ఇంటర్‌సెక్స్: "నేనొక అబ్బాయిని.. 16 ఏళ్ల వయసులో నాకు రుతుస్రావం మొదలయింది"

ముగ్గురు ఇంటర్‌సెక్స్ మహిళలు

ఫొటో సోర్స్, Iryna Kuzemko, Lia and Olga Opinko

ఫొటో క్యాప్షన్, ఐరీనా కుజెమ్కో, లియా, ఓల్గా ఒపిన్కోలలో మూడు విభిన్న ఇంటర్‌సెక్స్ రకాలున్నాయి - మొత్తంగా 40 రకాలున్నాయి

"నాకు 22 సంవత్సరాలప్పుడు నేను ఇంటర్‌సెక్స్ వ్యక్తినని అర్ధమయింది. అప్పటి నుంచి గతంలో కంటే ప్రతీ రోజూ ఆనందంగా గడుస్తోంది" అని ఐరీనా కుజెమ్కో చెప్పారు.

ప్రపంచంలో వివాదాస్పద లింగ శస్త్ర చికిత్సలుగా పరిగణించే శస్త్ర చికిత్సను బాల్యంలోనే చేయించుకున్న కొన్ని వేల మందిలో ఆమె ఒకరు.

పురుష, స్త్రీ శరీర లక్షణాలలో 40కి పైగా రకరకాల వైవిధ్యాలను కలిగి ఉన్నవారందరినీ ఇంటర్‌సెక్స్‌కు చెందిన వారిగా పరిగణిస్తారు.

కొంత మందికి హార్మోనుల పని తీరులో వైవిధ్యాలు ఉంటే కొంత మంది శారీరకంగా వైవిధ్యం ఉన్నట్లు కనిపిస్తారు. ఉదాహరణకు కొందరికి స్త్రీలకు ఉండే పునరుత్పత్తి అవయవాలు ఉంటే, కొంత మందికి పురుషుల్లో ఉండే జననేంద్రియాలు బాహ్యంగా కనిపిస్తాయి.

వీటికి సమాధానం వెతుక్కోవడానికి చాలా మంది ఇంటర్‌సెక్స్ వ్యక్తులు చాలా వేదనకు గురవుతూ ఉంటారు. అందులో వారికి లింగ సంబంధిత శస్త్ర చికిత్స జరిగినప్పుడు మరీ ఇబ్బంది పడుతూ ఉంటారు.

లింగ సంబంధిత శస్త్ర చికిత్సల విషయాన్ని అంత తేలికగా తీసుకోవడానికి లేదని డాక్టర్లు చెబుతారు. "పిల్లల లింగాన్ని నిర్ధరించడానికి జన్యు పరీక్ష నిర్వహించిన తర్వాత చాలా మంది వైద్యులు, తల్లి తండ్రులు, జన్యు నిపుణులు కలిసి లింగ సంబంధిత శస్త్ర చికిత్స చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు" అని వైద్యులు చెబుతారు.

అయితే, పిల్లలకు అవసరం లేని లింగ శస్త్ర చికిత్స చేయడాన్ని ఇంటర్‌సెక్స్ ఉద్యమకారులు వ్యతిరేకిస్తారు. యుక్త వయస్సు వచ్చిన తర్వాతే ఎవరికి వారు లింగం గురించి నిర్ణయం తీసుకోగలరని వారంటారు. వారు అమ్మాయిలా అబ్బాయిలా అనేది తల్లి తండ్రులు, వైద్యులు నిర్ణయించకూడదని వాదిస్తారు.

ఇలా శస్త్రచికిత్సలు జరిగిన ముగ్గురు ఇంటర్‌సెక్స్ మహిళలు తమ కథనాలను బీబీసీతో పంచుకున్నారు. వారు తమని తాము ఎలా ఆమోదించుకోవడం మొదలుపెట్టారో వివరించారు.

