ఆంధ్రప్రదేశ్: అత్యాచార కేసుల్లో ‘21 రోజుల్లో’ మరణశిక్ష... ఇంకా 'దిశ' బిల్లులో ఏముంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
మహిళలు, బాలికలపై అత్యాచారం, యాసిడ్ దాడుల వంటి క్రూర నేరాలకు పాల్పడేవారికి, కచ్చితమైన ఆధారాలుంటే 21 రోజుల్లోనే మరణ శిక్ష విధించేలా ఆంధప్రదేశ్ ప్రభుత్వం చట్టాలకు పదును పెట్టేందుకు సిద్ధమైంది.
ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం-2019 ( ఏపీ 'దిశ' యాక్ట్) ముసాయిదాను సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్ట్ ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగైనెస్ట్ విమెన్ అండ్ చిల్ట్రన్ యాక్ట్-2019 బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది.
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 'దిశ' అత్యాచారం, హత్య ఘటన పట్ల దేశమంతా ఆందోళనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. పక్క రాష్ట్రంలో జరిగినప్పటికీ ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని.. మహిళలు, చిన్నారుల భద్రత కోసం ‘దిశ యాక్ట్’ తెస్తామని ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
దీనికి అనుగుణంగానే రాష్ట్ర కేబినెట్ బుధవారం ఈ నిర్ణయాలు తీసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
ప్రతిపాదిత చట్టాల ప్రకారం అత్యాచార కేసుల్లో నేరం జరిగినట్లు నిర్ధారించే కచ్చితమైన ఆధారాలు ఉంటే, దోషులకు 21 రోజుల్లోపే కోర్టులు మరణశిక్ష విధిస్తాయి.
వారం రోజుల్లో పోలీసుల దర్యాప్తు, ఆ తర్వాతి 14 రోజుల్లో ప్రత్యేక కోర్టు విచారణ ముగుస్తాయి. మొత్తంగా 21 రోజుల్లో తీర్పు వస్తుంది.
దిశ యాక్ట్‌తో పాటు ఇండియన్ పీనల్ కోడ్‌లో అదనంగా 354(ఇ), 354 (ఎఫ్) సెక్షన్లను చేర్చే ముసాయిదా బిల్లులకు కూడా కేబినెట్ అనుమతి ఇచ్చింది.
చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడేవారికి పదేళ్ల నుంచి 14 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించాలని 354 (ఎఫ్)లో ప్రతిపాదించారు. తీవ్ర నేరాలకు జీవిత ఖైదు వరకూ శిక్ష విధించాలని సూచించారు.
ప్రస్తుతానికి ఇలాంటి నేరాలకు పోక్సో చట్టం కింద మూడు నుంచి ఐదేళ్ల వరకూ శిక్ష విధిస్తున్నారు.
ఇక 354(ఇ) ప్రకారం మెయిల్, సోషల్‌మీడియా, డిజిటల్ మీడియాల్లో మహిళల గౌరవానికి భంగం కలిగించేలా పోస్ట్‌లు చేసేవారిపై కఠినమైన చర్యలు ఉంటాయి. మొదటిసారి తప్పు చేసినవారికి రెండేళ్లు, రెండో సారి తప్పుచేసినవారికి నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తారు.
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

ఫొటో సోర్స్, vamsikaka/twitter
సత్వర న్యాయం దిశగా తొలి అడుగులు : చిరంజీవి
ఆంధ్రప్రదేశ్ 'దిశ' చట్టం-2019 పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్నారు.
‘‘మహిళా సోదరీమణులకు, లైంగిక వేధింపులకు గురవుతున్న చిన్నారులకు ఈ చట్టం భరోసా, భద్రత ఇస్తుందన్న ఆశ నాలో ఉంది. 'దిశ' సంఘటన మనందర్నీ కలిచివేసింది. ఆ భావోద్వేగాలు తక్షణ న్యాయాన్ని డిమాండ్ చేశాయి. తక్షణ న్యాయం కంటే సత్వర న్యాయం మరింత సత్ఫలితాలను ఇస్తుందన్న నమ్మకం అందరిలో ఉంది. అందుకోసం ఆంధ్రప్రదేశ్‌లో తొలి అడుగులు పడటం హర్షణీయం’’ అని ఓ ప్రకటనలో చెప్పారు.
‘‘4 నెలలు అంతకంటే ఎక్కువగా పట్టే విచారణా సమయాన్ని 21 రోజులకు కుదించడం, ప్రత్యేక కోర్టులు ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పించడాన్ని ప్రశంసిస్తున్నా. నేరాలోచన ఉన్న వాళ్లలో భయం కల్పించే విధంగా చట్టాలు తేవడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ చర్యలతో మహిళా లోకం నిర్భయంగా, స్వేచ్ఛగా ఉండగలుగుతుందన్న నమ్మకం నాకు ఉంది" అని చిరంజీవి అన్నారు.

