కరోనావైరస్: 128 ఏళ్ల తర్వాత తొలిసారిగా తిరుమలలో దర్శనాలు రద్దు

తిరుమల తిరుపతి దేవస్థానం

ఫొటో సోర్స్, Ttd

తిరుమలలో భక్తుల దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. తిరుమల చరిత్రలో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం 128 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

1892లో రెండు రోజుల పాటు కేవలం భక్తులకు దర్శనాన్ని మాత్రమే కాదు... ఏకంగా ఆలయాన్ని కూడా మూసివేసినట్టు రికార్డుల్లో నమోదయ్యిందని టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు.

ప్రస్తుతం భక్తులకు దర్శనం టోకెన్లను ఇవ్వడం నిలిపివేశారు. ఇప్పటికే బుక్ చేసుకున్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. అలాగే శుక్రవారం ఊదయం జరిగే వివిధ సేవలకు సంబంధించి ఇప్పటికే టిక్కెట్లు తీసుకున్న భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు అనిల్ సింఘా చెప్పారు.

ఇప్పటికే తిరుమల చేరుకున్న భక్తులకు గురువారం రాత్రిలోగా దర్శనం కల్పిస్తామని స్పష్టం చేశారు. మొత్తంగా రేపు ఉదయం నుంచి భక్తుల రాకపోకల్ని టీటీడి నిలేపయనుంది. అయితే

స్వామి వారి కైంకర్యాలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయి. ఇప్పటి వరకు ఉన్న ఆదేశాల మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నామని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు తదపరి ఆదేశాలు ఉంటాయని టీటీడీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే టీటీడీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం కూడా అవకాశం ఇస్తామని సింఘాల్ చెప్పారు.

తిరుపతి

ఫొటో సోర్స్, Ttd svbc

గ‌త 10రోజులుగా త‌గ్గిన యాత్రికుల సంఖ్య‌

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి సుదీర్ఘ చ‌రిత్ర ఉంది. బ్రిటీష్ పాల‌న‌లో ఉండ‌గానే 1933లోనే టీటీడీ పాల‌క‌మండ‌లి ఏర్పాట‌య్యింది. అప్ప‌టి నుంచి వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. 1944 నాటికి తొలి ఘాట్ రోడ్డు సిద్ధమయ్యింది.

సుదీర్ఘ‌కాలం పాటు రాక‌పోక‌ల‌కు అదే రోడ్డు వినియోగించేవారు. ప్ర‌స్తుతం కొండ నుంచి దిగువ‌కు రావ‌డానికి ఆ రోడ్డు ఉప‌యోగ‌ప‌డుతోంది. ఇక కొండ‌పైకి వెళ్లేందుకు రెండో ఘాట్ రోడ్డు ప‌నులు 1978లో ప్రారంభించారు. 1980 చివ‌రి నాటికి పూర్తిగా అందుబాటులోకి వ‌చ్చింది. అప్ప‌టి నుంచి నిత్యం వేలాది మంది భ‌క్తులు ద‌ర్శ‌నాల కోసం త‌గ్గ‌ట్టుగా వివిధ ఏర్పాట్లు విస్తృత‌మ‌వుతూ వ‌స్తున్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం

ప్ర‌స్తుతం ప్రపంచంలోనే అత్య‌ధిక ఆదాయం క‌లిగిన దేవ‌స్థానాల జాబితాలో అగ్ర‌స్థానంలో టీటీడీ ఉంటుంది. బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో రోజుకి ల‌క్ష మందికి పైగా యాత్రికుల‌కు ద‌ర్శ‌నాలు క‌ల్పించిన చ‌రిత్ర ఉంది. సాధార‌ణ సీజ‌న్ లో కూడా క‌నీసంగా నిత్యం 60వేల‌కు త‌గ్గ‌కుండా యాత్రికులు వ‌స్తూ ఉంటారు.

