విజయనగరంలో సెలూన్ లైబ్రరీ: ‘ఇక్కడ హీరో, హీరోయిన్లు కాదు... పుస్తకాలు స్వాగతం పలుకుతాయి’

- రచయిత, శ్రీనివాస్ లక్కోజు
- హోదా, బీబీసీ కోసం
మనం ఏదైనా సెలూన్‌కి వెళ్లినప్పుడు వెయిట్ చేయాల్సి వస్తే అక్కడున్న దినపత్రికలు, సినిమా మ్యాగజైన్లు, టీవీ చూస్తూ సమయం గడుపుతాం.
విజయనగరంలోని కృష్ణా ధియేటర్ పక్కనున్న సెలూన్‌లో కూడా కొంతకాలం కిందట వరకూ ఇలాగే జరిగేది.
అయితే ఈ సెలూన్ యాజమాని ఒక చక్కటి ఆలోచనతో తన సెలూన్‌ని లైబ్రరీగా మార్చేశారు.
"నాకు చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఇష్టం. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగాలేక ఇంటర్‌తోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. కానీ నా వృత్తిని కొనసాగిస్తూనే స్థానికంగా ఉన్న లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తెచ్చుకుని చదవడం అలవాటు. నాపై పుస్తకాల ప్రభావం ఎక్కువ. చెన్నైలో ఒక వ్యక్తి తన సెలూన్‌లో లైబ్రరీ పెట్టారని సోషల్ మీడియాలో చూశాను. దాంతో నేను కూడా అలా చేస్తే బాగుంటుందని అనుకున్నాను. స్థానిక గ్రంథాలయం పెద్దలను, కొందరు రచయితలను కలిసి నా ఆలోచన చెప్పాను. లైబ్రరీ ప్రారంభించేందుకు వారి వద్ద ఉన్న కొన్ని పుస్తకాలను ఇచ్చారు. అలా దాతలు ఇచ్చినవి, నేను కొన్నవి అన్నీ కలిపి నా షాపులో సెలూన్ లైబ్రరీ ప్రారంభించాను. షాపుపై కూడా సెలూన్ ఎటాచ్డ్ లైబ్రరీ అని రాసుంటుంది" అని సెలూన్ లైబ్రరీ యాజమని టీవీ దుర్గారావు బీబీసీతో చెప్పారు.

హీరోయిన్లు కాదు...పుస్తకాలు స్వాగతం చెప్తాయి
సాధారణంగా ఏ సెలూన్‌లో చూసినా అక్కడ హీరో, హీరోయిన్లు, క్రికెటర్లు, బాడీ బిల్డర్ల ఫోటోలే కనిపిస్తాయి.
సెలూన్‌లోకి అడుగు పెట్టగానే వారే మనకి స్వాగతం చెబుతున్న ఫీలింగ్ కలుగుతుంది.
అయితే ఈ సెలూన్ లైబ్రరీలో మాత్రం పుస్తకాలు స్వాగతం చెప్తాయి.
సెలూన్‌లోకి ప్రవేశించగానే ఇద్దరు, ముగ్గురు పుస్తకాలు చదువుతూ, అందులో లీనమైపోయి కనిపిస్తుంటారు.
"సెలూన్‌కి వచ్చేవారికి ఎట్రాక్షన్ కోసం సినీ స్టార్ల ఫోటోలు పెడతాం. అయితే అందుకు భిన్నంగా పుస్తకాలను అందుబాటులో ఉంచడం వలన మొదట్లో ఇబ్బంది ఎదురైంది. వచ్చిన వారంతా పుస్తకాలు తీసుకుని వాటిని చదవడం, పైగా ఇక్కడ కొన్ని పేజీల కంటే ఎక్కువ చదవలేకపోవడం జరిగేది. దాంతో ఇంటికి పుస్తకాలు ఇవ్వడం ప్రారంభించాను. అలాగే ఆసక్తి ఉంటే ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి చదువుకోవచ్చునని చెప్తున్నాను. విద్యార్థులు పోటీ పరీక్షల పుస్తకాలు ఉంచమని అడుగుతున్నారు. కొందరు దాతల సహాయంతో త్వరలోనే వాటిని ఏర్పాటు చేస్తున్నాను" అని దుర్గారావు చెప్పారు.

పంచతంత్రం...పిల్లల కాలక్షేపం
పిల్లలకు హెయిర్ కట్ చేయాలన్నా...చేయించాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది.
అయితే సెలూన్ లైబ్రరీకి వచ్చిన పిల్లలు మాత్రం ఎంచక్కా పంచతంత్రం, లయన్ కింగ్ వంటి కథల పుస్తకాలను తిరగేస్తూ, వాటిలోని బొమ్మలను చూస్తూ ఎంజాయ్ చేస్తారు.
పిల్లలకు పుస్తకాలను ఇవ్వడం ద్వారా వారికి ఒక మంచి అలవాటు చేసినట్లు అవుతుందని ఇక్కడికొచ్చే పేరెంట్స్ అంటున్నారు.
"నిజానికి మా ఇంటికి ఈ సెలూన్ లైబ్రరీ కాస్త దూరమే. కానీ ఈ సెలూన్‌లో పిల్లల పుస్తకాలున్న లైబ్రరీ ఉందని తెలిసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడి రావడం వలన సెలూన్‌కి వచ్చామనే ఫీలింగ్ కంటే లైబ్రరీకి వచ్చిన ఫీలింగే ఎక్కువ కలుగుతుంది. నేను, మా అబ్బాయి ఇద్దరం కూడా చేరో పుస్తకం పట్టుకుని మా వంతు వచ్చే వరకు హాయిగా చదువుకుంటాం. నిజానికి సెలూన్‌లో లైబ్రరీ ఏర్పాటు చేయడం చాలా మంచి ఐడియా. త్వరలో నా దగ్గరున్న పుస్తకాలను కూడా ఈ లైబ్రరీకి ఇస్తాను" అని పి. నగేష్ బీబీసీతో చెప్పారు.

