బిహార్ - అరారియా అత్యాచార కేసు: బాధితులే ముద్దాయిల్లా బోనులో ఎందుకు నిల్చోవాల్సి వస్తోంది?

ఫొటో సోర్స్, DIBYANGSHU SARKAR
- రచయిత, విభురాజ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
దాదాపు యాభై ఏళ్ల క్రితం మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఓ పోలీసు స్టేషన్‌లో మథుర అనే ఆదివాసీ యువతిపై అత్యాచారం జరిగింది.
మథురకు ‘సెక్స్ అలవాటు’ ఉండటం, ఆమె శరీరంపై గాయాల గుర్తులేవీ లేకపోవడాన్ని ఆధారాలుగా చూపిస్తూ నిందితులను ఆ కేసులో కోర్టు వదిలేసింది.
చంద్రపూర్‌కు దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరమున్న బిహార్‌లోని అరారియా పట్టణంలో ఇటీవల ఓ కోర్టులో ఓ సామూహిక అత్యాచార కేసులో బాధితురాలు మెజిస్ట్రేట్‌కు తన వాంగ్మూలం ఇచ్చారు. అయితే, ఆమెను ఆ కోర్టు జుడీషియల్ కస్టడీలోకి పంపింది.
మథుర కేసులో బాధితురాలు అత్యాచారానికి వ్యతిరేకంగా అరవలేదని అప్పుడు కోర్టు పేర్కొంది.
అరారియా కేసులో బాధితురాలిపై జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు తరఫునే ఫిర్యాదు నమోదైంది.
‘‘అత్యాచార బాధితురాలు సీఆర్‌పీసీ సెక్షన్ 164 ప్రకారం ఇచ్చిన వాంగ్మూలంపై సంతకం చేయడానికి నిరాకరించారు. కోర్టు కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు’’ అని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మథుర కేసుకు, అరారియా కేసుకు చాలా వ్యత్యాసం ఉండొచ్చు.
కానీ, 50 ఏళ్ల కాలంలో దేశం, దేశంలోని పరిస్థితులు, చట్టాలు మారినా, అత్యాచార బాధితులే ముద్దాయిల్లా బోనులో నిల్చోవాల్సి వస్తోంది.
అరారియా కేసులో అత్యాచార బాధితురాలితోపాటు, ఆమెకు తోడుగా వచ్చిన ఇద్దరు సామాజిక కార్యకర్తలను కూడా జైలుకు పంపారు.
సామూహిక అత్యాచార కేసులో బాధితురాలుగా ఉన్న యువతి జైలుకు వెళ్లాల్సి వస్తుందా? కానీ, అరారియాలో అలా వెళ్లాల్సి వచ్చింది.
ఈ ఘటన జులై 10న జరిగింది. తనపై జరిగిన సామూహిక అత్యాచారం గురించి సదరు బాధితురాలు అరారియాలోని మహిళల పోలీస్ స్టేషన్‌లో జులై 7న ఫిర్యాదు చేశారు. అంతకుముందు రోజు తనపై అత్యాచారం జరిగినట్లు అందులో పేర్కొన్నారు.
జులై 7, 8 తేదీల్లో బాధితురాలికి వైద్య పరీక్షలు జరిగాయి. జులై 10న తన వాంగ్మూలం ఇచ్చేందుకు ఆమె జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లారు.
కోర్టులో జడ్డి చదివి వినిపించిన వాంగ్మూలం బాధితురాలికి అర్థం కాలేదు. తనకు తోడుగా వచ్చిన కల్యాణీ బడోలా అనే మహిళకు ఆ వాంగ్మూలాన్ని వినిపించాలని బాధితురాలు కోరారు. కల్యాణీ కూడా అదే అభ్యర్థన చేశారు.
కల్యాణీ ఓ సామాజిక కార్యకర్త. జన్ జాగరన్ శక్తి సంగఠన్ అనే సంస్థలో ఆమె సభ్యురాలు. తన్మయ్ నివేదిత అనే మరో సామాజిక కార్యకర్తతో కలిసి ఆమె బాధితురాలికి తోడుగా కోర్టుకు వచ్చారు.
అయితే, వాంగ్మూలాన్ని చదివి వినిపించాలని వారు అభ్యర్థన చేసిన తర్వాత కోర్టులో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
దాదాపు సాయంత్రం 5 గంటలకు బాధితురాలిని, కల్యాణీ, తన్మయ్‌ల ను అదుపులోకి తీసుకున్నారు. జులై 11న జైలుకు పంపారు.
జులై 17న బాధిరాలిని బెయిల్‌పై విడుదల చేశారు. తన్మయ్, కల్యాణీ ఇప్పటికీ కస్టడీలోనే ఉన్నారు.

