నిర్భయ ఘటన: రేపిస్టులను ఉరి తీయాలనే వాదనలు సరే... బాధితుల బాగోగుల సంగతేమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రియాంక దూబే
- హోదా, బీబీసీ ప్రతినిధి
పక్షం రోజుల క్రితం హైదరాబాద్ పశు వైద్యురాలి అత్యాచారం, హత్యతో మొదలైన ఈ వాదన, నిర్భయ ఘటనలో దోషులకు మరణ శిక్ష విధించడానికి సన్నాహాలు చేసేవరకూ వచ్చి ఆగింది.
ఈలోపు, ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని సజీవదహనం చేశారు. ముజఫర్‌నగర్ నుంచి నాగపూర్ వరకూ వార్తాపత్రికలన్నీ దేశంలో జరుగుతున్న అత్యాచార వార్తలతో నిండిపోయాయి. దానితోపాటూ అత్యాచార నిందితులకు మరణశిక్ష విధించాలనే డిమాండ్ సోషల్ మీడియాలో మరోసారి జోరందుకుంది.
పార్లమెంటులో జయాబచ్చన్ మరణదండన కంటే మరింత ముందుకెళ్లి అత్యాచార నిందితులను 'స్ట్రీట్ స్టయిల్ జస్టిస్' కోసం ప్రజలకు అప్పగించాలని చేసిన డిమాండ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అటు హైదరాబాద్ ఘటనలో నిందితులు పోలీసు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడంతో... మంచిపనే చేశారన్న నిర్భయ తల్లిదండ్రులు కూడా ఆ వివాదాస్పద హత్యలను 'న్యాయమే' అన్నారు.
అత్యాచార కేసుల్లో దోషులకు 6 నెలల్లోనే కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ మహిళా కమిషన్ అధ్యక్షులు స్వాతి మాలివాల్ దిల్లీలో గత 10 రోజులుగా నిరాహారదీక్షలో కూడా కూచున్నారు. అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్ష వేయాలంటూ సోషల్ మీడియాలో నినాదాలు వెల్లువెత్తుతున్న సమయంలోనే నిర్భయ కేసులో దోషి పవన్ కుమార్ గుప్తాను మండోలీ జైలు నుంచి దిల్లీ తీహార్ జైలుకు మార్చారు.
నిర్భయ కేసులో దోషులు అందరూ ఇప్పుడు తీహార్ జైల్లోనే ఉన్నారు. వారిపై సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టారు.
దీంతో త్వరలో వారికి ఉరిశిక్ష వేస్తారనే ఊహాగానాలు కూడా జోరందుకున్నాయి. అత్యాచార నిందితులకు ఉరిశిక్ష వేయాలనే ఈ నిరంతర డిమాండ్, మరణశిక్ష అనే ప్రశ్నను మన మధ్య ఎప్పటికీ పరిష్కారం కాని ఒక చిక్కు ప్రశ్నగా మార్చేసింది.
నేషనల్ లా యూనివర్సిటీ(దిల్లీ) పరిశోధనలో తాజా గణాంకాల ప్రకారం 2018 డిసెంబర్ వరకూ భారత్‌లోని రకరకాల జైళ్లలో ఉన్న 426 మంది దోషులకు మరణశిక్ష విధించారు. 2017లో ఈ సంఖ్య 371.

మరణశిక్ష ప్రక్రియ
కింది కోర్టు ఒకసారి శిక్ష విధించినా, ఏదైనా హైకోర్టు దానికి ఆమోద ముద్ర వేసేవరకూ ఉరిశిక్ష ఖరారు కాదు. తర్వాత దోషులకు సుప్రీంకోర్టు వెళ్లడానికి, అక్కడ కూడా నిరుత్సాహం ఎదురైతే, వారికి ఆర్టికల్ 137 ప్రకారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసే ప్రత్యామ్నాయం కూడా ఉంటుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్, తర్వాత రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టడం అనేది ఆఖరి ప్రత్యామ్నాయం అవుతుంది. తమను రక్షించుకునే అన్ని దారులూ మూసుకుపోయి, చట్టపరమైన మినహాయింపులు లభించకపోతే దోషులను ఉరికంబానికి ఎక్కిస్తారు.
