ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం (1946-2020): నాలుగు దశాబ్దాల్ని అలరించిన సుమధుర గాత్రం

ఫొటో సోర్స్, G VENKET RAM
గాన గంధర్వుడిగా కోట్లాది మంది ప్రేమాభిమానాలు, ప్రశంసలు పొందిన విఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు.
చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారని కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు.
శుక్రవారం(సెప్టెంబరు 25) మధ్యాహ్నం 1.04 గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్లు ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రి తెలిపింది.

ఫొటో సోర్స్, Mgm healthcare
ఆ గాత్రం మధురం.. ఆ గానం అమరం
మధురమైన గాత్రం, సంగీతంపై విశేషమైన పట్టున్న గాయకుడిగా పేరు తెచ్చుకున్న బాలసుబ్రహ్మణ్యానికి మరో ప్రత్యేకతా ఉందని ఆయనతో పనిచేసినవారంతా చెబుతుంటారు.
తెరపై కనిపించే నటులే పాడుతున్నారా అనిపించేలా ఏ నటుడికి తగ్గట్లుగా ఆ నటుడికి గాత్రం మార్చి పాడడం బాలుకే సాధ్యమని సినీ, సంగీత రంగాలవారు చెబుతుంటారు.
దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ తన గాత్ర మాధుర్యంతో కోట్లాది ప్రజలను మైమరపించిన బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త తెలుసుకుని దేశవ్యాప్తంగా సినీ రంగంతో పాటు ఇతర రంగాలకు చెందినవారి నుంచి సంతాపాలు వెల్లువెత్తున్నాయి.
నటుడిగానూ ప్రత్యేకత
ఎస్పీ బాలు పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం. ఆయితే అందరికీ ఆయన బాలుగా సుపరిచితుడు.
పాటలు పాడటంతోపాటు కొన్ని సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం కూడా వహించారు. కొన్ని సినిమాల్లో నటించారు కూడా. నిర్మాతగానూ వ్యవహరించారు.
కొద్దికాలం కిందట విడుదలైన మిథునం ఆయనకు నటుడిగానూ మంచి గుర్తింపునిచ్చింది. అలాగే ‘ఓ పాపా లాలీ’ అనే చిత్రంలో ఆయన నటననూ ఇప్పటికీ స్మరించుకుంటారు. ఆ సినిమాలో బాలు స్వయంగా ఒక బ్రీత్ లెస్ సాంగ్ పాడారు. తెలుగులో బ్రీత్‌లెస్ సాంగ్స్‌కి ఆయనే ఆద్యుడని చెబుతారు.

ఫొటో సోర్స్, Facebook/spb
16కి పైగా భాషల్లో 40 వేలకు పైగా పాటలు
తెలుగు, తమిళంతోపాటు కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ప్రధానంగా ఆయన పాటలు వినిపిస్తాయి. మొత్తంగా చూస్తే 16కుపైగా భాషల్లో ఆయన పాటలు పాడారు. 40,000కుపైగా పాటలు పాడి ఆయన గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు.
నెల్లూరుకు సమీపంలోని కోనేటమ్మపేటలో బాలు జన్మించారు. తండ్రి ఎస్‌పీ సాంబమూర్తి.. హరికథలు చెప్పేవారు. బాలుకు ఇద్దరు సోదరులు, ఐదుగురు సోదరీమణులు.
ఆయన సావిత్రిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి వివాహం విశాఖ జిల్లాలోని సింహాచలం ఆలయంలో 1969లో జరిగింది.
బాలు సోదరి ఎస్‌పీ శైలజ కూడా గాయని. ఆమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించారు కూడా. నటుడు శుభలేఖ సుధాకర్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు.
బాలు సావిత్రిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు ఎస్‌పీబీ చరణ్, కుమార్తె పల్లవి ఉన్నారు.
చరణ్ కూడా గాయకుడే. ఆయన సినిమా నిర్మాతగానూ మారారు.

