బిహార్: ‘సామూహిక అత్యాచార బాధితురాలిని జైలుకు పంపిన కోర్టు’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సీటూ తివారీ
- హోదా, బీబీసీ కోసం
బిహార్‌లోని అరారియాలో ఓ సామూహిక అత్యాచార బాధితురాలిని కోర్టు జైలుకు పంపింది.
సదరు బాధితురాలు, ఆమెకు తోడుగా వచ్చిన మరో ఇద్దరిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. ఆ ముగ్గురినీ పోలీసులు సమస్తీపుర్‌లోని దల్‌సింహసరాయ్ జైలుకు తరలించారు.
తనపై జరిగిన సామూహిక అత్యాచారం గురించి సదరు బాధితురాలు అరారియాలోని మహిళ పోలీస్ స్టేషన్‌లో జులై 7న ఫిర్యాదు చేశారు. అంతకుముందు రోజు తనపై అత్యాచారం జరిగినట్లు అందులో పేర్కొన్నారు.
మోటార్ సైకిల్ నడపడం నేర్పిస్తానంటూ ఆ బాధితురాలికి పరిచయమున్న ఓ యువకుడు ఆమెను బయటకు తీసుకువెళ్లినట్లు ఎఫ్ఐఆర్‌లో ఉంది.
ఆ తర్వాత నిర్మానుష్య ప్రాంతంలోకి ఆమెను తీసుకువెళ్లాడని, అక్కడ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారని ఎఫ్ఐఆర్ పేర్కొంది.
తనకు పరిచయమున్న ఆ యువకుడిని సహాయం కోరినా, అతడు అక్కడి నుంచి పారిపోయినట్లు బాధితురాలు తెలిపారని అందులో ఉంది.
అరారియాలోని జన్ జాగరణ్ శక్తి సంగఠన్ (జేజేఎస్ఎస్) సభ్యుల సాయంతో బాధితురాలు ఇల్లు చేరుకున్నారు.
ఇంట్లో పరిస్థితులు అసౌకర్యంగా ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయి, జేజేఎస్ఎస్ సభ్యులతోపాటు ఉన్నారు.
జులై 7, 8 తేదీల్లో బాధితురాలికి వైద్య పరీక్షలు జరిగాయి. జులై 10న తన వాంగ్మూలం ఇచ్చేందుకు ఆమె జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లారు.

అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు
జేజేఎస్ఎస్ విడుదల చేసిన పత్రిక ప్రకటన ప్రకారం బాధితురాలు, జేజేఎస్‌ఎస్ కార్యకర్తలతో కలిసి జులై 10 మధ్నాహ్నం ఒంటి గంటకు కోర్టు చేరుకున్నారు. అక్కడే కారిడార్‌లో వేచి చూస్తున్నారు. ఆ సమయంలో కేసులోని ఓ నిందితుడు కూడా అక్కడ ఉన్నారు. దాదాపు నాలుగు గంటలు వేచిచూసిన అనంతరం బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు.
‘‘వాంగ్మూలం తీసుకున్న తర్వాత జుడీషియల్ మెజిస్ట్రేట్ దానిపై సంతకం చేయాలని బాధితురాలికి సూచించారు. ఆమె కాస్త ఉద్విగ్నతకు గురయ్యారు. తనకేమీ అర్థం కావడం లేదని అన్నారు. మీరేం చదువుతున్నారో తెలియదు, కల్యాణీ అక్కను పిలవండి అని అన్నారు’’ అని ఆ ప్రకటనలో జేజేఎస్ఎస్ పేర్కొంది.
కల్యాణి తన్మయ్ నివేదిత జేజేఎస్ఎస్‌లో సభ్యులు.
‘‘ఆ తర్వాత కేసు విచారణాధికారిని పిలిపించారు. అప్పుడు బాధితురాలు వాంగ్మూలంపై సంతకం చేశారు. బయటకు వచ్చి... ‘నాకు అవసరమైనప్పుడు, మీరు ఎక్కడికి వెళ్లారు?’ అంటూ కల్యాణీ, నివేదితలతో బాధితురాలు గట్టిగా అన్నారు’’ అని జేజేఎస్ఎస్ ప్రకటనలో పేర్కొంది.
