హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు ఎంతమంది వెళ్లిపోయారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘హైదరాబాద్ ఖాళీ అయిపోతోంది. లక్షల మంది జనం నగరం విడచి వెళ్లిపోతున్నారు’.. కొంత కాలంగా ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపించింది.
ఒక దశలో నగరం నుంచి సుమారు 20 లక్షల మందికి పైగా వెళ్లిపోయారని కొన్ని ప్రచారాలు కూడా వచ్చాయి.
‘ప్రజలారా హైదరాబాద్ విడిచి వెళ్లిపోండి’ అంటూ రాజకీయ నాయకుడిగా మారిన ఓ మాజీ విలేకరి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా తిరిగింది కూడా..
ఇంతకీ హైదరాబాద్ ఖాళీ అయిపోతోందా?
జూన్ చివర, జూలై మొదట్లో హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారని విస్తృత ప్రచారం జరిగింది. దీంతో నగరం నుంచి వలసలు కాస్త పెరిగాయి. ముఖ్యంగా లాక్‌డౌన్ ఉంటే ఇక్కడ పని ఉండదు అనుకునే వాళ్లు, ఊరెళ్లి ఇంట్లో వర్క్ ఫ్రం హోం చేసుకోవచ్చు అనుకునే వారు ఇలాంటి వారిలో ఉన్నారు. అలాగే ఉద్యోగాలు కోల్పోయి, వ్యాపారాలు నష్టపోయి, ఇప్పట్లో తేరుకునే అవకాశం, మళ్లీ ప్రారంభం అయ్యే అవకాశం లేని వారు కూడా ఊరి బాట పట్టారు. ఇందులో రెండు రాష్ట్రాల వారూ ఉన్నారు.
ఇతర రాష్ట్రాల వారి సంఖ్య చాలా తక్కువ. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ఉద్దేశం ఉన్న వారంతా లాక్‌డౌన్ ముగిసిన మొదట్లోనే వెళ్లిపోయారు. తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారి నుంచి ఐటీ ఉద్యోగులు వరకూ వలస వెళ్లే వారిలో ఉన్నారు.
‘‘నాతో పాటూ నా మిత్రులు కూడా ఆరేళ్లుగా హైదరాబాద్లో తోపుడు బండి నిమ్మరసం అమ్ముతున్నాం. కానీ లాక్‌డౌన్ వల్ల వారంతా ఊళ్లకు వెళ్లిపోయారు. నేనొక్కడినే వెళ్లకుండా వ్యాపారం చేస్తున్నాం’’ అని బీబీసీతో చెప్పారు సికిందరాబాద్‌లో తోపుడు బండి నడిపే రఘు అనే వ్యక్తి. రఘు మిత్రులు మొదటి విడత లాక్‌డౌన్ సమయంలో వెళ్లిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
కానీ రెండోసారీ లాక్‌డౌన్ ఉంటుందన్న వార్తల ప్రభావం మిగిలిన వారిపై కాస్త పడింది. ముఖ్యంగా అన్ లాక్ తరువాత కూడా పెద్దగా ఉపాధి దొరకని వర్గాలు, రెండోసారీ లాక్‌డౌన్ అనే మాట వినేసరికి వెళ్లిపోయారు.
‘‘హైదరాబాద్లో మళ్లీ లాక్‌డౌన్ అనే సరికి నా దగ్గర రోజూ సామాన్లు కొనే చాలా మంది వెళ్లిపోయారు. మళ్ళీ ఎప్పుడు లాక్‌డౌన్ ఎత్తేస్తారో తెలీదు. నెలల తరబడి ఐతే ఉండలేం అంటూ ఇళ్లు ఖాళీ చేసేశారు’’ అని బీబీసీతో చెప్పారు మెహదీపట్నం దగ్గరలో కిరాణా దుకాణం నడిపే వ్యక్తి.
అయితే, ఇక్కడ పని దొరకనప్పుడు గ్రామాల్లో మాత్రం ఎలా గడుస్తుందని ప్రశ్నించినప్పుడు ‘‘ప్రభుత్వాలు ఇచ్చే రేషన్, ఉపాధి హామీ పథకాలు ఆదుకుంటాయని’’ చెప్పాడతను.
