ఉత్తర భారతదేశంలో వరి ఎక్కువగా సాగు చేయటమే.. పంట వ్యర్థాల దగ్ధం సమస్యలకు కారణమా?

తన పొలంలో పంట వ్యర్ధాలను తగలబడుతున్న అవతార్ సింగ్
ఫొటో క్యాప్షన్, తన పొలంలో పంట వ్యర్ధాలను తగలబడుతున్న అవతార్ సింగ్
    • రచయిత, కృతిక పత్తి, అరవింద్ చాబ్రా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

పంజాబ్ లోని పటియాలా జిల్లాలో ఉన్న అవతార్ సింగ్ పొలంలోంచి వచ్చే పొగ ఆ గ్రామం అంతా వ్యాపించింది. ఆయన పొలంలో మిగిలిన వరిగడ్డి వ్యర్ధాలను కాల్చడం అప్పుడే పూర్తి చేశారు. ఆయన తిరిగి పంట వేసుకోవడానికి నేలను సిద్ధం చేస్తున్నారు.

ఈ పొగ ఆ గ్రామం వరకు మాత్రమే విస్తరించి ఆగిపోదు. ఇది 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిల్లీ వరకు విస్తరించి రాజధానిలో ఉన్న విషపూరిత వాయువులకు తోడవుతుంది.

దీని వలన ఒక్క దిల్లీయే కాకుండా ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాలను కలుషితం చేసి కొన్ని లక్షల మంది ఆరోగ్యానికి ప్రమాద కారకంగా మారుతోంది. ఈ పంట వ్యర్ధాల నుంచి వచ్చే పొగ భారీ ప్రజారోగ్య ముప్పును సృష్టించింది.

ఈ ఏడాది కోవిడ్ మహమ్మారికి ఈ వాయు కాలుష్యం జతైతే ప్రజలు ఇన్ఫెక్షన్ బారిన పడేందుకు మరిన్ని ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీని వలన వారు కోలుకోవడం కూడా కష్టమవుతుంది. కొన్ని అంచనాల ప్రకారం ఉత్తర భారతదేశంలో ఉన్న రైతులు ప్రతీ సంవత్సరం 23 మిలియన్ టన్నుల పంట వ్యర్ధాలను తగలబెడతారు.

ఈ అలవాటును మాన్పించాలని ప్రభుత్వాలు చాలా ప్రయత్నం చేశాయి. వీటికి ప్రత్యామ్నాయాలను సూచించాయి. ఈ పద్దతులను నిషేధించాయి.

ఇంకా వీటిని తగలబడుతున్న రైతులకు జరిమానా విధించారు. కొంత మందిని జైలులో కూడా పెట్టారు.

ఉత్తర భారతంలో రైతులు వచ్చే పంటకు భూమిని సిద్ధం చేయడం కోసం పంట వ్యర్ధాలను తగల బెడతారు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఉత్తర భారతంలో రైతులు వచ్చే పంటకు భూమిని సిద్ధం చేయడం కోసం పంట వ్యర్ధాలను తగల బెడతారు

సత్ప్రవర్తనతో ఉన్న రైతులకు బహుమతులు కూడా ఇచ్చారు. ఈ గడ్డిని తగలబెట్టని ప్రతీ రైతుకు ఎకరాకు 2400 రూపాయిల చొప్పున బహుమతి ఇవ్వాలని 2019లో సుప్రీం కోర్టు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలను ఆదేశించింది.

గత సంవత్సరం గడ్డిని తగలబెట్టని సింగ్ ఆ బహుమతి వస్తుందని ఎదురు చూస్తున్నారు. "మేము ఈ సంవత్సరం అంతా ఎదురు చూసాం. మాకేమి బహుమతి లభించలేదు. అందుకే ఇక ఈ ఏడాది మిగిలిన వాళ్ళలాగే నేను కూడా ఈ సంవత్సరం గడ్డిని తగలబెడదామని నిర్ణయించుకున్నాను" అని ఆయన చెప్పారు.

కొంత మంది రైతులకు డబ్బులు ఇవ్వలేకపోయామని పంజాబ్ ప్రభుత్వం కూడా ఈ ఆగస్టులో అంగీకరించింది. "అసలు ఈ బహుమతి లభించిన రైతులెవరూ నాకు తెలియదు" అని చరణ్ దీప్ గ్రేవల్ అనే రైతు అన్నారు.

వాయు కాలుష్యం పెరుగుతున్న రీతిలోనే, కొన్ని దశాబ్దాలుగా అత్యధిక ఉత్పత్తి చేసేవారికి ప్రోత్సాహకాలు అందించిన విధానానికి కలిగిన బీటలను సరిచేయాలనే ప్రయత్నాలు చేస్తున్న విధాన కర్తలకు దేశంలో ఉన్న రైతులకు మధ్య అగాధం పెరుగుతూనే ఉంది.

రైతులు అధికమొత్తంలో పంటలు ఉత్పత్తి చేయడాన్ని ప్రోత్సహిస్తున్న విధానాలే దీనికి కొంత వరకు కారణమని నిపుణులు అంటున్నారు.

