ప్రజాస్వామ్యం బలహీనపడుతోందా? ప్రభుత్వం ముందు భారత మీడియా మోకరిల్లుతోందా?

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జుబేర్‌ అహ్మద్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత శుక్రవారం ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలిలో వర్చువల్‌ ప్రసంగం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ 'కోవిడ్ -19కు వ్యతిరేకంగా పోరాటాన్ని భారతదేశం ఒక భారీ ప్రజా ఉద్యమంగా మార్చింది' అని అన్నారు.

మోదీ చేసిన ఈ ప్రకటనకు భారత మీడియాలో విస్తృతమైన కవరేజ్ లభించింది. ఆశ్చర్యకరంగా ప్రధాని మాటలపై ఎవరూ విమర్శలు చేయలేదు. భారతదేశంలో పాజిటివ్‌ కేసులు పదిలక్షల మార్కును దాటాయి. రోజువారీ కొత్త కేసులు రికార్డులు సృష్టిస్తున్నాయి.

'కరోనాకు వ్యతిరేకంగా పోరాటం ఒక ప్రజా ఉద్యమంగా మారింది' అన్న మోదీ వ్యాఖ్యలపై భారత మీడియా ఆధారాలు అడగలేదు. ఇటు చూస్తే సోషల్‌ మీడియాలో కరోనాపై బాధితుల ఆక్రందనలు కనిపిస్తున్నాయి. రోగులు ఆసుపత్రులకు వెళుతూనే ఉన్నారు. వాహనాలు దిగక ముందే మరణించిన వారి గురించి కూడా వార్తలు వస్తున్నాయి.

మార్చి 24న లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు 21 రోజుల్లో కరోనాను అదుపులోకి తీసుకురాగలమని ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. కానీ నెలలు గడిచినా అదుపులోకి రాలేదు, సరికదా వినాశనం సృష్టిస్తోంది.

కరోనాను నియంత్రిస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీలపై మీడియా ఆయనను ప్రశ్నించలేదు. వాస్తవానికి మునుపటికంటే ఆరోగ్య సేవలు ఇప్పుడు మెరుగైన స్థితిలో ఉన్నాయి. ఆసుపత్రులలో పడకల సంఖ్య పెరిగింది. ఐసీయూ యూనిట్లు కూడా పెరిగాయి. ఇప్పుడు మరిన్ని టెస్ట్ కిట్లు, ఫీల్డ్ హాస్పిటల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

కానీ అదే సమయంలో సామాన్యుల కష్టాలు కూడా పెరిగాయి. కరోనాపై పోరాటం ఒక పెద్ద ఉద్యమంగా మారినట్లు ఎక్కడా సూచనలు కనిపించడం లేదు. ఇప్పుడిది వైద్య సిబ్బంది, ప్రభుత్వం మధ్య యుద్ధంలా కనిపిస్తోంది.

భారత మీడియా తీరుపై సీనియర్ జర్నలిస్టు పంకజ్ వోహ్రా విచారం వ్యక్తం చేశారు." అవగాహన అనేది ప్రజాస్వామ్యంలో కీలకమే. కానీ మీడియా తన పాత్రను సరైన రీతిలో పోషించడం లేదు "అని ఆయన అన్నారు.

మీడియా ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తోందని, గత కొన్నేళ్లుగా ఈ ధోరణి కనిపిస్తోందని లండన్‌లో ఉంటున్న ఒక భారతీయ జర్నలిస్టు అన్నారు. ఆయన తన పేరును చెప్పడానికి ఇష్టపడలేదు. "భారతదేశంలో కరోనా మహమ్మారి అంశాన్ని మీడియా కవర్ చేసిన విధానం దాని సంప్రదాయ ధోరణికి విరుద్ధంగా ఉంది. అధికారంలో ఉన్నవారి తరఫున మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఆదర్శాలను, వాస్తవాలను పోల్చి చూపాలి. మీడియా కూడా తన ఆదర్శాలను, వాస్తవాలను పోల్చి చూసుకోవాలి. భారత మీడియాలో ఈ రెండింటి మధ్య ఉన్న అంతరం ఈ స్థాయిలో ఇంతకు ముందెన్నడూ లేదు'' అని ఆయన అన్నారు.

