Coronavirus: ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించండి - ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, dd news

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

‘‘నా ప్రియమైన దేశ ప్రజలారా.. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఒక తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒక ప్రకృతి విపత్తు సంభవిస్తే అది కొన్ని దేశాలకు పరిమితమవుతుంది. కానీ ఈ మహమ్మారి మానవాళి మొత్తాన్నీ చుట్టుముట్టింది.

కరోనావైరస్ ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంటే మనం గత రెండు నెలలుగా ఆందోళనగా చూస్తున్నాం. 130 కోట్ల మంది భారతీయులు ఈ ప్రపంచ మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. జాగ్రత్తలు పాటించటానికి తీవ్రంగా కృషి చేశారు.’’

అంతా బాగానే ఉందనుకోవటం తప్పు...

‘‘అయితే.. కొన్ని రోజులుగా అంతా బాగానే ఉందన్న అభిప్రాయం ఏర్పడింది. కానీ కరోనావైరస్ వంటి ఒక ప్రపంచ మహమ్మారిని తేలికగా తీసుకోవటం సరికాదు.

పౌరులందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. మనమంతా ఉమ్మడిగా కరోనావైరస్ మీద పోరాడాలి.

నేను భారత ప్రజలను ఎప్పుడు ఏది కోరినా ఎన్నడూ నిరాశచెందలేదు. మీ అందరి ఆశీస్సులతోనే మనం లక్ష్యాల దిశగా పయనిస్తున్నాం. ఇప్పుడు ప్రజలందరినీ మరొకటి కోరుతున్నా.

నాకు మీకు రాబోయే కొన్ని వారాలు కావాలి. మీ రాబోవు సమయం కొంత కావాలి.

ఇప్పటివరకూ కరోనా మహమ్మారి నుంచి బయటపడడానికి ఎలాంటి పరిష్కారం దొరకలేదు. దానికి ఎలాంటి వ్యాక్సిన్ కనుగొనలేదు. అలాంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరిలో ఆందోళన ఉండడం సర్వ సాధారణం.

కొన్ని దేశాల్లో కరోనావైరస్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ పరిశోధనల్లో మరో విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత హఠాత్తుగా వ్యాధి విస్ఫోటనంలా వ్యాపించింది.

ఈ దేశాల్లో వైరస్ సోకిన రోగుల సంఖ్య చాలా వేగంగా పెరిగింది. ఈ విశ్వ మహమ్మారి వ్యాపించడాన్ని, దీని ట్రాక్ రికార్డు మీద భారత ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టింది.

ఇటీవల కొన్ని దేశాలు తగిన నిర్ణయాలు తీసుకున్నాయి. తమ దేశంలో రోగులకు వీలైనంత వరకూ ఏకాంతంగా ఉండేలా చేసి పరిస్థితిని చక్కదిద్దాయి. అందులో పౌరుల పాత్ర చాలా కీలకం.’’

కరోనావైరస్ నుంచి మిమ్మల్ని మీరు ఇలా రక్షించుకోండి

మహమ్మారిని సంకల్ప బలంతో ఎదుర్కొందాం...

‘‘మిగతా పెద్ద పెద్ద దేశాల్లో ప్రభావం ఎలా ఉందో మనం చూస్తున్నాం. భారత్ మీద దాని ప్రభావం లేదని అనుకోవడం తప్పు. అందుకే ఈ విశ్వ మహమ్మారిని ఎదుర్కోవడానికి రెండు విషయాలు చాలా ముఖ్యం. మొదటిది సంకల్పం, రెండోది సంయమనం.

ఈ రోజు 130 కోట్ల మంది దేశ ప్రజలు తమ సంకల్పం, ఈ విశ్వ మహమ్మారిని ఆపడానికి ప్రతి ఒక్కరూ తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని సంకల్పం పూనాలి. ఈ వైరస్ వ్యాపించకుండా చూడాలి.

మిత్రులారా.. ఇలాంటి విశ్వ మహమ్మారి ఒకే మంత్రాన్ని చెబుతుంది. మనం ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటి స్థితిలో మనం ఆరోగ్యంగా ఉండడం అత్యంత అవసరం.

ఈ వ్యాధి నుంచి బయటపడడానికి.. మనం స్వయంగా ఆరోగ్యంగా ఉండడానికి చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని - స్వచ్ఛందంగా... స్వయంగా జనం నుంచి దూరంగా ఉండడం. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండడం. దీనినే సోషల్ డిస్టాన్సింగ్ అని చెప్తున్నారు.’’

