రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఎంతమంది పిల్లలు.. వాళ్లు ఎక్కడున్నారు.. ఏంచేస్తుంటారు?

ఫొటో సోర్స్, Alamy
పుతిన్ కుటుంబం గురించి ప్రపంచానికి ఎంత తెలుసు? ఆయన భార్య ఏం చేస్తున్నారు? పిల్లలు ఎంతమంది? వాళ్లేం చేస్తున్నారు?
నిజానికి పుతిన్ కుటుంబం బయటకు తెలిసింది చాలా తక్కువే. తన కుటుంబం గురించి ఎక్కువగా మాట్లాడడం తనకు ఇష్టం ఉండదని పుతిన్ గతంలో చెప్పారు.
2015లో జరిగిన ఒక సమావేశంలో ఆయన కుమార్తెల గురించి ప్రశ్నలు వేశారు.
"నా కుమార్తెలు రష్యాలోనే ఉంటారు. రష్యాలోనే చదివారు. వాళ్లను చూసి నేను గర్వపడుతున్నాను. వాళ్లు మూడు విదేశీ భాషలు అనర్గళంగా మాట్లాడగలరు. నా కుటుంబం గురించి నేను ఎవరితోనూ చర్చించను. ప్రతీ వ్యక్తికి వాళ్ల సొంత జీవితం ఉంటుంది. గౌరవంగా బతకాలని అనుకుంటారు" అని చెప్పారు.
పుతిన్‌కు ఇద్దరు కుమార్తెలు. వాళ్ల వివరాలు బయటకి చెప్పడం ఆయనకు ఇష్టం లేకపోవచ్చుగానీ, ఇతరులు ఊరుకోరుగా.
తాజాగా పుతిన్ కూతుళ్లు మరియా వొరంత్సోవా (36), కాటెరినా టిఖోనోవా (35)లపై అమెరికా ఆంక్షలు విధించింది.
"పుతిన్ తన ఆస్తులను కుటుంబ సభ్యుల వద్ద దాచి ఉంచారని భావిస్తున్నాం. అందుకే వారిని టార్గెట్ చేస్తున్నాం" అని ఒక అమెరికా అధికారి చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
పెద్ద కూతురు తండ్రికే సపోర్టు
పుతిన్ తన కుటుంబ జీవితం గురించి గోప్యంగా ఉంచినా, కొన్ని పత్రాలు, మీడియా రిపోర్టులు, అప్పుడప్పుడు చేసిన బహిరంగ ప్రకటనల ద్వారా వీరిద్దరి గురించి కొంతవరకు తెలుసుకోవచ్చు.
పుతిన్, ఆయన మాజీ భార్య ల్యూడ్మిలాకు కలిగిన సంతానం ఈ ఇద్దరమ్మాయిలు.
1983లో పుతిన్, ల్యూడ్మిలాను వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆమె ఎయిర్ హోస్టెస్‌గానూ, ఆయన కేజీబీ ఆధికారిగానూ పనిచేస్తున్నారు.
వారి వివాహ బంధం 30 ఏళ్లు కొనసాగింది. ఈ సమయంలోనే పుతిన్ రష్యాలో రాజకీయంగా ఎదిగారు.
2013లో ఈ దంపతులు విడిపోయారు. ఆ సమయంలో ఇద్దరూ విడివిడిగా ప్రకటనలు చేశారు.
"ఇది మా ఇద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం. మేమిద్దరం ఒకరినొకరు చూసుకోవడమే కరువైపోయింది. ఇద్దరికీ వేర్వేరు జీవితాలు ఉన్నాయి" అని పుతిన్ చెప్పారు.
అయితే, పుతిన్ "పూర్తిగా పనిలో మునిగిపోయారని" ల్యూడ్మిలా చెప్పారు.
వారి మొదటి బిడ్డ మరియా వొరంత్సోవా 1985లో పుట్టారు. ఆమె, సెయింట్ పీటర్స్‌బర్గ్ యూనివర్సిటీలో బయాలజీ, మాస్కో స్టేట్ యూనివర్సిటీలో మెడిసిన్ చదివారు.
ప్రస్తుతం వొరంత్సోవా ఎండోక్రైన్ వ్యవస్థపై పరిశోధన చేస్తున్నారు. పిల్లల ఎదుగుదలలో లోపాలపై వచ్చిన ఒక పుస్తకానికి ఆమె సహ రచయిత. మాస్కోలోని ఎండోక్రైనాలజీ రీసెర్చ్ సెంటర్ పరిశోధకుల జాబితాలో ఆమె పేరు కూడా ఉంది.
వొరంత్సోవా వ్యాపారవేత్త కూడా. ఒక భారీ వైద్య కేంద్రాన్ని నిర్మించాలనుకుంటున్న కంపెనీకి ఆమె సహ యజమాని అని బీబీసీ రష్యా గుర్తించింది.
వొరంత్సోవా, డచ్ వ్యాపారవేత్త జోరిట్ జూస్ట్ ఫాసెన్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన కొన్నాళ్లు రష్యన్ స్టేట్ ఎనర్జీ దిగ్గజం గాజ్‌ప్రోమ్‌లో పనిచేశారు. ప్రస్తుతం వారిద్దరూ విడిపోయినట్టు సమాచారం.
యుక్రెయిన్ యుద్ధం గురించి ఆమెతో మాట్లాడినవారు చెప్పిన విషయాలు.. ఆమె తన తండ్రికి మద్దతు ఇస్తున్నారు. ఈ యుద్ధం గురించి అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న వార్తలపై సందేహాలు వెలిబుచ్చారు.