నరేంద్ర మోదీ ప్రసంగం

ఫొటో సోర్స్, Getty Images

సంస్థల పట్ల చిన్నచూపు

భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎదుగుదలను గమనించానన్నారు చికాగో యూనివర్సిటీలో లా అండ్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న టామ్ గిన్స్‌బర్గ్‌. తరచూ భారతదేశాన్ని సందర్శిస్తున్న ఆయన, మీడియా తన పాత్ర నుంచి తప్పుకుంటున్నట్లు కనిపిస్తోందని అన్నారు. "భారతదేశంలో మీడియా నియంత్రణకు గురవుతోంది. వాటి యజమానులు ప్రధానమంత్రికి దగ్గరివారు. వారు జర్నలిస్టులను అదుపు చేస్తుంటారు'' అని నరేంద్ర మోదీ గురించి వ్యాఖ్యానించారు.

పాలక బీజేపీకి అధికారికంగా ఏ ఛానెల్ లేదు. కానీ పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ ప్రధాని మోదీ పక్షాన ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వారు హిందుత్వ భావజాలానికి మద్దతు ఇవ్వడమో లేదంటే ఏదో ఒకవిధంగా అధికార పార్టీతో సంబంధాలు పెట్టుకోవడమో జరుగుతుంది. అనేక ప్రాంతీయ పార్టీల నేతలు, మద్దతుదారులకు కూడా ఏదో ఒక రూపంలో మీడియా యాజమాన్యాలతో లింకులు ఉంటాయి. ఆ ఛానళ్లు ఈ పార్టీలకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి.

జర్నలిస్టులను అదుపు చేయడానికి ప్రయత్నించారని, వారిపై ప్రభావం చూపడానికి ప్రయత్నించారని ప్రభుత్వంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గ్లోబల్ మీడియా స్వేచ్ఛ విషయంలో భారత ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతోంది. జర్నలిస్టులపై అధికారులు కేసులు పెడుతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి.

ప్రజల నుంచి విపరీతమైన మద్దతు సంపాదించిన నేతలు సంస్థలను లెక్కచేయరని టామ్‌ గిన్స్‌బర్గ్‌ అన్నారు.

"ఇండియా, బ్రెజిల్‌, అమెరికాలలో పాపులారిటీ పొందిన నేతలు సంస్థలను నిర్లక్ష్యం చేస్తారు. ప్రజలను వారికి దూరం చేసే ఏ వ్యవస్థనూ వారు ఇష్టపడరు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మూడు దేశాలలో కరోనా వైరస్‌ ఉధృతి ఎక్కువగా ఉంది. ఇక్కడి నేతల స్పందన భిన్నంగా ఉంది'' అని ఆయన అన్నారు.

అమెరికాలోని జాన్స్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం అంచనాల ప్రకారం కరోనా ఉధృతిలో అమెరికా మొదటి స్థానంలో, బ్రెజిల్‌ రెండోస్థానంలో, ఇండియా మూడో స్థానంలో ఉన్నాయి.

డోనల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రజాకర్షణ ఉన్న నేతలు అధికారం తమ గుప్పిట్లో పెట్టుకోడానికి కరోనా సంక్షోభాన్ని వాడుకుంటున్నారని జాన్స్‌ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ స్టీవ్‌ హెన్కే అన్నారు. "సంక్షోభం పోతుంది. కానీ అధికారం వారి చేతుల్లోనే ఉంటుంది" అని ఆయన అన్నారు. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా వైరస్‌ మీద పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా అభివర్ణించారని ఆయన అంటారు. "కరోనా మహమ్మారి సమయంలో మోదీ మీడియాను తన గుప్పిట్లోకి తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఆయన కోరుకున్నదే మీడియాలో కనిపిస్తోంది. కరోనా సంక్షోభాన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు చాలా గొప్పగా ఉన్నాయని మీడియాలో ప్రచారం జరుగుతోంది" అని ఆయన అన్నారు.

