నిర్భయ రేప్ కేసు: విషాదం, ఆగ్రహం కమ్మేసిన భారత్‌ను ఒక్కతాటి పైకి తెచ్చిన కేసు

ఫొటో సోర్స్, JEWEL SAMAD
- రచయిత, ప్రియాంక దూబే
- హోదా, బీబీసీ ప్రతినిధి
క్షమాభిక్ష పిటిషన్లు కొట్టివేయడంతో 2012 డిసెంబర్‌లో జరిగిన నిర్భయ ఘటనలో దోషులు ముకేష్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ కుమార్, అక్షయ్ కుమార్‌కు ఉరిశిక్ష ఖరారైంది.
21వ శతాబ్దంలో భారత్‌ను దిగ్భ్రాంతికి గురిచేసిన అత్యంత దారుణమైన అత్యాచారం కేసు తన తుది ముగింపు వైపు కదులుతున్నట్లు కనిపిస్తోంది. నలుగురినీ మార్చి 20న ఉరితీయాలని కోర్టు తీర్పు ఇచ్చింది.
దిల్లీలోని పటియాలా హౌజ్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ప్రకారం, మార్చి 20 (శుక్రవారం) ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు.
భారతీయుల స్మృతిపథంలో రాబోవు మరికొన్నేళ్ల పాటు సజీవంగా నిలిచిపోయే ఒక కేసుగా నిర్భయ ఘటన మిగిలింది.
అంతేకాదు, ఈ ఘటన తర్వాత భారత చట్ట వ్యవస్థలో మహిళల కోసం వచ్చిన ఎన్నో మార్పుల వల్ల కూడా ఈ కేసు అందరికీ శాశ్వతంగా గుర్తుండిపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images
భయానకమైన 2012 డిసెంబర్ 16 రాత్రి
ఏడేళ్ల క్రితం డిసెంబర్ 12న 23 ఏళ్ల నిర్భయ తన స్నేహితుడితో కలిసి దిల్లీలోని సాకేత్ సెలెక్ట్ సిటీ వాక్ సినిమా హాల్‌లో 'లైఫ్ ఆఫ్ పై' సినిమా చూడ్డానికి వెళ్లింది.
ఒక కాల్ సెంటర్‌లో పనిచేస్తూ, ఆ జీతంతో ఫిజియోథెరపీ కోర్స్ చదువుతున్న నిర్భయ ఆ సాయంత్రం ప్రతి విషయంలో ఆశలే ఊపిరిగా సాగే యువ భారతానికి ఒక ప్రతీకగా నిలిచింది.
కష్టపడి పనిచేస్తూ, కలలను నిజం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, వారమంతా పనిచేశాక మీలా, నాలా.. ఒక ఆదివారం స్నేహితుడితో కలిసి సినిమా చూడ్డానికి వెళ్లాలనుకునే ఒక సగటు యువతి ఆమె.
ఆ సాయంత్రం నిర్భయ తన స్నేహితుడితో కలిసి సినిమా చూస్తోంది. అదే సమయంలో దక్షిణ దిల్లీ, ఆర్కే పురం ప్రాంతం, రవిదాస్ బస్తీలోని 31 ఏళ్ల రాంసింగ్ తన సోదరుడు ముకేశ్ సింగ్‌తో కలిసి ఆదివారం జల్సా చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. అదే కాలనీలో ఉండే పవన్ గుప్తా, వినయ్ శర్మ ఈ సోదరులతో కలిశారు.
మత్తు, ఉన్మాదం తలకెక్కిన ఈ నలుగురూ తర్వాత బస్ క్లీనర్‌గా పనిచేసే అక్షయ్ ఠాకూర్, ఒక మైనర్ బాలుడిని కూడా తమతోపాటూ తీసుకెళ్లారు.