ఐరీనా

ఫొటో సోర్స్, Iryna Kuzemko

ఫొటో క్యాప్షన్, ఐరినా చిన్నపుడు తను ఇంటర్‌సెక్స్ వ్యక్తినని తనకు తెలియదు.. ఆమె యుక్తవయసుకు వచ్చినపుడు ఆమెలో వైవిధ్యం కనిపించటం మొదలైంది

‘నేనొక అమ్మాయిని.. నాకు 15 ఏళ్లపుడు నా వృషణాలను తొలగించారు’

ఐరీనా కుజెమ్కో, 27 సంవత్సరాలు, ఇంటర్ సెక్స్ ఉద్యమకారిణి

నాకు యుక్త వయస్సు వచ్చేవరకు నేనొక అమ్మాయిలా పెరిగాను. నా తోటి వారందరికీ అప్పటికే రుతుస్రావం మొదలయింది కానీ, నాకు మాత్రం రుతుస్రావం మొదలవ్వలేదు. మా క్లాసు మొత్తం మీద నాకొక్క దానికే రొమ్ములు పెరగలేదు.

అమ్మాయిలకు యుక్త వయస్సు వచ్చే విధానం గురించి వివరించే సినిమాకు మా క్లాసు పిల్లలనందరినీ తీసుకుని వెళ్లారు. అది నాకు చాలా వేదనతో కూడిన అనుభవం. ఆ సినిమాలో అమ్మాయిల గురించి వివరిస్తున్నట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలోనూ అవుతోంది, కానీ నాకెందుకు జరగటం లేదో నాకర్ధం కాలేదు.

నేను మిగిలిన అమ్మాయిలలా లేననే విషయం గురించి మా అమ్మ, అమ్మమ్మ పెద్దగా విచారించలేదు. "ఏమి పర్వాలేదు. అంతా సర్దుకుంటుంది" అని అనేవారు. కానీ, నాకు 14 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను వాళ్ళని ఒక స్త్రీ వైద్య నిపుణురాలు దగ్గరకు తీసుకుని వెళ్ళమని ఒత్తిడి చేశాను.

నా అండాశయాలు పని చేయడం మొదలు పెట్టాలని డాక్టర్ చెప్పారు. అందుకోసం ఆవిడ కొన్ని వైద్య విధానాలు చెప్పారు. నేను ఆవిడ చెప్పినట్లే వారానికి ఒకసారి కొన్ని నెలల పాటు చేశాను. కానీ, ఫలితం లేకపోయింది. దాంతో నేనింకా కృంగిపోయాను.

నాకు 15 ఏళ్ళు వచ్చాక మా నాన్నగారు నన్ను మాస్కోలో ఒక డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లారు. వాళ్ళు నాకేమీ చెప్పలేదు. మా నాన్నగారిని మాత్రం వారి ఆఫీసు లోపలికి రమ్మని పిలిచారు.

మా నాన్నగారు బయటకు వచ్చి నాకు చిన్న శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని చెప్పారు. వాళ్ళేమి చేస్తారో నాకు తెలియదు. స్కూలులో అమ్మాయిలు కూడా నన్ను చాలా అడిగారు. కానీ, వాళ్లకు ఏమి సమాధానం ఇవ్వాలో నాకే తెలియదు.

ఐరీనా

ఫొటో సోర్స్, Iryna Kuzemko

ఫొటో క్యాప్షన్, తన ఇంటర్‌సెక్స్ వైవిధ్యం గురించి డాక్టర్లు, తన తండ్రి తనకు చాలా ముందుగానే చెప్పివుంటే బాగుండేదని ఐరీనా అంటారు

నా శరీరం లోపలున్న భాగాలన్నీ తీసేస్తే బాగుంటుందేమోనని నేను మా నాన్నగారితో అన్నాను. "నీకెప్పుడో అన్నీ తీసేశారు" కదా అని మా నాన్నగారు సమాధానం చెప్పారు. నేను ఆశ్చర్యానికి గురయ్యాను. అప్పుడు నా అండాశయాన్ని తొలగించారని నాకర్ధమయింది.

విద్యార్థిగా ఉన్నప్పుడు నేను స్వీయహాని చేసుకోవడం, నన్ను నేను ద్వేషించుకోవడం చేసేదానిని.

ఇంటర్నెట్‌లో ఇంటర్‌సెక్స్‌కు చెందిన వ్యక్తుల గురించి వీడియో చూసి వాళ్ళ కథ కూడా నా కథను పోలి ఉందని అర్ధం చేసుకున్నాను.

