ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో మరో జలియన్‌వాలా బాగ్

- రచయిత, అరుణ్ శాండిల్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
"1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ విషాదం బ్రిటిష్ ఇండియా చరిత్రకు ఒక మాయని మచ్చ." ప్రస్తుత బ్రిటిష్ పాలకులు కూడా అంగీకరించిన ఒక వాస్తవం ఇది.
ఆ మారణహోమం 1919 ఏప్రిల్ 13న వైశాఖి రోజున జరిగింది.
స్వాతంత్రోద్యమ అనుకూల ప్రదర్శనల కోసం జలియన్‌వాలా బాగ్‌లో పెద్దసంఖ్యలో గుమిగూడిన ప్రజలపై సైనికులు కాల్పులు జరిపారు. జనరల్ డయ్యర్ ఆదేశాలతో సైనికులు జరిపిన కాల్పుల్లో వందలాది మంది మరణించారు. వేల సంఖ్యలో గాయపడ్డారు.
ఆ మారణహోమానికి 2021 ఏప్రిల్ 13తో 102 ఏళ్లు. అయితే, ఇలాంటి సంఘటనే ఒకటి దక్షిణ భారతదేశంలో జరిగిందన్న సంగతి చాలా మందికి తెలియదు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా సరిహద్దుకు సమీపంలోని ఒక బాగ్(తోట)లో సమావేశమైన స్వాతంత్ర్య ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 32 మంది మరణించారు.

ఎక్కడుందీ ప్రాంతం
ఈ 'దక్షిణ భారత జలియన్‌వాలాబాగ్' ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.
ప్రస్తుత కర్నాటక రాష్ట్రంలోని గౌరీబిదనూరు జిల్లాలో విదురశ్వత్థ అనే గ్రామంలో 1938 ఏప్రిల్ 25న ఈ విషాదం చోటుచేసుకుంది.
అప్పటికి విదురశ్వత్థ పాత మైసూరు రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో ఉండేది. పెన్నేరు నది ఒడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామం ఇది.
ఆ రోజు కాల్పుల్లో 32 మంది మరణించడంతో అక్కడ రక్తం పారింది.
వీరి ప్రాణత్యాగాలు మైసూరు రాష్ట్రంలో స్వాతంత్ర్య ఉద్యమం మరింత బలపడేలా చేశాయి. ప్రజలు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా వీధుల్లోకి వెల్లువలా వచ్చారు. స్వాతంత్ర్యం సాధించేవరకు ఆ పోరాట పటిమ కొనసాగింది.
విదురశ్వత్థ కర్నాటక రాజధాని బెంగళూరుకు 90 కి.మీ. దూరంలో, ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఎందుకీ మారణ హోమం
విదురశ్వత్థ గాంధీ మార్గంలో నడిచిన గ్రామం. బ్రిటిష్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న మైసూర్ ప్రభుత్వ పాలనలో ఉండేది.
స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉద్యమ వేగం పెంచిన సమయం అది.
ఆ సమయంలో మైసూర్ ప్రభుత్వం తన పాలనాప్రాంతంలో ఎక్కడా జాతీయ పతాకం ఎగరవేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తే తుపాకీ గుళ్లకు బలి కావాల్సిందేనని హెచ్చరించింది.
ప్రభుత్వ తీరును నిరసిస్తూ అప్పటి కాంగ్రెస్ నాయకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య, కేటీ భాష్యం, హార్డేకర్, సిద్ధలింగయ్య, కేసీ రెడ్డి, రామాచార్ వంటివారంతా మాండ్యా జిల్లాలోని శివపురలో నిర్వహించే కాంగ్రెస్ సమావేశంలోని ఎగరవేయాలనుకుంటారు.
కానీ, ప్రభుత్వం ఆ సంగతి తెలుసుకుని పోలీసులను మోహరించింది.. మూడు రోజుల కాంగ్రెస్ సమావేశాల్లో నాయకులు జాతీయ పతాకం ఆవిష్కరించడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారని.. విదురశ్వత్థ ఘటనను, నేపథ్యాన్ని, అనంతర పరిణామాలను తెలిపే 'జలియన్ వాలాబాగ్ ఆఫ్ కర్నాటక' పుస్తకంలో అధ్యయనకర్తలు గంగాధర మూర్తి, స్మితారెడ్డిలు రాశారు.

