కరోనావైరస్: దేశంలో 4కు చేరిన మరణాలు, మార్చి 22 నుంచి అంతర్జాతీయ విమానాలన్నీ రద్దు

మాస్కు ధరించిన మహిళలు

ఫొటో సోర్స్, EPA

దేశంలో కరోనావైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. పంజాబ్‌కు చెందిన 70 ఏళ్ల వ్యక్తి తాజాగా మరణించారు. ఆ వ్యక్తి ఇటీవల జర్మనీ నుంచి ఇటలీ మీదుగా భారత్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఇంతకుముందు కర్నాటకలో ఒకరు, దిల్లీలో ఒకరు, మహారాష్ట్రలో ఒకరు చనిపోయారు.

కీలక సూచనలు చేసిన కేంద్రం

ఈ నెల 22 నుంచి వారం రోజుల పాటు అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు పలు కీలక సూచనలు కూడా చేసింది.

పదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లకు పైబడిన వృద్ధులు ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని సూచించింది.

ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే సదుపాయం కల్పించాలని కోరింది.

దేశవ్యాప్తంగా మెట్రోలు, రైల్వేలు, విమానాలు, బస్సు సర్వీసులను తగ్గించాలని ప్రభుత్వం సూచించింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రూప్ సీ, డీ ఉద్యోగులు వారం విడిచి వారం విధులకు హాజరవ్వాలని చెప్పింది. ఏ,బీ క్యాటగిరికి చెందిన ఉద్యోగులకు పని గంటల్ని తగ్గించాలని సూచించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
కరోనావైరస్ ఐసోలేషన్ వార్డు

ఫొటో సోర్స్, HEALTH DEPARTMENT

ప్రైవేటు ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్ర ఆదేశించిందని అన్నారు. అయితే ఆంక్షల నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

కోవిడ్-19 విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యలకు యువత సహాయ సహకారాలందించాలని కేంద్రం కోరింది. ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచించింది. దేశవ్యాప్తంగా అన్ని విద్యాలయాలు, థియేటర్లు, మ్యూజియంలు, క్లబ్బులు తాత్కాలికంగా మూసివేయాలని సూచించింది.

అలాగే అన్ని రకాల ఫంక్షన్లను కూడా వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

రోగులకు, వికలాంగులకు, విద్యార్థులకు తప్ప మిగిలిన అందరికీ రైల్వే శాఖ అందిస్తున్న రాయతీలను కూడా ఈ అర్థరాత్రి నుంచి నిలిపేస్తున్నట్టు కేంద్రం తెలిపింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)