నా వైద్యానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకుని మాస్కోలో ఒక డాక్టర్‌ని సంప్రదించాను. మా అమ్మ నా పక్కనే నిల్చుని ఉంది. ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది.

నాకు 15 ఏళ్లున్నపుడు నా వృషణాలతో పాటు పని చేయని అండాశయ పొరలను తొలగించారని, నాకు 22 సంవత్సరాలు వచ్చాక తెలిసింది. అప్పటి నుంచి నేను హార్మోను మందులు తీసుకుంటున్నాను.

నాకు స్త్రీలకు ఉండే క్రోమోజోములతో పాటు పురుషులకు ఉండే క్రోమోజోములు కూడా ఉన్నాయని తెలిసింది. నాకు అండాశయం కూడా ఉంది.

ఐరీనా

ఫొటో సోర్స్, Iryna Kuzemko

ఫొటో క్యాప్షన్, ఐరీనా

ఈ విషయంపై మా నాన్నతో చాలా తీవ్రంగా చర్చించాను. అయితే, ఈ విషయం గురించి నాకు చెప్పవద్దని ఇద్దరు పిల్లల మానసిక శాస్త్రవేత్తలు సూచించారని ఆయన నాకు చెప్పారు.

మా నాన్న తన తప్పును అంగీకరించలేదు. ఆయన నిజాన్ని సూటిగా చెప్పి ఉండాల్సింది. నా జీవితం మరోలా ఉండేది. అప్పటి నుంచి నేను మా నాన్నతో మాట్లాడలేదు.

ఇది తెలిసిన తర్వాత నేను చాలా నిస్పృహకు లోనయ్యాను. ఎలా బతకాలో నాకర్ధం కాలేదు. కానీ, నన్ను నేను ఆమోదించుకోవడం మొదలు పెట్టాను. నాలో జరిగిన లింగ మార్పులకు "ఇంటర్ సెక్స్" అనే పేరు ఉంది. అంతకు ముందు నేనొక అనిశ్చిత స్థితిలో ఉండేదానిని.

ఇంటర్‌సెక్స్ వ్యక్తులు కూడా చాలా శాంతియుతంగా జీవిస్తారని అర్ధం చేసుకున్నాను. దీనికి బాధపడాల్సిన పని లేదని తెలిసింది. దాంతో నా మీద నాకు నమ్మకం పెరిగింది.

నా లాంటి వారు నాలా బాధలు పడకుండా పిల్లలకు, యుక్త వయస్సు వారికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను.

వీడియో క్యాప్షన్, లింగ మార్పిడి ఎలా చేస్తారు?
line

కొందరిలో పుట్టుకతోనే బయటపడితే.. కొంతదరికి యుక్త వయస్సులో తెలుస్తుంది

జూలియా సిండ్రోవా, పిల్లల వైద్య నిపుణులు

పిల్లల జీవితం అపాయంలో ఉంటే లింగ బేధాన్ని సరి చేయడానికి చేసే శస్త్ర చికిత్సకు కాస్మెటిక్ శస్త్ర చికిత్సకు మధ్యనుండే భేదాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉంది.

ఉదాహరణకు ఒక అమ్మాయికి పురుషులకు ఉండే జననేంద్రియాలు బయటకు కనిపించవచ్చు. లేదా క్లిటోరల్ హైపర్ట్రోఫీ కనిపించవచ్చు. పూర్తిగా అమ్మాయిలా చేయడానికి దానిని సరి చేస్తారు.

ఇలాంటి పరిస్థితి వలన ప్రాణాపాయం ఉండకపోవచ్చు కానీ, వీటి వలన సామజిక సమస్యలు ఉంటాయి. అలాంటి పిల్లలను బడులలోనూ, స్విమ్మింగ్ పూల్ లాంటి ప్రదేశాల దగ్గర అనుమానాస్పదంగా చూస్తారు.

ఒక్కొక్కసారి వీరిలో మూత్రానికి వెళ్ళడానికి ఇబ్బంది కలగవచ్చు. అలాంటి వారికి శస్త్ర చికిత్స చేయడం తప్పని సరి.