ఫొటో సోర్స్, Reuters
చిన్న కూతురు రాక్ ఎన్ రోల్ డాన్సర్
పుతిన్ రెండవ కుమార్తె కాటెరినా టిఖోనోవా తన అక్క కన్నా ఎక్కువగా పబ్లిక్‌లో కనబడతారు. ఆమె ఒక రాక్ ఎన్ రోల్ డాన్సర్. 2013లో జరిగిన ఒక అంతర్జాతీయ స్థాయి పోటీలో ఆమె, తన భాగస్వామితో కలిసి అయిదవ స్థానంలో నిలిచారు.
అదే సంవత్సరం టిఖోనోవా, పుతిన్ చిరకాల మిత్రుడి కుమారుడు కిరిల్ షామలోవ్‌ను వివాహం చేసుకున్నారు. వారి వివాహం సెయింట్ పీటర్స్‌బర్గ్ సమీపంలోని ప్రత్యేకమైన స్కీ రిసార్ట్‌లో జరిగింది. మూడు తెల్ల గుర్రాల రథంలో పెళ్లికూతురు, పెళ్లికొడుకు మండపానికి విచ్చేశారని అక్కడి సిబ్బంది తెలిపారు.
2018లో రష్యాలోని కొందరు వ్యాపారవేత్తలపై అమెరికా ఆంక్షలు విధించింది. వారిలో షామలోవ్ కూడా ఒకరు. షామలావ్ రష్యాలోని ఒక పెట్రోకెమికల్ కంపెనీలో షేర్‌హోల్డర్.
"పుతిన్ కూతురిని పెళ్లి చేసుకున్న తరువాత షామలావ్ వ్యాపార రంగంలో వేగంగా ఎదిగారని" అమెరికా ట్రెజరీ తెలిపింది.
తరువాత ఈ జంట విడిపోయారు.

ఫొటో సోర్స్, Reuters
యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తరువాత, బియారిట్జ్‌లో ఉన్న ఒక విలాసవంతమైన విల్లాను ఆక్రమించుకున్నందుకు ఇద్దరు రష్యన్ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఆ విల్లా షామలోవ్‌కు చెందిందని చెబుతున్నారు.
టిఖోనోవా ప్రస్తుతం విద్యా, వ్యాపార రంగాల్లో ఉన్నారు. ఆమె, 2018లో రష్యన్ స్టేట్ మీడియాలో న్యూరోటెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు ఒకసారి, 2021లో ఒక బిజినెస్ వేదికపై మరొకసారి కనిపించారు.
ఈ రెండు సందర్భంల్లోనూ ఆమె తన తండ్రి ప్రస్తావన తీసుకురాలేదు. టిఖోనోవా తన తండ్రితో ఎక్కువ కాలం గడపలేదని సమాచారం.
పుతిన్‌కు మనుమలు కూడా ఉన్నారు. 2017లో ఒక ఫోన్-ఇన్ కార్యక్రమంలో తనకు మనుమలు ఉన్నట్టు చెప్పారుగానీ, ఎంతమంది ఉన్నారు, ఏ కూతురి పిల్లలు అన్నది చెప్పలేదు.
"నా మనుమల్లో ఒకరు నర్సరీ స్కూల్లో ఉన్నారు. వాళ్లు రాజ కుమారుల్లా పెరగాలని నేననుకోవట్లేదు. సాధారణ పౌరుల్లాగే పెరగాలి" అని పుతిన్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- శ్రీలంక, చైనా మధ్య పెరుగుతున్న దూరం భారత్‌కు కలిసొస్తుందా
- ‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా.. అందుకే నా నోరు మూయించాలని చూస్తోంది’... ఈడీ కేసుపై మేధా పాట్కర్
- కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమన్న రాహుల్‌గాంధీ వాదనలో నిజమెంత
- Kinder Surprise చాక్లెట్ ఎగ్స్‌ను రీకాల్ చేసిన కంపెనీ, అసలు కారణం ఇదే..
- వైఎస్ జగన్ కూడా ఎన్టీఆర్ బాటలోనే వెళ్తున్నారా? ఏపీలో క్యాబినెట్ మంత్రులందరి రాజీనామాలు తప్పవా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