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

సోషల్ డిస్టాన్సింగ్ చాలా అవసరం...

‘‘ప్రపంచ మహమ్మారిని ఎదుర్కోవటానికి ఈ సోషల్ డిస్టాన్సింగ్ చాలా అవసరం. అందులో మన సంకల్పం చాలా కీలక పాత్ర పోషిస్తుంది.

అందుకే.. మీరు ఆరోగ్యంగా ఉన్నారని అనిపిస్తే, మీకు ఏం కాదని అనిపిస్తే.. బయటకు వెళ్తూ ఉంటే.. కరోనావైరస్ నుంచి సురక్షితంగా బయటపడాతామని అనుకుంటే ఆ ఆలోచన మంచిది కాదు.

అలా మీరు, మీకు, మీ కుటుంబానికి అన్యాయం చేస్తున్నారు. అందుకే రాబోయే కొన్ని వారాలపాటు అత్యంత అవసరమైతే తప్ప మీ ఇంటి నుంచి బయటకు రావొద్దని నా వినతి.

వీలైనంత వరకూ వ్యాపారమైనా, ఆఫీసు అయినా.. మీ ఇంటి నుంచే పని చేయండి. ప్రభుత్వ సేవల్లో, ఆస్పత్రుల్లో ఉన్నవవారు, మీడియా అందరూ క్రియాశీలంగా ఉండడం అవసరం. కానీ, సమాజంలో మిగతా వారంతా స్వయంగా మిగతా జనానికి, మిగతా సమాజానికి దూరంగా ఉండాలని నా వినతి.

మన కుటుంబంలో వృద్ధులు ఉంటే.. వారు రాబోవు కొన్ని వారాల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని నా వినతి. 60, 65 సంవత్సరాల పైన వయసున్న వారు ఇంటి నుంచి బయటకు వెళ్లకండి.’’

నరేంద్రమోదీ

ఫొటో సోర్స్, Getty Images

మార్చి 22న జనతా కర్ఫ్యూ పాటిద్దాం...

‘‘వచ్చే ఆదివారం మార్చి 22వ తేదీన ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని కోరుతున్నా. ఇది ప్రజల కోసం, ప్రజలే పాటించే కర్ఫ్యూ కావాలి.

మార్చి 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ దేశప్రజలందరూ ప్రజా కర్ఫ్యూను అమలు చేయాలి.

ఆ రోజంతా మీరు మీ ఇళ్లలోనే ఉండండి. అవసరమైన పనులు ఉన్నవాళ్లు మాత్రమే బయటకు వెళ్లాలి. వారికి బాధ్యత ఉంటుంది. కానీ పౌరులుగా.. ఎవరినీ చూడ్డానికి కూడా వెళ్లకండి. సంకల్పం తీసుకోండి.

దేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా మార్చి 22న జనతా కర్ఫ్యూ అమలు చేయాలని కోరుతున్నా.

ఆదివారం నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకూ పాటించే ఈ ప్రజా కర్ఫ్యూ సందేశాన్ని ప్రజల వరకూ చేర్చాలి. వారిని చైతన్యం చేయాలి.

పది మంది కొత్తవారికి ఫోన్ చేసి దీని గురించి చెప్పాలి. కరోనావైరస్ లాంటి విశ్వమహమ్మారి మీద యుద్ధం కోసం భారత్ ఎంత సిద్ధగా ఉందో చూపాల్సిన సమయం ఇది.’’

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్
పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

రొటీన్ చెకప్‌లు, సర్జరీలు వాయిదా వేసుకోండి

‘‘నేను మార్చి 22న ఆదివారం నేను మీ అందరితో మాట్లాడతాను.

పోలీసులు, డాక్టర్లు, నర్సుల నుంచి డెలివరీ బాయ్‌ల వరకూ ప్రతి ఒక్కరూ తమ గురించి పట్టించుకోకుండా ఇతురుల సేవలో ఉన్నారు. ఇప్పటి పరిస్థితులు అసాధారణమైనవి. వారికి ఈ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంది. అయినా వారు తమ కర్తవ్యం నిర్వహిస్తున్నారు.

వారు దేశ రక్షకుల్లా కరోనా మహమ్మారికి, మనకు మధ్య ఒక శక్తిలా ఉన్నారు. దేశం అలాంటి చిన్నాపెద్దా అందరికీ, సంస్థలకూ కృతజ్ఞతలు తెలుపుతోంది.