బాధితురాలిపైనే ఎఫ్ఐఆర్
అరారియా కోర్టులో బాధితురాలిపై, ఆమె వెంట వచ్చిన ఇద్దరిపై ఐపీసీ సెక్షన్లు 353, 228, 188, 180, 120 (బీ)ల ప్రకారం కేసు నమోదైంది.
ప్రభుత్వ ఉద్యోగుల పనులకు ఆటంకం కలిగించాలన్న ఉద్దేశంతో బలప్రయోగం చేయడం, దాడి చేయడం వంటి చర్యలకు సెక్షన్ 353 వర్తిస్తుంది. నేరం రుజువైతే గరిష్ఠంగా రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు.
న్యాయ కార్యకలాపాల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను కావాలని అవమానించడం, వారి పనులకు ఆటంకం కలిగించడం వంటి వాటికి సెక్షన్ 228 వర్తిస్తుంది. నేరం రుజువైతే గరిష్ఠంగా ఆరు నెలల వరకూ శిక్ష పడుతుంది.
ప్రభుత్వ ఉద్యోగుల ఆదేశాలను పాటించేందుకు నిరాకరించినవారికి సెక్షన్ 188 వర్తిస్తుంది. ఈ నేరానికి గరిష్ఠంగా ఒక నెల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించే అవకాశాలున్నాయి.
వాంగ్మూలంపై సంతకం చేసేందుకు నిరాకరించిన సందర్భంలో సెక్షన్ 180 వర్తిస్తుంది. నేరం రుజువైతే గరిష్ఠంగా మూడు నెలల జైలు శిక్ష వేయొచ్చు.
నేరపూరిత కుట్రలకు సెక్షన్ 120(బీ) వర్తిస్తుంది. మరణశిక్ష, జీవితఖైదు శిక్ష వర్తించే నేరాలకు కుట్ర పన్నిన సందర్భంలో, ఒక వేళ క్రిమినల్ నేరం కాకపోతే 120 (బీ) ప్రకారం రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఏళ్లు శిక్ష పడుతుంది. ఇతర నేరాలకు సంబంధించిన కుట్రలకు ఆరు నెలల వరకూ శిక్ష విధించవచ్చు.

ఫొటో సోర్స్, ANDRÉ VALENTE/BBC
సీజేఎం కోర్టు ఏం చెప్పిందంటే...
ఈ కేసు ఇప్పటివరకూ అరారియాలోని రెండు కోర్టులకు వెళ్లింది.
అత్యాచార బాధితురాలిని, ఆమె వెంట వచ్చిన ఇద్దరినీ జుడీషియల్ కస్టడీలోకి తీసుకున్న వారం తర్వాత జులై 17న అరారియా చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ (సీజేఎం) కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
‘‘అత్యాచారం, క్రూరమైన లైంగిక దాడి కేసులో ఆమె బాధితురాలిగా ఉంది. శారీరకంగా, మానసికంగా ఆమె పడుతున్న ఇబ్బందిని విస్మరించలేం’’ అని వ్యాఖ్యానించింది.
‘‘అత్యాచార బాధితుల బాధను, ఇబ్బందిని అర్థం చేసుకుంటూ ఉదార వైఖరి చూపాల్సిన అవసరం ఉంది. బాధితురాలి పట్ల ఈ కోర్టు సానుభూతితో ఉంది. ఆమెను జైలులో పెట్టడం సరికాదని, అలా చేయడం ఆమెకు మరింత బాధపెట్టినట్లు అవుతుందని భావిస్తోంది’’ అని వ్యాఖ్యానించింది.
సీజేఎం ఇచ్చిన ఆదేశం ఓ ప్రశ్నకు తావిస్తోంది.
ఇదివరకు జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి మహమ్మద్ ముస్తఫా శాహీ బాధితురాలి పట్ల సానుభూతి చూపలేదా?
అత్యాచార బాధితురాలు శారీరకంగా, మానసికంగా అనుభవిస్తున్న బాధను విస్మరించారా?
అరారియా సీజేఎం కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ, సుప్రీం కోర్టు మార్గదర్శకాలను కూడా ప్రస్తావించింది.
‘‘అత్యాచార బాధితుల పట్ల సానుభూతి, సహానుభూతితో వ్యవహరించాలి. వారు మానసిక దిగ్భ్రాంతితో ఉండి ఉంటారు. కౌన్సిలింగ్, న్యాయపరమైన సాయం, వైద్యం... సామాజికంగా, ఆర్థికంగా సహకారం వారికి అవసరమవుతుంది’’ అని సుప్రీం కోర్టు ఇదివరకు సూచించింది.