1960లలో రైతులకు స్నేహపూర్వకంగా తీసుకున్న నిర్ణయాలు, చవకగా ఇచ్చిన సబ్సిడీల వలన పంజాబ్, హర్యానా రాష్ట్రాలు దేశంలో అత్యధికంగా ఆహార పదార్ధాలను ఉత్పత్తి చేస్తున్నాయి.

కానీ, అప్పట్లోలా భారతదేశంలోని ధాన్యాగారాలు ఇప్పుడు ఖాళీగా లేవు.

ఓటు బ్యాంకులో రైతులు పోషించే కీలకమైన పాత్ర మొత్తం విషయాన్ని మరింత సంక్లిష్టం చేస్తోంది.

అందుకే కోర్టు ఆదేశించిన నిషేధాలు, అధిక మొత్తంలో జరిమానాలు లాంటివి ఎవరూ అమలు చేయరు. "ఇవి రాజకీయ నాయకులు అమలు చేస్తే కొన్ని వేల రైతుల కోపాన్ని ఎదుర్కోవల్సి ఉంటుంది. అందుకే వాళ్ళు ఇవి అమలు చేయరు" అని వ్యవసాయ ఆర్ధికవేత్త అవినాష్ కిషోర్ అన్నారు.

ఇదిలా ఉండగా, రైతులు ఉచిత విద్యుత్తు, వరి ఎరువులకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు పొందుతున్నారు.

"మనం అమలు చేసే విధానాల పైనే రైతుల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఉచిత విద్యుత్తు, చవక ఎరువులు వినాశనానికి కారణమవుతున్నాయి" అని వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి అన్నారు.

కానీ, దిల్లీ వాయు కాలుష్యానికి రైతులు కాల్చే పంట వ్యర్ధాలు కొంత వరకు కారణమైనప్పటికీ ఇక్కడి దుమ్ము, పారిశ్రామిక, వాహన ఉద్గారాలు, చెత్తను తగలబెట్టడం కూడా కారణాలే. కానీ, ఈ నిందలో అధిక భాగం తమ పైనే పడుతోందని రైతులు అంటున్నారు.

దిల్లీలో ప్రతీ శీతాకాలం వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలకు చేరుతుంది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, దిల్లీలో ప్రతీ శీతాకాలం వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలకు చేరుతుంది

ఈ ప్రాంతాలలో ఉండే వాతావరణం కూడా వాయు కాలుష్యంలో కొంత పాత్రను పోషిస్తుంది. రైతులు సంవత్సరానికి రెండు సార్లు ఒకసారి వేసవిలో, మరోసారి శీతాకాలం మొదట్లో గడ్డిని తగలబెడతారు. వేసవిలో, వేడి గాలుల వలన మంటలు తొందరగా చెదిరిపోతాయి. కానీ, సెప్టెంబరు, అక్టోబరులలో తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు, గాలి వేగం తక్కువగా ఉండటం వలన ఈ పొగ దూరంగా విస్తరించడానికి దోహదం చేస్తాయి.

"దిల్లీలో ఉండే వాయు కాలుష్యంలో గాలి వేగం, దిక్కులను బట్టి ఈ పంటవ్యర్ధాల పొగ వలన 1 నుంచి 42 శాతం వరకు ఉంటుంది" అని డాక్టర్ గులాటి చెప్పారు.

కానీ పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజా నివేదిక మాత్రం పంట వ్యర్ధాల వలన వచ్చే వాయు కాలుష్యం 2019లో సగటున 10 నుంచి 15 శాతానికి పెరిగిందని చెబుతోంది.

ఈ వ్యర్ధాలను తగలబెట్టేందుకు ప్రభుత్వం రైతులకు ప్రత్యామ్నాయ పద్ధతులను సూచించింది కానీ, దానికుండే సమస్యలు దానికున్నాయి.

ఉదాహరణకు హ్యాపీ సీడర్ అనే పరికరాన్ని ట్రాక్టర్ పైన అమరిస్తే, ఆ పరికరం ఒక వైపున ఈ గడ్డిని తొలగిస్తూ మరో వైపు గోధుమ విత్తనాలను కూడా నాటేస్తుంది. ఇది పర్యావరణ హితంగా ఉండి వేగంగా, ప్రభావవంతంగా పని చేస్తుందని ప్రచారం కూడా జరిగింది. సొంతంగా పంటలు పండించుకునే రైతులు, లేదా రైతుల సమూహాలకు ఎవరికైనా కూడా దీనికయ్యే ఖర్చులో 50 - 80 శాతం ప్రభుత్వం భరిస్తానని చెప్పింది.

పంజాబ్‌లో ఇందర్జీత్ సింగ్ అనే ఒక ధనిక రైతు గత సంవత్సరం హ్యాపీ సీడర్ దొరకడం వలన ఈ సంవత్సరం గడ్డిని తగలబెట్టలేదని చెప్పారు.