విదురశ్వత్థలో ఆ వారం రోజులు
శివపురలో తమ ప్రయత్నం విఫలమవడంతో విదురశ్వత్థలో 1938 ఏప్రిల్ 18న 'ధ్వజ సత్యాగ్రహ' పేరుతో కార్యక్రమం నిర్వహించి జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు.
ఇది ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడి నుంచీ ప్రజలు వస్తారన్నది నాయకుల అంచనా. ఈ ధ్వజ సత్యాగ్రహం గురించి కోలార్ జిల్లా అంతటా తిరుగుతూ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
ఇదంతా మైసూర్ ప్రభుత్వానికి తెలిసింది.. విదురశ్వత్థకు 2 కిలోమీటర్ల పరిధిలో 15 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టరాదంటూ నిషేధం విధించింది.
కాంగ్రెస్ నాయకులు నాలుగు రోజుల పాటు వ్యూహాత్మకంగా ఎలాంటి ప్రయత్నం చేయలేదు.
ఏప్రిల్ 22న..
ఎన్‌సీ నాగిరెడ్డి నాయకత్వంలో ప్రజలు విదురశ్వత్థ వైపు కదిలారు. అందరి చేతుల్లో జాతీయ జెండాలు.
ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ ధ్వజ సత్యాగ్రహ నిర్వహించడానికి రావాలంటూ కరపత్రాలు పంచుకుంటూ సాగిపోయారు.
ఆయన వెంట జనం కదిలారు. మరోవైపు ఆంధ్ర ప్రాంతం నుంచి కల్లూరు సుబ్బారావు నేతృత్వంలో ప్రజలు భారీగా తరలారు.
వేలాది మంది విదురశ్వత్థ దిశగా కదలడంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.
మైసూరు రాష్ట్రం, ఆంధ్రప్రాంతం నుంచి వచ్చిన సత్యాగ్రహులంతా విదురశ్వత్థ చేరుకుని అక్కడి ఆలయం వెనుక ఉన్న తోటలో చేరారు.
పోలీసులూ అక్కడికి చేరుకుని ఎన్‌సీ నాగిరెడ్డి, మరికొందరు నాయకులను అరెస్ట్ చేసి చిక్కబళ్లాపూర్ కోర్టుకు తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆజ్ఞను ధిక్కారించారన్న నేరంపై వారిని క్షమాపణ చెప్పమని న్యాయమూర్తి ఆదేశించారు.
నాయకులు అందుకు అంగీకరించలేదు.. దీంతో వారిని జైలులో పెట్టారు.
ఏప్రిల్ 23, 24..
నాయకులను జైలులో పెట్టారన్న విషయంలో ఒక్కసారిగా కోలార్ జిల్లా మొత్తం తెలిసిపోయింది.
వారిని జైల్లో బందించడాన్ని ఖండిస్తూ ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విదురశ్వత్థ ఉద్రిక్తంగా మారిపోయింది. అక్కడి తోటలో సత్యాగ్రహులంతా ఆగ్రహావేశాలకు లోనయ్యారు.
దీంతో వారిని అదుపు చేయడం పోలీసులకు సాధ్యం కాలేదు. దీంతో అదనపు పోలీసు బలగాలు వచ్చిపడ్డాయి.
ఎటుచూసినా పోలీసులే.. ప్రజలూ అంతకంతకూ పెరిగారు.
సత్యాగ్రహులు ఆ తోటలోని ఉండిపోయారు. అక్కడి నుంచి ఎటూ కదలలేని పరిస్థితి.
ఏప్రిల్ 25 మారణహోమం
1938 ఏప్రిల్ 25 ఉదయం 10.30 గంటలకు గౌరీబిదనూరు, దాని చుట్టుపక్కల గ్రామాల నుంచి మరింత మంది విదురశ్వత్థకు చేరుకున్నారు.