ఫొటో సోర్స్, Getty Images
అరారియా అత్యాచారం కేసులో బాధితురాలు... కల్యాణీ, తన్మయ్‌ల ఇళ్లలో పనిచేస్తుంటారు.
బాధితురాలితో సాన్నిహిత్యం ఉండటంతోనే ఆమె వెంట వాళ్లు కోర్టుకు వెళ్లారని వారి గురించి తెలిసినవారు చెప్పారు.
వారిపై దాఖలైన ఎఫ్ఐఆర్‌కు, బెయిల్ ఆదేశంలో పేర్కొన్న కారణాలకు వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని న్యాయ వ్యవహారాల నిపుణుడైన పాత్రికేయుడు, రచయిత మనోజ్ మిట్టా అంటున్నారు.
‘‘అత్యాచార బాధితురాలి మానసిక పరిస్థితిని అర్థం చేసుకుంటూ బెయిల్ మంజూరు చేశారు. మరోవైపు ఇదే మానసిక స్థితి కోర్టులో ఆమె ప్రవర్తనకు కారణమవుతుంది. దీంతో ఎఫ్ఐఆర్‌కు ఆధారమే లేకుండా పోయినట్లైంది. కోర్టులో తన వెంట వచ్చినవారితో కలిసి బాధితురాలు గందరగోళ వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు’’ అని ఆయన అన్నారు.
‘‘సెక్షన్ 164 ప్రకారం ఇచ్చే వాంగ్మూలం అత్యాచార బాధితురాలి పక్షంలో ఉంటుంది. న్యాయ ప్రక్రియను అడ్డుకునేందుకు, తద్వారా పోలీసు విచారణలో జోక్యం చేసుకునేందుకు నిందితులు ప్రయత్నించారన్న ఆరోపణలను బలపరిచే ఆధారాలు ఇవ్వడంలో ఎఫ్‌ఐఆర్ విఫలమైంది’’అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
చట్టపరమైన ప్రక్రియ ఏంటి?
సీఆర్‌పీసీ సెక్షన్ 164 ప్రకారం ఇచ్చే వాంగ్మూలాల్లో రెండు రకాలు ఉంటాయి.
మొదటి కేటగిరీ నిందితులు నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చే వాంగ్మూలం. నిందితులకు న్యాయవాదిని పెట్టుకునేందుకు అనుమతిస్తారు.
నిందితులు కానివారు ఇచ్చే వాంగ్మూలాలు మరో రకం. ఇలాంటి వాంగ్మూలం ఇచ్చివారు దానిపై తప్పకుండా సంతకం చేయాలని చెప్పే నిబంధనలేవీ లేవు.
సీఆర్‌పీసీ సెక్షన్ 278 ప్రకారం ఒకవేళ వాంగ్మూలం ఇచ్చినవారికి అందులో పేర్కొన్న విషయాల్లో దేనిపైనైనా అభ్యంతరాలు ఉంటే, న్యాయమూర్తి విడిగా దానికి తన వ్యాఖ్యలు జోడించవచ్చు.
అసంపూర్తిగా ఉన్న వాంగ్మూలంతోపాటుగా జడ్జి ఓ మెమోను కేసు ఫైల్‌లో జత చేస్తారు. ఆ తర్వాత సెక్షన్ 180 ప్రకారం వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి సమక్షంలో తన వ్యాఖ్యలు రికార్డు చేయొచ్చు.
దిల్లీ సామూహిక అత్యాచార ఘటన తర్వాత జేఎస్ వర్మ కమిటీ నివేదిక సూచనలతో సెక్షన్ 164లో 5ఏ సబ్‌సెక్షన్‌ను జోడించారు. దీని ద్వారా లైంగిక హింస బాధితుల కోసం ప్రత్యేకమైన సౌలభ్యాన్ని కల్పించారు.
బాధితులు శారీరకంగా లేదా మానసికంగా ఇబ్బంది పడుతున్నారని జడ్డి భావిస్తే, వారికి ఓ సహాయక వ్యక్తిని నియమించే అవకాశం ఉంది.
అరారియా జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు 164 (5ఏ)ను విస్మరించిందని నిపుణులు అంటున్నారు.
ఈ కేసులో జడ్జి చెబుతున్న విషయాలు తనకు అర్థం కావడం లేదని బాధితురాలు అంటూనే ఉన్నారు. తన వెంట వచ్చిన కల్యాణీని పిలిపించాలని కోరుతూ ఉన్నారు.
బాధితురాలి మానసిక పరిస్థితి బాగోలేదని అరారియా సీజీఎం కోర్టు అంగీకరించింది కూడా.

