కరోనావైరస్ లాక్‌డౌన్: మే 3 వరకూ పొడిగించిన ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, DDNews
కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం తొలుత ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ గడువు ఇవాల్టితో పూర్తవుతుంది. ఈ లాక్ డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
ప్రధాని ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే...
కరోనావైరస్ మహమ్మారిపై భారత్ పోరాటం బలంగా కొనసాగుతోంది. మీరు కష్టాలకు ఓర్చుకుని, దేశాన్ని కాపాడారు. మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు.
ఓ సైనికుడిలా మీరు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. మన రాజ్యాంగంలో 'వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా' అన్నదానికి అర్థం ఇదే. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజున మన సామూహిక శక్తిని చాటుకుంటూ ఆయనకు నివాళి అర్పిస్తున్నాం.
లాక్‌డౌన్‌లో నియమనిబంధనలను పాటిస్తూ పండుగలను జరుపుకోవడం స్ఫూర్తిదాయకం. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్త సంవత్సరం పండుగ జరుపుకుంటున్నారు. వారికి నా శుభాకాంక్షలు.
దేశంలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేసిన కృషిలో మీరు భాగస్వాములు, దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా. కరోనావైరస్ రోగుల సంఖ్య వందకు చేరుకోకముందు విదేశాల నుంచి వచ్చినవారికి 14 రోజుల ఐసోలేషన్‌ను భారత్ తప్పనిసరి చేసింది.
550 కేసులున్నప్పుడు 21 రోజుల లాక్‌డౌన్ రూపంలో చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాం. సమస్య తలెత్తగానే, త్వరగా నిర్ణయం తీసుకుని దాన్ని అరికట్టే ప్రయత్నం చేశాం.
ఈ సమస్య విషయంలో ఏ దేశంతోనూ మనం పోల్చుకోవడం సరికాదు. కానీ, ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలతో పోల్చుకుని చూసుకుంటే, భారత్ ఇప్పుడు చాలా మెరుగైన స్థితిలో ఉంది.
నెలన్నర కిందట కరోనావైరస్ వ్యాప్తి విషయంలో చాలా దేశాలు భారత్‌తో సమానంగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆ దేశాల్లో మన కన్నా 25 రెట్లు ఎక్కువగా కేసులు పెరిగాయి.భారత్ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఏం జరిగేదో మనం ఊహించలేం. కొన్ని రోజులుగా జరుగుతున్నది చూస్తే, మనం తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని అర్థం అవుతుంది.సామాజిక దూరం పాటించడం, లౌక్‌డౌన్ వల్ల దేశానికి చాలా లాభం జరిగింది.
ఆర్థికపరంగా చూసుకుంటే దీని వల్ల మనకు బాగా నష్టం జరిగిందనిపించవచ్చు. కానీ, దేశ పౌరుల ప్రాణాల కన్నా ఏదీ ఎక్కువ కాదు. మనం ఇన్ని చర్యలు తీసుకుంటున్నా, కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న తీరు ప్రపంచవ్యాప్తంగా నిపుణులను, ప్రభుత్వాలను భయపెడుతోంది.
కరోనావైరస్‌పై పోరాటం మనం ఎలా కొనసాగించాలి? నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి? ప్రజల ఇబ్బందులను ఎలా తక్కువ చేసుకోవాలి? ఈ విషయాలన్నింటిపై రాష్ట్రాలతో చర్చించాం.లాక్‌డౌన్ పొడిగించాలని చాలా రాష్ట్రాలు కోరాయి. కొన్ని ఇప్పటికే లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి.
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3 వరకూ కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నాం. కొత్త ప్రాంతాల్లో మనం ఇక కరోనావైరస్ వ్యాపించనీయకూడదు. మనం ముందుకున్నా ఎక్కువ అప్రమత్తంగా ఉండాలి.
హాట్‌స్పాట్లుగా మారే అవకాశమున్న ప్రాంతాలపై మరింత దృష్టి పెట్టాలి. కొత్త హాట్‌స్పాట్లతో మనకు మరిన్ని ఇబ్బందులు వస్తాయి. హాట్‌స్పాట్లు లేని ప్రాంతాల్లో ఏప్రిల్ 20 తర్వాత కొన్ని కార్యకలాపాలను అనుమతిస్తాం.
రేపు ఈ విషయం గురించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా పేదలకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. రబీ కోతలు జరిగే సమయం ఇది. వారికి ఇబ్బందులు లేకుండా రాష్ట్రాలతో కలిసి అందరం ప్రయత్నిస్తున్నాం. మన దగ్గర ఆహారం, ఔషధాల నిల్వలు మెండుగా ఉన్నాయి.
భారత్‌లో లక్ష పడకలకు ఏర్పాట్లు చేశాం. కోవిడ్-19 చికిత్స కోసం ఉన్న ఆసుపత్రులే 6 వేలకుపైగా ఉన్నాయి. మనం ధైర్యంగా, నిబంధనలను పాటిస్తూ పోతే కరోనావైరస్‌ను ఓడించి తీరుతాం.
మీకు ఏడు విషయాలు చెబుతున్నా.
1. ఇళ్లలో ఉండే వృద్ధులు, ఇదివరకే ఆరోగ్య సమస్యలున్నవారి గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
2. లాక్‌డౌన్, సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలి.
3. ఇంట్లో తయారుచేసుకున్న మాస్కులను తప్పకుండా వాడండి. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ చేసిన సూచనలను పాటించండి.
4. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆరోగ్య సేతు మొబైల్ యాప్ తప్పకుండా డౌన్‌లోడ్ చేసుకోండి. ఇతరులకు కూడా చెప్పండి.
5. మీకు సాధ్యమైనంత పేద కుటుంబాలకు సాయపడండి. వారి ఆకలి తీర్చండి.
6. మీ వ్యాపారం, పరిశ్రమల్లో పనిచేసేవారి పట్ల సానుభూతితో ఉండండి. ఎవరినీ ఉద్యోగం నుంచి తీసేయొద్దు.
7. వైద్యులు, నర్సులు, పోలీసులు ఇలా ఈ సంక్షోభ సమయంలో మనకు సేవలందిస్తున్నవారందరినీ గౌరవించండి.
మే 3 వరకూ లాక్‌డౌన్ నిబంధనలను పాటించండి. ఎక్కడున్నవారే అక్కడే ఉండండి. సురక్షితంగా ఉండండి.
మీరు, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంతో ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- హ్యాండ్ శానిటైజర్లకు ఎందుకింత కొరత?
- వేడి నీళ్లు, పానీయాలు కోవిడ్-19 బారి నుంచి రక్షిస్తాయా?
- కరోనావైరస్: తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్ తయారు చేసిన భారతీయ శాస్త్రవేత్త
- కరోనావైరస్: ప్రపంచ నాయకత్వం అమెరికా నుంచి చైనా చేతుల్లోకి వెళ్తోందా?
- ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో మరో జలియన్‌వాలా బాగ్
- ‘అప్పుడు గంగానది శవాలతో ఉప్పొంగింది...’ మరణమృదంగం మోగించిన 1918 నాటి ఫ్లూ నుంచి భారత్ ఏం నేర్చుకోవాలి?
- తెలుగు సినిమాకు కొత్త నక్కిలీసు గొలుసు – పలాస 1978
- తెలంగాణలో సూర్యుడు 'అస్తమించని' గ్రామం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








