రాహుల్ గాంధీకి తన ఆస్తి మొత్తం రాసిచ్చేసిన 79 ఏళ్ల పుష్ప ముంజియాల్ ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రాజేశ్ డోబ్రియాల్
- హోదా, బీబీసీ కోసం
డెహ్రాడూన్‌లోని సంపన్న కాలనీ డాలన్‌వాలాలో ప్రముఖ పాఠశాల వెల్హామ్ (గర్ల్స్) పక్కనే ఉన్న ప్రేమ్‌ధామ్ ఆశ్రమంలో మంగళవారం ఉదయం నుంచి సందడి మొదలైంది.
ఈ ఆశ్రమంలో నివసిస్తున్న 79 ఏళ్ల పుష్ప ముంజియాల్‌ను కలిసేందుకు చాలామంది వస్తున్నారు. వీరిలో మీడియా ప్రతినిధులే ఎక్కువగా ఉన్నారు.
మొన్నటివరకు పుష్ప ముంజియాల్ ఎవరో ప్రపంచానికి తెలీదు. ఆరోజు ఒక్కసారిగా ఆమె వెలుగులోకొచ్చారు. అందుకు కారణం, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన ఆస్తికి వారసుడని ప్రకటించడమే.
పుష్ప ముంజియాల్‌కు లక్షల్లో ఆస్తి ఉందని, అందులో 10 తులాల బంగారం కూడా ఉందని అంటున్నారు.
ఆమె దగ్గర 17 బ్యాంకు డిపోజిట్ సర్టిఫికెట్లు ఉన్నాయి. వాటి విలువ సుమారు 20 లక్షల రూపాయలు. అదంతా రాహుల్ గాంధీకి రాసిచ్చేశారు.
కాంగ్రెస్ పార్టీ వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న సమయంలో పుష్ప తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.
సోమవారం ఆమె తన వీలునామాను కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్‌కు అందించారు. అయితే, ఆమె తన వీలునామాను 2022 మార్చి 9 నాటికే సిద్ధం చేసి ఉంచారు.
ఈ విషయం ఇప్పుడు బయటికొచ్చిందిగానీ, గత పదేళ్లుగా పుష్ప చేస్తున్న సేవింగ్స్ అన్నిట్లో నామినీగా రాహుల్ గాంధీ పేరే ఇచ్చారు.

ఫొటో సోర్స్, RAJESH DOBARIYAL
రాహుల్ గాంధీని ఎంచుకోవడానికి కారణం?
ప్రేమ్‌ధామ్ వృద్ధాశ్రమానికి వచ్చే యోగా టీచరు సీమా జోహార్ ద్వారా పుష్ప కాంగ్రెస్ మెట్రోపాలిటన్ అధ్యక్షుడు లాల్‌చంద్ శర్మను సంప్రదించారు. శర్మ ఆమెకు కాంగ్రెస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతమ్ సింగ్‌ను పరిచయం చేశారు.
"రాహుల్ గాంధీ ఆలోచనలు ఆమెను చాలా ప్రభావితం చేశాయి. ఈ దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆయన కుటుంబం తమ జీవితాలను త్యాగం చేసిందని ఆమె భావిస్తున్నారు. అందుకే రాహుల్ గాంధీని తన వారసుడిగా ప్రకటించారు" అని శర్మ చెప్పారు.
బీబీసీతో మాట్లడుతూ పుష్ప కూడా అదే చెప్పారు.
"రాహుల్ గాంధీని వారసుడిగా ఎందుకు ఎన్నుకున్నానంటే, ఆయన పేదల గురించి చాలా ఆలోచిస్తారు. ఆయనకు అవకాశమొస్తే మంత్రదండంతో పేదలందరినీ ధనవంతులుగా మార్చేస్తారు" అన్నారామె.
రాహుల్ గాంధీ మంచితనం గురించి టీవీల్లో చూసి తెలుసుకున్నానని పుష్ప చెప్పారు. ఈ విషయాలపై ఇంకా వివరంగా మాట్లాడడానికి ఆమె ఇష్టపడలేదు.