పుస్తకంతో స్నేహం
సెలూన్‌లో లైబ్రరీని ఏర్పాటు చేసిన దుర్గారావు ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు.
సెలూన్ లైబ్రరీ గురించి విన్న అనేక మంది పుస్తకాలను ఇస్తున్నారు.
స్థానికులైతే దీన్ని చూసేందుకు వచ్చి పుస్తకాలను ఇస్తున్నారు. సెలూన్ యాజమానిని అభినందిస్తున్నారు.
ప్రయత్నం చిన్నదే అయినా వినూత్నమైనదంటూ ప్రశంసిస్తున్నారు.
తిరుపతి, హైదరాబాద్, కడప, నెల్లూరు, గుంటూరు వంటి ప్రాంతాల నుంచి కొందరు పోస్టులో సైతం పుస్తకాలు పంపించారు.
"ఈ సెలూన్ లైబ్రరీని ఒక వింతగానే చెప్పుకోవాలి. ఎందుకంటే సెలూన్‌లో ఏదైనా కాస్త చోటు ఉంటే వారి వ్యాపార అభివృద్ధికి మరేదైనా చేస్తారు కానీ లైబ్రరీ పెట్టడం అరుదు. పైగా పుస్తకాలను కొనడం, దాతలను అడిగి తీసుకోవడం కూడా శ్రమతో కూడుకున్న పనే. పుస్తకాలు, అవి అందించే విజ్ఞానం విలువ తెలిస్తే తప్ప ఇటువంటి పనులు చేయలేం. సెలూన్‌లో తమ వంతు కోసం ఎదురు చూసే సమయం వృధా కాకుండా, పుస్తకం చదువుకోవడం మంచి పని. మనం పుస్తకం చదువుతుంటే పక్కవారికి కూడా చదవాలనే ఆసక్తి కలుగుతుంది. అందుకే ఈ సెలూన్‌లో కూషన్ చైర్స్‌లో కంటే బుక్ రాక్స్ వద్దే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. టెక్నాలజీ ప్రభావంతో పుస్తకాలకు దూరమైన చాలా మంది...ఇక్కడ మళ్లీ పుస్తకాలతో స్నేహం మొదలు పెడుతున్నారు" అని సెలూన్ లైబ్రరీకి పుస్తకాలను ఇచ్చిన జిల్లా గ్రంథాలయ సేవ సంఘం అధ్యక్షుడు ఎస్ఎస్ఎస్ఎస్ రాజు బీబీసీతో చెప్పారు.

లైబ్రరీ నియమాలు, నిశబ్ధం తప్పనిసరి
వచ్చింది సెలూన్‌కే అయినా ఇక్కడ గ్రంథాలయ నియమాలు పాటించాలి.
పుస్తకం చదివితే వారి పేరు, ఫోన్ నెంబర్ రాయాలి.
అలాగే పుస్తకం చదివిన వారు తమ అభిప్రాయాన్ని ఖచ్చితంగా లాగ్ బుక్‌లో రాయాలి.
అలాగే పుస్తకం ఇంటికి పట్టుకుని వెళ్లినా, తిరిగి తీసుకుని వచ్చినా వివరాలు రాయాలి.
వచ్చింది సెలూన్‌కే అయినా లైబ్రరీకి వచ్చిన అనుభూతి కలుగుతుండటంతో చాలా మంది సెలూన్ లైబ్రరీ వద్దే సమయం గడుపుతూ కనిపిస్తున్నారు.
పైగా వచ్చిన వారందరూ పుస్తకాలు చదువుతుండటంతో లైబ్రరీలాగే ఈ సెలూన్ కూడా ప్రశాంతంగా ఉంటుంది.
"టెక్నాలజీ రాకతో ఏ సమాచారం కావాలన్నా స్మార్ట్ ఫోన్లపైనే ఆధారపడుతున్నాం. దీని వలన మంచి ఎంత జరగుతుందో... మనలో ఉన్న సృజన, ఆలోచన సామర్థ్యం చంపేయడం వంటి చెడు కూడా జరుగుతుంది. పైగా వయసుతో సంబంధం లేకుండా అంతా గంటల కొద్దీ స్మార్ట్ ఫోన్లతోనే కాలం గడిపేస్తున్నారు. పుస్తకాలు చదవడం వలన మనలోని సృజనాత్మకత పెరగడంతో పాటు మెదడు పదునెక్కుతుంది. సెలూన్‌కి రాగానే కన్యాశూల్కం, శ్రీశ్రీ మహా ప్రస్థానం, సైన్స్ పుస్తకాలు, పిల్లల పుస్తకాలు ఇలా అన్ని రకాల పుస్తకాలు లభించడం సంతోషంగా ఉంది" అని సెలూన్ లైబ్రరీకి వచ్చిన సీహెచ్ ఆదినారాయణ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








