెను విషాదాన్ని మిగిల్చింది
- తాలిబాన్లు అఫ్గాన్ మాజీ అధ్యక్షుడు నజీబుల్లాను చంపి క్రేన్‌కు వేలాడదీశారు... ఆ రోజుల్లో అసలేం జరిగింది?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- అక్కడ అమ్మాయి పేరు ఎవరికీ చెప్పకూడదు.. పెళ్లి పత్రాల్లో రాయరు, మరణ ధ్రువీకరణల్లో ఉండదు
- ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఎవరీ మడావి హిడ్మా... మావోయిస్టు పార్టీలో అంత త్వరగా ఎలా ఎదిగారు?
- లవ్ జిహాద్: హిందు-ముస్లింల మధ్య పెళ్లిళ్లు అడ్డుకొనేందుకు చట్టాలు ఎందుకు తీసుకొస్తున్నారు?
- అమెరికాతో ఒప్పందం తర్వాత తాలిబన్లు ఏం చేయబోతున్నారు?
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల లేఖ... అందులో ఏముందంటే..
- మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో ఏడాదిన్నర పాటు తిరిగిన ఒక మహిళా ప్రొఫెసర్ అనుభవాలు
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఆ రోజు అసలు ఏం జరిగిందంటే.. దాడిలో గాయపడిన CRPF జవాన్ చెప్పిన వివరాలు...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








