ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్: ఆ రోజు అసలు ఏం జరిగిందంటే.. దాడిలో గాయపడిన CRPF జవాన్ చెప్పిన వివరాలు...

- రచయిత, ఆలోక్ ప్రకాశ్ పుతుల్
- హోదా, బీబీసీ కోసం
‘‘ఆయన మా ఎస్ఐ. ఆయన దగ్గరే గ్రెనేడ్ వచ్చి పడింది. గ్రెనేడ్‌లోని చర్రాలు ఆయన కాళ్లలోకి దూసుకెళ్లాయి. కాళ్ల నుంచి చాలా రక్తం పోతూ ఉంది. నొప్పితో ఆయన అరుస్తూ ఉన్నారు. రక్తం ఆగడానికి ఏదైనా పట్టీ కట్టమని అడిగారు. ప్రాథమిక చికిత్స చేయమని అడిగారు. కానీ, ప్రాథమిక చికిత్స చేయాల్సిన పోలీసు అప్పటికే గాయపడి ఉన్నారు. నొప్పితో మా ఎస్ఐ బాధపడుతుండటం చూసి, నా తలపాగా విప్పి, ఆయన కాలుకు పట్టీగా కట్టాను’’ అంటూ చెమ్మగిళ్లిన కళ్లతో చెప్పారు బలరాజ్ సింగ్.
సీఆర్‌పీఎఫ్ కోబ్రా బెటాలియన్‌లో ఆయన పోలీస్.
శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్‌లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో బలరాజ్ సింగ్ గాయపడ్డారు.
ఈ ఘటనలో 22 మంది పోలీసులు మరణించారు. మరో 31 మంది గాయపడ్డారు. బీజాపుర్, రాయ్‌పుర్ ఆసుపత్రుల్లో వీరు చికిత్స పొందుతున్నారు.
రాయ్‌పుర్‌లోని రామకృష్ణ ఆసుపత్రిలో బలరాజ్ సింగ్ రాయ్ చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు పొట్టలో తూటా తగిలింది. అయితే, ఆయన ప్రాణాలకు ఎలాంటి ముప్పూ లేదని వైద్యులు చెప్పారు.
ఎదురుకాల్పుల సమయంలో బలరాజ్ సింగ్ చూపించిన తెగువను రాష్ట్ర ప్రత్యేక డీజీపీ ఆర్‌కే విజ్ స్వయంగా కలిసి అభినందించారు.

పంజాబ్‌లో తరంతరాన్‌లోని కలేర్ గ్రామానికి చెందిన బలరాజ్ సింగ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, 2014 అక్టోబర్‌లో సీఆర్‌పీఎఫ్‌లో చేరారు.
బలరాజ్‌కు ముగ్గురు అక్కలు. వారికి వివాహాలయ్యాయి. ఆయన తండ్రి గతంలో దుబాయిలో పనిచేస్తుండేవారు. ప్రస్తుతం ఊరిలోనే వ్యవసాయం చేస్తున్నారు.
మొదటి నుంచి సైన్యంలో చేరాలన్నది తన కోరిక అని బలరాజ్ అంటున్నారు.
‘‘తరంతరాన్‌లో సైన్యంలో చేరడం యువకులందరి కల. సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్.. ఇలా భద్రతాదళాల్లో ఏదో ఒక దానిలో చేరాలనుకుంటారు’’ అని ఆయన చెప్పారు.
బలరాజ్ సింగ్ తల్లిదండ్రులు, భార్య ఇప్పటికీ వారి ఊరిలోనే ఉన్నారు. ప్రతి రోజూ తన యోగక్షేమాలను బలరాజ్ వారికి ఫోన్‌లో తెలియజేస్తున్నారు.
బలరాజ్ పొట్టపై తూటా గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఆయన నవ్వేటప్పుడు కూడా ఆ నొప్పితో ఇబ్బందిపడటం ఆయన ముఖంలో కనిపిస్తోంది.
‘‘నేను బాగానే ఉన్నా. ఆరోగ్యం బాగుంది. తూటా నన్ను తాకి వెళ్లిపోయింది. పెద్దగా ఏం కాలేదు. నెమ్మదిగా కోలుకుంటున్నా’’ అని బలరాజ్ అన్నారు.

