భారతదేశంలో బ్రాహ్మణులు మాంసం తినడం ఎప్పటి నుంచి, ఎందుకు మానేశారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, అపర్ణ అల్లూరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
నవరాత్రి సందర్భంగా దిల్లీలోని కొన్ని ప్రాంతాలలో మాంసం షాపులు మూసేయాలని కొన్ని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ సందర్భంగా హిందూ మతానికి, మాంసాహారానికి మధ్య ఏదైనా విరోధం ఉందా అన్న అనుమానాలు కలగడం సహజం. అయితే చరిత్రను ఒక్కసారి గమనిస్తే మాంసానికి, భారత్‌కు ఉన్న అవినాభావ సంబంధం ఏంటో అర్ధమవుతుంది.
''ఇతర మతాల వాళ్లు హిందూ పండగలను గౌరవించి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తే, మేం కూడా వారి పండగలకు అదే రీతిలో గౌరవం ఇస్తాం'' అని దిల్లీలో భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు పర్వేశ్ వర్మ అన్నారు.
ఏప్రిల్ 2న ప్రారంభమైన తొమ్మిది రోజుల నవరాత్రి పండుగకు చాలామంది హిందువులు ఉపవాసం ఉంటారని, అందువల్ల ఈ పండగ సందర్భంగా భారతదేశం అంతటా మాంసం దుకాణాలను మూసేస్తే మంచిదని ఆయన సూచించారు. అయితే, దిల్లీలో అధికార ఆమ్ఆద్మీ పార్టీ ఈ సూచన పై విరుచుకుపడింది.
వాస్తవానికి దిల్లీలో మాంసానికి మంచి డిమాండ్ ఉంది. బటర్ చికెన్, చికెన్ కర్రీ, కెబాబ్‌లు ఇక్కడ ఫేమస్.
ప్రస్తుతం రంజాన్ మాసం నడుస్తున్నట్లు ఎంపీ పర్వేశ్ వర్మకు తెలియని విషయం కాదు. ఈ మాసానికి, మాంసానికి ఉన్న సంబంధం కూడా ఆయనకు తెలియంది కాదు. అందులోనూ దేశవ్యాప్తంగా ఎక్కువ మాంసం షాపులు ముస్లింల ఆధ్వర్యంలోనే నడుస్తుంటాయి.
చరిత్రకు, పర్వేశ్ వాదనకు పొసగడం లేదు. ''ఇది చాలా దురదృష్టకర పరిణామం. ఎందుకంటే భారతీయ సంప్రదాయాలు దాన్నికన్నా చాలా సంక్షిష్టమైనవి'' అని విక్రమ్ డాక్టర్ అన్నారు. ఆయన భారతీయ ఆహారం మీద 'ది ఎకనామిక్ టైమ్స్' కు విస్తృతంగా కథనాలు రాశారు.
''ఇండియాలో మాంసాహారానికి, శాకాహారానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అది కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కానీ, రెండింటిలో ఏదో ఒకదానికి మద్ధతుగా మాట్లాడాలని నాపై కూడా తరచూ ఒత్తిడి వస్తుంటుంది'' అన్నారాయన. ''భారతదేశంలో శాకాహారం రైట్ వింగ్‌కు ఆయుధంగా మారింది'' అని విక్రమ్ డాక్టర్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
చిత్రంగా భారతదేశంలో ప్రగతిశీల వాదులు మాంసాహారాన్ని సమర్ధిస్తుండగా, పాశ్చాత్య దేశాలలో ముఖ్యంగా వామపక్ష వాదులు మాంసం తక్కువ తినడం మంచిదని వాదిస్తున్నారని విక్రమ్ డాక్టర్ అన్నారు.
నిన్న మొన్నటి వరకు భారతదేశంలో బీఫ్ గురించి వాదోపవాదాలు, విమర్శలు కొనసాగాయి. హిందువులు గోవును పవిత్రమైనదిగా భావిస్తుంటారు. చాలా రాష్ట్రాలలో గోవధ పై నిషేధం ఉంది.
2014 లో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ పార్టీకి పట్టున్న అనేక రాష్ట్రాలలో కబేళాలను, పశు మాంస విక్రయాలను అడ్డుకున్నారు. గోమాంసం అమ్ముతున్నారనో, సరఫరా చేస్తున్నారనో ఆరోపిస్తూ అనేకచోట్ల ముస్లింల పై దాడులు జరిగాయి.
దిల్లీ నగరంలోని హోటళ్ల మెనూలో ఇప్పుడు బీఫ్ కూడా కనిపిస్తుంది. చాలామంది దీనిని మాంసం అని మాత్రమే చెబుతుంటారు. మాంసం అమ్మే పెద్ద పెద్ద షాపుల్లో విదేశాల నుంచి వచ్చిన పందిమాంసం, మేక మాంసం అమ్ముతుంటారు కానీ, ఈ మాంసం స్టాక్ ఉంచరు. బీఫ్ తినే వారు కూడా తమకు ఆ మాంసం కావాలంటూ గుసగుసలాడినట్లు అడుగుతుంటారు.