ఫొటో సోర్స్, Facebook/spb
బాల్యం నుంచే పాటలతో
బాల్యం నుంచే బాలుకు సంగీతంపై ఇష్టం ఏర్పడింది. హార్మోనియం, పిల్లనగ్రోవి వంటి వాద్యాలు వాయించేవారు. తండ్రి వాయిస్తున్నప్పుడు చూసి తను నేర్చుకునేవారు.
బాలును ఇంజినీర్ చేయాలని ఆయన తండ్రి కలలుగన్నారు. అనంతపురంలోని జేఎన్‌టీయూలో ఇంజినీరింగ్‌లో చేర్పించారు. అయితే టైఫాయిడ్ జ్వరంతో ఆయన మధ్యలోనే ఆపేశారు. తర్వాత చెన్నైలోని అసోసియేట్ మెంబర్ ఆఫ్ ద ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్‌లో చేరారు.
అయితే సంగీతాన్ని మాత్రం బాలు వదిలిపెట్టలేదు. కాలేజీ వార్షికోత్సవాల్లో ఆయన పాటలు పాడేవారు. కొంతమంది స్నేహితులు మద్రాస్‌కు వెళ్లి సినిమాల్లో పాడాలని ఆయనకు సూచించారు.
1964లో మద్రాస్ తెలుగు కల్చరల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన పోటీలో బాలు ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఇది ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్‌గా మారింది. దీని తర్వాత సంగీత దర్శకుడు ఎస్‌పీ కోదండపాణి ఆయనకు అవకాశం ఇచ్చారు. తరువాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల నుంచి ఆయనకు ఆఫర్లు వచ్చాయి.
సినిమాలో పాటలు పాడే ముందు బాలు.. మ్యూజిక్ బ్యాండ్‌కు లీడర్‌గా ఉండేవారు. ఈ బ్యాండ్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాతోపాటు ఆయన సోదరులు భాస్కర్, గంగై అమరన్ కూడా ఉన్నారు. ఈ ట్రూప్‌లో ఇళయరాజా గిటారిస్ట్‌గా పనిచేసేవారు.

ఫొటో సోర్స్, SP Charan
మర్యాద రామన్నతో తొలి పాట
శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న సినిమాతో గాయకుడిగా బాలు పరిచయం అయ్యారు. ఈ సినిమా 1966 డిసెంబరు 15న విడుదలైంది. అప్పటినుంచి వివిధ భాషల్లో 40,000కుపైగా పాటలు పాడారు.
ఆయన మొదట పాటను పూర్తిగా అర్థం చేసుకొని హావభావాలను పలికిస్తూ పాడుతుంటారు. ఇదే ఆయనకు చిన్న వయసులోనే గొప్ప పేరు తెచ్చిపెట్టింది.
ఒకసారి అయితే రికార్డింగ్ థియేటర్‌లో 12 గంటల్లోనే ఆయన 17 పాటలు పాడారు. సంస్కృతంలో బాలు వర్ణాలను చక్కగా పలుకుతారని పేరుంది.
ఒకప్పుడు చిరంజీవి, రజినీకాంత్ సినిమాల్లో తొలిపాట బాలూ పాడేవారు. కమల్‌హాసన్‌కు బాలూ స్వరమే చక్కగా సరిపోతుందని అందరూ అంటుంటారు. కొన్నిసార్లు అయితే మాట్లాడేది కమల్ హాసనో లేదా బాలునో ప్రజలు గుర్తుపట్టలేకపోయేవారు.

ఫొటో సోర్స్, facebook/spb
బుల్లి తెరపైనా..
30ఏళ్లకుపైగా తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో బాలు ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. అదే సమయంలో మలయాళంలో డాక్టర్ కేజే యేసుదాస్ హవా కొనసాగేది. మలయాళంలో బాలు కొన్ని పాటలే పాడారు.
తమిళంలో విషాద గీతాలకు యేసుదాస్ స్వరం సరిగ్గా సరిపోతుందని అందరూ భావించేవారు. అయితే నెంజుకుల్లే, నానుంమ్ ఉంథెన్ ఊరవాయ్ లాంటి హిట్ పాటలను బాలు పాడారు.
బుల్లితెరపైనా బాలూ మెరుపులు మెరిపించారు. ఈ-టీవీలోని పాడుతా తీయగా, మాటీవీలోని పాడాలని ఉంది షోలకు ఆయన జడ్జిగా వ్యవహరించారు. మరోవైపు కన్నడ టీవీ షో ఎదె థుంబి హాదీవేను, తమిళంలో ఎన్నోపాటు పాడుంగల్ షోలనూ ఆయన నడిపించారు.
రజినీకాంత్, కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, గిరీశ్ కర్నాడ్, జెమినీ గణేశన్, కార్తీక్, రఘువరన్ వంటి నటులకు బాలు డబ్బింగ్ కూడా చెప్పారు. తమిళం నుంచి డబ్ అయ్యే కమల్ హాసన్ సినిమాలకు ఎక్కువగా డబ్బింగ్ చెప్పింది బాలూనే.

