సరోగసీ: మనుమరాలిని కడుపులో మోసి జన్మనిచ్చిన 61 ఏళ్ల బామ్మ

మనవరాలికి జన్మనిచ్చిన నానమ్మ

ఫొటో సోర్స్, ARIEL PANOWICZ / WWW.ARIELPANOWICZ.COM

ఫొటో క్యాప్షన్, సెసిల్ ఎలెజ్

అమెరికాలోని నెబ్రాస్కాకు చెందిన ఒక బామ్మ తన మనుమరాలికి జన్మనిచ్చారు. తన గే కుమారుడికి, అతని భర్తకు ఒక బిడ్డనందించడం కోసం ఆమె సరోగేట్‌గా మారారు. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే వారి ఆనందానికి అంతు లేదు.

సెసిల్ ఎలెజ్, తన కుమారుడు మాథ్యూ ఎలెజ్, అతని భర్త ఎలియట్ డౌవర్టీల బిడ్డను తన గర్భంలో మోసి, పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఆ పాపకి ఉమా లూయీస్ అని పేరు పెట్టారు.

పిల్లలు కావాలని, వారికొక కుటుంబం ఏర్పడాలని మాథ్యూ, ఎలియట్ భావించారు. వారి కోరిక విన్న తరువాత, వారి బిడ్డను తన గర్భంలో మోస్తానని సెసిల్ ప్రతిపాదించారు. అది వినగానే వాళ్లిద్దరూ బాగా నవ్వారని సెసిల్ చెప్పారు. అప్పుడు ఆవిడ వయసు 59 సంవత్సరాలు.

కుటుంబ సభ్యులంతా ఆవిడ ప్రతిపాదనను ఒక జోక్‌ లాగ తీసుకున్నారు. ఆచరణలో సాధ్యం కాని విషయంగా పరిగణించారు.

"సెసిల్ ఒక నిస్వార్థమైన మహిళ. ఆవిడ మనసు ఎంతో అందమైనది. ఆవిడ నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన మనసులను కదిలించింది" అని ఎలియట్ తెలిపారు.

ఒమాహాలో నివసించే మాథ్యూ, అతని సహచరుడు ఎలియట్ బిడ్డను కనడానికి మార్గాలను అన్వేషిస్తున్నప్పుడు.. సెసిల్ చేసిన ప్రతిపాదన ఆచరణ సాధ్యమేనని ఒక సంతోనోత్పత్తి నిపుణుడు సూచించారు.

సెసిల్‌కు అనేక రకాల పరీక్షలు నిర్వహించి ఆవిడ సరోగసీకి అర్హురాలని నిర్థారించారు.

"నేను ఎల్లప్పుడూ నా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తాను. నేను ఒక బిడ్డను మోయలేనని సందేహపడాల్సిన అవసరమే లేదు" అన్నారు సెసిల్. మాథ్యూ తన స్పెర్మ్ అందించారు. ఎలియట్ సోదరి లియా అండాన్ని దానం చేశారు.

మాథ్యూ, ఎలియట్

ఫొటో సోర్స్, ARIEL PANOWICZ / WWW.ARIELPANOWICZ.COM

ఫొటో క్యాప్షన్, తమ కుమార్తె పుట్టిన రోజునాడు మాథ్యూ, ఎలియట్

“సాధారణ జంటలు ఐవీఎఫ్ ద్వారా బిడ్డను పొందడం అనేది చివరి అవకాశంగా భావిస్తారు కానీ అది మాకున్న ఒకే ఒక్క అవకాశం” అని హెయిర్‌ డ్రెస్సర్ అయిన ఎలియట్ తెలిపారు.

"మాకు బిడ్డ కావలంటే కొత్తగా ఏదైనా ఆలోచించాల్సిందేనని మాకు ముందే తెలుసు" అని స్కూల్ టీచర్‌గా పని చేస్తున్న మాథ్యూ అన్నారు.

తన ప్రెగ్నన్సీ అంతా సజావుగా సాగిందని సెసిల్ చెప్పారు.

సెసిల్ గర్భంలో పిండాన్ని అమర్చాక, అది సరిగ్గా అమరిందో తెలుసుకునేందుకు ఆమె ఇంట్లోనే ప్రెగ్నన్సీ పరీక్ష చేసుకున్నారు. దాన్లో నెగటివ్ రావడంతో చాలా నిరాశ చెందారు. అయితే, మర్నాడు ఆమె కుమారుడు మాథ్యూ వచ్చి చూస్తే అందులో మరో పింక్ లైన్ కనిపించింది. ఇంక వాళ్ల ఆనందానికి అవధుల్లేవు.

