నిర్భయ కేసు దోషుల ఉరితీత; సుప్రీం కోర్టులో అర్ధరాత్రి విచారణలో ఏం జరిగింది

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, ANI

నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులకు దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం మార్చి 20 ఉదయం 5.30 గంటలకు ఉరిశిక్ష అమలైంది. దిల్లీలోని తీహార్ జైలులో ఈ నలుగురికీ అధికారులు ఉరిశిక్ష అమలు చేశారు.

శిక్ష అమలు సందర్భంగా తీహార్ జైలు బయట భద్రతను కట్టుదిట్టం చేశారు. నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్ష అమలుచేయడం తీహార్ జైలులో ఇదే మొదటిసారి.

నలుగురి మృతదేహాలకు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ హాస్పిటల్‌లో పోస్ట్ మార్టమ్ నిర్వహిస్తారు. ఈ నివేదిక ఉదయం 8 గంటలకు అందే అవకాశం ఉంది. శిక్ష అమలు చేసే సమయంలో కూడా ఇద్దరు వైద్యులు జైలులో ఉన్నారు.

ఘటన జరిగిన ఏడేళ్ల మూడు నెలల 4 రోజుల తర్వాత వారికి శిక్ష అమలైంది.

అర్ధరాత్రి అత్యవసర విచారణ

మార్చి 20 ఉదయం 5.30 గంటలకు వారికి ఉరిశిక్ష అమలు చేయాలని మార్చి 5న దిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ జారీ చేసింది. ఆ వారెంట్‌పై స్టే విధించాలంటూ వారు మరోసారి పిటిషన్ వేశారు. దానిని పటియాలా కోర్టు గురువారం తిరస్కరించింది.

దీంతో దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

వివిధ కోర్టుల్లో కొన్ని పిటిషన్లు పెండింగులో ఉండటం వల్ల ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని వారు కోర్టును కోరారు. కానీ, దిల్లీ హైకోర్టు కూడా ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.

దోషుల తరపు లాయర్ ఏపీ సింగ్ సుప్రీం కోర్టులో అత్యవసర విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

నిర్భయ నిందితులు

ఫొటో సోర్స్, DELHI POLICE

దోషి పవన్ గుప్తా క్షమాభిక్ష రాష్ట్రపతి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అర్థ రాత్రి 3 గంటల సమయంలో జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్.బోపన్నలతో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది.

పవన్ గుప్తాకు సంబంధించిన స్కూల్ సర్టిఫికెట్, స్కూల్ రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్‌లను ఏపీ సింగ్ కోర్టుకు సమర్పిస్తూ, నేరం జరిగిన సమయంలో అతడు మైనర్ అని తెలిపారు.

కానీ జస్టిస్ భూషణ్ దీన్ని తిరస్కరించారు. "ఇవన్నీ మీరు ఇంతకుముందు ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీలపై విచారణ సమయంలో చూపించారు. మీరు మళ్లీ మళ్లీ ఒకే అంశాన్ని లేవనెత్తుతున్నారా? మీరు మా తీర్పును సమీక్షించాలని చాలా తెలివిగా అడుగుతున్నారు. న్యాయం అనేది ఎప్పటికప్పుడు పునర్నిర్వచించడం కుదరదు. రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరించడాన్ని సవాలు చేయడానికి ఇది వేదిక కాజాలదు" అని స్పష్టం చేశారు.

ఏపీ సింగ్ వాదనలపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ జరిగిన వాదనలు, పిటిషన్లను ఆయన కోర్టుకు సమర్పించారు.

ఇదే పిటిషన్‌ను ట్రయల్ కోర్టులో దాఖలు చేయగా, దాన్ని అక్కడ తిరస్కరించారని ఆయన తెలిపారు. హైకోర్టులోనూ ఇదే జరిగిందని, సుప్రీంకోర్టులో వేసిన ఎస్ఎల్పీ విషయంలోనూ ఇదే నిర్ణయం వెలువడిందని ఆయన అన్నారు. మళ్లీ ఇదే అంశంపై పవన్ గుప్తా క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లను దాఖలు చేశారని కోర్టుకు తెలిపారు.

"మొదటి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు. ఇప్పుడు మళ్లీ రెండోది దాఖలు చేస్తున్నారు" అని భానుమతి అన్నారు.

దీన్ని అనుమతించడం కుదరదు అని సొలిసిటర్ జనరల్ తెలిపారు.

"మీరు ఈ వాదనలను ట్రయల్ కోర్టు, ఎస్ఎల్పీ సమయంలో కూడా లేవనెత్తారు. ఇప్పుడు మళ్లీ అవి ఎలా ప్రస్తావిస్తారు?" అని జస్టిస్ భూషణ్ ప్రశ్నించారు.