అప్పటికే సుమారు 25 వేల మంది అక్కడ త్రివర్ణ పతాక ఆవిష్కరణ కోసం ఎదురుచూస్తున్నారు.
ముందుగా అనుకున్న సమయానికే త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని సత్యాగ్రహులు అనుకున్నారు. ఆ క్రమంలో జెండా ఎగరవేయడానికి సిద్ధమవగా.. పోలీసులు వారిపై తుపాకులు ఎక్కుపెట్టారు.
అయినా సత్యాగ్రహులు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. జెండా ఎగరవేయడానికే నిర్ణయించుకున్నారు. దీంతో వేదులవేణి సూరన్న, నారాయణ స్వామి, శ్రీనివాసరావు, కల్లూరు సుబ్బారావు వంటి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
వారి అరెస్టులతో ప్రజల్లో కోపం కట్టలు తెంచుకుంది. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకుడు రామాచార్ సత్యాగ్రహులను ఉద్దేశించి మాట్లాడడం ప్రారంభించారు.
ఆయన ప్రసంగించరాదని.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. రామాచార్ అందుకు నిరాకరించారు. పోలీసులు ప్రజలపై లాఠీ చార్జి చేశారు.
అంతలో జిల్లా పోలీస్ సూపరింటిండెంట్ తన పిస్టల్ తీసి కాల్చాడు. ఆ తుపాకీ గుండు తగిలి ఒక వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఎస్పీతో పాటు అక్కడున్న పోలీసులూ తూటాల వర్షం కురిపించారు.
సత్యాగ్రహులు ఒక్కరొక్కరు అక్కడే కుప్పకూలిపోయారు.
మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన ఈ మారణ కాండలో 32 మంది అక్కడికక్కడే చనిపోయారు. 48 మంది గాయపడ్డారు. పెన్నేటి తీరంలో రక్తం ప్రవహించింది.
సత్యాగ్రహుల శవాలతో విదురశ్వత్థలోని ఆ వనం శ్మశానంలా మారిపోయింది.
ఎటుచూసినా చెల్లాచెదురుగా పడి ఉన్న సత్యాగ్రహుల మృతదేహాలే.

ఫొటో సోర్స్, Getty Images
వల్లభాయి పటేల్‌ను పంపించిన గాంధీ
విదురశ్వత్థ విషాదం మహాత్మ గాంధీకి తెలిసింది. ఈ విషయం తెలిసేటప్పటికి ఆయన వార్ధాలో ఉన్నారు. ఏప్రిల్ 29న దీనిపై ఆయన ప్రకటన విడుదల చేశారు. ''అహింసాయుత మార్గంలో స్వాతంత్ర్యం సాధించాలనే ప్రయత్నంలో విదురశ్వత్థలో మరణించిన 32 మంది త్యాగం వృథా కాదు'' అంటూ ఈ ఘటనను ఆయన ఖండించారు.
ఈ కాల్పుల ఘటన తరువాత మైసూరు ప్రభుత్వం అక్కడి వార్తాపత్రికలు కొన్నిటిపై నిషేధం విధించింది.
రెండు నెలల పాటు అక్కడి నాయకులెవరూ సభల్లో మాట్లాడకుండా ప్రభుత్వం నిషేధాజ్ఞలు అమలు చేసింది.
అరెస్టులు, నిషేధాలను నిరసిస్తూ కోలార్ జిల్లా అంతటా విద్యార్థులు కాలేజీలు, స్కూళ్లను వదిలి బయటకొచ్చారు.
సైన్యాన్ని పెద్దఎత్తున మోహరించడంతో మే చివరి వరకు ఆ ప్రాంతమంతా గంభీరంగా మారిపోయింది.
నిజలింగప్ప నేతృత్వంలో అయిదుగురు సభ్యులతో కాంగ్రెస్ ఒక నిజనిర్ధారణ కమిటీ వేసింది.
ఆ తరువాత ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసి దీనిపై విచారణ జరిపింది.
ఈ ఘటనకు కారణమని ఆరోపణలున్న మైసూర్ దివాన్ సర్ మీర్జాకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమయ్యాయి.
