Kinder Surprise eggs: సాల్మొనెల్లా బ్యాక్టీరియా కేసులు పెరగడంతో కిండర్ సర్‌ప్రైజ్ చాక్లెట్‌లను రీకాల్ చేసిన కంపెనీ

కిండర్ సర్‌ప్రైజ్

ఫొటో సోర్స్, Thinkstock

    • రచయిత, మైఖేల్ రేస్
    • హోదా, బిజినెస్ రిపోర్టర్, బీబీసీ న్యూస్

బ్రిటన్‌లో 63 సల్మోనెలా బ్యాక్టీరియా కేసులు నమోదయ్యాయి. చిన్నపిల్లలే ఎక్కువగా దీని బారిన పడ్డారు.

ఈ కేసులతో సంబంధం ఉందనే అనుమానంతో కిండర్ సర్‌ప్రైజ్ చాక్లెట్లను రీకాల్ (మార్కెట్ నుంచి వెనక్కి రప్పించడం) చేస్తున్నారు. సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఫుడ్ పాయిజన్‌కు దారితీస్తుంది.

ఇప్పటివరకు బ్యాక్టీరియా ప్రభావానికి లోనైన అన్ని కిండర్ సర్‌ప్రైజ్ ఎగ్స్ బెల్జియంలోని ఒకే ఫ్యాక్టరీలో తయారయ్యాయని 'ద ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీ' (ఎఫ్‌ఎస్‌ఏ) తెలిపింది.

20 గ్రాముల పరిమాణంలో లభించే, మూడు ఎగ్స్ కలిపి ఒకే ప్యాక్ రూపంలో అందుబాటులో ఉండే కిండర్ సర్‌ప్రైజ్ చాక్లెట్లను తినొద్దని ఎఫ్‌ఎస్‌ఏ సూచించింది. 11 జూలై 2022 నుంచి 7 అక్టోబర్ 2022 వరకు గడువు తేదీలు ఉన్న చాక్లెట్లను తినకూడదని తెలిపింది.

విక్రయాల కోసం మార్కెట్‌లోని వచ్చిన కిండర్ ఉత్పత్తుల్లో ఒక్కటి కూడా సాల్మొనెల్లా పాజిటివ్‌గా తేలలేదని చాక్లెట్ తయారీ కంపెనీ ఫెర్రారో చెప్పింది.

''ఆహార భద్రతను మేం చాలా తీవ్రంగా పరిగణిస్తాం. ఈ విషయంలో క్షమాపణ కోరుతున్నాం'' అని ఆ సంస్థ వ్యాఖ్యానించింది.

ఈ బ్యాక్టీరియా కారణంగా ప్రస్తుతం మరణాలు సంభవించలేదు. కానీ, 5 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సున్న చిన్నారులే ఈ బ్యాక్టీరియా బారిన పడ్డారు.

ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్‌లో కూడా మరిన్ని కేసులు నమోదయ్యాయి.

కిండర్ సర్‌ప్రైజ్

ఫొటో సోర్స్, iStock

'ముందు జాగ్రత్త'

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫెర్రారో కంపెనీ స్వచ్ఛందంగా తమ ఉత్పత్తుల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఎఫ్‌ఎస్‌ఏ చెప్పింది. ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపింది.

సాల్మొనెల్లా కేసుల పెరుగుదలకు కచ్చితమైన కారణాన్ని గుర్తించేందుకు ఆహార భద్రతా అధికారులతో కలిసి ఫెర్రారో పనిచేస్తోందని చెప్పింది.

కిండర్ బ్రాండ్ తయారు చేసిన ఇతర ఉత్పత్తులు ఈ బ్యాక్టీరియా బారిన పడలేదని నమ్ముతున్నట్లు ఎఫ్‌ఎస్‌ఏ తెలిపింది.

యూకేలో బయటపడిన సాల్మొనెల్లా పాయిజనింగ్ కేసులకు, ఫెర్రారో కంపెనీ తయారు చేసిన ఒక ఉత్పత్తికి సంబంధమున్నట్లు ప్రజారోగ్య సంస్థలు చేసిన పరిశోధనలో తేలినట్లు ఎఫ్‌ఎస్‌ఏ ఒక హెచ్చరికను జారీ చేసింది.

''ఈ ప్రత్యేకమైన ఉత్పత్తులు చిన్న పిల్లలకు చాలా ఇష్టమని మాకు తెలుసు. ఈస్టర్ సమీపిస్తోంది. కాబట్టి ఇప్పటికే ఈ ఉత్పత్తులు మీ ఇళ్లలో ఉన్నాయేమో చూడాలని మేం చిన్నపిల్లలు తల్లిదండ్రులు, సంరక్షకులను కోరుతున్నాం'' అని ఎఫ్ఎస్ఏ హెడ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ టీనా పాటర్ చెప్పారు.

సాల్మొనెల్లా వ్యాధి లక్షణాలను యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ డాక్టర్ లెస్లీ లార్కిన్ తెలిపారు.

''డయేరియా, కడుపునొప్పి, వాంతులు, జ్వరం దీని లక్షణాలు. సాధారణంగా కొన్ని రోజుల్లోనే ఇవి తగ్గిపోతాయి'' అని ఆమె చెప్పారు.

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్న పిల్లల్లో ఈ లక్షణాలు మరింత తీవ్రంగా ఉంటాయని, అలాంటి వారు వైద్యులను సంప్రదించాలని సూచించారు.

సాల్మొనెల్లా ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపించగలదు. కాబట్టి లక్షణాలు ఉన్నవారు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని తెలిపారు.

సల్మోనెలా

సాల్మొనెల్లా అంటే ఏమిటి?

సాల్మొనెల్లా అనేది ఒక రకమైన ఆహార బ్యాక్టీరియా. ఇది సాధారణంగా చిన్నపేగుల్లో కనిపిస్తుంది. ఇది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సంక్రమిస్తుంది. జంతువుల నుంచి కూడా మనుషులకు వ్యాపిస్తుంది.

ఎలాంటి ఆహారంలో ఇది కనిపిస్తుంది?

  • పచ్చి లేదా సరిగ్గా వండని మాంసం
  • గుడ్లు
  • కడగని పండ్లు, కూరగాయలు
  • పాశ్చురైజేషన్ చేయని పాలు

లక్షణాలు

  • డయేరియా
  • జ్వరం
  • పొత్తికడుపులో నొప్పి
  • వాంతులు

నివారణ పద్ధతులు

  • పౌల్ట్రీ ఉత్పత్తులు, గుడ్లు, మాంసాన్ని బాగా ఉడికించాలి
  • వండని మాంసం, గుడ్ల పెంకులు తాకిన తర్వాత చేతులు శుభ్రంగా కడగాలి
  • పండ్లు, కూరగాయల్ని బాగా కడగాలి
  • పచ్చి మాంసాన్ని వండిన ఆహారపదార్థాలకు దూరంగా పెట్టాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)