యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది? - BBC Factcheck

నటరాజు విగ్రహం

ఫొటో సోర్స్, CDS.CERN.CH

    • రచయిత, విఘ్నేష్.ఎ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

స్విట్జర్లాండ్-ఫ్రాన్స్ సరిహద్దుల్లో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత సైన్స్ రీసెర్చ్ సంస్థల్లో ఒకటైన యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్(సీఈఆర్ఎన్) అత్యంత జటిలమైన యంత్రాలు ఉపయోగిస్తుంది.

ఈ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో.. ‘‘మన చుట్టూ ఉన్న ప్రతిదానినీ తయారు చేసే కణాల ప్రాథమిక నిర్మాణాన్ని మేం పరిశీలిస్తాం. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత క్లిష్టమైన సైన్స్ పరికరాలను మేం ఉపయోగిస్తుంటాం’’ అని ఉంది.

‘గాడ్ పార్టికల్’ అనే హిగ్స్ బోసన్ ఉనికిని కూడా కేవలం ఒక ఊహగా భావించారు. 2012లో లార్జ్ హైడ్రాన్ కొలైడర్ అనే ఒక పార్టికల్ ఎస్కలేటర్‌ను ఉపయోగించి ‘గాడ్ పార్టికల్’ ఉందని సీఈఆర్ఎన్ ధ్రువీకరించింది.

మానవ నాగరికత చరిత్రలో ఇంత ప్రాధాన్యం ఉన్న ఈ సంస్థ పరిసరాల్లో హిందూ దేవుడు శివుడి నటరాజ విగ్రహం ఉంది.

ఈ విగ్రహాన్ని 2004 జూన్ 18న సీఈఆర్ఎన్ పరిసరాల్లో ఏర్పాటుచేశారు. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, అప్పటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఆర్కూట్ స్థాపన కూడా అదే ఏడాది జరగడం యాదృచ్చికం.

ఇంటర్‌నెట్ వచ్చాక సోషల్ మీడియా కొన్ని కోట్ల మందిని చేరింది. దానితోపాటూ ఫేక్‌న్యూస్ కూడా వ్యాపించింది. ఇప్పుడు ఈ నటరాజ విగ్రహం గురించి కూడా ఎన్నో నకిలీ వార్తలు వ్యాపిస్తున్నాయి.

వైరల్ ఫొటో

ఫొటో సోర్స్, FACEBOOK

వైరల్ ఫొటో

ఫొటో సోర్స్, FACEBOOK

సీఈఆర్ఎస్ పరిసరాల్లో ఉన్న ఈ నటరాజ విగ్రహం గురించి ఎలాంటి నకిలీ వార్తలు వ్యాపిస్తున్నాయి అనేది మొదట చూద్దాం.

సోషల్ మీడియా యూజర్లు కొందరు ఈ నటరాజ విగ్రహం పరమాణు నిర్మాణాన్ని వర్ణిస్తుందని చెబుతున్నారు. అందుకే సీఈఆర్ఎన్ పరిసరాల్లో ఆ విగ్రహం పెట్టాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారని అంటున్నారు.

మరో ఫేక్‌న్యూస్‌లో “ఈ విగ్రహంలో నటరాజు ఆనంద తాండవ ముద్రలో నృత్యం చేస్తున్నారు. దీనిని విదేశీ శాస్త్రవేత్తలు ‘కాస్మిక్ డాన్స్’ అంటున్నారు. పరమాణులో ఉప పరమాణు గతికి ఈ ముద్ర సమానం అంటున్నారని" చెప్పారు.

“నటరాజు మొత్తం విశ్వానికి ప్రతీక. అది చాటిచెప్పడానికే సీఈఆర్ఎన్ శాస్త్రవేత్తలు ఈ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటుచేయాలనుకున్నారు” అని కూడా చెప్పారు.

హిందూ దేవీదేవతల విగ్రహాల గురించి ఇలాంటి వాదనలు, శాస్త్రీయంగా తప్పని నిరూపితమైన ఎన్నో కథలు సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో ఉన్నాయి.

సీఈఆర్ఎన్ పరిసరాల్లో నిజానికి ఈ విగ్రహాన్ని ఎందుకు పెట్టారనేది తెలుసుకునే ముందు దానికి సంబంధించిన ఆసక్తికరమైన వాస్తవాన్ని తెలుసుకుందాం.