మార్చి 22 ఆదివారం రోజున మనం అలాంటి వారందరికీ ధన్యవాదాలు చెబుతాం. ఆదివారం ప్రజా కర్ఫ్యూ రోజున సాయంత్రం 5 గంటలకు.. 5 నిమిషాల పాటు అలాంటి వారికి ధన్యవాదాలు చెబుదాం. వారికి సెల్యూట్ చేద్దాం. సేవా పరమో ధర్మ అనే మన సంస్కృతిని పాటించే అందరూ ఇలాంటి వారి కోసం మన కృతజ్ఞతను వ్యక్తం చేద్దాం.

సంక్షోభ సమయంలో మీరు మరొకటి గుర్తుంచుకోవాలి. మన అత్యవసర సేవల కోసం మన హాస్పిటళ్ల మీద ఒత్తిడి ఉంది. రొటీన్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లాల్సి ఉంటే.. వాటి నుంచి దూరంగా ఉండండి. మీకు అత్యవసరమైతే తప్ప.. మీ ఫ్యామిలీ డాక్టర్.. ఎవరైనా ఉంటే ఫోన్ చేసి అవసరమైన సలహాలు తీసుకోండి. అవసరమైన సర్జరీలు తేదీ తసుకుంటే దాన్ని కూడా వాయిదా వేసుకోండి. నెల తర్వాత తేదీ తీసుకోండి.

నిత్యావసరాల కోసం హడావుడి పడవద్దు...

కోవిడ్ - 19 ఎకానమిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. అది నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్థిక సమస్యలను తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది కూడా చూస్తుంది.

ఈ మహమ్మారి దేశ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదల ఆర్థికపరిస్థితికి నష్టం కలిగించింది. ఈ సంక్షోభ సమయంలో నా దేశ వ్యాపారులు.. ఉన్నతాదాయ వర్గాలకు వీలైతే మీరు ఎవరి నుంచి సేవలు పొందుతుంటారో వారి ఆర్థిక పరిస్థితిపై దృష్టి పెట్టండి. రాబోయే రోజల్లో వారు మీ ఇళ్లకు రాకపోయినా దయ చూపండి.

నా దేశ ప్రజలకు దేశంలో పాలు, ఆహార పదార్థాలు, మందులు, నిత్యావసర వస్తువుల లోటు లేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. అందుకే ప్రజలు అవసరమైన సామాన్లు సేకరించుకోడానికి హడావుడి పడకండి. మీరు మొదట ఎలా ఉన్నారో.. అలాగే ఉండండి.. హడావుడి వద్దు.

గత రెండు నెలల్లో ప్రతి పౌరుడు.. దేశం ముందుకు వచ్చిన ఈ సంక్షోభాన్ని దేశ ప్రజలు తమ కష్టంగా భావించారు. భారత్ కోసం, రాబోవు సమయంలో కూడా మనందరం మన కర్తవ్యాలను బాధ్యతను ఇలాగే నిర్వహిస్తుంటామని ఆశిస్తున్నా.

ఇలాంటి సమయంలో కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి. చాలాసార్లు పౌరులుగా మన ఆకాంక్షలు కూడా నెరవేరవు. అయినా.. ఈ కష్టం ఎంత పెద్దదంటే.. ఒక దేశం మరో దేశానికి సాయం చేయడంలేదు. అందుకే దేశ ప్రజలందరూ ఈ దృఢ సంకల్పంతో ఈ కష్టాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది.

మిత్రులారా.. మనం ఇప్పుడు మన పూర్తి సామర్థ్యాలను వెచ్చించి మనల్ని కాపాడుకోడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ రోజు దేశంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలైనా, స్థానిక సంస్థలైనా, పౌర సమాజాలైనా.. ఈ మహమ్మారి నుంచి కాపాడడానికి తమ వంతు భాగస్వామ్యం అందిస్తున్నాయి. ఈ వాతావరణంలో మానవాళి విజయం సాధించాలి. భారత్ విజయం సాధించాలి.

నవరాత్రి వస్తోంది. ఈ శక్తి ఉపాసన.. భారత్ ఈ సంకల్పంతో భారత్ ముందుకు వెల్లాలి.. అవసరమైన చర్యలు చేపట్టాలి. మనని కాపాడుకుందాం. ఈ దేశాన్ని కాపాడుకుందాం. జనతా కర్ఫ్యూ పాటించాలని మరోసారి కోరుతున్నా. మీకు చాలా ధన్యవాదాలు.''

BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

హెల్ప్ లైన్ నంబర్లు
కరోనావైరస్

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)