రెండో విడత లాక్‌డౌన్ అనుమానంతో వెళ్లిన వారిలో చిరుద్యోగులు కూడా ఉన్నారు. జూలై మొదలు, జూన్ చివర్లలో నగరం నుంచి బయటకు దారి తీసే రోడ్లపై ఇంటి సామాగ్రి వేసుకుని వెళ్లే ట్రక్ ఆటోలు, మినీ ట్రక్కులు చాలా కనిపించేవి. దానికితోడు ఇళ్లు అద్దెకు ఇచ్చే వారి టూలెట్ బోర్డులు కూడా కనిపించడం పెరిగాయి.
గ్రామాల్లో భుక్తికి లోటు లేదు
హైదరాబాద్‌లో వ్యాపారం, ఉద్యోగం వదలి వెళ్లినా గ్రామాల్లో ఉపాధికి లోటు లేకపోవడం వలసలకు ఒక కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెల్ల కార్డు ఉన్న వారికి బియ్యం ఇతర నిత్యవసరాలు దొరుకుతున్నాయి. దానికితోడు ఉపాధి హామీ పథకం చాలా మంది పేదలకు వరంగా మారింది. దీంతో నగరాలు పట్టణాల్లో ఉపాధి లేదు అనుకున్న వారు, లాక్‌డౌన్ భయం ఉన్న వారు ఊరి ప్రయాణం అయ్యారు.

ఫొటో సోర్స్, SHYAMMOHAN
కరోనా భయం
కరోనా సమయంలో కూడా విధి నిర్వహణ చేయాల్సిన ఉద్యోగులు చాలా మంది తమ కుటుంబ సభ్యులను గ్రామాల్లో వదిలిపెట్టి వచ్చారు. హైదరాబాద్ నగరంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండడం, తాము బయట తిరగాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారు చాలా మంది.
‘‘నాకు కరోనా కాలంలోనూ డ్యూటీ ఉంది. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సమయంలో రిస్కు చేయడం ఎందుకని వారిని, నా భార్యను వాళ్ల పుట్టింట్లో దించి వచ్చాను.’’ అని బీబీసీతో అన్నారు ఓ పత్రికలో పనిచేసే విలేకరి.
చాలా మంది బ్యాంకు సిబ్బంది కూడా ఇలా చేసిన వారిలో ఉన్నారు.
ప్యాకర్స్ అండ్ మూవర్స్‌కు పెరిగిన వ్యాపారం
"మా దగ్గరకు వచ్చేవారిలో చాలా మంది కరోనా వల్లే వెళ్తున్నారు. ఇంటి దగ్గర ఉంటే టెన్షన్ ఉండదన్న భావన చాలా మందిలో ఉంది. ముఖ్యంగా ఉద్యోగాలు పోయి, ఇక్కడ సొంత ఇల్లు లేని వారు అద్దె కట్టడం భారంగా మారడంతో వెళ్లారు. పైగా ఇప్పుడు కొత్త ఉద్యోగాలు వెతుక్కునే సమయం కూడా కాదిది. మాలాంటి పాకర్స్ అండ్ మూవర్స్ వద్దకు వచ్చేవారిలో ఎక్కువగా ఎగువ మధ్యతరగతి వారే ఉంటారు. మార్చి ఏప్రిల్ నెలల్లో, అంటే లాక్‌డౌన్ పెట్టిన మొదటి నెలన్నరలో వ్యాపారం ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే అన్లాక్ మొదలైందో, అంటే మే చివర, జూన్ మొదటి నుంచి వ్యాపారం బాగా పెరిగింది అన్నారు" సహారా పాకర్స్ కి చెందిన శ్రీనివాస్.
సాధారణంగా మార్చి నుంచి ఆగస్ట్ మధ్య మాకు సీజన్ ఉంటుంది. ఆ సమయంలో పిల్లలకు సెలవులు, ట్రాన్స్‌ఫర్లు ఉంటాయి. గతేడాది ఈ సీజన్ తో పోలిస్తే ఈ ఏడాది కచ్చితంగా ఎక్కువ వ్యాపారమే జరిగింది అన్నారు శ్రీనివాస్.