దీంతో దివాన్ మీర్జా ఇందులో జోక్యం చేసుకుని సమస్యని పరిష్కరించాలని గాంధీజీకి లేఖ రాయడంతో ఆయన వల్లభాయి పటేల్, ఆచార్య కృపలాణీలను మైసూర్ పంపిస్తారు.
నిషేధాజ్ఞలు ఎత్తివేయాలని, నాయకులను విడుదల చేయాలని పటేల్ సూచించగా మైసూర్ దివాన్ అందుకు అంగీకరిస్తారు. మువ్వన్నెల పతాకం ఎగరవేయడంపైనా నిషేధం తొలగిస్తారు.
దీన్ని 'పటేల్-మీర్జా' ఒప్పందంగా చెబుతారు.
అనంతరం ప్రభుత్వం వేసిన కమిటీ 147 మంది సాక్షులను విచారించి, సుదీర్ఘ కాలం వాదనలు విన్నాక తన నివేదిక సమర్పించింది.
కాల్పులు జరపాల్సిన పరిస్థితులు ఏర్పడడం వల్లే అలా జరిగిందని చెబుతూ 10 మందే చనిపోయినట్లు తేల్చింది.
దీంతో 1938 నవంబరు 19న మైసూర్ ప్రభుత్వం ఈ వివరాలతో నోటిఫికేషన్ జారీ చేసిందని 'జలియన్ వాలాబాగ్ ఆఫ్ కర్నాటక' పుస్తకంలో వివరించారు.
మృతులకు స్మారకంగా విదురశ్వత్థలో 1973లోనే ఒక స్తూపం నిర్మించారని అక్కడి స్మృతివనం వ్యవహారాలు చూసే రామకృష్ణ 'బీబీసీ'కి తెలిపారు.

ఆ శోకవనం నేడు స్ఫూర్తి స్థలం
విదురశ్వత్థ మారణకాండలో అసువులుబాసినవారి జ్ఞాపకార్థం ఇక్కడ వీర స్తూపం నిర్మించారు.
2004లో స్మారక సమాధి, వీర సౌధం కూడా నిర్మించారు. వీర సౌధ చుట్టూ ఉద్యానం ఏర్పాటు చేసి దానికి సత్యాగ్రహ వీర సౌధ ఉద్యానం అని పేరు పెట్టారు.
గ్యాలరీ.. స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన పుస్తకాలతో గ్రంథాలయం, విదురశ్శత్థ మారణహోమానికి సంబంధించిన డాక్యుమెంటరీలు ప్రదర్శించడానికి ఒక థియేటర్ వంటివన్నీ ఇక్కడ నిర్మించారని రామకృష్ణ చెప్పారు.
భారత దేశ స్వాతంత్ర్య ఉద్యమం, వీరుల త్యాగాలకు సంబంధించి తెలుసుకోవాలనుకునేవారు, అధ్యయనకర్తలు ఇక్కడకు పెద్ద సంఖ్యలో వస్తుంటారని 'సత్యాగ్రహ స్మారక అభివృద్ధి కమిటీ' సభ్యుడు గంగాధర మూర్తి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- శ్రీకాకుళం జిల్లా: ఈ గ్రామంలో 500 మంది పేర్లు పోలీసు: 'తల్లి, తండ్రి, పిల్లలు అంతా పోలీసులే.. కానీ, ఖాకీ ధరించే పోలీసులు లేరు'
- భారతదేశంలో బ్రాహ్మణులు మాంసం తినడం ఎప్పటి నుంచి, ఎందుకు మానేశారు?
- యుజ్వేంద్ర చాహల్‌ను 15వ అంతస్తు నుంచి వేలాడదీసిన ఆ క్రికెటర్ ఎవరు
- మంటల మధ్య పోలీసుల చేతుల్లో కనిపిస్తున్న ఈ పాప ఎవరు? అసలు ఏం జరిగింది
- ఆంధ్రప్రదేశ్ : విద్యుత్ కోతలపై ఆన్లైన్లో మీమ్‌లు - ‘పవర్ రాలేదా పుష్పా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