ఫొటో సోర్స్, AFP
‘బాధను అర్థం చేసుకోనక్కర్లేదా?’
అరారియా కేసులో అత్యాచార బాధితురాలితోపాటు ఆమె వెంట వచ్చిన ఇద్దరు సామాజిక కార్యకర్తలను జైలుకు పంపారు.
భారత్‌లో లైంగిక హింస బాధితులు ఫిర్యాదులు చేయడానికి ముందుకు రావడమే తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తరహా ఘటనలు పునరావృతమైతే, బాధితులను అవి మరింత నిరుత్సాహపరుస్తాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
‘‘మన సమాజంలో బయటకు వచ్చి మాట్లాడటానికి మహిళలను అనుమతించడమే తక్కువ. ముఖ్యంగా లైంగిక హింస కేసుల్లో ఇది ఇంకా తక్కువ. మన వ్యవస్థ ఎప్పుడూ మహిళల గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. మథుర అత్యాచార కేసు నుంచి ఇప్పటివరకూ పరిస్థితి ఏమీ మారలేదు’’ అని మహిళల హక్కుల కోసం పనిచేస్తున్న సామాజిక కార్యకర్త ఖదీజా ఫారూఖీ అన్నారు.
‘‘బాధితులకు అనుకూలమైన వాతావరణం కల్పించాలి. వారికి న్యాయం జరిగే పరిస్థితి రావాలి. అరారియాలో జరిగింది చూస్తే, మన వ్యవస్థ ఇంకా ముందుకు సాగలేదని అనిపిస్తోంది. మహిళలను చదువుకోనివ్వరు. వేరే మనుషులతో కలవనివ్వరు. ఒక్కసారిగా వెళ్లి, మెజిస్ట్రేట్‌తో మాట్లాడమని అంటే ఎలా? తనపై జరిగిన అత్యాచారం గురించి పురుషుడితో ఆమె ఎలా చెప్పుకోవాలి. ఇది ఆమెకు ఎంత కష్టమైన పని. ఆమె బాధను అర్థం చేసుకోనక్కర్లేదా?’’ అని ఆమె ప్రశ్నించారు.
భారత్‌లో ఏటా వేల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రతి ఏడాదీ ఈ సంఖ్య పెరుగుతూ పోతోంది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సమాచారం ప్రకారం.. 2018లో 33,977 అత్యాచారాలు జరిగాయి. అంటే సగటున ప్రతి 15 నిమిషాలకు దేశంలో ఒక అత్యాచారం జరుగుతోంది.
అయితే, నిజానికి అత్యాచారాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని, వీటిలో చాలా కేసులు పోలీసుల వరకు రావట్లేదని మహిళా హక్కుల ఉద్యమకారులు చెబుతున్నారు.
న్యాయం కోసం ఏళ్లకు ఏళ్లు బాధితులు పోరాటం చేయాల్సి వస్తోందని... ఈ క్రమంలో నిందితుల నుంచి వేధింపులు, బెదిరింపులకు గురవ్వాల్సి వస్తోందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 సామాజిక వ్యాప్తిని భారతదేశం ఎందుకు ఒప్పుకోలేకపోతోంది?
- సిరాజుద్దౌలా: ఈయనను దారుణంగా చంపాకే భారతదేశంలో బ్రిటీష్‌వాళ్లకు ఎదురు లేకుండా పోయింది
- కరోనావైరస్ను ఎదుర్కొనేందుకు కొందరిలో 'రహస్య' రోగ నిరోధక కణాలున్నాయా?
- ఉత్తర కొరియాలో మొదటి కరోనావైరస్ అనుమానిత కేసు.. అప్రమత్తమైన కిమ్ జోంగ్-ఉన్
- టీవీ రిపోర్టర్ మెడపై క్యాన్సర్ కణితిని గుర్తించి అప్రమత్తం చేసిన ప్రేక్షకురాలు
- ప్రజాస్వామ్యం బలహీనపడుతోందా? ప్రభుత్వం ముందు భారత మీడియా మోకరిల్లుతోందా?
- వీడియో గేమింగ్‌లో విపరీతంగా పెరుగుతున్న మహిళల సంఖ్య
- కిమ్ జోంగ్ ఉన్: ప్రపంచ రాజకీయాల్లో ఈ పేరంటే ఎందుకంత సంచలనం?
- కరోనావైరస్ - ఉత్తర కొరియా: 'వెలిగిపోయే విజయం మాది' అంటున్న కిమ్ జోంగ్ ఉన్
- కిమ్ జోంగ్ ఉన్ తరువాత ఉత్తర కొరియాను పాలించేదెవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