ఫొటో సోర్స్, PRAKASH SINGH
ఇక్కడ, సినిమా చూశాక నిర్భయ, ఆమె స్నేహితుడు తిరిగి ఇల్లు చేరడానికి ఆటో కోసం చూస్తున్నారు. చాలాసేపటి వరకూ ద్వారక వెళ్లడానికి ఒక్క వాహనం దొరకలేదు. ఎలాగోలా వారు ఒక ఆటోలో మునీర్‌కా బస్ స్టాండ్ వరకూ చేరుకోగలిగారు. అక్కడ కూడా ద్వారక వెళ్లడానికి వాహనాలేవీ లేవు.
ఏం చేద్దామా అనుకుంటున్న, నిర్భయ, ఆమె స్నేహితుడి ముందు ఒక తెల్లటి ప్రైవేట్ బస్సు వచ్చి ఆగింది. లోపల్నుంచి ద్వారకా- ద్వారకా అనే శబ్దం వినిపించడంతో ఇద్దరూ అందులో ఎక్కేశారు. బస్సులో తాము ప్రయాణికులు అనుకున్న ఆరుగురూ నిజానికి, జల్సా చేయాలనే ఉద్దేశంతో దిల్లీలోని ఒక మురికివాడ నుంచి అప్పుడే బయటికొచ్చారని వారికి తెలీదు.
రాత్రి సుమారు 9.30 అవుతోంది. బస్సు మునీర్‌కా నుంచి మహిపాల్‌పూర్ దగ్గరకు చేరుకోగానే మైనర్ బాలుడు, అతడి స్నేహితులు ఇద్దరితో గొడవ మొదలెట్టారు.
మాటామాటా పెరగడంతో మొదలైన ఒక మామూలు గొడవ తర్వాత, ఒక గంటపాటు జరిగింది బహుశా స్వతంత్ర భారతదేశ చరిత్రపై ఎప్పటికీ మాయని ఒక గాయంలా, చెరగని మచ్చలా మిగిలిపోయింది.
రాంసింగ్ అతడి సహచరులు ఒకవైపు నిర్భయ స్నేహితుడిని కొడుతుంటే, మరోవైపు నిర్భయను బస్ వెనక్కు తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు. నిందితులు అక్కడే ఆమెపై వంతులవారీగా అత్యాచారం చేశారు. ఎదురు తిరిగిన ఆమె శరీరంలోకి ఐరన్ రాడ్‌ను చొప్పించి అత్యంత క్రూరంగా ప్రవర్తించారు.
ఆమె స్నేహితుడిని కూడా రక్తం వచ్చేలా కొట్టారు. ఒక గంటపాటు ఈ హింసాకాండ కొనసాగుతున్న సమయంలో ఆ తెల్లటి ప్రైవేట్ బస్ దక్షిణ దిల్లీ అంతా చక్కర్లు కొడుతోంది. ఆ తర్వాత బాధితురాలు చనిపోయిందని భావించిన వారు ఆమెను రోడ్డు పక్కన విసిరేశారు.
ఇద్దరి మొబైల్ ఫోన్, పర్స్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులు లాక్కున్నారు. తర్వాత బాధితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, తమను బయటికి విసిరేసిన తర్వాత బస్సుతో తొక్కించి ప్రాణాలు తీయాలని దోషులు ప్రయత్నించినట్టు బాధితులు చెప్పారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES
మృత్యువుతో పోరాటం
ఇంటి దగ్గర సాయంత్రం కూతురి కోసం ఎదురుచూస్తున్న నిర్భయ తల్లిదండ్రులు రాత్రి పది గంటల నుంచీ నుంచీ ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించారు. కానీ ఫోన్ స్విచాఫ్ చేసినట్లు వస్తోంది.
రాత్రి 11.15కు నిర్భయ తండ్రికి ఒక ఫోన్ వచ్చింది. చేసినవారు నిర్భయకు యాక్సిడెంట్ అయ్యిందని చెప్పగానే, కుటుంబం వెంటనే సఫ్దర్ గంజ్ ఆస్పత్రి చేరుకుంది. అక్కడ బాధితురాలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
మంచు దుప్పటి కప్పేసిన దిల్లీ తర్వాత రోజు ఉదయం చరిత్రలోనే ఒక దారుణమైన ఘటన గురించి వింటూ మేల్కోబోతంది. వైద్య పరీక్షల్లో నిందితులు ఐరన్ రాడ్‌తో బాధితురాలిపై క్రూరంగా దాడి చేశారని, ఆమె ప్రైవేట్ పార్ట్స్‌తో దానిని చొప్పించడంతోపాటూ, ఆమె పేవులు కూడా బయటకు తీశారని తెలిసింది.
