దిల్లీ కరోనా క్వారెంటైన్ కేంద్రంలో '14 ఏళ్ల బాలికపై అత్యాచారం... ఇద్దరు అరెస్ట్'

దిల్లీలో అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీలోని కోవిడ్-19 క్వారెంటైన్ కేంద్రంలో 14 ఏళ్ల అమ్మాయిపై మరొక పేషెంట్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలతో 19 ఏళ్ళ యువకుడిని, ఆ ఘటనను వీడియో తీసిన మరొకర్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

బాధితురాలితో పాటు నిందితులిద్దరూ కోవిడ్ సోకినవారే. దిల్లీలో 10 వేల బెడ్లతో ఏర్పాటు చేసిన భారతదేశపు అతిపెద్ద క్వారెంటైన్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది.

అయితే, మైనర్ బాలికపై జూలై 15నే జరిగినట్లు భావిస్తున్న ఈ అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశామని పోలీసులు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికకు తెలిపారు.

"నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి, కస్టడీకి తరలించాం. అయితే, కోవిడ్ వ్యాధి నుంచి కోలుకునే వరకు వారికి సంస్థాగత సంరక్షణ కల్పిస్తున్నాం" అని సీనియర్ అధికారి పర్విందర్ సింగ్ తెలిపారు. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

స్థానిక పత్రికల కథనాల ప్రకారం ఆ బాలికపై కోవిడ్ సంరక్షణ కేంద్రంలోని బాత్‌రూమ్‌లో అత్యాచారం జరిగింది. బాధితురాలు ఆ విషయాన్ని అదే కేంద్రంలో తనకు తోడుగా ఉన్న కుటుంబ సభ్యుడికి తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్దదని చెబుతున్న ఈ క్వారెంటైన్ కేంద్రంలో వ్యాధి లక్షణాలు అసలు లేని, అంతగా లేని బాధితులకు సంరక్షణ కల్పిస్తున్నారు. ఇంటివద్ద ఐసోలేషన్లో ఉండడానికి వీలుపడని వారికి ఇక్కడ ఆశ్రయం కల్పిస్తు న్నారు.

భారతదేశంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. 12 లక్షలకు పైగా కరోనావైరస్ బాధితులతో ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంది. ఈ పరిస్థితుల్లో చాలా రాష్ట్రాలు ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి.

అయితే, క్వారెంటైన్ కేంద్రంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. గతవారం, ముంబయిలోని ఒక క్వారెంటైన్ కేంద్రంలో కూడా ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఒక వ్యక్తిని బిహార్‌లోని పట్నాలో అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)