ఇది అధికారాన్ని గుప్పిట పట్టుకునే ప్రయత్నమని, దీనినే డెమొక్రాటిక్‌ బ్యాక్‌స్లైడింగ్ అంటారని ప్రొఫెసర్‌ గిన్స్‌బర్గ్‌ వెల్లడించారు. "ప్రజాస్వామ్య వ్యవస్థలను క్రమంగా దెబ్బతీయడం, అధికారాన్ని పొందటానికి ఎన్నికలను ఉపయోగించుకోవడం, పార్లమెంటులో కనిపించకుండా ఉండటం, దేశభద్రత పేరుతో పాత్రికేయులను అణచివేయడం, వాస్తవాలను మరుగు పరిచి తన చేతిలో ఉన్న మీడియా ద్వారా కల్పితాలను ప్రచారం చేయడం డెమొక్రాటిక్‌ బ్యాక్‌స్లైడింగ్‌కు నిదర్శనం'' అని ఆయన అన్నారు. "అన్నీ చట్టబద్దంగా జరుగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ప్రజాస్వామ్య భావన క్షీణిస్తున్నట్లు మీడియా గుర్తించలేదు. అర్ధం చేసుకోలేదు'' అన్నారు.

"భారతదేశంలో కొందరు ఎంపిక చేసిన వ్యక్తులను అరెస్టు చేస్తున్నారు, అలాగే ఎంపిక చేసిన వ్యక్తులను విడుదల చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి మూలాధారంలాంటి యూనివర్సిటీల గురించి కూడా నాకు ఆందోళన ఉంది. వాటిని కూడా రాజకీయమయం చేస్తున్నారు'' అని టామ్‌ గిన్స్‌బర్గ్‌ అన్నారు.

భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిశీలిస్తున్న ప్రొఫెసర్‌ టామ్‌, పాఠ్య పుస్తకాలలో చరిత్రను మార్చడం, చారిత్రక ప్రదేశాలలో కూడా మార్పు చేయడంవంటివి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే చర్యలకు నిదర్శనం అని ఆయన అంటారు.

ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

అప్రకటిత ఎమర్జెన్సీ

రాజకీయాలు చాలా మారిపోయాయని, అధికారాన్ని చేపట్టాలంటే అత్యవసర పరిస్థితిని ప్రకటించడం లేదంటే ఒకరిని పడగొట్టనవసరం లేదని ప్రొఫెసర్ టామ్ అన్నారు.

ఇవాళ ఇందిరాగాంధీ బతికి ఉన్నట్లయితే 1975-77 మధ్యకాలంలో చేసినట్లు అత్యవసర పరిస్థితిని ప్రకటించాల్సిన అవసరం ఉండేది కాదు."ఈ రోజుల్లో అధికారం చేజిక్కించుకోడానికి తిరుగుబాటో, వామపక్ష ఉద్యమమో అక్కర్లేదు. మీడియాను నియంత్రిస్తే చాలు అన్ని సంస్థలను ఒక్కొక్కటిగా గుప్పిట పెట్టుకోవచ్చు" అని ఆయన చెప్పారు.

ఎమర్జెన్సీకి 45 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ ఒక వ్యాసం రాశారు. ప్రొఫెసర్ టామ్ వాదనతో ఆయన అంగీకరిస్తున్నట్లు కనిపించింది. "అత్యవసర పరిస్థితి విధించడానికి ఒక చట్టపరమైన ప్రకటన చేశారు. కాని ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని గుప్పిట పట్టడానికి అంతదాకా వెళ్లాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఎమర్జెన్సీ ముగిసిందని కాగితం మీద రాశారు. ఇప్పుడు మనం కొత్త వ్యవస్థలో జీవిస్తున్నాం. ఎమర్జెన్సీ ఇప్పటికే మొదలైంది. ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ప్రజాస్వామ్యం క్రమంగా తుడిచి పెట్టుకుపోతున్న కాలంలో మనం బతుకుతున్నాం'' అని ఆయన రాశారు.

