'ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్న బీజేపీ, పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఇస్తామని మేనిఫెస్టోలో ఎలా హామీ ఇచ్చింది'

ఫొటో సోర్స్, Bjp manifesto
- రచయిత, శంకర్.వి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశం పునర్విభజన చట్టం ఆమోదించినప్పటి నుంచి చర్చనీయాంశంగానే ఉంది.
కేంద్ర ప్రభుత్వం మాత్రం అది ముగిసిన అధ్యాయం అని పదే పదే చెప్పింది.
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, నీతి అయోగ్ కారణంగా ఏపీ సహా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కాదని పార్లమెంట్‌లోనే ప్రకటించారు.
తాజాగా మార్చి 23న కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ కూడా అదే మాట అన్నారు.
అంతకుముందు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ఆర్థికమంత్రి 2019 జూన్‌లో స్పష్టం చేశారు.
కేంద్రం ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో పార్లమెంట్ లోపల, బయటా చెబుతూనే వస్తోంది.
కానీ స్వయంగా బీజేపీ నాయకురాలి హోదాలో నిర్మలా సీతారామన్ తాజాగా పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోని ఆమె ఆవిష్కరించారు. హోదాపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు.
పుదుచ్చేరి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా బీజేపీ దానిని ప్రస్తావించింది.
2014 సాధారణ ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ముగిసిన అధ్యాయమని ప్రకటించింది.
కానీ ఇప్పుడు పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఎలా ప్రకటిస్తారనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది.

ఫొటో సోర్స్, Bjp manifesto
పుదుచ్చేరి మేనిఫెస్టోలో ఇప్పుడు...
పుదుచ్చేరి అసెంబ్లీలో తొలిసారిగా పాగా వేయాలని ఆశిస్తోంది బీజేపీ.
అక్కడ ఎన్.ఆర్ కాంగ్రెస్, అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయగలమనే ధీమాతో ఉంది.
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు గుప్పించింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి 27న 40 పేజీల మేనిఫెస్టో విడుదల చేశారు.
వివిధ తరగతుల వారీగా ప్రజలకు అనేక కొత్త సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు.
పుదుచ్చేరిని టూరిజం హబ్‌గా మారుస్తామంటూ 'బెస్ట్ పుదుచ్చేరి' నినాదం ఇచ్చారు.
అదే మేనిఫెస్టోలోని 37వ పేజీలో "కేంద్రం పుదుచ్చేరికి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదా" ఇస్తుందని చెప్పారు.
పుదుచ్చేరిలో బీజేపీ గెలిస్తే కేంద్రం అందించే నిధుల విషయంలో రాయితీలు ఇస్తామని, నిధులు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు.
పుదుచ్చేరి అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని, జమ్మూ కశ్మీర్‌లాగే నిధుల కేటాయింపు పెంచుతామని అన్నారు.
ప్రస్తుతం 25 శాతంగా ఉన్న కేంద్రం నిధులను 40 శాతానికి పెంచడానికి ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదా ఉపయోగపడుతుందని తెలిపారు.
అంతేగాకుండా ఇప్పుడు 30:70గా ఉన్న పుదుచ్చేరి, కేంద్రం నిధులను 70:30గా సవరించి అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల్లో వాటా పెంచుతామని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ఏపీకి ప్రత్యేక హోదాపై అప్పుడు...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో బీజేపీ నేతలు ప్రతిపాదించారు.
దాంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు రాజ్యసభలో హామీ ఇచ్చింది.
కానీ దానిని చట్టంలో ప్రస్తావించకపోవడంతో ఇప్పటి వరకు అమలు కాలేదు.
ఆ తర్వాత 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని తెలిపింది.
ప్రస్తుతం ప్రధానిగా ఉన్న నరేంద్రమోడీ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి, నెల్లూరు సభల్లో స్వయంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.
"ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకురావడంతో వెంకయ్యనాయుడిదే ప్రధాన పాత్ర అని, తాము దానిని అమలు చేస్తాం" అని సభాముఖంగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వస్తే, వివిధ పథకాల గ్రాంట్ ఇన్ ఎయిడ్ మొత్తం పెరగడంతో పాటు పారిశ్రామిక రాయితీలు, పన్ను రాయితీలు, ఇతర మినహాయింపులు, జీఎస్టీ ఇతర అంశాలు పెట్టుబడిదారులను ప్రోత్సహిస్తాయని, ఉపాధి కల్పన పెరుగుతుందనే అభిప్రాయం ఉంది.