ఫొటో సోర్స్, muppallasubbarao/facebook
‘సమస్య మూలాల్లోకి వెళ్లడం లేదు’
మహిళలపై హింస అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోకుండా, భావోద్వేగాల ఆధారంగా చట్టాలు రూపొందించడం శ్రేయస్కరం కాదని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు వ్యాఖ్యానించారు.
సత్వర న్యాయం అందించేందుకు అవసరమైన చర్యలపై ఇప్పటికే అనేక కమిషన్‌ల, పార్లమెంట్ కమిటీల సిఫార్సులు ఉన్నాయని ఆయన బీబీసీతో అన్నారు.
‘‘ప్రతి 10లక్షల మందికి 50 మందికి తగ్గకుండా న్యాయమూర్తులు అవసరం అని జాతీయ లా కమిషన్ చెప్పింది. కానీ ప్రస్తుతం 13 మంది ఉన్నారు. వాటిలోనూ అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏపీ హైకోర్టులో 24 మంది న్యాయమూర్తులు ఉండాలి. 13 మంది మాత్రమే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 21 రోజుల్లో తీర్పులు వెలువరించడం ఎలా సాధ్యం?’’ అని సుబ్బారావు సందేహం వ్యక్తం చేశారు.
‘‘అత్యాచారం జరిగితే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక వచ్చేందుకే చాలా సమయం పడుతుంది. అలాంటిది ఏడు రోజుల్లో ఛార్జీషీట్ వేయాలని బిల్లులో పేర్కొన్నారు. ఇది ఎలా సాధ్యం. పునఃపరిశీలన చేయడం మంచిది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

‘అనుగుణంగా చర్యలు లేవు’
నేరాల నియంత్రణకు, వాటికి తగ్గట్టుగా శిక్షలు విధించడం అవసరమేనని.. కానీ, అందుకు అనుగుణంగా యంత్రాంగం గురించి ప్రస్తావన కనిపించడం లేదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ కార్యదర్శి డి.రమాదేవి వ్యాఖ్యానించారు.
‘‘రాష్ట్రంలో 100కి ఫోన్ చేస్తే స్పందించేందుకు తగినంత సిబ్బంది లేరు. మొదట అలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. న్యాయమూర్తుల ఖాళీల విషయం చెప్పనవసరం లేదు. దానికి తగ్గట్టుగా బడ్జెట్ కేటాయించాలి. మహిళల కిడ్నాప్‌ల్లో ఏపీ దేశంలోనే నాలుగో స్థానంలో ఉంది. వాటిని ఈ చట్టాల్లో ప్రస్తావించలేదు’’ అని ఆమె అన్నారు.
‘‘పరువు హత్యల పేరుతో సాగుతున్న అరాచకాలను అరికట్టే చర్యలు ఈ బిల్లుల్లో లేవు. ప్రభుత్వం వాటిని ఎందుకు విస్మరించింది. మహిళలపై నేరాలు జరగకుండా నిరోధించే చర్యలను ఈ కూడా ఈ బిల్లుల్లో పేర్కొనలేదు’’ అని రమాదేవి అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ఆసిఫాబాద్ మహిళ అత్యాచారం, హత్య కేసు: ‘ఆ శరీరం ఆడమనిషిలానే లేదు.. నా కోడలిని బొమ్మలా ఆడుకున్నారు’
- అత్యాచార నిందితుడిని షూట్ చేస్తే... 'సింగం' అయిపోతారా
- కశ్మీర్ వేర్పాటువాది మక్బూల్ భట్: ఒక వ్యక్తిని ఉరి తీసి, జైలులోనే ఖననం చేయడం తీహార్ జైలు చరిత్రలో అదే తొలిసారి
- రూ. 65 కోట్ల విలువ చేసే అరుదైన విస్కీ వేలానికి సిద్ధమవుతోంది
- పాకిస్తాన్ థార్ ఎడారి: ఇక్కడ ఆవుల బలిదానం ఉండదు, గోమాంసం విక్రయించరు
- సనా మారిన్: పదిహేనేళ్ల వయసులో బేకరీలో ఉద్యోగి... 34 ఏళ్లకు దేశ ప్రధాని
- ‘చిన్న పాప సార్... సెక్స్ అంటే ఏంటో తెలీదు.. అట్లాంటి బిడ్డను రేప్ చేసి చంపినారు’
- రోహింజ్యాల మారణహోమం ఆరోపణలు అవాస్తవం.. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆంగ్ సాన్ సూచీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