ఫొటో సోర్స్, RAJESH DOBARIYAL
పుష్ప గతంలో కూడా అనేక దానాలు చేశారు. 1999లో ఉపాధ్యాయురాలిగా పదవీ విరమణ పొందిన ఆమె, తాను పొదుపు చేసిన మొత్తంలోంచి రూ.25 లక్షలను డూన్ ఆస్పత్రికి విరాళమిచ్చారు. అయితే, ఆ ఆస్పత్రి పనితీరు పట్ల ఆమె సంతృప్తిగా లేరు.
"ఆ డబ్బును ఆస్పత్రి ఏమి చేసిందో నాకెప్పుడూ చెప్పలేదు. విరాళం ఇచ్చినప్పుడు, ప్రతి సంవత్సరం ఆ డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారో చెప్పాలనే షరతు పెట్టుకున్నాం" అని పుష్ప చెప్పారు.
తన ఆస్తులను ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి సహాయనిధికి ఇవ్వడానికి బదులు రాహుల్ గాంధీకి ఇవ్వాలని నిర్ణయించుకోవడానికి ఇదీ కూడా ఒక కారణమని ఆమె చెప్పారు.
ఆశ్రమంలో వాళ్లు ఏమంటున్నారు?
పుష్ప పేరు మీడియాలో మారుమోగుతున్నప్పటికీ, వృద్ధాశ్రమంలో నిశ్శబ్దమే నెలకొని ఉంది.
ఆశ్రమంలో ఉంటున్న ఇతర మహిళలు, పుష్ప గురించి మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఆమె ఎక్కువ సమయం తన గదిలోనే ఉంటారని, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరని చెప్పారు.
ఆశ్రమంలో ఇతర మహిళలకు, పుష్పకు మంచి స్నేహసంబంధాలు లేవని, వాళ్లెవరూ ఆమెను ఇష్టపడరని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది, కొందరు వృద్ధ మహిళలు తెలిపారు. వారు తమ పేర్లు బయటపెట్టవద్దని కోరారు.
ఆమె బంధువులు ఆ ఊర్లోనే ఉన్నారని, వారికి ఆమె ఎప్పుడూ ఎలాంటి సహాయం చేయలేదని, ఆమె పరమ పిసినారి అని అక్కడి సిబ్బంది చెప్పారు.
'ఫ్రాన్సిస్కన్ సిస్టర్స్ ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గ్రేస్' అనే ఒక క్రిస్టియన్ ఛారిటబుల్ సొసైటీ ఈ ఆశ్రమాన్ని నడుపుతోంది.

ఫొటో సోర్స్, RAJESH DOBARIYAL
'పుష్పను సంతోషపెట్టడం అంత సులువు కాదు'
ప్రేమ్‌ధామ్ వృద్ధాశ్రమం 1990లో ప్రారంభమైందని ఆశ్రమ ఇన్‌చార్జి సిస్టర్ ఏంజెలిన్ తెలిపారు. ప్రస్తుతం ఆశ్రమంలో ఉన్నవారిలో అందరికన్నా సీనియర్ పుష్ప అని చెప్పారు. ఆమె గత 23 ఏళ్లుగా ఈ ఆశ్రమంలోనే ఉంటున్నారు.
ఈ ఆశ్రమం 40 మందికి ఆశ్రయం ఇవ్వగలదు. ప్రస్తుతం 29 మహిళలు, ఒక పురుషుడు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు.
ఈ వృద్ధాశ్రమంలో ఉండేవారితో కొంత సమయం గడపడానికి కవితా సింగ్ అప్పుడప్పుడూ వస్తుంటారు. వారి బాధలు, కష్టాలు వింటారు. అన్నీ మర్చిపోయి భగవంతుడిపై మనసు లగ్నం చేయమని వాళ్లకి చెబుతుంటారు.
ఆశ్రమంలో ఏర్పాట్లు చాలా బాగుంటాయని కవిత చెప్పారు.
అయితే, పుష్ప ముంజియాల్‌ను సంతోషపెట్టడం అంత సులువు కాదని ఆమె అన్నారు.
ఆశ్రమంలో భోజనం బాగుండట్లేదని ఒకసారి ఆమె డెహ్రాడూన్ జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారని ఇతర మహిళలు చెప్పారు.
భోజనం పట్టుకుని పుష్ప జిల్లా మేజిస్ట్రేట్ ఆఫీసుకు వెళ్లారు. ఆహారం, నీళ్లల్లో మట్టి ఉంటోందని ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణలో ఆహారం కలిషితమైనట్టు ఆధారాలేమీ కనిపించలేదు.
ఇవి కూడా చదవండి:
- డ్రగ్స్ కేసుల్లో ఇప్పటివరకు ఎవరినైనా శిక్షించారా, ఈ నేరాలకు ఎలాంటి శిక్షలు ఉంటాయి?
- విస్కీ టేస్ట్ దాని వయసు ముదురుతున్న కొద్దీ పెరుగుతుందంటారు... ఏమిటీ 'ఏజింగ్' మహిమ?
- పాకిస్తాన్ ముస్లిం మత బోధకుడు డాక్టర్ ఇస్రార్ ప్రసంగాల వల్లే యూదులను నిర్బంధించారా... యూట్యూబ్ ఆయన చానెల్‌ను ఎందుకు తొలగించింది?
- 'వరకట్నంతో అందంగా లేని అమ్మాయిలకు కూడా అందమైన అబ్బాయిలతో పెళ్ళి చేయొచ్చు...' ఇదీ బీఎస్సీ విద్యార్థులకు చెప్పే పాఠం
- గుజరాత్: కొత్తగా వచ్చిన పశు నియంత్రణ బిల్లు వివాదం ఏంటి... పశువుల యజమానులు ఎందుకు ఆగ్రహిస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