అత్యాచారం, మరణశిక్ష
'క్రిమినల్ లా అమెండ్‌మెంట్ యాక్ట్(2018)' ద్వారా మరణ శిక్ష పరిధిని పెంచారు. తర్వాత 12 ఏళ్ల లోపు పిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో కూడా మరణశిక్ష విధించే కొత్త చట్టం అమలు చేశారు. తర్వాత 'ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రెన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్' లేదా పోక్సోలో కూడా మార్పులు చేసి మరణశిక్షను చేర్చారు. అత్యాచారంతోపాటూ హత్యకు సంబంధించిన దుశ్చర్యల్లో కూడా మరణశిక్ష వేసే నిబంధన ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
ఉరిశిక్ష వల్ల నిజంగా అత్యాచారాలు తగ్గుతాయా?
నిర్భయ నిందితులకు ఉరిశిక్ష వేస్తారంటూ వస్తున్న వార్తల మధ్య ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఉరిశిక్ష అత్యాచారం చేసేవారిలో భయం పుట్టిస్తుందా అనే వాదన బలంగా వస్తోంది.
అయితే గణాంకాలను చూస్తే ఉరిశిక్షలతోపాటు అత్యాచారాలు కూడా పెరుగుతున్నాయని తెలుస్తోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్‌సిఆర్‌బీ) తాజా గణాంకాల ప్రకారం భారత్‌లో ప్రస్తుతం ప్రతి 15 నిమిషాలకూ ఒక అత్యాచార కేసు నమోదవుతోంది.
మరణశిక్ష వల్ల అత్యాచారాల ఘటనలు తగ్గినట్లు ధ్రువీకరించడానికి ప్రభుత్వ, ప్రభుత్వేతర పరిశోధనలు ఏవీ లేవు. బదులుగా లైంగిక వేధింపులు పెరిగాయని చెబుతున్న గణాంకాలు దేశంలో మహిళల పట్ల హింస గ్రాఫ్ పైపైకి పోతూనే ఉందని చెబుతోంది.
డెత్ పెనాల్టీ అనే అంశంపై చాలా కాలం నుంచీ పనిచేస్తున్న సుప్రీంకోర్టు వకీల్ యుగ్ చౌధరి మరణశిక్ష వల్ల నేరాలు ఎప్పుడూ తగ్గలేదని అన్నారు.
"మరణశిక్ష నేరాలు తగ్గించడానికి జీవితఖైదు కంటే ఎక్కువ ప్రభావం ఎప్పుడూ చూపించలేకపోయింది. లైంగిక వేధింపుల గణాంకాలు మన ముందే ఉన్నాయి. హైదరాబాద్ కేసులో ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత రోజే త్రిపురలో ఘోర అత్యాచార ఘటన జరిగింది. ఇప్పుడు దేశమంతా జరుగుతున్న ఈ అత్యాచార ఘటనలు చూస్తుంటే, ఉరిశిక్ష, పోలీస్ ఎన్‌కౌంటర్ల వల్ల ఆ నేరాల్లో ఎలాంటి వ్యత్యాసం రాదని స్పష్టంగా తెలుస్తోంది" అని యుగ్ చెప్పారు.
మరణశిక్ష డిమాండు మహిళా భద్రత అనే ప్రాథమిక అంశం నుంచి దృష్టి మళ్లించడానికి జనాగ్రహాన్ని చల్లార్చే ఒక సులభమైన పద్ధతని యుగ్ చెబుతున్నారు.
"వర్మ కమిటీ రిపోర్టులో మహిళలపై హింసకు సంబంధించిన అంశాలేవో స్పష్టంగా చెప్పారు. మెరుగైన పోలీసింగ్, మహిళల కోసం ఒక సిస్టం తయారు చేయాల్సిన అవసరం ఉంది. కానీ వర్మ కమిటీ సిఫారసులను అమలు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి బలమైన చర్యలు చేపట్టలేదు. నిర్భయ ఫండ్‌ను కూడా సరిగా ఉపయోగించడం లేదు. కానీ, నేరస్థులను ఉరిశిక్ష వేయడం అనేది వారికి సులభం. దీని ద్వారా ఎలాంటి ప్రాథమిక సంస్కరణలు చేయకుండానే మహిళల భద్రత గురించి తాము ఆలోచిస్తున్నట్లు ప్రభుత్వం సందేశం ఇస్తుంది".

ఫొటో సోర్స్, Getty Images
ఉరిశిక్షతో సమస్యలేంటి?