"అది నిజంగా అత్యంత సంతోషకరమైన క్షణం" అని సెసిల్ తెలిపారు. తనకు వయసైపోయిందని, కళ్లు సరిగ్గా కనిపించడం లేదని, అందుకే రెండో పింక్ లైన్‌ను గుర్తించలేకపోయారని.. ‘చూపు మందగించింది గానీ బిడ్డని కనడానికి సిద్ధమైపోయింది’ అంటూ పిల్లలు తనను ఆటపట్టించారని చెప్తూ సెసిల్ ఆ సంతోష క్షణాలను గుర్తు చేసుకున్నారు.

"నా నిర్ణయం విన్నాక నా మిగతా పిల్లలిద్దరూ కొంచెం కంగారు పడ్డారు. కానీ వివరాలన్నీ తెలుసుకున్నాక నాకు పూర్తిగా మద్దతిచ్చారు. తొమ్మిది నెలలూ కుటుంబ సభ్యులందరూ నన్నెంతో బాగా చూసుకున్నారు" అని సెసిల్ తెలిపారు.

మనవరాలు ఉమతో సెసిల్ ఎలెజ్

ఫొటో సోర్స్, ARIEL PANOWICZ / WWW.ARIELPANOWICZ.COM

ఫొటో క్యాప్షన్, మనవరాలు ఉమతో సెసిల్ ఎలెజ్

అయితే, ఈ వార్త నెబ్రాస్కాలో ఎల్జీబీటీ కుటుంబాలు ఎదుర్కొంటున్న వివక్షను మరోసారి తెర పైకి తీసుకొచ్చింది.

2015లో గే వివాహాలను చట్టబద్ధం చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన తరువాత కూడా రాష్ట్ర స్థాయిలో స్వలింగ సంపర్కుల పట్ల వివక్షకు వ్యతిరేకంగా ఎటువంటి చట్టబద్ధమైన చర్యలూ తీసుకోలేదు.

2017 వరకూ కూడా రాష్ట్రంలో స్వలింగ సంపర్కులైన తల్లిదండ్రులు పిల్లల్ని దత్తత తీసుకోవడంపై నిషేధం కొనసాగించింది.

ప్రెగ్నన్సీ సమయంలో సెసిల్ ఎంత పోరాడినప్పటికీ ఆవిడకు ఆరోగ్యపరమైన ఖర్చులకు ఇన్సూరెన్స్ లభించలేదు. అంతే కాకుండా, అక్కడ ఉన్న ఒక చట్టం ప్రకారం బిడ్డను కడుపులో మోసిన వ్యక్తి పేరు కూడా జనన ధృవీకరణ పత్రంల్లో జత చేస్తారు.

ఉమ బర్త్ సర్టిఫికెట్‌లో మాథ్యూ పేరు పక్కన సెసిల్ పేరు రాసారు కానీ తండ్రిగా ఎలియట్ పేరు రాయలేదు.

"ఇక్కడ మాకు ఎన్ని రకాల అవరోధాలున్నాయో చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే" అని మాథ్యూ తెలిపారు.

ఎలియట్ సోదరి లియా, ఎలియట్, సెసిల్, మాథ్యూ

ఫొటో సోర్స్, ARIEL PANOWICZ / WWW.ARIELPANOWICZ.COM

ఫొటో క్యాప్షన్, ఎలియట్ సోదరి లియా, ఎలియట్, సెసిల్, మాథ్యూ

నాలుగేళ్ల క్రితం మాథ్యూ, ఎలియట్‌ను వివాహం చేసుకోబోతున్నానని తను పని చేస్తున్న స్కట్ కేథలిక్ హై స్కూల్‌లో తెలిపినప్పుడు, వాళ్లు మాథ్యూను ఉద్యోగం నుంచి తొలగించారు.

అప్పట్లో ఈ వార్త ఎల్జీబిటీ కమ్యూనిటీలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. మాథ్యూ ఎదుర్కొన్న వివక్షకు వ్యతిరేకంగా ఆన్‌లైన్ పిటిషన్ రూపొందించాలని స్కూలు పూర్వ, ప్రస్తుత విద్యార్థులను, తల్లిదండ్రులనూ కోరారు.

మాథ్యూకు మద్దతునిస్తూ 1,02,995 మంది ముందుకొచ్చారు. ఎల్జీబీటీ వ్యక్తులు ఎదుర్కొంటున్న వివక్షను అడ్డుకోవడానికే తమ కథను అందరితో పంచుకుంటున్నామని సెసిల్ చెప్పారు.

"ఆశలు వదులుకోవద్దు. ఏదో ఒక మార్గం దొరుకుతుంది’ అని చెప్పడమే మా ఉద్దేశం’’ అని సెసిల్ తెలిపారు.

"మాపై వస్తున్న విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ఏది ఏమైతేనేం, చివరకు మాకో కుటుంబం ఏర్పడింది, స్నేహితులున్నారు, మాకు మద్దతునిచ్చే పెద్ద సమాజమే ఉంది" అని మాథ్యూ సంతోషం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)