"చట్టబద్ధంగా డెమొక్రాటిక్ బ్యాక్‌స్లైడింగ్‌ మొదలైందని ప్రతిపక్షాలు గుర్తించడం లేదు. ఇప్పుడు నిండా మునిగారు. ఇక ఉన్నది వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలపడమే. అయితే వారు ప్రజల్లోకి వెళ్లి గొడవ చేస్తే అధికారం కోసం ఆకలితో చేస్తున్నారని విమర్శించవచ్చు. కానీ ఆలస్యం చేస్తే ఆ అవకాశం కూడా ఉండదు'' అని ‌ప్రొఫెసర్‌ టామ్‌ అన్నారు.

పార్లమెంటులో విపక్షాల ప్రదర్శన

ఫొటో సోర్స్, Hindustan Times

వ్యతిరేకతలో విభజన

ఇప్పుడున్న పరిస్థితులకు ఒక్క నరేంద్రమోదీనే కారణమని చెప్పడం సరికాదంటారు సీనియర్‌ జర్నలిస్ట్‌ పంకజ్‌ వోహ్రా . "కాంగ్రెస్‌ తన పతనం ద్వారా సంస్థలను విస్మరించే అధికారాన్ని బీజేపీకి ఇచ్చింది. చాలా సందర్భాల్లో సంస్థలను బలహీనం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏమి చేసినా చాలా వరకు ప్రజల నుంచి మద్దతు ఉంది. అలాంటప్పుడు అత్యవసర పరిస్థితిలాంటి చర్యలు తీసుకోవలసిన అవసరం లేదు" అని వోహ్రా అభిప్రాయపడ్డారు.

"ప్రతిపక్షం చీలిపోయింది. మెజారిటీ సమాజం ఏకమవుతున్న పరిస్థితిని ఎదుర్కోడానికి అది భయపడుతోంది. అధికారపార్టీ ఎజెండాను నిర్దేశిస్తుండగా, ప్రతిపక్షాలు వాటి ఆప్షన్‌ను ఇవ్వలేక పోతున్నాయి. అటువంటి పరిస్థితిలో ప్రజలు ఎవరి ఒత్తిడి లేకుండానే అధికార పార్టీవైపు మొగ్గుతారు. అధికారపార్టీ విధానాలను తట్టుకోలేక చాలా పరిమిత సందర్భాల్లోనే ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే ప్రజలు అధికారంలో పార్టీని అన్నింటికి బాధ్యురాలిగా చేయలేకపోతున్నారు'' అని వోహ్రా అన్నారు. "దీనికి కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే సమాధానం చెప్పాలి. ప్రజల్లోనే కాదు, వారి సొంతకార్యకర్తల్లోనూ అధినాయకత్వంపై నమ్మకం లేదు. దీంతో మోదీ పని సులభమైంది'' అంటారు వోహ్రా.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

గత ఏడాది డిసెంబర్‌లో పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టం చర్చ జరుగుతున్నప్పుడు, పార్లమెంటు ఉభయ సభల్లో చర్చకు మోదీ గైర్హాజరయ్యారు. ఆయన సభకు రాకపోవడాన్ని అందరూ గమనించారు.

ప్రధాని మోదీ హయాంలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలపై ఒత్తిళ్లు పెరిగాయి. ప్రభుత్వాన్ని విమర్శించేవారు, ప్రత్యర్ధులు వీటికి టార్గెట్ అయ్యారు. రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న సమయంలో కూడా ఈ దాడులు జరిగాయి. రాజస్థాన్‌లో సంక్షోభం నడుస్తున్న సమయంలో ఈ కేంద్ర సంస్థలు దాడులు చేశాయి.