నిర్భయకు చికిత్స చేసిన డాక్టర్లు తమ మొత్తం మెడికల్ కెరీర్‌లో అంత భయంకరమైన సామూహిక అత్యాచారం కేసు ఎప్పుడూ చూడలేదని మీడియాతో చెప్పారు.
తర్వాత రెండు వారాల వరకూ నిర్భయ మృత్యువుతో పోరాడింది. కానీ ఆమె శరీరమంతా తగిలిన గాయాలు, పేవులు పూర్తిగా బయటకు లాగేయడంతో ఆమె కోలుకునే అవకాశాలు అంతకంతకూ క్షీణించాయి. ఆమె స్నేహితుడిని మాత్రం ప్రాథమిక చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు.
నిర్భయ పరిస్థితి క్షీణించడం చూసిన అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 27న ఆమెను ఎయిర్ అంబులెన్స్‌లో సింగపూర్ పంపించాలనే నిర్ణయం తీసుకున్నారు.
తర్వాత ఒక్కరోజుకే, అంటే డిసెంబర్ 29న ఉదయం నిర్భయ సింగపూర్ ఆస్పత్రిలో మృతిచెందింది.
కానీ ఆ విషాదం, ఆమె అకాల మరణం దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఉద్యమానికి మొదటి అడుగుగా మారింది. ఆ ప్రభావం ఇప్పటికీ దిల్లీ జంతర్ మంతర్ నుంచి పట్నా, హైదరాబాద్, బెంగళూరు వరకూ జరిగిన స్త్రీవాద ఉద్యమాల్లో కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, AFP
వ్యతిరేక ప్రదర్శనలు, జస్టిస్ వర్మ కమిటీ
భారత్‌తోపాటూ మొత్తం ప్రపంచమంతా ఇప్పుడు నిర్భయ పేరుతో గుర్తింపు పొందిన బాధితురాలికి అండగా దేశమంతా ఒక్కటైంది. దిల్లీ సహా భారత్‌లోని అన్ని రాష్ట్ర రాజధానుల్లో క్యాండిల్స్, ప్లకార్డులు పట్టుకుని 'అత్యాచార చేసినవారికి ఉరిశిక్ష వేయండి', 'అమ్మాయిల బట్టల కాదు, మీ ఆలోచనలు మారాలి', 'కూతుళ్లకు రక్షణ కావాలి' అనే నినాదాలు చేశారు.
స్వతంత్రం వచ్చిన తర్వాత దేశమంతటా తీవ్ర విషాదం, ఆగ్రహం ఒకేసారి కమ్మేసిన ఒక అరుదైన, చారిత్రక ఘటన ఇది. పోలీసులు టియర్ గ్యాస్, లాఠీఛార్జీలు, వాటర్ క్యానన్లు ఉపయోగించినా దిల్లీ ఇండియా గేట్ ముందు నిరసనకారులు వెనక్కు తగ్గలేదు.
వరుసగా వారాలపాటు జరిగిన నిరసనల తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వర్మ అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. జస్టిస్ వర్మ కమిటీ పేరుతో గుర్తింపు పొందిన ఈ కమిటీకి మహిళలకు భద్రత కల్పించేలా కొత్త చట్టం తీసుకువచ్చే బాధ్యతలు అప్పగించారు.
స్త్రీ సురక్షా అంశంపై దేశవ్యాప్తంగా అందిన సలహాల ఆధారంగా కేవలం 29 రోజుల్లో సిద్ధం చేసిన 630 పేజీల కమిటీ రిపోర్ట్, తర్వాత 2013లో ఆమోదం పొందిన 'క్రిమినల్ అమెండ్‌మెంట్ యాక్ట్'కు ఆధారం కూడా అయ్యింది.