"కానీ, ఇదేమి అంత చవకగా దొరకదు. ఈ మెషీన్ అమర్చాలంటే ట్రాక్టర్ కూడా ఉండాలి. ఇవి రెండూ కలిపి సుమారు 11 లక్షల రూపాయిల వరకు ఖర్చు అవుతుంది. అందుకే చాలా మంది రైతులు గడ్డిని తగలబెట్టడానికే ఇష్టపడతారు" అని సింగ్ అన్నారు.

"అలాగే, కొంత మంది పెట్టుబడి పెట్టగలిగినప్పటికీ దీనిని వాడటం రాక కూడా వాడరు" అని చెప్పారు.

భారతీయ వ్యవసాయ పరిశోధన శాఖ పంటల వ్యర్ధాలతో 15 - 20 రోజులలో తయారు అయ్యేలా అభివృద్ధి చేసిన ఒక సేంద్రియ ఎరువు కూడా మరో కీలకమైన ప్రత్యామ్న్యాయంగా అవతరించింది. కానీ, కొందరు రైతులు, పంటకు పంటకు మధ్య అంత వ్యవధి లేదని అంటారు.

"మేము వేసవిలో వరి వేయడానికి ఒప్పుకోరు. ఎందుకంటే వరిని పండించడానికి నీరు పుష్కలంగా కావాలి" అని గ్రేవల్ అంటారు.

"మేము ఈ పంటను తొందరగా వేయడానికి అనుమతిస్తే ఈ వ్యర్ధాలను తగలబెట్టడానికి మాకు పంటకి పంటకీ మధ్య సమయం ఉంటుంది" అని ఆయన అన్నారు.

పంట వ్యర్థాల దగ్ధం

భారతదేశానికి ఇంకొక వ్యవసాయ విప్లవం అవసరమా?

కానీ, ఇలాంటి ప్రయత్నాలన్నీ అప్రస్తుతం అని గులాటి లాంటి నిపుణులు అంటారు.

ఈ సమస్యను మూలాల నుంచి పరిష్కరించుకుంటూ రావాలని ఆయన అన్నారు. ‘‘పంట వ్యర్ధాల కాల్పులలో అత్యధిక భాగం పోషిస్తున్న ఒక్క వరికి మాత్రమే కాకుండా మిగిలిన పంటలు పండించడానికి కూడా సబ్సిడీలు ఇవ్వాలి" అని ఆయన అన్నారు.

"భారతదేశానికి గోధుమలు, బియ్యం కంటే విటమిన్లు, ఖనిజాల అవసరం ఎక్కువగా ఉంది. దీని వలన కాయగూరలు, పళ్ళ పెంపకం పెరిగి పచ్చదనం కూడా పెరుగుతుంది. ఈ పంటల వలన వ్యర్ధాల ప్రసక్తే రాదు. దీంతో మంటలు తగ్గుతాయి’’ అని ఆయన పేర్కొన్నారు.

కానీ, ఈ విషయంలో ముందుకు వెళ్లాలంటే, భారతదేశం మళ్ళీ తన ప్రయాణాన్ని మొదటి నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. కనీసం 1966 నుంచైనా. దేశంలో హరిత విప్లవానికి సారధ్యం వహించేందుకు పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలను ఎంపిక చేసినప్పుడు ఆధునిక సాంకేతికత, అధిక పంటలను ఇచ్చే విత్తనాలను వాడి భారీ స్థాయిలో ఉత్పత్తులను పండించాయి.

"ఉత్తర భారతదేశంలో అంత పెద్ద మొత్తంలో వరి పండించడం ఎప్పటికైనా సమస్యలు తెచ్చి పెడుతుంది. ఈ ప్రాంతం భౌగోళిక స్వరూపం వరి పండించడానికి అనువు కాదు" అని గులాటి అన్నారు.

"వరిని చాలా అధిక మొత్తంలో భూగర్భ జలాలు ఉన్న ప్రాంతంలో పండిస్తే సులభమవుతుంది. పంజాబ్ భూగర్భ జలాలకు ప్రసిద్ధి కాదు" అని ఆయన అంటారు.

యాబై సంవత్సరాల తర్వాత ఇలా అధిక మొత్తంలో పంటలు పండించడం వలన వాయు కాలుష్యానికి మాత్రమే కాకుండా ఇది మరిన్ని విపరీత పరిణామాలకు కూడా దారి తీస్తోంది.

"ప్రాంతాలలో నీటి నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. భావి తరాలకు నీటి కొరత పొంచి ఉంది" అని గులాటి అన్నారు.

ఇది దీర్ఘ కాలం కొనసాగే విధానం కాదని రైతులు గుర్తించారు. కానీ, ప్రభుత్వం సరైన పరిష్కారాలను అందించక పోవడంతో తమ దగ్గర మరో మార్గం లేదని చెప్పారు.

"మేము సాగు చేస్తున్న తీరు కొన్ని లక్షల మంది ఆరోగ్యం పై ప్రభావం చూపింది. కానీ, ఈ ప్రభావం దిల్లీ కి చేరే లోపు ముందు రైతుల మీదే పడతాయి" అని గ్రేవల్ అన్నారు.

"మేము ఆ పొగ మధ్యలో ఉన్నాం. కానీ, దాని గురించి ఎవరూ పట్టించుకోరు" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)