ఇలాంటి పిల్లలంతా తమ శరీరం గురించి, లింగం గురించి స్వీయ నిర్ణయం తీసుకోగలిగే అవకాశం ఇవ్వాలి. ఒక్కసారి పెద్దయ్యాక వారు సొంతంగా అలోచించి నిర్ణయం తీసుకోగలిగే శక్తిని కలిగి ఉంటారు. మూత్ర ద్వారం మూసుకుపోవడం లాంటి సమస్యలు ఎదురయి మూత్రానికి వెళ్లడం ఇబ్బంది అయిన పక్షంలో పిల్లలకు వైద్య సహాయం అవసరం అవుతుంది.

శస్త్ర చికిత్స చేయడం వలన సున్నితత్వం కోల్పోవడం, పునరుత్పత్తి సామర్ధ్యం కోల్పోవడం, తీవ్రమైన నొప్పి లాంటి కొన్ని ఇతర ప్రభావాలు ఉండవచ్చు. హార్మోన్ థెరపీ వలన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. వారిని తరచుగా పరీక్ష చేస్తూ ఉండాలి.

ఈ ఇంటర్‌సెక్స్ వైవిధ్యాన్ని లైంగిక ఆసక్తి అని పొరబడకూడదు. మనలో చాలా మంది భిన్నలింగాల వారు స్వజాతి సంపర్కులై ఉంటాం. ఇలాగే, ఇంటర్‌సెక్స్ ఉన్న వారిలో కూడా ఉంటారు.

ఇంటర్‌సెక్స్ వైవిధ్యం ఉన్నవారికి కూడా కుటుంబాలు ఉంటాయి. పిల్లలు ఉంటారు. కొంత మంది వారిలో జరిగిన ఇంటర్‌సెక్స్ వైవిధ్యం గురించి పిల్లలను కనలేనప్పుడు అర్ధం చేసుకుంటారు.

అదే సమయంలో ప్రతి కథా విభిన్నంగా ఉంటుంది. కొంతమందికి ఈ లింగ వైవిధ్యాలు పుట్టుకతోనే బయటపడితే, కొంత మందికి ప్రత్యేకమైన రూపు రేఖలు ఉంటాయి. కొంత మందికి ఇది యుక్త వయస్సులో తెలుస్తుంది.

ఈ రోజు నా స్నేహితులు, తోటి విద్యార్థులు, టీచర్లు, చాలా మద్దతు అందిస్తారు. నేను వారందరి దగ్గర నుంచి ప్రేమను పొందుతాను.

నేను నన్ను నేను ఆమోదించుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి నా జీవితం మరింత ఆనందమయంగా మారుతూ వస్తోంది.

line
లియా

ఫొటో సోర్స్, pickpik

ఫొటో క్యాప్షన్, లియా తన గుర్తింపు విషయంలో అనేక ఏళ్ల పాటు సంఘర్షణకు లోనయ్యారు

‘నేను పుట్టినపుడు అమ్మాయిగా నమోదు చేశారు.. పెద్దయ్యాక అబ్బాయినని నిర్ధారించారు’

లియా (అసలు పేరు కాదు)

నా కథ ప్రసూతి ఆసుపత్రి దగ్గరే మొదలయింది. నాకు పూర్తిగా అమ్మాయిగానూ, పూర్తిగా అబ్బాయిగానూ లేని, సరిగ్గా రూపొందని జననేంద్రియాలు ఉన్నాయని డాక్టర్లు మా అమ్మతో చెప్పారు.

నీకు పుట్టింది అబ్బాయా? అమ్మాయా? నువ్వేమని అనుకుంటున్నావు? అని వాళ్లు మా అమ్మను అడిగారు.

మా అమ్మ మాత్రం నన్ను అమ్మాయిగానే నమోదు చేయించారు. డాక్టర్లు చేసిన మొదటి తప్పు అదే. వాళ్ళు ఆ బాధ్యతను మా అమ్మ మీద పెట్టి ఉండాల్సింది కాదు.

దాంతో, నేనొక అమ్మాయిగానే పెరిగాను.

నేను స్కూల్లో చేరక ముందు మా అమ్మ నన్ను వైద్య పరీక్షలకు తీసుకుని వెళ్లారు. అక్కడ డాక్టర్లు మా అమ్మతో, "నీకు విచక్షణ ఉందా? నీకు అబ్బాయి ఉన్నాడు" అని చెప్పారు.

