కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు చేరవేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా 'కోవాక్సీన్' మూడవ దశ ట్రయల్స్‌లో హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ పాల్గొన్నారు. వాలంటీర్‌గా ముందుకొచ్చి శుక్రవారం వ్యాక్సీన్ డోసు తీసుకున్నారు. మరోవైపు మరికొన్ని నెలల్లోనే కోవిడ్ వ్యాక్సీన్ సిద్ధమవుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్థన్ అంటున్నారు.
పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అయితే కరోనా టీకా ధర కూడా ప్రకటించింది. ఒక డోసు ధర రూ.500 నుంచి రూ.600 ఉంటుందని తెలిపింది.
ఇవన్నీ చూస్తుంటే త్వరలో కోవిడ్- 19 టీకా సిద్ధం కాబోతోందన్న విషయం అర్థమవుతోంది. ఇప్పుడు ఈ వ్యాక్సీన్‌ను ప్రజల్లోకి ఎలా తీసుకెళతారన్నదే ప్రశ్న.
కరోనా వ్యాక్సీన్‌ను దేశవ్యాప్తంగా ప్రజలకు చేరవేసేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక రూపొందిస్తోంది?

ఫొటో సోర్స్, ANIL VIJ
ఏయే వ్యాక్సీన్లు అందుబాటులోకి రానున్నాయి?
2021లో మొదటి రెండు మూడు నెలల్లోపే వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి డా. హర్షవర్థన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆగస్టు -సెప్టెంబర్‌కల్లా 30 కోట్లమందికి టీకా అందించే స్థితిలో ఉంటామని ఆయన తెలిపారు.
అంటే వ్యాక్సీన్ కౌంట్‌డౌన్ ప్రారంభమైనట్టే లెక్క.
మరోవైపు, అమెరికాలో మోడెర్నా కంపెనీ తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సీన్, వైరస్ నుంచి 95% రక్షణ కల్పించగలదని ట్రయల్స్ ప్రారంభ ఫలితాల్లో తేలింది.
ఇటీవల ఫైజర్ కంపనీ, తమ వ్యాక్సీన్ 90% సురక్షితమని ప్రకటించింది.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారుచేస్తున్న వ్యాక్సీన్ కూడా వృద్ధులపై మెరుగైన ప్రభావం చూపిస్తోందని తేలింది.
మోడెర్నా వ్యాక్సీన్‌ను మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద, ఫైజర్ వ్యాక్సీన్‌ను మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చెయ్యాల్సి ఉంటుంది. వీటిని ఇంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయడం సవాలుతో కూడుకున్న విషయం.
అందుకే, కేంద్ర ప్రభుత్వం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సీన్ మీద, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కోవాక్సిన్ మీద దృష్టి పెడుతోంది. వీటిని సాధారణ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేయవచ్చని చెబుతున్నారు. అన్నీ సజావుగా సాగితే వచ్చే ఏడాది ప్రారంభంలోనే కోవాక్సీన్ మార్కెట్లోకి రావొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వాక్సీన్‌తో నిల్వ సబంధిత ఇబ్బందులు ఉండవు.

ఫొటో సోర్స్, Getty Images
టీకా ఎంత మోతాదులో లభ్యం కానుంది?
సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే నెలకు 5 నుంచీ 6 కోట్ల డోసుల వ్యాక్సీన్‌ను ఉత్పత్తి చేయగలిగే స్థితిలో ఉన్నట్టు తెలిపింది. 2021 ఫిబ్రవరికల్లా నెలకు 10 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తే స్థితికి చేరుకుంటామని వెల్లడించింది.
అయితే, భారత ప్రభుత్వం, సీరం సంస్థతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకుందనే విషయంలో ఇప్పటివరకూ ఇరు పక్షాల నుంచీ స్పష్టమైన సమాచారం రాలేదు.
కానీ, సీరం సంస్థ సీఈఓ అదార్ పూనావాలా మాట్లాడుతూ.. "భారత ప్రభుత్వం 2021 జులై నాటికల్లా 10 కోట్ల వ్యాక్సీన్ డోసులు కావాలని అడిగినట్లు" తెలిపారు.
2020 జులై నాటికి 30 కోట్ల డోసులను ప్రజలకు చేర్చాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది.
అయితే, అన్ని డోసులనూ సీరం నుంచే కొనుగోలు చేస్తుందా లేదా మరొక సంస్థతో సంప్రదింపులు జరుపుతోందా అనే విషయంపై సమాచారం లేదు.
జులై నాటికి 30 కోట్ల డోసుల వాక్సీన్‌ను భారత ప్రభుత్వానికి సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామని అదార్ పూనావాలా ప్రకటించారు.
ఇదే కాకుండా, సీరం ఇనిస్టిట్యూట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా మిగతా దేశాలకు కూడా వ్యాక్సీన్ సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తోంది. అన్ని దేశాల్లోనూ పేదలకు వ్యాక్సీన్ అందేలా చూస్తామని ఈ సంస్థ తెలిపినట్లు సమాచారం.