హోదా ఎందుకు రాలేదు..
ఏపీతోపాటూ ప్రత్యేక హోదా కావాలని రాజస్తాన్, ఒడిశా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, బిహార్, తెలంగాణ రాష్ట్రాల నుంచి అభ్యర్థనలు వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది.
కానీ ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికీ ఇవ్వడం సాధ్యం కాదని నిర్మలా సీతారామన్ రెండేళ్ల క్రితమే పార్లమెంటులో ప్రకటించారు.
2019 జూన్ 24న లిఖిత పూర్వక సమాధానంలో కేంద్రం వైఖరిని ఆమె స్పష్టం చేశారు.
పారిశ్రామిక రాయితీలకు, ప్రత్యేక హోదాకి సంబంధం లేదన్నారు.
"జాతీయ అభివృద్ధి మండలి ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాల ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక హోదా అమలులోకి వచ్చింది. సరిహద్దు రాష్ట్రాలు, కొండ ప్రాంతాల్లో జన సాంధ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే అది అమలయ్యింది. ప్రస్తుతం ప్రత్యేక హోదా పరిశీలనలో లేదు. హోదాతోనే పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందనే వాదనలో నిజం లేదు. అనేక రాష్ట్రాల విజ్ఞప్తిని మేం పరిగణనలోకి తీసుకోవడం లేదు" ఆమె ప్రకటించారు.
ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మార్చి 23న ఏపీలో అధికార వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈ అంశాన్ని ప్రస్తావించినపుడు కూడా కేంద్రం నుంచి అదే సమాధానం వచ్చింది.
ప్రభుత్వం తరపున హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రత్యేక హోదాకి బదులు ప్రత్యేక ప్యాకేజీ అందించామని చెప్పారు.
"14వ ఆర్థిక సంఘం సూచనల మేరకు ప్రత్యేక హోదా అంశాన్ని రద్దు చేశాం. అందుకే కేంద్రం ఆర్థిక శాఖ నుంచి భారీ ప్యాకేజీని ప్రకటించింది. ఆ నిధులతో అభివృద్ధికి అన్ని రకాలుగా అవకాశం ఉంది. హోదా ఉంటేనే అభివృద్ధి జరుగుతుందనేది నిజం కాదు. పదేళ్లలో ఎన్నో సంస్థలు ఏర్పాటు చేస్తామన్నాం. ఎన్నో అమలు చేశాం. వెనుకబడిన జిల్లాలకు రూ. 1400 కోట్ల నిధులు ఇచ్చాం. రెవెన్యూ లోటు కింద రూ. 22,111 కోట్ల రూపాయల గ్రాంట్లు ఇచ్చాం. మరికొన్ని హామీలు పూర్తి చేస్తాం. ఏపీ, తెలంగాణ మధ్య సమస్యలున్నాయి. వాటిని ఆయా రాష్ట్రాలే సంయుక్తంగా పరిష్కరించుకోవాలి. కేంద్రం వద్ద పెండింగ్ లేవు" అంటూ ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్థిక సంఘానికి, ప్రత్యేక హోదాకి సంబంధం ఏమిటి
కేంద్రం చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవని ఏపీలో బీజేపీ మినహా అన్ని పార్టీల నేతలు అంటున్నారు.
ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా ఏడాది క్రితం వరకూ కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని 'పాచిపోయిన లడ్డూ'లంటూ విమర్శించింది.
వైఎస్ జగన్ కూడా విపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను పదే పదే ప్రస్తావించారు.
ఇటీవల ప్రధాని సమక్షంలో కూడా ఏపీ స్పెషల్ స్టేటస్ గురించి జగన్ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారు.
"14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఎలాంటి సిఫార్సులు చేయలేదు. ఆ కమిటీ సభ్యుడు అభిజిత్ సేన్ స్వయంగా లేఖ కూడా రాశారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా 2014 మార్చి 2న అప్పటి కేంద్ర కేబినెట్ ప్లానింగ్ కమిషన్‌కి సిఫార్సు చేస్తూ తీర్మానించింది. 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పడే వరకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎలాంటి అడ్డంకి లేనట్టే కదా. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా హోదా ఇవ్వాలని అడుగుతాయన్న వాదన కూడా పొంతనలేనిది. రాష్ట్ర విభజన జరగడానికి ముందస్తు షరతుగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీకి అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలతో పాటుగా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రతినిధులు పార్లమెంటులో ఉండగానే హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో బీజేపీ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పార్లమెంట్ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవెర్చేందుకు ఉదారత చూపాల్సిందిగా ప్రధానిని కోరుతున్నా" అంటూ సీఎం హోదాలో నీతిఅయోగ్ సమావేశంలోనే జగన్ మాట్లాడారు.