‘‘బయట అరుపుల మధ్య జుడీషియల్ మెజిస్ట్రేట్ కల్యాణిని లోపలికి పిలిపించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని చదివి వినిపించాలని కల్యాణీ కోరారు. ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. సాయంత్రం 5 గంటలకు కల్యాణీ, తన్మయ్‌లతోపాటు బాధితురాలిని అదుపులోకి తీసుకున్నారు. జులై 11న జైలుకు పంపారు’’ అని ఆ ప్రకటనలో ఉంది.
స్థానిక పత్రిక దైనిక్ భాస్కర్ కథనం ప్రకారం కోర్టు ప్రజెంటర్ రాజీవ్ రంజన్ సిన్హా అత్యాచార బాధితురాలితో సహా ముగ్గురిపై మహిళలపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సొంత వాంగ్మూలంపైనే బాధితురాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ఎఫ్ఐఆర్‌లో నమోదైంది.
‘‘కోర్టులో వాంగ్మూలం కాపీని లాక్కునే ప్రయత్నం చేశారు. కోర్టులో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆ ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జుడీషియల్ మెజిస్ట్రేట్ ఆదేశించారు’’ అని ఆ పత్రిక రాసింది.
ఆ కేసు ఎఫ్ఐఆర్ కాపీ బీబీసీ చేతికి కూడా వచ్చింది.
ఈ విషయమై పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ నారాయణ్ యాదవ్‌తో బీబీసీ మాట్లాడింది.
‘‘నాకు ఈ విషయం గురించి ఏమీ తెలియదు. లాక్‌డౌన్ వల్ల మేం కోర్టుకు వెళ్లలేకపోతున్నాం’’ అని ఆయన అన్నారు.
అరారియా ఎస్‌డీపీఓ పుష్కర్ కుమార్‌ను బీబీసీ సంప్రదించినప్పుడు... ‘వారిని జైలుకు పంపలేదు’ అని ఆయన సమాధానం ఇచ్చారు.
ఆ తర్వాత ఫోన్‌లో తనకేమీ వినిపించడం లేదంటూ కాల్ కట్ చేశారు. అనంతరం ఫోన్ ఎత్తడం ఆపేశారు.
సంబంధిత అధికారులను బీబీసీ ఇ-మెయిల్ ద్వారా కూడా సంప్రదించింది. ఈ కథనం రాసే సమయానికి వారి నుంచి స్పందన రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
విడుదల చేయాలని మహిళా సంఘాల డిమాండ్లు
అత్యాచార బాధితురాలు, జేజేఎస్ఎస్ కార్యకర్తల అరెస్టు విషయం బయటకు వచ్చాక, వారిని విడుదల చేయాలంటూ బిహార్‌లోని మహళా సంఘాలు డిమాండ్ చేశాయి.
‘‘ఇది అమానవీయ నిర్ణయం. బాధితురాలు తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నారు. తనకు జరిగిన విషయాన్ని ఆమె ఎన్నో సార్లు వివరించాల్సి వచ్చింది. ఆమె వివరాలు బయటకు వచ్చాయి. ఒక నిందితుడు, అతడి కుటుంబం పెళ్లి ప్రస్తావన తెచ్చి, కేసు లేకుండా చేయాలని ప్రయత్నించారు. బాధితురాలు అందుకు అంగీకరించలేదు. ఆమెకు 22 ఏళ్లు. మేజర్. కేసులో గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నారు.