ఫొటో సోర్స్, Getty Images
లక్షల్లో వెళ్తున్నారా?
జూన్ చివర, జూలై మొదట్లో లాక్‌డౌన్ వార్తలతో ఎక్కువ మంది ఊళ్లకు పయనం అయ్యారు. అప్పుడు ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వలేదు. మీడియాలో వార్తలు వచ్చాయి. తరువాత లాక్‌డౌన్ ఉండబోదని మంత్రులు లీకులు ఇచ్చారు.
ఇంటి సామాన్లతో వెళ్లే బండ్లూ, టూలెట్ బోర్డులూ పెరిగే సరికి మొత్తం నగరమే ఖాళీ అయిపోతుందేమోనన్న భావన వ్యాపించింది. కానీ వాస్తవ సంఖ్య అంత పెద్ద మొత్తంలో లేదనే కనిపిస్తోంది.
జనం వెళ్తున్నది వాస్తవమే కానీ, లక్షల్లో వెళ్తున్నది నిజం కాదని చెబుతున్నాయి లెక్కలు. కృష్ణా జిల్లా గరికపాడు చెక్ పోస్టు దగ్గర జూన్ చివరి వారంలో రోజుకు సుమారు 700 మంది వరకూ ఏపీలోకి వెళ్లారు. జూన్ నెలాఖరుకు క్రమగా రోజుకు వెయ్యి మంది వరకూ సరిహద్దు దాటారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వాహనాల సంఖ్య కూడా జూన్ మధ్యలో రోజుకు 300 వాహనాల వరకూ సరిహద్దు దాటగా, జూలై మొదటి వారంలో సంఖ్య పెరిగింది. ఇక గుంటూరు జిల్లా దాచేపల్లి ప్రాంతంలో జూన్ మధ్యలో రోజుకు 3 వేల మంది సుమారు ఆంధ్రలోకి ప్రవేశింగా, జూలై మొదట్లో 4 వేల వరకూ వెళ్లేవారు. ఇక కర్నూలు నుంచి కూడా సంఖ్య పెరిగింది.
అయితే ఈ మొత్తం సంఖ్య కూడినా, రహస్యంగా లెక్కలకు చిక్కకుండా వెళ్లే వారు నూటికి ఇరవై మంది ఉంటారని అంచనా వేసినా, దాదాపు రెండు నెలలుగా ఈ ప్రకారమే వెళ్లేరనుకున్నా, మొత్తం ఆంధ్రలోకి వెళ్లిన వారి సంఖ్య 3-4 లక్షలకు మించడం లేదు.
తెలంగాణలోపల తిరిగే వారి సంఖ్య విషయంలో ఎలానూ లెక్కలు ఉండవు. ఇక తెలంగాణలోకి ఎవరైనా రావచ్చనే నిబంధన వల్ల, ఆంధ్ర నుంచి తెలంగాణకు ఎంత మంది వస్తున్నారన్న లెక్కలు దొరకవు. దీంతో వలసలు ఉన్నా, నగరమే ఖాళీ అవుతోందన్న వాదన అయితే సరికాదు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌పై గూగుల్‌కు అంత ప్రేమ ఎందుకు
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
- ‘నేను 420’ అంటూ నగ్న చిత్రాలతో బ్లాక్మెయిల్.. గుంటూరులో ఇంజినీరింగ్ విద్యార్థుల దారుణం
- మనిషి మెదడు తినే అమీబా మళ్లీ కనిపించింది
- మహిళలు వీర్యాన్ని దాచుకుని, తమకి కావలసినప్పుడు గర్భం ధరించే అవకాశం వస్తే ఈ ప్రపంచం ఎలా మారుతుంది?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ కేసులు: ఐదు ప్రశ్నలు
- గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో భారతీయ సైనికులు మిస్సయ్యారా? ‘పది మందిని విడుదల చేసిన చైనా’
- జాన్ బోల్టన్ పుస్తకం: ‘డోనల్డ్ ట్రంప్ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సహాయం కోరారు’
- కరోనావైరస్: ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పిసినారితనం చూపిందా?
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