ఫొటో సోర్స్, Bjp manifesto
ఏపీకి లేదని, పుదుచ్చేరికి ఇస్తారా...
అప్పట్లో ముఖ్యమంత్రుల సమావేశంలో జగన్ ఏపీకి స్పెషల్ స్టేటస్ గురించి ప్రస్తావించినా ప్రధానమంత్రి మాత్రం స్పందించలేదు.
అయితే, ఏపీకి ముగిసిన అధ్యాయం అంటూ చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు పుదుచ్చేరికి ఎలా హోదా ఇస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఏపీకి ముందు న్యాయం చేయాలని టీడీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు.
"తెలుగుదేశం తరపున ప్రత్యేక హోదా ఇస్తామంటే మోదీకి మద్ధతు ఇచ్చాం. కేంద్రం మాట మార్చిన తర్వాత ఎన్నో పోరాటాలు చేశాం. దిల్లీలో ఉద్యమించాం. ప్రజల తరపున నిలబడితే మా మీద నిందలు వేశారు. ఇప్పుడు ఏపీకి ఇవ్వకుండా పుదుచ్చేరికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించడం విడ్డూరంగా ఉంది. ఏపీకి ఇవ్వడానికి అవకాశం లేనప్పుడు మరో కేంద్ర పాలిత ప్రాంతానికి మాత్రం ఎలా ఇస్తారు. స్వయంగా మోదీ తిరుపతిలో చెప్పిన మాట ప్రకారం ముందు ఏపీకి ఇవ్వాలి. వైసీపీ నేతలు కేంద్రాన్ని నిలదీస్తాం..25 ఎంపీలు ఇవ్వండని చెప్పి, ఇప్పుడు 28మంది పార్లమెంట్ సభ్యులున్నా మాట్లాడడం లేదు. ఏపీని బీజేపీ మోసం చేస్తుంది. వైసీపీ నోరు మెదపలేకపోతోంది. ప్రజలు వాళ్లకి బుద్ధి చెప్పాలి" అని ఆయన బీబీసీతో అన్నారు.
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఈ అంశంపై ట్వీట్ చేశారు
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

ఫొటో సోర్స్, FB/Vishnu Vardhan Reddy
రాష్ట్రానికిచ్చే హోదా వేరు, పుదుచ్చేరికి చేసిన ప్రకటన వేరు: బీజేపీ
ఏపీ సహా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం ఎన్నోసార్లు పార్లమెంటులో చెప్పినా, ఇంకా దాని గురించి మాట్లాడడంలో అర్థం లేదని బీజేపీ అంటోంది.
అదే సమయంలో జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరి లాంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇచ్చిన హోదా గురించి మాట్లాడడం హాస్యాస్పదం అంటోంది.
నారా లోకేశ్ ట్వీట్‌కి సమాధానంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఒక ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఏపీ అభివృద్ధికి కేంద్రం అనేక రూపాల్లో నిధులు ఇస్తోందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి బీబీసీకి చెప్పారు.
"జమ్మూ కశ్మీర్‌కి కేటాయిస్తున్నన్ని నిధులను పుదుచ్చేరికి కూడా కేటాయిస్తామని చెప్పాం. దానిని రాష్ట్రాల ప్రత్యేక హోదాతో ముడిపెడతారా? కేంద్ర పాలిత ప్రాంతానికి నిధులు కేటాయించి, అభివృద్ధి చేసేందుకు మా పార్టీ ప్రయత్నిస్తోంది. దేశమంతటా అభివృద్ధికి మోదీ సర్కారు పెద్ద పీట వేస్తోంది. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తోంది. ఏపీకి కూడా ఉదారంగా నిధులు ఇస్తోంది. కేంద్రం నిధులతో చేపడుతున్న కార్యక్రమాలకు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఫోటోలు వేసుకుని ప్రచారం చేసుకుంటున్నాయి. పైగా కేంద్రం ఏమీ ఇవ్వలేదంటూ నిందలు వేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదు కాబట్టే ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఏపీకి వస్తున్నాయి" అంటూ విష్ణువర్థన్ రెడ్డి వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రత్యేక హోదా వల్ల కేంద్ర పాలిత ప్రాంతాలకు వచ్చేదేంటి
ఆర్థిక సంఘం, కేంద్ర ప్రభుత్వాలను సంప్రదించి పుదుచ్చేరికి ప్రత్యేక హోదా సాధిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.
కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రత్యేక హోదా అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
దేశంలోని 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం దిల్లీకి మాత్రమే, దేశ రాజధాని ప్రాంతంగా ప్రత్యేక హోదా ఉంది.
ఆర్టికల్ 239 ఏఏ ప్రకారం రాజ్యాంగం ద్వారా దిల్లీకి ఈ హోదా దక్కింది.
ఇక ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు జమ్మూ కశ్మీర్‌కి ప్రత్యేక హోదా ఉండేది.
కానీ ఆర్టికల్ 370 రద్దుతో పాటూ, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జమ్మూ కశ్మీర్, లద్దాక్ ప్రాంతాలకు పలు ప్రత్యేక సదుపాయాలు రద్దయ్యాయి.
"జమ్మూ కశ్మీర్ కోసం కేటాయించే నిధుల్లో మెజార్టీ వాటాను కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. అదే విధంగా పుదుచ్చేరికి కూడా ఆర్థిక సంఘంతో చర్చించిన తర్వాత నిధుల వాటా పెంచుతామని కేంద్రం చెప్పింది" అని బీజేపీ నేత రఘురాజన్ బీబీసీతో అన్నారు.
రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది.
అందులో ప్రత్యేక హోదా పేరుతో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక సదుపాయాలను కల్పించారు.
ప్రత్యేక కేటగిరీ స్థాయి పేరుతో కొన్ని రాష్ట్రాలకు అదనపు రాయితీలు కల్పించారు.
జాతీయ అభివృద్ధి మండలి ఆమోదంతో లభించే ప్రత్యేక కేటగిరీ స్థాయికోసం గతంలోనే కేంద్రం కొన్ని నిర్ధిష్టమైన అంశాలు ప్రస్తావించింది.
సరిహద్దు రాష్ట్రాలు, పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే హోదా ఇచ్చినట్టు తెలిపింది.
"కేంద్ర పాలిత ప్రాంతాలకు నిధులు పెంచడానికి ఇప్పటి వరకూ ప్రత్యేక హోదా అనే ప్రస్తావన రాలేదు. జమ్మూ కశ్మీర్‌కి ప్రత్యేక పరిస్థితుల్లోనే నిధుల వాటాలో కొంత భాగం పెంచారు" అని రాజ్యాంగ పరిశీలకులు ఎం శ్రీరామ్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, facebook
తిరుపతి ఎన్నికల్లో హోదా అంశం
ఏపీలో రాజకీయాంశంగా మారిన ప్రత్యేక హోదా వ్యవహారం, పుదుచ్చేరి బీజేపీ మేనిఫెస్టో విడుదలైన తర్వాత మరోసారి తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా దాని ప్రభావం ఉంటుందనే అంచనాలతో పార్టీల మధ్య వాదోపవాదనలు మొదలయ్యాయి.
ఉప ఎన్నికల్లో బీజేపీని బద్నాం చేసేందుకే ప్రత్యర్థి పార్టీలు పుదుచ్చేరి అంశాన్ని ప్రస్తావిస్తున్నాయని బీజేపీ నేతలు అంటున్నారు.
అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం బీజేపీ తీరుని తప్పుబడుతున్నారు.
ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ హోదా పేరుతో ఆ పార్టీ దగా చేస్తోందని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయత్వంలో ఏపీకి హోదాను సాధిస్తామని చెబుతున్నారు.
ప్రత్యేక హోదా పేరుతో మభ్య పెట్టడం ఆపాలని జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ అన్నారు.
ఏపీకి రావాల్సిన నిధులపై దృష్టిపెట్టాలని, తిరుపతి ఉప ఎన్నికల కోసం ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతం హోదాని రాజకీయ చేయడం తగదని సూచించారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: భారత్‌లోని 18 రాష్ట్రాల్లో ‘డబుల్ మ్యూటెంట్ వేరియంట్’
- కుతుబ్ మినార్ స్థానంలో అంతకు ముందు హిందూ దేవాలయం ఉండేదా?
- వీగర్ ముస్లిం జాతిని చైనా సమూలంగా తుడిచిపెట్టేస్తోందా? బ్రిటన్ నివేదికలో ఏం బయటపడింది?
- తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...
- న్యూజీలాండ్ ప్రభుత్వం 'తల్లుల' కోసం చేసిన చట్టంపై చర్చ ఎందుకు... భారత్‌లో పరిస్థితి ఏంటి?
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