కానీ, ఆమెను ‘లీగల్ గార్డియన్’ గురించి ప్రశ్నిస్తూ వచ్చారు. కనీసం అక్కడ కౌన్సిలింగ్ సదుపాయం కూడా లేదు. మాకు న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంది. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం’’ అని ఎడ్వా రాష్ట్ర అధ్యక్షురాలు రామ్‌పరీ అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారత్‌లో అత్యాచార చట్టాల్లో 80వ దశకంలో పెద్ద మార్పులు వచ్చాయి. కేసుల్లో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యతను పురుషులపై పెట్టారు. 2013లో క్రిమినల్ లా అమెండ్‌మెంట్ యాక్ట్ తర్వాత మహిళలను కేంద్రంగా చేసుకుని చట్టం వచ్చింది.
‘‘కొత్త చట్టం ప్రకారం సెక్సువల్ హిస్టరీ గురించి చర్చించకూడదు. బాధితురాలి గోప్యతకు ప్రాధాన్యత కల్పించారు. వాంగ్మూలం ఇచ్చే సమయంలో ‘విశ్వసనీయ వ్యక్తి’ని వెంట తీసుకుని వెళ్లవచ్చు. వాంగ్మూలం కాపీని కూడా బాధితురాలికి ఇవ్వాల్సి ఉంటుంది. వీలుంటే మహిళా జడ్జి సమక్షంలో వాంగ్మూలం తీసుకోవాలి. ఇన్ని ఉన్నా, అత్యాచార బాధితులు సామాజికంగా, కుటుంబపరంగా, న్యాయవ్యవస్థ స్థాయిలో అమానవీయ అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తోంది’’ అని మానవహక్కుల కార్యకర్త ఖదీజా ఫరూఖీ అన్నారు.
గమనిక: జన్ జాగరన్ శక్తి సంగఠన్ ప్రకటనలో నిజానిజాలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించుకులేకపోయింది. ఈ కథనం ప్రచురించే సమయానికి అధికార వర్గాల నుంచి ఎలాంటి వివరణా రాలేదు.
ఇవి కూడా చదవండి:
- 'ప్రేమించి గర్భవతి అయిన కూతురిని తల్లిదండ్రులే చంపేశారు'
- చైనా - భారత్ మధ్య 45 ఏళ్లుగా లేనంత గొడవలు ఇప్పుడెందుకు?
- ఆల్ఫ్స్ పర్వతాలపై భారతీయ పత్రికలు, 1966 విమాన ప్రమాదం నాటివేనా
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- కరోనావైరస్: ఇండియా గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారిపోతుందా?
- భారత్ - చైనా 1962 యుద్ధం: పిరికిపందల చర్యా లేక నమ్మకద్రోహమా?
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- డెక్సామెథాసోన్: కరోనా 'లైఫ్ సేవింగ్' మెడిసిన్‌కు, భారత్‌కు ఉన్న బంధం ఏంటి?
- అమెరికా ఆధిపత్యం పోతుందా? చైనా సూపర్ పవర్ అవుతుందా? కరోనావైరస్తో తెర వెనుక జరుగుతున్న యుద్ధాలేమిటి?
- ‘నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా.. లాక్‌డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది’
- ‘ఉద్యోగం పోయింది.. అందుకే నా సెక్సీ ఫోటోలు అమ్ముకుంటున్నా’
- హైదరాబాద్ నుంచి ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు
- చైనా, ఇరాన్‌ల సీక్రెట్ డీల్: భారత్‌కు ఎంత నష్టం
- భారత్‌పై గూగుల్‌కు అంత ప్రేమ ఎందుకు
- భారతీయ భార్య - చైనా భర్త.. వారిద్దరికీ ఓ కూతురు... వారి జీవితం ఇప్పుడెలా మారింది?
- విటమిన్-డి తీసుకుంటే వైరస్ రాకుండా కాపాడుతుందా
- 2 వేల సంవత్సరాల పురాతన అస్థిపంజరం.. మర్డర్ మిస్టరీలా ఉందంటున్న శాస్త్రవేత్తలు
- లాక్డౌన్లో పెరిగిన గృహ హింస: ‘‘నా భర్త నన్ను భార్యగా చూడలేదు.. శారీరక అవసరాలు తీర్చుకునే ఒక యంత్రంలాగే చూసేవారు’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