కానీ ఇటీవ‌ల క‌రోనా ప్ర‌భావం కార‌ణంగా భ‌క్తుల సంఖ్య అనూహ్యంగా త‌గ్గిపోయింది. గ‌త ఏడాదితో పోలిస్తే 30 శాతం త‌గ్గుద‌ల న‌మోద‌య్యింది. మార్చి 16 న 55,827 మంది ద‌ర్శ‌నాలు చేసుకున్నారు. 17న ఆ సంఖ్య 49,229 కి త‌గ్గింది. 18 వతేదీన 48,041 మంది ద‌ర్శ‌నాలు చేసుకున్నారు. గ‌త ఏడాది ఇదే కాలంలో ద‌ర్శ‌నాలు చేసుకున్న వారి సంఖ్య 65 నుంచి 70వేల మ‌ధ్యలో ఉంది.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

గ‌త ఏడాది మార్చిలో దాదాపు 18ల‌క్ష‌ల మంది యాత్రికులు తిరుమ‌ల ఆల‌యంలో ద‌ర్శ‌నాలు చేసుకున్నారు. అయితే ఈసారి వారి సంఖ్య సుమారు 14ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉండ‌వ‌చ్చ‌ని టీటీడీ అధికారులు అంచ‌నాలు వేశారు.

అయితే ప్ర‌స్తుతం క‌రోనా వ్యాప్తిని నివారించే చ‌ర్య‌ల్లో భాగంగా ఆల‌యానికి ద‌ర్శ‌నాల కోసం వ‌చ్చే వారిపై ఆంక్ష‌లు విధించ‌డంతో రాబోయే కొద్ది రోజుల పాటు తిరుమ‌ల పూర్తిగా బోసిపోయే అవ‌కాశం క‌నిపిస్తోంది.

తిరుపతి

ఫొటో సోర్స్, Ttd svbc

గ్ర‌హ‌ణాలు, సంప్రోక్ష‌ణ వంటి సంద‌ర్భాల్లోనే మూసివేత‌

తిరుమ‌ల ఆల‌యానికి సుదీర్ఘ చ‌రిత్ర ఉంది. శ‌తాబ్దాల కాలం నుంచి నిత్యం భ‌క్తుల రాక‌పోక‌లు సాగుతున్నాయి. అయితే గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో తొలిసారిగా వ్యాధులు, వైర‌స్ లో వ్యాప్తి కార‌ణంగా యాత్రికుల‌ను తిరుమ‌ల‌కు రావ‌ద్ద‌ని చెప్ప‌డం ఇదే తొలిసారిగా తిరుప‌తికి చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ వి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

ఆయ‌న బీబీసీతో మాట్లాడుతూ గ్ర‌హ‌ణాల సంద‌ర్భంగా కొన్ని గంట‌ల పాటు ఆల‌యాలు మూసివేయ‌డం చాలా సాధార‌ణం. రెండేళ్ల క్రితం సంప్రోక్ష‌ణ పేరుతో బాలాల‌యం కోసం 9 రోజుల పాటు ద‌ర్శ‌నాలు నిలిపివేశారు. బంద్ , ఇత‌ర ఆందోళ‌న‌ల కార‌ణంగా కొన్ని రోజుల పాటు భ‌క్తుల రాక‌పోక‌ల‌కు ఆటంకాలు ఏర్ప‌డిన అనుభ‌వాలున్నాయి.

స‌మైక్యాంధ్ర ఉద్య‌మం స‌మ‌యంలో కొంత‌కాలం అలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింది. కానీ తొలిసారిగా టీటీడీ అధికారులే భ‌క్తులు రావ‌ద్ద‌ని చెప్ప‌డం విశేష‌మే. గ‌తంలో ఎన్న‌డూ ఇలా జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు కూడా ఎన్ని రోజుల పాటు ఆల‌యంలో ద‌ర్శ‌నాలు నిలిపివేస్తున్నార‌న్న‌ది స్ప‌ష్ట‌త రావ‌డం లేదు అంటూ తెలిపారు.

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)