శిల్పి రాజన్

ఫొటో సోర్స్, SIRPI RAJAN FACEBOOK

ఒక నాస్తికుడు రూపొందించాడు

ఈ నటరాజ విగ్రహాన్ని రూపొందించిన కళాకారుడు తమిళనాడుకు చెందిన ఒక నాస్తికుడు. శిర్పి(శిల్పి) పేరుతో పాపులర్ అయిన రాజన్ తమిళ సోషల్ మీడియా సర్కిల్లో పెరియార్ సిద్ధాంతాలను సమర్థించే యాక్టివ్ కార్యకర్తల్లో ఒకరు.

ఒకప్పుడు తమిళనాడులోని కుంభకోణంలో నివసించిన రాజన్ గత కొన్నేళ్లుగా ఆ వృత్తిలో లేరు.

అంధవిశ్వాసాలు, జాతి వ్యవస్థ, మత విశ్వాసాలు, జ్యోతిషం లాంటి వాటిని విమర్శిస్తూ ఉండే ఆయన వీడియోలు తరచూ తమిళనాడులోని రైట్ వింగ్ కార్యకర్తలకు లక్ష్యంగా మారుతుంటాయి.

1998లో భారత విదేశాంగ శాఖ తరఫున సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియం నుంచి ఈ విగ్రహం ఆర్డర్ వచ్చిందని ఆయన బీబీసీకి చెప్పారు.

“1980వ దశకం నుంచి నేను ఎక్కువగా దిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తుండేవాడిని. ప్రొఫెషల్ కారణాలతో నేను సెంట్రల్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియంతో టచ్‌లో ఉన్నాను. నాకు విగ్రహం చేయడానికి ఆర్డర్ అక్కడి నుంచే వచ్చింది” అని చెప్పారు.

“నా సిద్ధాంతాలకు, నా వృత్తికి మధ్య ఎప్పుడూ ఎలాంటి సంఘర్షణా రాలేద”ని శిల్పకళ వృత్తిలో దళితులను కూడా చేర్చిన రాజన్ అంటారు.

నటరాజు విగ్రహం

ఫొటో సోర్స్, CDS.CERN.CH

ఈ విగ్రహం పెట్టడం వెనుక కారణం

భారత్ బహుమతిగా ఇచ్చిన ఈ విగ్రహాన్ని సీఈఆర్ఎన్ 39, 40 నంబర్ భవనాల మధ్యలో శాశ్వతంగా ఏర్పాటు చేసింది.

సోషల్ మీడియా అడిగిన ఒక ప్రశ్నకు జవాబుగా సీఈఆర్ఎన్ వెబ్‌సైట్‌లో దాని గురించి ప్రస్తావించారు.

“సీఈఆర్ఎన్‌తో తన బంధానికి గుర్తుగా భారత్ ఇచ్చిన ఒక బహుమతే ఈ నటరాజ విగ్రహం. భారత్‌తో ఈ 1960వ దశకంలో మొదలైన ఆ బంధం ఇప్పటికీ అది దృఢంగా ఉంది” అని చెప్పారు.

యూరోపియన్ దేశం కాకపోయినప్పటికీ భారత్ దాదాపు ఆరు దశాబ్దాలుగా సీఈఆర్ఎన్ సభ్యుడుగా ఉంది. భారత ప్రభుత్వం ఈ విగ్రహాన్ని దౌత్య కారణాలతోనే సీఈఆర్ఎన్‌కు ఇచ్చింది. దీని వెనుక శాస్త్రీయ కారణాలేవీ లేవు.

సీఈఆర్ఎన్ తన సైట్‌లో “హిందూ మతంలో శివుడు చేసిన నటరాజ నృత్యం శక్తికి లేదా జీవశక్తికి ప్రతీకగా నిలిచింది. నటరాజు విశ్వ నృత్యం, ఉప-పరమాణు కణాల కాస్మిక్ డాన్స్ ఆధునిక అధ్యయనం మధ్య ఒక రూపంగా భారత్ ఆయన విగ్రహాన్ని ఎంచుకుంది” అని వివరించింది.

ఇది భారత ప్రభుత్వం ద్వారా తయారైన ఒక విగ్రహం. ఎలాంటి వాస్తవాలు లేదా తార్కిక సమర్థన, శాస్త్రీయ కారణాలు లేకుండానే ఎన్నో ఏళ్ల నుంచీ దీనిని అక్కడ ఉంచారు. సీఈఆర్ఎన్‌లో ఉన్న ఎన్నో కళాఖండాల్లో నటరాజ విగ్రహం కూడా ఒకటి అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)