"నేను అక్షయ్ తరపును సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని పాటియాలా కోర్టుకు ముందే తెలిపాను. నేను సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న సమయంలోనే పాటియాలా కోర్టు మేం దాఖలు చేసిన పిటిషన్‌ను ఎలా తిరస్కరిస్తుంది? ఉరిశిక్ష పడిన దోషులు నలుగురికీ న్యాయం ఎలా జరుగుతుంది?" అని ఏపీ సింగ్ వాదించారు.

తిహార్ జైలు

ఫొటో సోర్స్, Ani

"క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణను ఏ ప్రాతిపదిక మీద మీరు సవాల్ చేస్తున్నారు? మీరు గతంలో వినిపించిన వాదనలనే మళ్లీ వినిపిస్తున్నారు" అని జస్టిస్ భూషణ్ ప్రశ్నించారు.

"మండోలి జైలులో పవన్ గుప్తా దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ పెండింగులో ఉంది. అతడిని ఉరితీసే ముందే అతడి వాంగ్మూలాన్ని నమోదు చేయాలి. పవన్ గుప్తా తలపై 14 కుట్లు పడ్డాయి. ఇది మానవ హక్కులకు విఘాతం కాదా? ఏ జైలు నింబధనలు దీన్ని అనుమతిస్తున్నాయి?" అని ఏపీ సింగ్ అన్నారు.

"మీరు వేసిన ఎస్ఎల్పీ విచారణ సమయంలో వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నాం. అప్పుడు కూడా మీరు ఇదే స్కూల్ సర్టిఫికెట్ చూపించారు. మళ్లీ దాన్నే ఎలా తీసుకొస్తారు?" అని జస్టిస్ భానుమతి లాయర్ ఏపీ సింగ్‌ను ప్రశ్నించారు.

ఆర్టికల్ 72 ప్రకారం (క్షమాభిక్షపై రాష్ట్రపతి ప్రత్యేక అధికారాలు) తీసుకోవాల్సిన నిర్ణయం నిష్పాక్షికంగా తీసుకోలేదని దోషి పవన్ తరపున వాదించిన మరో లాయర్ షామ్స్ ఖ్వాజా కోర్టుకు తెలిపారు.

"వారికి ఈరోజు శిక్ష అమలుచేస్తారని నాకు తెలుసు, కానీ, దాన్ని రెండు, మూడు రోజులు వాయిదా వేసి, వారి వాంగ్మూలాన్ని నమోదు చేయేవచ్చు. అప్పుడు దోషులకు న్యాయం చేసినట్లవుతుంది" అని ఏపీ సింగ్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

అన్ని వాదనలూ విన్న సుప్రీం కోర్టు త్రిసభ్య బెంచ్ పవన్ గుప్తా పెట్టుకున్న పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.

"క్షమాభిక్ష పిటిషన్‌పై రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించడానికి కోర్టుకున్న పరిధి స్వల్పమని కోర్టు భావిస్తూ వస్తోంది. దోషి ఒకరు మైనర్ అనే పిటిషనర్ తరపు వాదనలను కోర్టులు పరిగణనలోకి తీసుకోలేదు అనడం సరికాదు. జైలులో హింసించారనే ఆరోపణల ఆధారంగా ఆర్టికల్ 72 ప్రకారం తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించడం సాధ్యం కాదు. క్షమాభిక్ష తిరస్కరిస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయంపై ఇకపై ఎలాంటి న్యాయ విచారణలైనా నిలిపివేస్తూ, ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం" అని త్రిసభ్య బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.

అంతకు ముందు దిల్లీ హైకోర్టులో ఏం జరిగింది?

ముగ్గురు దోషుల తరపున లాయర్ ఏపీ సింగ్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

అయితే, శిక్ష అమలు నిలిపివేతకు తగిన కారణాలు ఏవీ లేవని దిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. పాటియాలా హౌస్ కోర్టు జారీచేసిన డెత్ వారెంట్‌ను సమర్థించింది.

జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంజీవ్ నారులాలతో కూడిన బెంచ్ ఈ విచారణ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

"దోషులు మళ్లీ మళ్లీ ఒకే పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం, మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి" అని ఏపీ సింగ్‌కు సూచించింది.

"ఉరిశిక్షను ఎందుకు వాయిదా వేయాలి? మీ దగ్గర ఏమైనా బలమైన వాదనలు ఉంటే వినిపించండి, పరిగణనలోకి తీసుకుంటాం" అని బెంచ్ స్పష్టం చేసింది.

అక్షయ్ సింగ్ భార్య దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌పై కూడా దిల్లీ హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ పిటిషన్‌కు, ఉరితీతకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)