మరణశిక్షతో చాలా సైద్ధాంతిక, వ్యవహారిక సమస్యలు ఉన్నాయి. అవి మహిళలపై జరిగే హింసకు సంబంధించిన చర్చలో ప్రజాభిప్రాయాన్ని ధ్రువీకరించే అంశంగా మారాయి. ఒక వైపు అత్యాచార దోషులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ వస్తుంది. మరోవైపు మరణశిక్షకు వ్యతిరేకంగా కూడా బలమైన వాదన ఉంది.
మరణశిక్షకు సంబంధించిన స్దైధాంతిక సమస్యల గురించి చెప్పిన యుగ్ "ఇక్కడ అత్యంత పెద్ద సైద్ధాంతిక విభేదం ఏంటంటే రాష్ట్రం దగ్గర పౌరుల ప్రాణాలు తీసే హక్కు లేదు. ఉరిశిక్ష వేసే హక్కు రాష్ట్రం, పౌరుల సామాజిక ఒప్పందం పరిధిలోకి బయట వస్తుంది. దేవుడు ఇచ్చిన ప్రాణాలు తీసే అధికారం మనుషులకు లేదనే ధార్మిక వాదన కూడా ఉంది" అన్నారు.
మరణశిక్ష ప్రక్రియ తప్పులకు అతీతం కాదు.
ఈ సైద్ధాంతిక వాదనలకు భిన్నంగా మరణశిక్ష ప్రక్రియలో చాలా తప్పుల భయాలతో నిండి ఉంది.
"మరణశిక్ష వేసే ప్రక్రియ ఏకపక్షంగా, లేదంటే తప్పులతో నిండి ఉంది. ఉరిశిక్ష ఇచ్చే ప్రక్రియ చట్టానికి బదులు జడ్జిల వివేకాన్ని బట్టే ఉంటుందనే మాటను సుప్రీంకోర్టు చాలాసార్లు అంగీకరించింది.
'అంటే మీ నేరం ఏంటి, ఆ నేరానికి చట్టం ఏం చెబుతుంది అనేదాని ఆధారంగా మీకు ఉరిశిక్ష వేయడం ఉండదు. దానికి బదులు జడ్జి ఏం ఆలోచించారు, ఆయనకు ఏమనిపించింది అనే ఆధారంగా శిక్ష వేస్తారు. అంతేకాదు, చాలా కేసుల్లో మరణశిక్ష విధించిన దశాబ్దాల తర్వాత కోర్టు నేరస్థులను వదిలేసింది" అంటారు యుగ్ చౌధరి.
ఆయన దీనికి ఒక ఉదాహణ కూడా చెప్పారు. "నేను ఇటీవల చూసిన ఒక కేసులో మరణశిక్ష విధించిన 16 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు దోషులను వదిలేయడమే కాదు, 16 ఏళ్ల జైల్లో ఉన్నందుకు వారికి పరిహారం కూడా ప్రకటించింది. ఇదెందుకు చెబుతున్నానంటే, జడ్జి కూడా మనిషే, మనిషి తప్పు చేయకుండా ఉండడు. అందుకే, మరణశిక్ష వేయడం అనే ఈ ప్రక్రియ కూడా తప్పు కాకుండా పోదు.
మరణశిక్ష ఎలాంటిదంటే, అది వేసిన తర్వాత న్యాయ ప్రక్రియలో ఏదైనా పొరపాటు జరిగిందని, ఆ వ్యక్తి ఏ తప్పు చేయలేదని తెలిస్తే, అప్పుడు దానిని సరిదిద్దుకోవడం, సవరించడం, మార్చడం దేనికీ అవకాశం ఉండదు.

ఫొటో సోర్స్, Getty Images
మహిళల పేరున మరణశిక్ష
చాలాకాలంపాటు మహిళల, బాలల హక్కుల కోసం పనిచేసన 'హక్' సంస్థకు సంబంధించిన భారతి అలీ, "మరణశిక్ష చ్టుటూ తిరిగే ఈ చర్చలో అత్యంత బాధాకరమైన విషయం ఒకటుంది. మహిళల సంక్షేమం అని చెబుతూ, వారికి న్యాయం అందించాలనే పేరుతో దానిని సమర్థిస్తున్నారు. అంటే, ఉరివేయడంతో పితృస్వామ్యం అంతమవుతుంది అంటున్నారు" అన్నారు.