హిందువులలోని అగ్ర కులాల వారు బీఫ్ తినరు. కానీ, దేశవ్యాప్తంగా దళితులు, ముస్లింలు, క్రైస్తవులు దీన్ని తింటుంటారు. కేరళలో మత కారణాలతో చాలా కొద్దిమంది మాత్రమే ఈ మాంసం తినరు.
భారత దేశానికి క్రీస్తుకు పూర్వం 70,000 సంవత్సరాల నుంచి మాంసంతో అనుబంధం ఉందని క్లినికల్ న్యూట్రిషనిస్ట్ మనోషి భట్టాచార్య అన్నారు. ఆమె భారతీయ ఆహారపు అలవాట్లపై పరిశోధన చేశారు.
పురాతన కాలంలో అంటే సింధు నాగరికత కాలంలో భారతీయులు అడవి పంది, గోమాంసం ఎక్కువగా తినేవారని భట్టాచార్య అన్నారు. వేదకాలంలో అంటే క్రీస్తుపూర్వం 1500 నుంచి 500 మధ్య కాలంలో ఆవు, ఇతర జంతువులను బలి ఇవ్వడం చాలా సర్వసాధారణ విషయమని ఆమె చెప్పారు. వాటి మాంసాన్ని దేవుళ్లకు నైవేద్యంగా పెట్టడం, విందుల్లో ఆరగించడం ఉండేదని చెప్పారు.
కాబట్టి, విదేశాల నుంచి భారతదేశం మీద దండెత్తిన ముస్లిం రాజులే మాంసాన్ని ఇక్కడికి పరిచయం చేశారన్న హిందూ గ్రూపుల వాదనలు నిజం కాదు.
వివిధ రాజుల దండయాత్రలు, దేశాల మధ్య వ్యాపారం, వ్యవసాయ విధానాల కారణంగా ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోతూ వచ్చాయి. క్రమక్రమంగా బ్రాహ్మణులతోపాటు, హిందూ మతంలోని అగ్రకులాల వారి మెనూ నుంచి బీఫ్, మాంసం మాయమైంది. దీనికి ప్రధాన కారణం మతమే అయినా, అదొక్కటే కారణం మాత్రం కాదు.
కనీసం 16వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశంలో బ్రాహ్మణులు మాంసం తిన్నారని తన పరిశోధనలో తేలినట్లు డాక్టర్ భట్టాచార్య వెల్లడించారు. ఇక ఉత్తరాదిలో బ్రాహ్మణులు, కొన్ని అగ్రకులాల వారు 19వ శతాబ్దం చివరలోనే మాంసాహారాన్ని వదిలేశారని ఆమె పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వలస పాలన కారణంగా మారిన భూ వినియోగం, వ్యవసాయ విధానాలు, వాణిజ్యంతోపాటు, కరవుల వంటివి ఆధునిక భారతీయ ఆహార అలవాట్లలో మార్పులకు కారణమయ్యాయని భట్టాచార్య అంటారు. అప్పటి నుంచే బియ్యం, గోదుమలు, పప్పుల వినియోగం పెరిగింది.
భారతీయ ఆహార విధానాలలో ప్రతి నియమానికీ మినహాయింపులు ఉంటాయి. ఇప్పటికీ కొన్ని బ్రాహ్మణ కుటుంబాలలో మాంసం తినడం తప్పుకాదు. కశ్మీరీ పండిట్లు మేక మాంసాన్ని స్థానికంగా పండే ఘాటైన మిర్చితో కలిపి వండుకుని తింటారు. బెంగాల్‌తో పాటు కొంకణ్ తీరంలో బ్రాహ్మణులు రకరకాల చేపలను తింటారు.
మాంసాహారం తినేవారిలో ఆవు మాంసం అతి తక్కువ వినియోగంలో ఉండగా, అగ్రస్థానంలో చేపలు, ఆపై చికెన్, తర్వాత మటన్ లు తరువాతి స్థానాన్ని ఆక్రమిస్తున్నాయని గత సంవత్సరం నిర్వహించిన నేషనల్ శాంపిల్ సర్వే లో తేలింది.
భారతీయులు ఎంత మాంసం తింటున్నారనేది అంచనా వేయడం కష్టం. ‘ప్యూ‘ సర్వేలో మీరు వెజిటేరియనా అని ప్రశ్నించినప్పుడు 39% అవును అని సమాధానం చెప్పారు. 81% తాము మాంసం తింటామని చెప్పారు. అయితే మాంసం తిన్నా కొన్ని రోజులు, వారాల్లో మాత్రం తినబోమని చెప్పారు.