ఫొటో సోర్స్, ANDREA RONCHINI/NURPHOTO VIA GETTY IMAGES
శుభవార్త ముందుగా ఎక్కడినుంచి రావొచ్చు?
భారత దేశంలో ఐదు వ్యాక్సీన్లకు ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇందులో రెండు మూడవ దశ ట్రయల్స్‌కు చేరుకున్నాయి.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో పాటు మరో నాలుగు సంస్థలకు వ్యాక్సీన్ ఉత్పత్తిలో సహకరించనున్నట్లు సీరం ఇనిస్టిట్యూట్ తెలిపింది.
"మేము ఒప్పందం చేసుకున్న సంస్థలు తయారు చేస్తున్న వ్యాక్సీన్లలో కొన్ని ఒక్క డోసుతోనే కోవిడ్-19ను దూరం చేయగలిగే అవకాశం ఉంది. అయితే, ఏ వ్యాక్సిన్ ఎంత ప్రభావంతంగా పనిచేస్తుందనేది ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. అందుకే మేము మరి కొన్ని సంస్థలతో కూడా కలిసి వ్యాక్సీన్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించుకున్నాం" అని పూనావాలా వివరించారు.
వచ్చే ఏడాది మూడు, నాలుగు నెలలకొకసారి ఓ కొత్త కోవిడ్ వాక్సీన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏ వ్యాక్సీన్ వేయించుకోవాలనేది ప్రభుత్వం, ప్రజలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. జనవరిలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సీన్ మార్కెట్లోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని పూనావాలా తెలిపారు.
వీటిల్లో రెండు, మూడు వ్యాక్సీన్లు ప్రభావవంతంగా ఉన్నాయని నిరూపణ అయితే సీరం ఇనిస్టిట్యూట్ మిగతా వ్యాక్సీన్ల ఉత్పత్తి నుంచి విరమించుకుంటుంది.
ఇది కాకుండా, దేశంలో మరికొన్ని సంస్థలు కూడా వ్యాక్సీన్ ఉత్పత్తిలో భాగమవున్నాయి. మిగతా దేశాల్లో తయారవుతున్న వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
రష్యా వ్యాక్సీన్‌ను కూడా ఇండియాలో పరీక్షించనున్నట్లు తెలుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
ముందుగా ఎవరెవరికి వ్యాక్సీన్ వేస్తారు?
వ్యాక్సీన్ మార్కెట్లోకి రాగానే అందరికన్నా ముందు హెల్త్‌కేర్ వర్కర్లకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అందిస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే, సాధారణ ప్రజలకు టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని డా. హర్షవర్ధన్‌ను ప్రశ్నించగా.."135 కోట్ల మందికి ఒకేసారి టీకాను అందించలేం. అందుకే ప్రభుత్వం ప్రాధాన్యతల జాబితా తయారుచేసుకుంది" అని చెప్పారు.
గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.."వ్యాక్సీన్ బహుషా రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. రెండు మూడు వారాలలోపు రెండో డోసు తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వం ముందుగా 25 నుంచి 30 కోట్ల మందికి మాత్రమే టీకా ఇవ్వగలుగుతుంది. గత 10 నెలలుగా ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేస్తున్న హెల్త్‌కేర్ వర్కర్లకు తొలి ప్రాధాన్యత లభిస్తుంది." అని చెప్పారు.
"తరువాత 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు టీకాలిస్తారు. అనంతరం 50-65 మధ్య వయస్కులకు, ఆ తరువాత 50 లోపు వారిలో ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకాలిస్తారు" అని తెలిపారు.
ఈ ప్రాధాన్యతలను నిర్ణయించడానికి భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, అందులో వైద్య నిపుణుల సలహా మేరకు ప్రాధాన్యతల లిస్ట్ తయారు చేసిందని డా. హర్షవర్ధన్ తెలిపారు.
నీతి ఆయోగ్ సభ్యులు వీకే. పాల్ ఈ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు.
దేశంలోని ప్రతీ గ్రామానికి, పంచాయతీకి ఈ వాక్సీన్‌ను చేరవేయడానికి భారత ప్రభుత్వం మూడు నెలలకు ముందే కసరత్తు ప్రారంభించిందని, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అక్టోబర్ నాటికే హెల్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల జాబితా తయరుచేసిందని సమాచారం.
ఇవి కూడా చదవండి:
- యూరినరీ ఇన్‌కాంటినెన్స్: మహిళల్లో మూత్రం లీకయ్యే సమస్యకు కారణాలేంటి...
- నంద్యాల ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం కుటుంబం అంతా ఎందుకు ఆత్మహత్య చేసుకుంది?
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- ‘దూదేకుల’ వివాదం ఏపీ హైకోర్టుకు ఎందుకు చేరింది
- నియాండర్తల్: ఆధునిక మానవుడి చేతిలో అంతరించిపోయిన జాతి కథ.. హోమో సేపియన్స్ చేతిలో ఎంత దారుణంగా చనిపోయారంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