మిగిలిన డాక్టర్లు కూడా నన్ను అబ్బాయిగానే నిర్ధరించారు. దాంతో అన్ని పత్రాల మీద నా పేరు మార్చారు.

నేను స్కూలుకి అబ్బాయిలానే వెళ్ళాను. అయితే, అప్పటికే నేను అమ్మయిగా తెలిసిన పిల్లలున్నారు. దాంతో మా అమ్మ నన్ను వేరే స్కూలుకు మార్చారు.

అప్పటివరకు నేను పెద్దగా విచారించలేదు. ఇదే విషయం గురించి మా పెద్దవాళ్ళు ఆలోచిస్తున్న విధానం చూసి నాకు విచారం మొదలయింది. దాంతో ఒత్తిడి పెరిగింది.

నా పొడవైన జుట్టును కత్తిరించుకోవడానికి తిరస్కరించే దానిని. కానీ, లూజు బట్టలు, టోపీతో కూడిన టాపులు వేసుకునే దానిని. వాళ్ళు నా లింగాన్ని ఎన్నుకునే స్వేచ్ఛను ఇచ్చినందుకు నేను నెమ్మదించాను.

ఇప్పటికీ నేను ఇదే రీతిలో ఉంటాను.

లియా

ఫొటో సోర్స్, Lia

ఫొటో క్యాప్షన్, తన లింగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్న తన తల్లి తప్పుచేశానని ఇప్పుడు బాధపడుతున్నారని లియా చెప్పారు

నాకు 13 ఏళ్ళు ఉన్నప్పుడు నాకొక ప్రమాదం జరిగింది. ఒక గుర్రం నన్ను తోసేసింది. నేను లేచి చూసేటప్పటికి వెన్నెముక విరిగి హాస్పిటల్‌లో ఉన్నాను.

నాకు కాథెటర్ అమర్చారు. దాంతో నర్సులు నా జననేంద్రియాలు చూసి నేను అమ్మాయినో, అబ్బాయినో తెలియటం లేదని నన్ను ఏడిపించే వారు. విరిగిన వెన్నెముకతో ఇలాంటి మాటలు వినడం ఎలా ఉంటుందో ఊహించండి.

హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఇంట్లో పడుకునే ఉన్నాను. అక్కడ నాకు ఒక మంచం, ఒక కుర్చీ, రెండు పాత్రలు ఉండేవి. ఒకటి భోజనానికి, రెండవది మూత్రానికి.

మా అమ్మ, మామ్మ, సోదరి రోజంతా పని చేస్తూనే ఉండేవారు. మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. దాంతో నన్ను చూసుకోవడానికి ఎవరూ ఉండేవారు కాదు.

ఒక రోజు నేను నొప్పిని భరించలేక నన్ను నేను కత్తెరతో గాయపర్చుకున్నాను. అలా నా జీవితంలోకి స్వీయ హాని ప్రవేశించింది. మా అమ్మ ఇవేవీ గమనించలేదు.

నేను మళ్ళీ నా కాళ్ళ మీద నేను నిలబడతానని డాక్టర్లు కూడా భావించలేదు. కానీ, నేను వ్యాయామం చేయడం మొదలుపెట్టాను దాంతో ఎటువంటి పరికరాలు అవసరం లేకుండానే నా అంతట నేను లేచి నిలబడటం మొదలు పెట్టాను.

అలా లేచి నిలబడగానే నేను ముందుగా స్కూలుకు వెళ్లాలని అనుకున్నాను. స్కూలు మా ఇంటి నుంచి 20 నిమిషాల దూరంలో ఉంటుంది. కానీ, నాకున్న సమస్య వలన వెళ్ళడానికి 2 గంటలు పట్టేది.

స్కూలులో పిల్లలు నన్ను ఏడిపించి నా సంచిని టాయిలెట్లో విసిరేశారు. నేను వాళ్ళ వెంట పరుగు పెట్టలేనని వాళ్లకు తెలుసు

ఒక రోజు నేను లేచేటప్పటికి నా మంచం మీద రక్తం కనిపించింది. అప్పుడు నాకు 16 సంవత్సరాలు.

