అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ - అమెజాన్‌‌ల మధ్య వివాదంతో లాభపడిన మైక్రోసాఫ్ట్

ట్రంప్, సత్య నాదెళ్ల, జెఫ్ బెజోస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్, సత్య నాదెళ్ల, జెఫ్ బెజోస్
    • రచయిత, డేవ్ లీ
    • హోదా, నార్త్ అమెరికా టెక్నాలజీ రిపోర్టర్

జాయింట్ ఎంటర్‌ప్రైజ్ డిఫెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (జేడీ) ప్రాజెక్ట్‌కు 2018 మార్చిలో పెంటగాన్ మొట్టమొదట టెండర్లు పిలిచినప్పుడు పెద్దగా అంచనాలు లేవు. 34 లక్షల మంది యూజర్లను నిర్వహించే క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థను అమెరికా సైన్యానికి సమకూర్చే ప్రాజెక్ట్ ఇది.

ఒరాకిల్, ఐబీఎం వంటివారు కోరుకున్నట్లుగా వేర్వేరు కంపెనీలకు ఈ బాధ్యతలు అప్పగించాలని అనుకోకుండా.. రక్షణ శాఖ దీన్ని మొత్తంగా ఒక్కరికే అప్పగించాలని నిర్ణయించింది. 1000 కోట్ల డాలర్ల విలువైన ఈ ప్రాజెక్టు ఒక్క సంస్థకే అప్పగించేందుకు నిశ్చయించింది.

అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) ప్రపంచలోనే అతి పెద్ద క్లౌడ్ ప్లాట్‌ఫాం కావడంతో ఈ కాంట్రాక్టును అమెజాన్ సంస్థకు పువ్వుల్లో పెట్టి అప్పగిస్తారని నిపుణులు భావించారు.

దీనిపై క్లౌడ్ సేవలందించే సంస్థల నుంచి పెద్దఎత్తున విమర్శలు వస్తుండడంతో 'మాకెవరిపైనా ప్రత్యేక అభిమానం లేదు' అని డిఫెన్స్ డిజిటల్ సర్వీస్‌కు చెందిన తిమోతీ వాన్ చెప్పారు. ఒరాకిల్ దీనిపై కోర్టునాశ్రయించినా అమెజాన్‌కే ఇది దక్కుతుందనుకున్నారు.

కానీ, అంచనాలకు విరుద్ధంగా రక్షణ శాఖ ఆ కాంట్రాక్ట్‌ను మైక్రోసాఫ్ట్‌కు ఇచ్చింది.

దీంతో అమెజాన్ ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వాన్ని ఢీకొట్టడానికి సిద్ధమవుతోంది. అధ్యక్షుడు ట్రంప్ అనైతికంగా ఈ టెండర్ ప్రక్రియలో జోక్యం చేసుకున్నారని.. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక కూడా తనదే కావడంతో తనపై అక్కసుతో ట్రంప్ ఇలా చేశారని అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ఆరోపిస్తున్నారు.

బెజోస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బెజోస్

అమెజాన్ ఆధిపత్యానికి దెబ్బ తప్పదా

అమెజాన్ వెబ్ సర్వీసెస్ 2019లో 2500 కోట్ల డాలర్ల వ్యాపారం చేసింది. ఆ నేపథ్యంలో పదేళ్ల వ్యవధికి సంబంధించిన వెయ్యి కోట్ల డాలర్ల జేడీ కాంట్రాక్ట్ అమెజాన్‌కు దక్కడమే సరైనదనుకున్నారు.

ఇప్పటికే అమెరికా సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) కాంట్రాక్టు తమకు ఉన్నందున జేడీ కూడా తమకే దక్కుతుందని అమెజాన్ భావించింది. కానీ, తాజా పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులోనూ తమకు ఇలాంటి కాంట్రాక్టుల విషయంలో ఇబ్బంది తప్పదని అమెజాన్ ఇప్పుడు అనుకుంటోంది.

పెంటగాన్ మాదిరే ఇతర యూఎస్ విభాగాలూ ఆధునికీకరణ బాట పట్టినా కాంట్రాక్టులు అప్పగించే విషయంలో పెంటగాన్ దారిలోనే వెళ్తే ఎలా అని ఆందోళన చెందుతోంది.

ఈ కాంట్రాక్టు మైక్రోసాఫ్ట్‌కు దక్కడం వల్ల ఆ సంస్థ వాటా ఇక క్లౌడ్ మార్కెట్‌లో 17 శాతంగా ఉండనుంది. కాగా అమెజాన్ నిరసన వల్ల జేడీ నిర్ణయమేమీ మారబోదని వెడ్‌బుష్ విశ్లేషకుడు డాన్ ఈవ్స్ అన్నారు.

