పాకిస్తాన్: నిన్నటి దాకా అక్కా చెల్లెళ్లు... ఇప్పుడు అన్నాతమ్ముళ్లు

లింగ మార్పిడి

ఫొటో సోర్స్, SURGEON AMJAD CHOUDHRY

    • రచయిత, మహమ్మద్ జుబైర్ ఖాన్
    • హోదా, బీబీసీ కోసం

‘‘ఇస్లామాబాద్ నుంచి గుజరాత్‌కు నేను అబ్బాయిలా వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి అమ్మాయిల బట్టలు వేసుకోవడం, అమ్మాయిల్లా తయారు కావడం అసలు నచ్చేది కాదు. నా అలవాట్లన్నీ అబ్బాయిల్లానే ఉండేవి. నాకు ఏడుగురు సోదరీమణులు, ఓ సోదరుడు ఉన్నారు. నేను ఇలా సెక్స్ ఛేంజ్ ఆపరేషన్ చేసుకోవడంపై వారు కూడా సంతోషం వ్యక్తంచేశారు. నా సోదరుడు అబిద్ కూడా సంతోషంగా ఉన్నాడు.’’

పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజరాత్ జిల్లాలో సోన్‌బడీ గ్రామానికి చెందిన ఇంటర్ రెండో ఏడాది విద్యార్థి వలీద్ అబిద్ మాటలివీ.

లింగ మార్పిడి ఆపరేషన్‌కు ముందు తన పేరు బుష్రా అబిద్.

తన తమ్ముడు మురాద్ అబిద్. తను తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. లింగ మార్పిడి ఆపరేషన్‌కు ముందు తన పేరు వాఫియా అబిద్.

వీరిద్దరూ పంజాబ్ ప్రావిన్స్‌లో ఓ జమీందారీ కుటుంబ సంతానం.

లింగ మార్పిడి

ఫొటో సోర్స్, SURGEON AMJAD CHOUDHRY

ఈ కథ చాలా భిన్నమైనది

వలీద్, మురాద్ తలిదండ్రులు 1993లో పెళ్లి చేసుకున్నారు. వారికి తొమ్మిది మంది అమ్మాయిలు జన్మించారు. ఇద్దరు లింగ మార్పిడి చేసుకోవడంతో.. ఇప్పుడు వారికి ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వలీద్ వారికి ఐదో సంతానం. మురాద్ ఆరో సంతానం.

ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన బాలల ఆసుపత్రిలో 12 మంది వైద్యుల బృందం వారికి లింగ మార్పిడి ఆపరేషన్ నిర్వహించింది. ఈ వైద్యుల బృందానికి డాక్టర్ అమ్జాద్ చౌధరి నేతృత్వం వహించారు.

‘‘నేను ఇంతకుముందు కూడా సెక్స్ ఛేంజ్ ఆపరేషన్లు చేశాను. కానీ ఈ కేసు చాలా భిన్నమైనది. వారిద్దరూ రెండేళ్ల నుంచీ వారు మా దగ్గర చికిత్స తీసుకుంటూ వచ్చారు’’అని అమ్జాద్ వివరించారు.

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలకు ఎప్పుడూ తాను ఆపరేషన్ నిర్వహించలేదని ఆయన తెలిపారు.

‘‘వీరికి విడివిడిగా ఆపరేషన్లు నిర్వహించారు. సెప్టెంబరు 20న మొదటగా వలీద్‌కు ఆపరేషన్ చేపట్టాం. ఇది ఇక్కడి ఐసీయూలోనే విజయవంతంగా జరిగింది. అనంతరం అక్టోబరు 10న మురాద్‌కు ఆపరేషన్ నిర్వహించాం’’.

ఈ ఆపరేషన్లు ఒక్కోటి నిర్వహించడానికి ఆరు గంటలకుపైనే సమయం పట్టిందని అమ్మాజద్ వివరించారు. అక్టోబరు 21న ఇద్దరు సోదరులనూ ఆసుపత్రి నుంచి ఇంటికి పంపించామని తెలిపారు.