"పోలీసుల దర్యాప్తు దారుణంగా ఉండడం. న్యాయ వ్యవస్థలో నిండిన 'విక్టిమ్ షేమింగ్' లేదంటే భాదితురాలినే దోషిగా నిందించే ఆలోచనలను మార్చకుండా ఎంత పెద్ద మార్పులు జరుగుతాయి? మన రోజువారీ జీవితం సామాన్యుల్లా ఉండేందుకు, నగరాల్లో, గ్రామాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలను స్త్రీలకు అనుకూలంగా చేయాలి" అన్నారు.
మీడియా ఒత్తిడి, ప్రజాభిప్రాయం వల్లే ఉరిశిక్షలు వేస్తున్నారా?
ఉరిశిక్ష నిర్ణయాల్లో మీడియా ఒత్తిడి, ప్రజాభిప్రాయం పాత్రపై మాట్లాడిన యుగ్ చౌధరి "కోర్టు విచారణ, తీర్పు, లేదా ఉరిశిక్ష క్షమాభిక్షపై మీడియా ఒత్తిడి, జనాభిప్రాయ ప్రభావం పడకూడదు. కానీ నిజం ఏంటంటే జడ్జి కూడా మనిషే. వారు కూడా ప్రజాభిప్రాయ ఒత్తిడికి గురికావచ్చు. మీడియా సేకరించే ప్రజాభిప్రాయ సేకరణ వల్ల కూడా అంతిమ తీర్పుపై చాలా ప్రభావం పడవచ్చు. ప్రభుత్వాలు కూడా తమకు సౌకర్యంగా ఉండే స్టాండ్ తీసుకోవచ్చు. అలాంటప్పుడు చాలాసార్లు జనాల ఆగ్రహాన్ని చల్లార్చడానికి జడ్జిలు ఉరిశిక్ష వేయాల్సి వస్తుంది. కానీ దాన్ని నేను 'మరణశిక్ష కాదు, హ్యూమన్ సాక్రిఫైస్ లేదా నరబలి' అనే అంటాను" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
'ప్రతీకార' న్యాయ వ్యవస్థ Vs. 'పునరావాస' న్యాయ వ్యవస్థ?
భారత న్యాయ వ్యవస్థలో సంప్రదాయబద్ధంగా బాధితుల పునరావాసానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి బదులు నేరస్థులకు కఠినాతి కఠిన శిక్షలు వేసి న్యాయం చేయడం వైపే మొగ్గు చూపుతున్నారు,
రతన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో తీర్పు ఇస్తూ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ కృష్ణ అయ్యర్ ఆ విషయం ఒప్పుకున్నారు. "ఇది మన న్యాయ ప్రక్రియ బలహీనత. మనం నేరస్థులను శిక్షించాలని అభ్యర్థిస్తూ, బాధితురాలు, ఖైదీ కుటుంబాల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. వ్యవస్థలోని ఈ లోపాన్ని కొత్త చట్టం చేసినప్పుడే సరిచేయగలం" అన్నారు.
అయితే 'విక్టిమాలజీ'పై జరిగిన అన్ని ఆధునిక పరిశోధనలూ అత్యాచార బాధితులకు సంపూర్ణ పునరావాసం అవసరం అని అంగీకరించాయి. కానీ, భారత్‌లో ఇప్పటికీ నేరస్థులకు శిక్ష కఠినంగా ఉండాలనే ఎక్కువ వాదిస్తున్నారు. 'ప్రతీకార' న్యాయ వ్యవస్థ అనే గాలిలో బాధితురాలి 'పునరావాస' అనే ప్రశ్న ఎక్కడో కొట్టుకుపోతోంది.
ఇవి కూడా చదవండి:
- భారతదేశ కొత్త 'ముస్లిం వ్యతిరేక' చట్టం మీద ఆందోళనలు ఎందుకు?
- హ్యూమన్ రైట్స్ డే: మనిషిగా మీ హక్కులు మీకు తెలుసా...
- హైదరాబాద్ ఎన్‌కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు
- హైదరాబాద్ ఎన్‌కౌంటర్: ‘పోలీసుల కథనం చిన్నపిల్లలు కూడా నమ్మేలా లేదు’
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన బారత్
- విమానంలో ప్రయాణికురాలిని తేలు కుట్టింది
- ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి తెలంగాణలో రేప్ నిందితుల వరకు.. ఎన్కౌంటర్లలో నిజమెంత
- పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