శనివారం ఎదురుకాల్పుల ఘటనను గుర్తు చేసుకుంటూ మాట్లాడుతున్నప్పుడు ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి.
‘‘బీజాపుర్‌లోని తర్రెంకు వెళ్లేందుకు శుక్రవారం రాత్రి 9 గంటలకు బాంసాగుడా క్యాంపు నుంచి సీఆర్‌పీఎఫ్ బృందం బయల్దేరింది. క్యాంపుకు, పోలీస్ స్టేషన్‌కు మధ్య 12-13 కి.మీ.ల దూరం ఉంది. రాత్రి ఒకట్రెండుకు ఆ ప్రాంతంలో మా ఆపరేషన్ మొదలైంది. రాత్రి అంతా మేం మా లక్ష్యం కోసం గాలిస్తున్నాం. గాలింపు తర్వాత తిరిగి వస్తూ దాహం తీర్చుకునేందుకని ఓ కొండపై ఆగాం’’ అని వివరించారు బలరాజ్.
మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో సీఆర్‌పీఎఫ్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా బెటాలియన్లకు చెందిన 2,059 మంది పోలీసులు పాల్గొన్నారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు వెతికిన చోట్ల ఏమీ దొరకలేదు.
దాంతో, దగ్గర్లో మావోయిస్టులు లేకపోవచ్చని భద్రతా దళాలు భావించాయి. ఆపరేషన్ ముగించుకుని తిరుగుముఖం పట్టారు.
ఉదయం ఎనిమిది గంటల సమయంలో పోలీసులు ఇద్దరు-ముగ్గురు చొప్పున బృందాలుగా విడిపోయి జొన్నాగూడ గుట్టపై కాసేపు ఆగారు.
వారికి సమీపంలోనే మావోయిస్టుల పెద్ద బృందం తిరుగుతోందని, జాగ్రత్తగా ఉండాలని తమ బృందం లీడర్‌కు ఆ సమయంలో ఎస్పీ నుంచి సందేశం వచ్చిందని బలరాజ్ అన్నారు.
రాత్రంతా తిరిగిన పోలీసులకు కాస్త సేదతీరి, బిస్కెట్లు తినేందుకు కూడా సమయం దొరకలేదు.
..కడుపును చీల్చుకుంటూ తుపాకీ గుండు బయటికొచ్చింది
ఈ బృందం వెంటనే ఆల్ రౌండ్ సెక్యూరిటీ రింగ్ తయారు చేసి, టెక్రి చుట్టూ వృత్తాకారంలో పొజిషన్ తీసుకున్నారు.
ఈ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో భద్రతా దళాలకు అనేకమంది ఎదురయ్యారు. అయితే, వారిలో ఎక్కువమంది సాధారణ ప్రజలు, నిరాయుధులు. అందువల్ల వారిపై ఎక్కువ దృష్టి పెట్టలేదు.
"అదే సమయంలో కొండలపై నుంచి మా మీద దాడి చేశారు. వాళ్ల దగ్గర ఇంప్రొవైజ్ చేసిన బాంబులు ఉన్నాయి. వాటితో మాపై దాడి చేశారు. ఆ దాడిలో మా పోలీసులు చాలామంది గాయపడ్డారు. ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత, మేము టెక్రీ విడిచిపెట్టి కింద మైదానాల్లోకి వచ్చేశాం. మూడు వైపుల నుంచి మా మీద దాడి జరిగింది. ఒకవైపు నుంచి మేము వాళ్ల ఆకస్మిక దాడిని ఛేదించి వాళ్లకు ఎదురెళ్లాం" అని బలరాజ్ వివరించారు.