ఈ కొత్త చట్టం ప్రకారం ప్రత్యేక కేసుల్లో అత్యాచారానికి విధించే శిక్షను ఏడేళ్ల నుంచి పెంచి, జీవిత ఖైదుగా పెంచారు.
దానితోపాటూ, మానవ అక్రమ రవాణా, లైంగిక హింస, యాసిడ్ దాడులపై కూడా కొత్త నిబంధనలు జోడించారు.
జస్టిస్ వర్మ కమిటీ రిపోర్టును ఒక వైపు ప్రధాన పార్టీలన్నీ స్వాగతిస్తుంటే, మరోవైపు సైన్యం, భద్రతాదళాల ద్వారా మహిళలపై జరిగే హింస లాంటి వివాదాస్పద అంశాలపై స్పష్టత ఇవ్వలేదని ఒక వర్గం ఈ రిపోర్టును విమర్శించింది.

ఫొటో సోర్స్, DELHI POLICE
పోలీసు దర్యాప్తు, అరెస్టులు
నిర్భయ కేసులో వారంలోపే రామ్‌సింగ్, ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్, ఒక మైనర్ బాలుడు సహా మొత్తం ఆరుగురిని దిల్లీ పోలీస్ అదుపులోకి తీసుకున్నారు. రహదారిలో ఉన్న దుకాణాల సీసీటీవీల నుంచి లభించిన పుటేజ్ ద్వారా బాధితురాలిని తీసుకెళ్లిన తెల్ల ప్రైవేట్ బస్సును గుర్తించారు.
ఫోరెన్సిక్ ఆధారాలు, బాధితుల వాంగ్మూలం ఆధారంగా ఒక బలమైన కేస్ సిద్ధం చేసిన పోలీసులు అరెస్టు చేసిన వారం లోపే వారిపై కోర్టులో చార్జిషీటు ఫైల్ చేశారు. పోలీసుల దర్యాప్తుతోపాటూ చనిపోడానికి ముందు నిర్భయ స్పష్టంగా ఇచ్చిన వాంగ్మూలం, కోర్టు ఎదుట ఆమె స్నేహితుడు ఇచ్చిన బలమైన వాంగ్మూలం ఈ కేసును బాధితురాలి పక్షాన నిలపడంలో కీలక పాత్ర పోషించాయి.
ఆలోపు మార్చి 2013లో ఈ కేసులో ప్రధాన నిందితుడు రాంసింగ్ తీహార్ జైలులో చనిపోయాడు. రాంసింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. 2013లో ఆగస్టులో మైనర్ నిందితుడిని అత్యాచారం, హత్య కేసులో దోషిగా చెప్పిన జువైనల్ కోర్టు.. అతడిని 3 ఏళ్ల చైల్డ్ ఇంప్రూవ్‌మెంట్ హోంకు పంపించింది.

ఫొటో సోర్స్, AFP
దోషులకు ఉరిశిక్ష
2013 సెప్టెంబర్‌లో దిల్లీలోని ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సామూహిక అత్యాచారం, హత్య, ఆధారాలు చెరిపివేసినందుకు మిగిలిన నలుగురు దోషులు ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ ఠాకూర్‌లను దోషులుగా ఖరారు చేసింది. కోర్టు బయట నిలబడిన నిరసనకారులు వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
శిక్షను తగ్గించాలని వేసిన అన్ని పిటిషన్లను తోసిపుచ్చిన కింది కోర్టు ఆ నలుగురికి ఉరిశిక్ష విధించింది. వారు చేసిన నేరాన్ని క్రూరం, అమానవీయంగా చెప్పిన యోగేష్ ఖన్నా కోర్టు ఇలాంటి అమానవీయ క్రూర నేరాన్ని చూస్తూ కళ్లు మూసుకోలేమని చెప్పింది.
అయితే 2013 సెప్టెంబర్ నుంచి, ఇప్పుడు 2020 ఫిబ్రవరి వరకూ ఈ కేసు దిల్లీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు, తర్వాత దోషుల దయాభిక్ష పిటిషన్లతో రాష్ట్రపతి భవన్ తలుపు తట్టే వరకూ వచ్చింది. కానీ ప్రతి దగ్గరా దోషులకు మరణశిక్షను రద్దు చేయాలనే పిటిషన్లను కొట్టిపారేస్తూ వచ్చారు.

