ఇందిరాగాంధీ: ఆల్ఫ్స్ పర్వతాలపై భారతీయ పత్రికలు, 1966 విమాన ప్రమాదం నాటివేనా

ఇందిరా గాంధీ ఎన్నికల విజయంపై వార్త

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఎన్నికల్లో ఇందిరా గాంధీ విజయంపై వార్త

ఫ్రాన్స్‌లో ఆల్ప్స్ పర్వతాలపై 1966 నాటి భారతీయ వార్తా పత్రికలు బయటపడ్డాయి. మాంట్ బ్లాంక్ హిమానీనదం కరుగుతుండడంతో దాని అడుగున గుర్తించారు.

ఈ పత్రికలు 1966 జనవరి 24న కూలిపోయిన ఒక ఎయిర్ ఇండియా విమానంలో ఉండేవని భావిస్తున్నారు. ఆ విమాన ప్రమాదంలో 117 మంది చనిపోయారు.

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఎన్నికల్లో ఇందిరాగాంధీ గెలుపు

అక్కడ దొరికిన పత్రికలలో నేషనల్ హెరాల్డ్, ఎకనామిక్స్ టైమ్స్ సహా దాదాపు డజను పత్రికలు ఉన్నాయి.

వాటి మొదటి పేజీలలో.. ఇందిరాగాంధీ తొలి ఎన్నికల్లో విజయం సాధించడానికి సంబంధించిన వార్తలు ఉన్నాయి.

స్థానిక రెస్టారెంట్ యజమాని ఒకరు ఈ పేపర్లను గుర్తించారు. “అవి ఇప్పుడు ఆరుతున్నాయి. కానీ, మంచి కండిషన్‌లో ఉన్నాయి. చదవడానికి వీలుగానే ఉన్నాయి” అని చామోనిక్స్ స్కీ రిసార్ట్ పక్కనే రెస్టారెంట్ నడుపుతున్న టిమోతీ మాటిన్ ఏఎఫ్‌పీకి చెప్పారు.

అవి తడిసి ఉండడంతో ఆరబెట్టిన తరువాత వాటిని, విమానాలు కూలిన ప్రాంతాల్లో తను కనుగొన్న మిగతా వస్తువులతో కలిపి రెస్టారెంట్‌లో ప్రదర్శిస్తానని ఆయన చెప్పారు.

దొరికిన భారత పత్రికలతో టిమోతీ

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, దొరికిన భారత పత్రికలతో టిమోతీ

రెస్టారెంటులో ప్రదర్శిస్తా: టిమోతీ

కూలిన ఈ విమానం అవశేషాల్లో అత్యంత విలువైనవి ఆయనకు 2013లో దొరికాయి. పచ్చలు, నీలాలు, కెంపులు లాంటి విలువైన రత్నాలతో ఉన్న పెట్టె ఆయనకు దొరికింది. వాటి విలువ 1,47,000 డాలర్ల(కోటీ పది లక్షలకు పైనే) నుంచి 2,79,000 డాలర్ల(2 కోట్లకు పైనే) వరకూ ఉంటుందని అంచనా.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పర్వతాలపై హిమానీనదాలు కరగడానికి, ధ్రువాల దగ్గర మంచు పలకలు వెనక్కు జగడానికి కారణం అవుతున్నాయి. మౌంట్ బ్లాంక్ గ్రాండ్ జొరాస్సెస్ శిఖరం దగ్గర ఉన్న ప్లాన్‌పిన్సియక్స్ హిమానీనదం కూలిపోయేలా బలహీనంగా ఉందని అధికారులు గత సెప్టెంబర్‌లోనే హెచ్చరించారు.

అప్పట్లో బాంబేగా పిలుచుకుంటున్న ముంబయి నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం 101 1966 జనవరి 24న మాంట్ బ్లాంక్ శిఖరం దగ్గర కూలిపోయింది.

ప్రయాణం మధ్యలో దిల్లీ, లెబనాన్‌లోని బీరూట్‌లో రెండుసార్లు ఆగిన అది స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో మూడో సారి ఆగడానికి దిగుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది.

జెనీవాలో దిగుతున్న సమయంలో ఆ విమానం పర్వతానికి ఢీకొంది. ఆ ప్రమాదంలో విమానంలోని 106 మంది ప్రయాణికులతోపాటూ 11 మంది సిబ్బంది కూడా చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)