బలరాజ్, ఆయన సహచరులు కాల్పులు జరుపుతూ ముందుకు సాగారు. కానీ, వారికి అదంత సులభం కాలేదు.
మొదట బయట నుంచి కాల్పులు వినిపించినప్పుడు ఎస్‌టీఎఫ్ పోలీసులు వారిని వెంబడిస్తూ వెళ్లారు.
వాళ్ల వెనకాలే కోబ్రా బెటాలియన్ వెళ్లింది. దాంతో పరిస్థితి పోలీసుల అదుపులోకి వచ్చింది.
కాల్పులు జరుపుతూ పోలీసులు ముందడుగు వేశారు.
అప్పుడే ముందు వరుసలో ఉన్న ఒక ఎస్‌టీఎఫ్ జవానుకు ఒక బుల్లెట్ తగిలింది.
వెంటనే బలరాజ్ పొజిషన్ తీసుకోవడానికి అక్కడే ఉన్న ఒక చెట్టు వైపుకు పరిగెత్తారు.
అంతలోపే ఒక బుల్లెట్ వేగంగా వచ్చి ఆయన పొట్టలోంచి దూసుకుపోయింది.
ఒకటవ నంబర్ టీంకు చెందిన విజయ్, కటియార్ బలరాజ్‌ను పట్టుకున్నారు.
"మేము టెకల్గూడా గ్రామానికి చేరుకునేసరికి నాకు కూడా గాయమైంది. నాకు పొట్టలో బుల్లెట్ దూసుకుపోయింది. మిగతా పోలీసులు బాగానే ఉన్నారు. వారు పోరాటం కొనసాగిస్తున్నారు. వాళ్లంతా ఒక బాక్స్‌లాగా ఉండి, ఆ బాక్స్ మధ్యలో గాయపడినవారిని నడిపిస్తూ ముందుకు సాగారు. నడవలేని స్థితిలో ఉన్నవారిని.. తమ దగ్గర ఉన్న సాధనాలతోనే స్ట్రెచర్‌లాగ తయారుచేసి వాటిపై పడుకోబెట్టి చాపర్ దగ్గరకు చేర్చారు" అని బలరాజ్ వివరించారు.

ఫొటో సోర్స్, Ani
గాయాల బారిన పడ్డ పోలీసులను సురక్షిత ప్రాంతానికి తరలించడమే లక్ష్యంగా మిగతా పోలీసులు ముందుకు సాగారు.
దెబ్బ తగిలినప్పటికీ తాను నడవగలనని అనిపించినంత వరకు నడిచే వెళ్లాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు.
"నా గురించి మీరు బెంగపడకండి. మీరు మీ పోరాటంలో నిమగ్నంకండి. వెనుక నుంచి మావోయిస్టులు తరుముకొస్తున్నారు" అని బలరాజ్ తన సహరులతో చెప్పారు.
మిగిలినవారు మావోయిస్టులతో పోరాటం జరుపుతూనే ఉన్నారు. ఈలోగా చీకటి పడింది.
అయినప్పటికీ బలరాజ్ సింగ్ ధైర్యం కోల్పోకుండా, తన సహచరులతోపాటూ మూడు కిలోమీటర్లు నడిచి సిల్గోరే చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన్ను చికిత్స కోసం తరలించారు.
ఇప్పటివరకూ బలరాజ్ ప్రత్యక్షంగా ఎలాంటి ఎన్‌కౌంటర్ ఎదుర్కోలేదు. ఇదే ఆయనకు మొదటి అనుభవం.
తాను త్వరగా కోలుకుని మళ్లీ మావోయిస్టులతో పోరాటానికి సిద్దం కావాలని ఆయన కోరుకుంటున్నారు.
అన్ని సవ్యంగా జరిగితే ఈ నెల చివర్లో తన పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవాలని బలరాజ్ కోరుకుంటున్నారు.
ఇది ఆయనకు 28వ పుట్టినరోజు. కానీ, మరణాన్ని జయించిన బలరాజ్‌కు ఇది మొదటి పుట్టినరోజు కూడా.
ఇవి కూడా చదవండి:
- ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల లేఖ.. అందులో ఏముందంటే..
- దిల్లీ, మహారాష్ట్రలో నైట్ కర్ఫ్యూ: ‘కరోనా నైట్ షిఫ్ట్ చేసి పగలు నిద్రపోతుందా..?’ రాత్రి కర్ఫ్యూ పెట్టడంలో లాజిక్ ఏమిటి..
- దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించడానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఎవరిని సంప్రదించారు
- ‘మోదీ హత్యకు మావోయిస్టుల కుట్ర’: నిజమా? కల్పితమా?
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