రానున్న దశాబ్ద కాలంలో క్లౌడ్ సేవల కోసం లక్ష కోట్ల డాలర్లు ఖర్చు చేయొచ్చన్న అంచనాల నేపథ్యంలో వెయ్యి కోట్ల డాలర్ల ఈ కాంట్రాక్టును పోగొట్టుకోవడం అమెజాన్‌కు పెద్ద దెబ్బేనని ఈవ్స్ అభిప్రాయపడ్డారు.

పునరాలోచన..

ఈ కాంట్రాక్టు అమెజాన్‌కు దక్కుతుందన్న సమయంలో జులైలో డోనల్డ్ ట్రంప్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెంటగాన్ ఈ కాంట్రాక్టు విషయంలో వ్యవహరించిన తీరుపై ప్రజలు సంతోషంగా లేరని వ్యాఖ్యానించడంతోనే జెఫ్ బెజోస్‌కు ఇబ్బందులు మొదలయ్యాయి.

అసలు ఒక్క కంపెనీకే మొత్తం కాంట్రాక్టును ఇవ్వాలని నిర్ణయించినప్పుడే కుట్ర మొదలైందని ఈ కాంట్రాక్టు కోసం ఒరాకిల్ తరఫున గట్టిగా లాబీయింగ్ చేసిన ఆ సంస్థ ఉన్నతోద్యోగులు అంటున్నారు.

''కాంపిటీటివ్ బిడ్ ప్రకారం అమెజాన్‌కు ఇవ్వలేదని నాకు చాలా ఫిర్యాదులు అందుతున్నాయి'' అని ట్రంప్ ఇంతకుముందు అన్నారు.

ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసిన అనంతరం ఆగస్టు 1న జేడీ కాంట్రాక్ట్‌ను హోల్డ్‌లో పెట్టారు. అనంతరం అక్టోబరు 25న మైక్రోసాఫ్ట్‌కు అప్పగించారు.

దీంతో ఆగ్రహించిన అమెజాన్ సంస్థ నవంబరులో ఫెడరల్ కోర్టునాశ్రయించింది. సంస్థల సామర్థ్యాలను అంచనా వేయడం ద్వారా కాకుండా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా తమకు దక్కాల్సిన కాంట్రాక్టును మైక్రోసాఫ్ట్‌కు అప్పగించారని ఆరోపించింది.

ట్రంప్, జెఫ్ బెజోస్

ఫొటో సోర్స్, GETTY IMAGES/REUTERS

ఫొటో క్యాప్షన్, ట్రంప్, జెఫ్ బెజోస్

ట్రంప్‌కి కోపం ఎందుకంటే?

అమెజాన్‌ అంటే తనకున్న అయిష్టాన్ని ట్రంప్ పదేపదే వ్యక్తంచేయడం తెలిసిందే. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడానికి ముందే అమెజాన్‌పై ఆరోపణలు చేశారు. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నప్పుడు ప్రచార సమయంలో ఆయన.. అమెరికా తపాలా వ్యవస్థను ఉపయోగించుకుని అమెజాన్ తన వస్తువులను వినియోగదారులకు చేరవేస్తోందని.. దీనివల్ల అమెరికాకు తీవ్రమైన నష్టమేర్పడుతోందని ట్రంప్ ఆరోపించారు.

జెఫ్ బెజోస్ చేతిలో వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఉండడం ట్రంప్ ఆగ్రహానికి ఒక కారణం. అధ్యక్షుడికి ఈ పత్రిక పక్కలో బళ్లెం వంటిది. అమెజాన్‌తో సంబంధం లేకుండా బెజోస్ ఈ పత్రికలో పెట్టుబడులు పెట్టినప్పటికీ ట్రంప్ దృష్టిలో మాత్రం రెండింటికీ పెద్ద తేడా లేదు. ట్రంప్ అనేకసార్లు ఆ పత్రికను అమెజాన్ వాషింగ్టన్ పోస్ట్ అంటుంటారు కూడా.

జేడీ కాంట్రాక్టు తొలుత అమెజాన్‌కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్, ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్ పలు ట్వీట్లు చేశారు.

కోర్టులో అమెజాన్ కేసు వేసినప్పుడు ఇవన్నీ వివరించింది. ట్రంప్ విమర్శలు, ట్వీట్లు, అంతర్గతంగా పెంచిన ఒత్తిడి వల్ల పెంటగాన్ నిష్పాక్షికంగా వ్యవహరించలేకపోయిందని ఆరోపించింది.

కాగా, అమెజాన్ వేసిన దావాను తాము ఎదుర్కొంటామని అండర్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఫర్ అక్విజిషన్ అండ్ సస్టెయిన్‌మెంట్ ఎలెన్ లార్డ్ మంగళవారం చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)