నన్ను హాస్పిటల్ కి తీసుకుని వెళితే, డాక్టర్ నాకు అల్ట్రా సౌండ్ పరీక్ష చేసి "ఇక్కడ గర్భ సంచి ఉంది" అని అకస్మాత్తుగా అరిచారు. నేనా మాటలు వినగలననే విషయం ఆయన పూర్తిగా మర్చిపోయారు.

అలా స్త్రీల జననేంద్రియాలు నా శరీరంలో ఉన్నాయని నాకు అర్ధమయింది. అబ్బాయిగా ఉంటూ రుతుస్రావం అవ్వడం మొదలయింది.

నాకు కనిపించని నా శరీరం లోపల ఉన్న భాగాలను తొలగించుకోవాలని అనుకున్నాను.

అయితే, వాటిని అలాగే ఉండనివ్వమని డాక్టర్లు నన్ను ఒప్పించారు. అవి పూర్తిగా పని చేస్తున్నాయని చెప్పారు. అవి భవిష్యత్తులో ఉపయోగ పడవచ్చని చెప్పారు.

దాంతో మళ్ళీ నాలుగు శస్త్ర చికిత్సల తర్వాత నేను అమ్మాయిగా మారాను.

వీడియో క్యాప్షన్, భారత్‌లో జెండర్‌కున్న ప్రాధాన్యం ఎలా మారిపోయింది?
line

‘నేనెక్కువ అమ్మాయిల పట్ల ఆకర్షితురాలినవుతాను...’

జూలియా సిడ్రోవా , పిల్లల వైద్య నిపుణులు

డాక్టర్లు ఇంటర్‌సెక్స్ వైవిధ్యం ఉండే కేసులు అరుదుగా చూస్తూ ఉంటారు.

ఇంటర్‌సెక్స్ వైవిధ్యం గురించి సభ్యత లేకుండా వారికి తెలియచేస్తే ఒక యుక్త వయస్సులో ఉండే వారికి ఎలాంటి భావాలు కలుగుతాయో ఊహించండి.

అలాంటి పిల్లల తల్లి తండ్రులు చాలా ఒత్తిడికి గురవుతారు. వాళ్ళు ఒకరితో ఒకరికి దగ్గర బంధుత్వాలు ఉన్నవారా? లేదా తల్లి గర్భంతో ఉన్నప్పుడు మద్యం తాగడం కానీ, పొగతాగడం కానీ చేశారా లాంటి ప్రశ్నలు అడుగుతారు.

మీకు తెలిసిన వారిలో కూడా చాలా మంది ఇంటర్‌సెక్స్ పిల్లలు ఉండి ఉండవచ్చు.

మొత్తం జనాభాలో 1.7 శాతం కనీసం 40 ఇంటర్‌సెక్స్ వైవిధ్యాలలో ఒక రకాన్ని కలిగి ఉండవచ్చని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. అయితే, ఈ సంఖ్య ఇంకా తక్కువగా ఉండి ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.

నాకిప్పుడు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.

నాకు 20 ఏళ్ళున్నప్పుడు కొడుకును కన్నాను. నాకేమి మాతృత్వ భావనలు ఉండవు. కానీ, నా కొడుకుతో నాకు చాలా స్నేహపూర్వక సంబంధం ఉంటుంది.

మా అమ్మాయి నాతో ఉండదు. నేను తనను కిండర్ గార్డెన్‌లో చేర్చినప్పుడు పాప తండ్రి అక్కడ నుంచి పాపను అపహరించి వేరే చోటుకు తీసుకుని వెళ్లిపోయారు.

నా జీవితంలో నేనెంతో మంది అమ్మాయిలను, అబ్బాయిలను కలిశాను. నేనెక్కువ అమ్మాయిల పట్ల ఆకర్షితురాలినవుతాను. నాకు పురుషులతో మానసిక బంధం ఉండదు.

పురుషులను నేను కేవలం రోల్ మోడల్స్ గా మాత్రమే చూస్తాను. వాళ్ళేమి చేస్తారు, పడకలో ఎలా ప్రవర్తిస్తారు అని చూస్తాను. నేను కూడా అలాగే చేయాలి కదా.