ఫొటో సోర్స్, Facebook/spb
ఆరు నేషనల్ ఫిల్మ్ అవార్డులు.. 25 నంది పురస్కారాలు
40ఏళ్లలో బాలు 40,000 పాటలు పాడారు. వీటిలో సినిమా పాటలతోపాటు భక్తి గీతాలూ ఉన్నాయి. ఏ గాయకుడూ ఇన్ని పాటలు పాడలేదు. దీంతో గిన్నిస్ రికార్డుల్లో ఆయనకు చోటు దక్కింది.
1981 ఫిబ్రవరి 8న కన్నడ సంగీత దర్శకుడు ఉపేంద్ర కుమార్ కోసం ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకూ 21 కన్నడ పాటలు పాడి బాలు రికార్డు నెలకొల్పారు.
ప్లేబ్యాక్ సింగర్‌గా ఆయనకు ఆరు నేషనల్ ఫిల్మ్ అవార్డులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 నంది అవార్డులను అందుకున్నారు.
2001లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మ శ్రీతో సత్కరించింది. 2011లో ఆయనకు పద్మ విభూషణ్ కూడా దక్కింది.
తమిళంలో ఒకే రోజు 19 పాటలు, హిందీలో ఒకే రోజు 16 పాటలు బాలు పాడారు.
సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
బాలు మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు.
‘‘సాధారణ ప్రజల నుంచి సంగీత ప్రియుల వరకూ అందరిలోనూ ఐదు దశాబ్దాల పాటు బాల సుబ్రహ్మణ్యం తన గాత్రంతో నూతనోత్తేజం నింపారు. ఆయన చాలా రంగాల్లో నైపుణ్యం సాధించారు. ఆయన లోటు తీరనిది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు.''ఎన్నో సుమధుర గేయాలు ఆలపించిన బాలుకి.. భారతీయ ప్రజలందరూ అభిమానులు అయ్యారు. ఆయన ప్రాణాలు కాపాడడానికి డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం దురదృష్టకరం. ఆయన లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది. గాయకుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయన సినీ లోకానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఆయన లేని లోటు తీర్చలేనిది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘దిగ్గజ సంగీత కళాకారుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి మరణ వార్త విని విస్మయం చెందాను. సంగీత ప్రపంచానికి ఆయన లేని లోటు తీర్చలేనిది’’ అని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
‘‘దిగ్గజ సంగీత కళాకారుడు, గాయకుడు, పద్మభూషన్ ఎస్పీ బాలు మరణవార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. శ్రావ్యమైన ఆయన గాత్రం, పాటలను మేం ఎప్పటికీ మరచిపోం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’’ అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంతాపం వెలిబుచ్చారు.
ఇవి కూడా చదవండి:
- బాల గంగాధర్ తిలక్: కుల వివక్షను, స్త్రీల అణిచివేతను బలంగా సమర్థించారా?
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- చైనా - భారత్ సరిహద్దు సంఘర్షణ: 21వ శతాబ్దపు అతిపెద్ద జగడం ఇదేనా?
- భారత్, చైనాల సంబంధాల్లో మార్పులు రాబోతున్నాయా? మోదీ, జిన్‌పింగ్ భేటీ సాధ్యమేనా?
- ‘నీకు జీవితంలో తోడు దొరకదని శకుంతల దేవి చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- అయోధ్యలో రామమందిరం కింద టైమ్ కాప్స్యూల్?.. అందులో దాగిన రహస్యమేంటి
- బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పీవీ నరసింహారావు ఎందుకు ఆపలేదు?
- ‘తిలక్ ఇంకొన్నాళ్లు బతికుంటే భారత్-పాకిస్తాన్‌లు విడిపోయేవి కాదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