లింగ మార్పిడి

ఫొటో సోర్స్, SURGEON AMJAD CHOUDHRY

అసలు అపరేషన్ ఎందుకు?

‘‘ఈ పిల్లల జననేంద్రియాలు పుట్టినప్పుడు సరిగా రూపుదిద్దుకోలేదు. దీన్ని ‘ఎటిపికల్ జెనిటెలియా’ వ్యాధిగా పిలుస్తారు. ఈ వ్యాధితో పుట్టేవారికి జననేంద్రియాలు అస్పష్టంగా ఉంటాయి’’అని అబోటాబాద్‌ ఆయుబ్ టీచింగ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ జునైద్ తెలిపారు.

‘‘ఈ వ్యాధి వల్ల పిల్లల్లో జననేంద్రియాల అభివృద్ధికి అవాంతరాలు ఏర్పడతాయి. పుట్టుకతోనే ఈ వ్యాధి సంక్రమిస్తుంది’’.

‘‘చాలా కొద్ది మందికే ఇలాంటి వ్యాధి వస్తుంది. కేవలం 0.5 నుంచి 0.7 శాతం మందికే ఇది వచ్చే అవకాశం ఉంటుంది’’అని అమ్జాద్ తెలిపారు.

‘‘తాజా కేసులో వీరిద్దరూ అమ్మాయిలే. కానీ వీరిలో అమ్మాయిల లక్షణాలు ఏమీ లేవు’’

‘‘తగిన వయసు వచ్చిన తర్వాత కూడా వీరిలో రుతుస్రావం మొదలుకాలేదు. దీంతో గుజరాత్‌లోని ఆసుపత్రికి వీరిని తీసుకొచ్చారు. అక్కడి నుంచి వీరు పీఐఎంఎస్ పిల్లల ఆసుపత్రికి వచ్చారు’’

‘‘ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన తర్వాత వీరిద్దరికీ ‘ఎటిపికల్ జెనిటెలియా’ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించాం. అప్పుడే లింగ మార్పిడి అవసరం అవుతుందని చెప్పాం. ఆపరేషన్ తర్వాత వారి జెండర్ సాధారణ స్థితికి వచ్చింది’’.

మహిళ

ఫొటో సోర్స్, iStock

కృత్రిమంగా హార్మోన్లు

‘‘ఆపరేషన్ ముందు, తర్వాత కూడా వారికి చికిత్స అందించాల్సి వచ్చిది. కొన్ని మానసిక చికిత్సలు, కౌన్సెలింగ్ కూడా ఇచ్చాం. ఆపరేషన్ తర్వాత కొన్ని రోజుల వరకు మందుల సాయంతో కృత్రిమంగా హార్మోన్లను ఉత్పత్తి చేయించాం’’అని అమ్జాద్ తెలిపారు.

ఇలాంటి ఆపరేషన్లు చాలా నిర్వహించామని అమ్జాద్ తెలిపారు. ఆపరేషన్ల తర్వాత చాలా మంది హాయిగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. అయితే, ఆపరేషన్‌పై నిర్ణయం తీసుకొనే బాధ్యత వారిపైనే వదిలేశామని అన్నారు.

‘‘తాజా కేసుల విషయంలో.. వారికి తగిన సమయం ఇచాం. అన్ని అంశాలను వారికి వివరించి చెప్పాం. మానసిక నిపుణులు కూడా వారితో మాట్లాడారు. పిల్లల జననేంద్రియాలు, ప్రవర్తనల్లో ఏదైనా తేడా ఉన్నట్లు తల్లిదండ్రులు గుర్తిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇలాంటి వ్యాధితో బాధపడేవారిని త్వరగా వైద్యుల దగ్గరకు తీసుకొస్తే.. చికిత్స అందించేందుకు వీలుపడుతుంది. ఆలస్యమైతే.. సమస్య మరింత తీవ్రం అవుతుంది’’ అని అమ్జాద్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)