నాకిప్పటికే నాలుగు వివాహాలు అయ్యాయి. ఇప్పుడు నేను ఐదవ వివాహానికి సిద్ధం అవుతున్నాను. నేను చర్చిలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను ప్రేమించిన వ్యక్తి ఒక ట్రాన్స్‌జెండర్. ఆయన స్త్రీ శరీరంతో పుట్టారు. కానీ, తనను అందరూ పురుషునిలా చూస్తారు.

నేను ఎలా ఉండకూడదో అలా ఉండటానికి డాక్టర్లు ఒప్పించకపోతే , నా జీవితం పూర్తిగా వేరేగా ఉండేదేమో? ఎవరికి తెలుసు?

నా ఉనికి కోసం నేను ఇంత కాలం పాటు వెతికి నాలుగు పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలతో సమస్యలు ఎదుర్కొని ఉండే దానిని కాదేమో?

మరో వైపు, నా పిల్లలు, నేనిప్పుడు చేసుకోబోతున్న వివాహం నన్ను తిరిగి చర్చి వైపు తీసుకుని వెళుతున్నాయి. ఇదంతా నేను మా అమ్మకు గౌరవం కోసం చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు సరైన లింగాన్నే ఎన్నుకున్నారా లేదా అని ఆమె ఒక న్యూనతా భావంతో ఉండేవారు.

ఆ న్యూనతా భావాన్ని వదిలించుకోవల్సిన సమయం దగ్గర పడింది.

line
ఓల్గా ఒపిన్కో

ఫొటో సోర్స్, Olga Opinko

ఫొటో క్యాప్షన్, ఎన్నో ఏళ్ల అన్వేషణ తర్వాత.. క్రోమోజోముల విశ్లేషణ అనంతరం ఓల్గాకు సమాధానం లభించింది

‘నా శరీర భాగాలన్నీ గందరగోళంగా ఉన్నాయని 24 ఏళ్ల వయసులో తెలిసింది’

ల్గా ఓనిప్కో 35 సంవత్సరాలు, ఇంటర్ సెక్స్ ఉద్యమకారిణి

నేనెప్పుడూ అమ్మాయిలాగే కనిపించాను. నా లోపల కూడా అమ్మాయిలకు ఉండే భాగాలే ఉన్నాయి.

కానీ, నేను టీనేజర్‌గా ఉన్నప్పుడు నేను బరువు పెరగడం మొదలయింది. దాంతో నన్ను నా తోటి వారు ఏడిపించడం మొదలు పెట్టారు. నేను పొద్దున్న, సాయంత్రం జాగింగ్ చేయడానికి వెళ్లి, బరువు తగ్గడానికి డైటింగ్ కూడా చేసేదానిని. కానీ, బరువు పెరుగుతూనే ఉండేదానిని.

24 సంవత్సరాల వయస్సులో నేను హార్మోన్ల పరీక్ష చేయించుకున్నాను. నా లోపల శరీర అవయవాలన్నీ చిందర వందరగా ఉన్నాయని అర్ధం అయింది. కానీ, అప్పటికీ నేను ఇంటర్‌సెక్స్ వ్యక్తినని అర్ధం కాలేదు.

ఈ అసమానతలను సరి చేయడానికి ఎండోక్రైనాలజిస్ట్ హార్మోనుల మందులను సూచించారు. కానీ, కొన్ని రోజుల తర్వాత నా పై పెదవి మీద, మెడ మీద వెంట్రుకలు రావడం మొదలయింది. బయటకు వెళ్లి కొత్త స్నేహితులను చేసుకోవాలనుకునే ఒక 25 సంవత్సరాల అమ్మాయికి అలా జరిగితే ఎలా ఉంటుందో ఊహించండి.

దాంతో నేను హార్మోను మందులను తీసుకోవడం మానేశాను. కానీ, డబ్బులు, సమయం ఉన్నప్పుడల్లా నేను డాక్టర్ల దగ్గరకు వెళ్లడం మొదలు పెట్టాను.

ఒక డాక్టర్ నా క్రోమోజోముల జతను పరిశీలించాలని చెప్పారు. నాలుగు సంవత్సరాల క్రితమే నేను ఈ పరీక్ష వలన ఉభయ లింగ వ్యక్తినని అర్ధమయింది. నేనొక స్వజాతి సంపర్కురాలినని 24 సంవత్సరాలకే తెలిసింది.