నరేంద్ర మోదీ తన మొదటి ఐదేళ్ల పదవీకాలంలో ఒక్కసారి కూడా అధికారికంగా విలేకరుల సమావేశం నిర్వహించని భారత ప్రధానిగా నిలిచారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు. కొన్ని మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ అందులో ప్రశ్నలు లేవని, ఉన్నా కష్టమైన ప్రశ్నలుకావని విమర్శలు వినిపించాయి.

రాహుల్‌ గాంధీ మోదీని ఎదుర్కోలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కానీ మోదీని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడిగే వారిలో రాహుల్‌ గాంధీ కూడా ఒకరు. వివిధ అంశాలపై ఆయన నిత్యం ట్వీట్లు చేస్తున్నారు. కరోనా మహమ్మారిపై ప్రభుత్వం స్పందనను కూడా ఆయన ప్రశ్నించారు. లద్ధాఖ్‌లో చైనా చొరబాట్లపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. కాని ఆయన విమర్శలను, ప్రశ్నలను జాతి వ్యతిరేకమని, హిందూ వ్యతిరేకమని కొట్టిపారేశారు.

2019 ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీని కాపాలాదారుడే దొంగ అని రాహుల్‌గాంధీ విమర్శించారు. అయితే ఈ విమర్శ సరైంది కాదని కాంగ్రెస్‌ నేతలు, సీనియర్ జర్నలిస్టులు కూడా అభిప్రాయపడ్డారు.

షీ జిన్‌పింగ్, బోల్సెనారో, పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యాలు బలహీనపడుతున్నాయా?

అధికారాన్ని నిలబెట్టుకోడానికి చాలా దేశాలలో రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే విధానాలను అనుసరిస్తున్నారని ప్రొఫెసర్ టామ్ గిన్స్‌బర్గ్‌ చెప్పారు. రాజ్యాంగ సవరణలు చేయడం, ప్రభుత్వంలోని ఇతర విభాగాలలో జోక్యం చేసుకోవడం, బ్యూరోక్రసీని తన నియంత్రణలో పెట్టుకోవడం, పత్రికా స్వేచ్ఛకు అంతరాయం కలిగించడం, ఎన్నికలను ప్రభావితం చేయడంవంటివి వీటిలో కొన్ని.

"ప్రజాకర్షణ ఉన్న నేతలు ప్రతి సందర్భంలో తమను ప్రశంసిస్తున్న వారి నుంచే అధికారాన్ని పొందుతారు" అని ప్రొఫెసర్ టామ్‌ గిన్స్‌బర్గ్‌ సహచరుడు ప్రొఫెసర్ అజీజ్‌ ఉల్‌హక్‌ అన్నారు. "ఈ రోజు ప్రజాదరణ ఉన్న నాయకులందరిలో ఒక కామన్‌ విషయం కనిపిస్తుంది. వీరంతా ప్రజాస్వామ్యం గురించి నినదిస్తుంటారు. సంఖ్యాబలం ఉన్నంత వరకు వారు ఏది కోరుకుంటే అది చేస్తారు. అందులో ప్రజస్వామ్యపు మూలస్తంభాలకు కూడా మినహాయింపునివ్వరు" అని హక్‌ అన్నారు.

ఇప్పుడు బ్రెజిల్, అమెరికా, ఇండియాల మధ్య ఉన్న కామన్‌ అంశం కరోనా వైరస్‌. మూడు దేశాలు కరోనా బాధిత దేశాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. కానీ మూడు దేశాల నేతలు తాము ఎంతో గొప్పగా వైరస్‌ను నియంత్రించామని, దీన్ని ప్రపంచమంతా నమ్మాలని కోరుతున్నారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

మళ్లీ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కష్టమా?

