'ఒక ఎంపీ నన్ను రేప్ చేశాడు.. కానీ, నా తండ్రి ఎవరికీ చెప్పకుండా దాచేయమన్నాడు’ - ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కుమార్తె

ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రి బాబ్ హాక్ కుమార్తె రోసలిన్ డిలాన్.. 1980లలో తనపై ఒక ఎంపీ అత్యాచారం చేశాడని.. కానీ ఆ విషయం ఎవరికీ చెప్పకుండా దాచేయాలని తన తండ్రే తనకు సూచించాడని చెప్పారు.
రేప్ విషయంపై తాను నోరు తెరిస్తే.. తన కెరీర్ పాడవుతుందని ఆయన చెప్పాడని పేర్కొన్నారు.
రోసలిన్ ఈ ఆరోపణలను కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు. ఆస్ట్రేలియా వార్తా వెబ్‌సైట్ న్యూ డెయిలీ వీటిని చూసింది. రోసలిన్ డిలాన్ వయసు ఇప్పుడు 59 సంవత్సరాలు. తన తండ్రి ఆస్తిలో 27 లక్షల డాలర్ల (సుమారు రూ.19.2 కోట్ల) వాటా కోసం ఆమె దావా వేశారు.
బాబ్ హాక్‌కు చెందిన లేబర్ పార్టీలో ఒక ఎంపీ అయిన బిల్ లాండర్యూ కార్యాలయంలో పనిచేస్తున్నపుడు.. ఆయన తన మీద అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె చెప్తున్నారు. ఆ సమయంలో బాబ్ హాక్ లేబర్ పార్టీకి నాయకుడు అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
బాబ్ హాక్, బిల్ లాండర్యూ ఇప్పుడు సజీవంగా లేరు.
కోర్టు పత్రాల ప్రకారం.. 1983లో తన మీద మూడు సార్లు లైంగికంగా దాడి జరిగిందని రోసలిన్ డిలాన్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మూడోసారి అత్యాచారం జరిగిన తర్వాత.. ఈ విషయం తన తండ్రికి వెల్లడించి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పానని ఆమె తెలిపారు. దానికి ఆయన స్పందిస్తూ.. ''పోలీసులకు ఫిర్యాదు చేయొద్దు. ఇప్పుడు నాకు ఎటువంటి వివాదాలూ వద్దు. నన్ను క్షమించు. కానీ నేను ఇప్పుడు లేబర్ పార్టీ నాయకత్వం కోసం పోటీ చేస్తున్నాను'' అని చెప్పినట్లు ఆ పత్రాల్లో తెలిపారు.
ఈ ఆరోపణ గురించి తమ కుటుంబానికి తెలుసునని రోసలిన్ డిలాన్ సోదరి.. సూ పీటర్స్ హాక్ 'ద న్యూ డైలీ'తో చెప్పారు.
''ఆమె ఆ సమయంలోనే ఆ విషయం చెప్పింది. అప్పుడు ఆమెకు మద్దతు లభించిందని నేను భావిస్తున్నా.. కానీ అందులో న్యాయ వ్యవస్థ పాత్ర లేదు'' అని ఆమె పేర్కొన్నారు.
ఇతర కుటుంబ సభ్యులు ఆస్ట్రేలియా మీడియాతో ఈ విషయంపై స్పందించలేదు.
ఆస్ట్రేలియా కేంద్ర ప్రభుత్వ మాజీ అధికారి బిల్ లాండర్యూ 1976 నుంచి 1992 వరకూ ఎంపీగా ఉన్నారు. బాబ్ హాక్ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం.. బిల్, బాబ్ ఇద్దరి మధ్యా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్తారు.
1980లలో ఆస్ట్రేలియా రాజకీయాల్లో బాబ్ హాక్ అగ్రగణ్యుడిగా ఉండేవారు. వరుసగా నాలుగు సార్లు సాధారణ ఎన్నికల్లో గెలిచారు.
దేశంలో విప్లవాత్మక ఆర్థిక, సామాజిక మార్పులు తెచ్చారు. అతిసాధారణమైన, అతిగా బీరు తాగే వ్యక్తిగా అతడికి పేరుంది.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ ఎన్కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు
- హైదరాబాద్ ఎన్కౌంటర్: ‘పోలీసుల కథనం చిన్నపిల్లలు కూడా నమ్మేలా లేదు’
- 'గోల్డెన్ పాస్‌పోర్టుల' కోసం సంపన్నులంతా ఎందుకు ఎగబడుతున్నారు?
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన బారత్
- విమానంలో ప్రయాణికురాలిని తేలు కుట్టింది
- ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి తెలంగాణలో రేప్ నిందితుల వరకు.. ఎన్కౌంటర్లలో నిజమెంత
- పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