నా భావాలు ఊహించండి. నేను వయసులో ఉండగా సన్నగా లేనని విచారిస్తూ ఉండేదానిని. తర్వాత నేను స్వజాతి సంపర్కురాలినని అర్ధమయింది. ఇప్పుడు నేనొక అమ్మయినా కాదా అని ఆలోచిస్తున్నాను. నేనెవరిని?

నా సోదరుడు నా ఇంటర్‌సెక్స్ తత్వాన్ని ఆసక్తితో గమనిస్తాడు. నా అక్కలిద్దరూ నా పట్ల శ్రద్ధ చూపిస్తారు. నా తల్లి తండ్రులు నన్ను ఆమోదిస్తారు. వాళ్లంతా నన్ను ప్రేమిస్తారు. కానీ, దీని గురించి ఎవరూ మాట్లాడరు.

నా భాగస్వామి ఏ ప్రత్యేకమైన లింగానికి చెందిన వారు కాకపోవడం మాత్రం వారు ఆమోదించలేరు. తను అమ్మాయిగా పుట్టింది కానీ, తనని తాను అమ్మాయిగా కానీ, అబ్బాయిగా కానీ పరిగణించరు.

సమాజంలో ఉన్న భిన్నత్వాన్ని ఆమోదించలేకపోవడమే ఇంటర్‌సెక్స్ వ్యక్తులు ఎదుర్కొనే పెద్ద సమస్య.

ఈ ఇంటర్‌సెక్స్ వాళ్ళ భావాలు కూడా వినాలి. వాళ్లకి చిన్న వయస్సులో జరిగిన శస్త్ర చికిత్సలు వారిని కృంగదీస్తాయి. డాక్టర్లు నిర్ణయించిన దానికంటే భిన్నంగా వారు తమను తాము భావిస్తారు.

డాక్టర్లు, తల్లి తండ్రులు కలిసి ఇంటర్ సెక్స్ లక్షణాలున్న పిల్లలను అబ్బాయో, అమ్మాయో అనే చట్రంలోకి తేవాలని చూస్తారు. వీళ్ళను సమగ్రంగా తయారు చేయాలని సమాజం భావిస్తుంది.

ఏదైనా అనిశ్చితంగా, అసాధారణంగా ఉన్న వాటి పట్ల భయం ఉన్న వ్యక్తులు అలాంటి వారిని వేధించడం మొదలు పెడతారు.

అలాంటి పిల్లలు పుడతారా అనేది వాళ్లకు సందేహంగా ఉంటుంది. ప్రకృతి ఎప్పుడూ రెండు లింగాలలో మాత్రమే బందీ అయి ఉండదు.

line

‘ప్రత్యేకతను గుర్తించాక, అందంగా ఆనందంగా ఉంటారు...’

సెర్హి కిర్లియుక్ , సైకియాట్రీ , సైకో థెరపీ అసోసియేట్ ప్రొఫెసర్

ఒక సైకో థెరపిస్ట్ గా నేను అలాంటి కేసులను చూస్తూ ఉంటాను.

ఈ ఇంటర్‌సెక్స్‌కి చెందిన వారు చిన్న వయసులో లింగ సంబంధిత శస్త్ర చికిత్స జరిగినట్లు తెలుసుకున్న తర్వాత చాలా కోపానికి గురవుతారు.

అయితే, ఈ కోపాన్ని వారిలోనే ఉండేటట్లు మాత్రం చూడకూడదు. అది బయటకు రానివ్వడమే మంచింది.

ఇంటర్‌సెక్స్‌కి చెందిన వారు తమను తాము ఆమోదించుకోవడం మొదలుపెట్టి వారిలో ఉన్న ప్రత్యేకతను గుర్తించడం మొదలు పెట్టినప్పటి నుంచీ వారు చాలా అందంగా తయారవుతారు. వారి ముఖాల్లో మెరుపు కనిపిస్తుంది.

బీబీసీ గ్లోబల్ ఐడెంటిటీ కరెస్పాండంట్ మేఘ మోహన్ అందించిన సమాచారంతో..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)