దోషులు తమ ఉరిశిక్ష వాయిదా, క్షమాభిక్ష పిటిషన్లు, చట్టపరమైన దరఖాస్తులు లాంటి అన్ని మార్గాలనూ ఉపయోగించుకోవచ్చని ఫిబ్రవరి 5న సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. కానీ అప్పుడు కూడా క్షమాభిక్ష కోసం వారు పెట్టిన అన్ని పిటిషన్లనూ కొట్టిపారేశారు.
అటు నిర్భయ తల్లి, ఆశా దేవి కూడా దోషుల ఉరిశిక్ష వేయడంలో జరుగుతున్న జాప్యంపై వరుసగా ప్రశ్నలు సంధిస్తూ వచ్చారు. క్షమాభిక్ష పిటిషన్లను ఉపయోగిస్తూ దోషులు కేసును సాగదీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఫిబ్రవరి 14న వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు నలుగురు దోషులకూ కొత్త డెత్ వారెంట్ జారీ చేయడానికి దిల్లీ పోలీసులకు అనుమతి ఇచ్చింది.
దోషులను ఉరి తీయడానికి మీరట్ నుంచి పిలిపించిన తలారి తీహార్ జైలుకు కూడా చేరుకున్నారు. కొత్త డెత్ వారెంట్ జారీ అయ్యింది కాబట్టి దోషులకు ఉరిశిక్ష అయితే వేస్తారు,
కానీ దీనిని విస్తృత పరిధిలో చూస్తే దేశంలో లైంగిక హింసకు బలవుతున్న వేలాది మహిళలు న్యాయం కోసం ఇప్పటికీ సుదీర్ఘ, కఠిన పోరాటాలు చేస్తూనే ఉన్నారు.
2018లో 34 వేల అత్యాచార కేసులు నమోదైన ఈ దేశంలో, ప్రతి 15 నిమిషాలకు ఒక మహిళ లైంగిక హింస, అత్యాచారానికి బలవుతోంది. ఈ భయానక గణాంకాలు జస్టిస్ వర్మ కమిటీ, నిర్భయ కాండ న్యాయ ఫలితం వల్ల భారీ సామాజిక మార్పులు వస్తాయనే ఆశలపైనే పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది.
పరిస్థితి ఎలా ఉందంటే, ఈరోజుకూ భారత్‌లో లైంగిక హింసకు బలయ్యే ఎంతోమంది మహిళలు సామాజిక ఒత్తిళ్లు, కుటుంబ ప్రతిష్ఠ భయంతో ఫిర్యాదులు కూడా నమోదు చేయలేకపోతున్నారు.
ఇవి కూడా చదవండి:
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- కరోనావైరస్: స్పెయిన్ ప్రధాన మంత్రి భార్యకు కోవిడ్-19.. స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో సమస్తం బంద్.. ప్రజలు బయటకు రావటంపై నిషేధం
- కరోనావైరస్: తెలంగాణలో పకడ్బందీ చర్యలు.. మార్చి 31 వరకే వివాహాలకు అనుమతి.. ఆ తరువాత తేదీలకు ఫంక్షన్ హాల్స్ బుకింగ్స్‌పై నిషేధం
- వాస్ప్-76బి: ఇనుము వర్షంలా కురిసే ఈ గ్రహం ఓ నిప్పుకణిక.. పగటి ఉష్ణోగ్రత 2,400 సెంటీగ్రేడ్లు
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: తిరుమలకి భక్తుల రాకపోకలపై ప్రభావం ఎలా ఉంది? టీటీడీ అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి
- కరోనావైరస్: ట్రంప్ చెప్పిన ఆరు గొప్పలు.. అందులో నిజానిజాలు
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- కరోనావైరస్ గురించి ఈ సినిమా 10 ఏళ్ల కిందే చెప్పిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








