ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్: ‘అభినందన్‌ను విడిపించినట్లే మావోయిస్టుల చెర నుంచి నా భర్తను క్షేమంగా తీసుకురండి’

ఫొటో సోర్స్, MOHIT KANDHARI / BBC
- రచయిత, మోహిత్ కందారీ
- హోదా, జమ్మూ నుంచి బీబీసీ కోసం
జమ్మూలోని నేత్రాకోటి గ్రామంలో ప్రస్తుతం నిశ్శబ్ధం రాజ్యమేలుతోంది. ఈ గ్రామానికి చెందిన ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్ ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ తర్వాత ఆచూకీ లేకుండా పోయారు. ఆయన కుటుంబం దుఃఖంలో ఉండగా, ఆయన గురించి వాకబు చేస్తున్నామని సీఆర్‌పీఎఫ్ అధికారులు చెబుతున్నారు.
బీజాపుర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో శనివారం నాటి ఎన్‌కౌంటర్‌లో 22మంది జవాన్లు మరణించారు.
కానీ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ పేరు చనిపోయిన వారి జాబితాలో లేదు. అలాగని ఆయన సీఆర్‌పీఎఫ్ బలగాలతో పాటు వెనక్కి కూడా రాలేదు.
రాకేశ్వర్ సింగ్ 2011లో సీఆర్‌పీఎఫ్‌లో చేరారు. గతంలో వాళ్ల నాన్న కూడా సీఆర్‌పీఎఫ్‌లో పని చేశారు.
బస్తర్ ప్రాంతంలో తన సహచరులతో కలిసి మావోయిస్టుల కోసం గాలింపు ఆపరేషన్‌లో రాకేశ్వర్ సింగ్ పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, MOHIT KANDHARI / BBC
విషాదంలో కుటుంబం
రాకేశ్వర్ సింగ్ ఏమయ్యారో ఆచూకీ తెలికపోవడంతో మూడు రోజులుగా ఆయన కుటుంబం విషాదంలో మునిగిఉంది.
మీడియా ప్రతినిధులు జమ్మూలోని ఆయన ఇంటికి వెళ్లినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎంతో ఉద్వేగంతో కనిపించారు.
రాకేశ్వర్ సింగ్‌ను క్షేమంగా విడిపించాలని ఆయన కుటుంబీకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మరోవైపు రాకేశ్వర్ సింగ్ ఆచూకీ గురించి ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
అయితే రాకేశ్వర్ సింగ్ తమ వద్ద క్షేమంగా ఉన్నాడని బస్తర్ డివిజన్‌కు చెందిన మావోయిస్టులు ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
సమయం వచ్చినప్పుడు ఆయనను విడుదల చేస్తామని, త్వరలో ఆయన ఫొటోను కూడా పంపిస్తామని వారు వెల్లడించారు.

ఫొటో సోర్స్, ANI
'వింగ్ కమాండర్ అభినందన్‌లా విడుదల చేయించండి'
శనివారంనాడు ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు దాడి చేశారన్న వార్త వినగానే రాకేశ్వర్ సింగ్ భార్య, అత్త షాక్‌కు గురయ్యారు.
నాన్న కోసం ఎదురు చూస్తూ రాకేశ్వర్ సింగ్ ఐదేళ్ల కూతురు తల్లి ఒడిలో దిగాలుగా కూర్చుని కనిపించింది.
"శనివారం రాత్రి 9.30గంటలకు ఆయనతో మాట్లాడాను. ఆపరేషన్‌కు వెళ్లడానికి ఆహారం సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు. ఆపరేషన్ నుంచి వచ్చాక మాట్లాడతానని అన్నారు. కానీ ఆ తర్వాత మళ్లీ మాట్లాడలేదు" అని ఇంటికి వచ్చిన మీడియా ప్రతినిధులతో రాకేశ్వర్ సింగ్ భార్య మీను చిబ్ చెప్పారు.
"నక్సలైట్ల దాడి జరిగిందని తెలియగానే నేను వెంటనే బంటలాబ్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్ గ్రూప్ సెంటర్‌కు ఫోన్ చేశాను. కానీ అక్కడి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు" అన్నారు మీను చిబ్.
పాకిస్తాన్‌కు చిక్కిన ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్‌ను విడిపించినట్లుగానే తన భర్తను కూడా మావోయిస్టుల నుంచి క్షేమంగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని మీను చిబ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.
"మా వారు దేశం కోసం పదేళ్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు దేశ ప్రజలందరూ ఆయనకు సహాయంగా ముందుకు రావాలి. ఆయన క్షేమంగా తిరిగి రావాలని అందరూ ఆ భగవంతుడిని ప్రార్ధించాలి" అన్నారామె.

ఫొటో సోర్స్, MOHIT KANDHARI / BBC
అధికారులు ఏమంటున్నారు ?
సోమవారం నాడు జమ్మూలోని సీఆర్‌పీఎఫ్ సెంటర్ కమాండెంట్ పీసీ గుప్తా, మరికొందరు అధికారులు రాకేశ్వర్ ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటామని, ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్ బృందాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ రాకేశ్వర్ సింగ్ గురించి వాకబు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- గోల్డెన్ బ్లడ్... ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం
- ‘ఏపీకి స్పెషల్ స్టేటస్ లేదన్న బీజేపీ పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇస్తామని మేనిఫెస్టోలో ఎలా హామీ ఇచ్చింది’
- ‘అఖండ భారతం గురించి వారు మాట్లాడుతుంటే నేను అఖండ ద్రావిడం గురించి ఎందుకు మాట్లాడకూడదు’
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