" ప్రజాస్వామ్యాన్ని రక్షించడం ఎలా '' అన్న అంశంపై చికాగో యూనివర్సిటీలో పని చేస్తున్న ప్రొఫెసర్‌ టామ్‌ గిన్స్‌బర్గ్‌, ఆయన సహచరుడు హక్‌ ఒక పుస్తకం రాశారు. ప్రజాస్వామ్యం బలహీనపడటం గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడమే కాకుండా, దానికి పరిష్కారాలను కూడా సూచించారు. ఎన్నికల ద్వారా మార్చడానికి ఎల్లప్పుడూ అవకాశం ఉందని వీరదద్దరు నమ్ముతారు. " ప్రజాస్వామ్యం బలహీనపడుతోందని మేం చెప్పాం. దానికి పరిష్కారాలుంటాయని కూడా చెప్పాం. అది నిజంగానే జరిగింది. శ్రీలంకలో మహీంద రాజపక్సే మొదటి ప్రభుత్వంలో మొత్తం వ్యవస్థను స్వాధీనం చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్న సమయంలో ఎన్నికలు జరిగాయి. ఆయన ఓడిపోయారు. ఇప్పుడు ఆయన మళ్లీ అధికారంలోకి వచ్చారు. కానీ డెమొక్రాటిక్ బ్యాక్‌స్లైడింగ్‌ తగ్గింది'' అని వారు అన్నారు.

అన్నీ చెడిపోయాయనో, అన్నీ బాగున్నాయనో చెప్పడం సరికాదు. ప్రజలు ఎప్పుడూ ఏదో ఒకదాని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. వారికి భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. "చైనా వెళితే అక్కడ తాము సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతారు. కాని వారి మనసులో ఏముందో నిజంగా మనకు తెలియదు. ఈ రోజు భారతదేశం, చైనాల మధ్య పోలిక ఉంది" అని ప్రొఫెసర్‌ టామ్‌ అన్నారు. "ఒక మతాన్ని నాశనం చేయడానికి చైనా ప్రయత్నిస్తోంది. వీగర్‌ ముస్లింల అణచివేత ఆరోపణలను చైనా ఎప్పుడూ ఒప్పుకోదు" అని అన్నారు.

డోనల్డ్ ట్రంప్, బోల్సెనారో

ఫొటో సోర్స్, Getty Images

ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి

"మనం ప్రస్తుతం 18వ శతాబ్దపు సాంకేతిక పరిజ్ఞానాన్నినేటి ప్రజాస్వామ్యంలో వాడుతున్నాం. ప్రతి నాలుగైదు సంవత్సరాలకు ఓటు వేసి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. కానీ ఇది నేటి ఇరవై ఒకటవ శతాబ్దపు సమాజానికి సరిపోదు. ఇది అవసరమే కానీ చాలదు. పాలనలో తమ భాగస్వామ్యం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. తమ మాట వినాలని వారు భావిస్తున్నారు. మనం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం. చాలా దేశాలలో ప్రజలను పాలనలో భాగస్వాములను చేసే ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటిని కొనసాగించాలి'' అని టామ్‌ గిన్స్‌బర్గ్‌ అన్నారు.

"ట్రంప్‌తో అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉంది. నవంబర్లో ఆయన మళ్లీ ఎన్నికైతే, ప్రజాస్వామ్యంపట్ల అమెరికా ప్రజలకు గౌరవం లేదని, లేదంటే దాని గురించి పట్టింపులేదని అర్ధం చేసుకోవాలి'' అని ప్రొఫెసర్ అజీజ్ హక్ అన్నారు.

భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు ఇంకా నాలుగేళ్ల తర్వాత జరుగుతాయి. కానీ దీనికి ముందు చాలా రాష్ట్రాల్లో అసెంబ్లీకి ఎన్నికలుంటాయి. అసెంబ్లీ ఎన్నికలు స్థానిక సమస్యలపై మాత్రమే పోరాడుతున్నప్పటికీ, వాటి ఫలితాలు కూడా ప్రజాస్వామ్యం గురించి ప్రజలు ఆందోళనను నిరూపిస్తాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)