భారతీయ ఆహారపు అలవాట్లపై ప్రభుత్వాలు నిర్వహించిన సర్వేలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. 2021లో నిర్వహించిన సర్వే ప్రకారం, ఆ సర్వేకు ముందు ఒక వారంలో గ్రామీణ కుటుంబాల్లో నాలుగింట ఒకవంతు మంది, పట్టణాల్లో ఐదవ వంతు మంది మాంసం (లేదా చేపలు) తిన్నట్లు తేలింది.
అంటే మిగిలిన వారు శాఖాహారులు అని దీని అర్థం కాదు. వారు సర్వేకు ముందు ఏడు రోజులలో మాంసం తినలేదు అంతే.
అయితే, సర్వేల ద్వారా మాంసాహారపు ధోరణులను అంచనా వేయడం కష్టమని, కింది కులాలకు చెందిన వారు తాము మాంసం తింటామని చెప్పుకోవడానికి ఇష్టపడరని నిపుణులు అంటున్నారు. ''మేం శాకాహారులం. కానీ, మాంసం కూడా తింటాం అంటుంటారు'' అని డాక్టర్ భట్టాచార్య అన్నారు.
ఉన్నత వర్గాలు మాత్రమే శాకాహార విధానాన్ని స్వీకరించిన ఏకైక సంస్కృతి భారతీయ సంస్కృతి అని విక్రమ్ డాక్టర్ అన్నారు.
దీని కారణంగా దేశంలో వైవిధ్యమైన ఆహారపు అలవాట్లు ఏర్పడ్డాయని, దీనివల్ల మాంసం ఎప్పుడూ భోజనంలో హీరోగా మారలేదని విక్రమ్ డాక్టర్ అన్నారు.
విక్రమ్ డాక్టర్ గోవాలో నివసిస్తారు. అక్కడ దొరికే ఆహారాన్ని ఆయన సెమీ వెజిటేరియన్ అంటారు. అందుకు ఉదాహరణగా ఆయన ఎండు రొయ్యలు, గుమ్మడికాయ కలిపి చేసిన కూరను చెబుతారు. ఈ రెండూ పోషకాలతో కూడినవేనని, ఎంతో రుచిగా కూడా ఉంటాయని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
గోవాకు వచ్చిన వారు చాలామంది మాంసం తినడానికి ప్రయత్నిస్తారని, కానీ, గోవా ప్రజలు చాలామంది మాంసం తినరని ఆయన చెప్పారు. ఇక్కడి క్రైస్తవుల ఆహారంలో కూడా ఎక్కువగా పప్పుధాన్యాలను కొద్దిపాటి మాంసం, ఎండు చేపలు ఉంటాయి.
హైదరాబాద్ స్పెషల్ వంటకం దాల్చా సూప్ ను కూడా పప్పుధాన్యాలు, కూరగాయలు, మేకమాంసం, కోడిగుడ్లు లాంటివి వేసి తయారు చేస్తారు.
భారతదేశపు శాకాహార సంస్కృతికి ఆరోగ్యకరమైన స్థాయిలో మాంసం, చేపలను జోడించి మరింత ఆరోగ్యకరమైన వాతావరణ అనుకూల ఆహార సంప్రదాయాన్ని రూపొందించడానికి మనకు అవకాశం ఉందని విక్రమ్ డాక్టర్ అభిప్రాయపడ్డారు.
అయితే, ట్రెండ్ మారిపోతోంది. మాంసం వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా పౌల్ట్రీ చికెన్ పెరిగాక మాంసం వినియోగంలో కూడా పెరుగుదల కనిపించింది. గత సంవత్సరం భారతీయ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకం చికెన్ బిర్యానీ. భారతీయులు ప్రతి సెకనుకు రెండు ప్లేట్లను ఆర్డర్ చేశారని తేలింది.
''భారతదేశంలో శాకాహార సంప్రదాయం కొనసాగడం మంచిదే. కానీ వారు ప్రజల మీద బలవంతంగా రుద్దుతున్నారు. దీన్ని ఎవరూ ఒప్పుకోరు'' అన్నారు విక్రమ్ డాక్టర్.
ఇవి కూడా చదవండి:
- ఇమ్రాన్ ఖాన్: ప్లేబాయ్ నుంచి పాకిస్తాన్ ప్రధాని వరకూ...
- నవరాత్రి వేడుకల సమయంలో మాంసం షాపులను ఎందుకు మూయించేస్తున్నారు? అసలు మాంసం తినని వారు ఎంత మంది?
- షాంఘై లాక్డౌన్: ఆహారం దొరకడం లేదంటున్న కొందరు స్థానికులు
- ఇమ్రాన్ ఖాన్ భార్య ఫ్రెండ్ ఫరాఖాన్ ఎవరు, పాకిస్తాన్లో ఈమె పేరు ఎందుకు మారుమోగుతోంది?
- పుతిన్‌కు ఎంతమంది పిల్లలు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏంచేస్తుంటారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













