'వరకట్నంతో అందంగా లేని అమ్మాయిలకు కూడా అందమైన అబ్బాయిలతో పెళ్ళి చేయొచ్చు...' ఇదీ బీఎస్సీ విద్యార్థులకు చెప్పే పాఠం

వరకట్నం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కట్నం తీసుకోవడం నేరమని చట్టం చెబుతోంది. కానీ, కొన్ని పాఠ్య పుస్తకాలు కట్నం తీసుకోవడం వల్ల ప్రయోజనాలున్నాయని చెబుతున్నాయి.

'టెక్స్ట్ బుక్ ఆఫ్ సోషియాలజీ ఆఫ్ నర్సెస్' అనే పాఠ్య పుస్తకంలో రచయత టీకే ఇంద్రాణి వరకట్నం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ పుస్తకం బీఎస్సీ రెండవ సంవత్సరం సిలబస్‌లో ఉంది.

పుస్తకంలోని ఆరవ అధ్యాయంలోని 122వ పేజీలో ఈ అంశాన్ని పొందుపరిచారు. అమెజాన్‌లో ఈ పుస్తకానికి 4.5 రేటింగ్ ఉంది.

పాఠ్యపుస్తకాల్లో వరకట్నం వల్ల ప్రయోజనాలు ఉన్నాయని రాయడం దేశానికే సిగ్గు చేటు అని రాజ్యసభ సభ్యురాలు, శివసేన నేత ప్రియాంక చతుర్వేది అన్నారు. ఇటువంటి పుస్తకాల సర్క్యులేషన్ ఆపాలని, పూర్తిగా నిషేధించాలని కోరుతూ ఆమె కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు లేఖ రాశారు.

ప్రియాంక చతుర్వేది

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రియాంక చతుర్వేది

ఈ పుస్తకంలో ఏముంది?

ఈ పుస్తకంలోని వరకట్నం ప్రయోజనాల గురించి వివరించిన పేజీని సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు షేర్ చేశారు.

ప్రియాంక చతుర్వేది కేంద్ర మంత్రికి రాసిన లేఖలో ఆ పుస్తకంలో రాసిన విషయాలను ప్రస్తావించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"కొత్తగా పెళ్లి చేసుకున్న వారు ఇంటిని సమకూర్చుకునేందుకు వరకట్నం ఉపయోగపడుతుంది. దేశంలో వరకట్నంలో భాగంగా గృహోపకరణాలను ఇచ్చే సంస్కృతి ఉంది. తల్లితండ్రుల ఆస్తి నుంచి అమ్మాయిలకు వచ్చే భాగాన్ని అమ్మాయికి కట్నంగా ఇస్తారు. అమ్మాయిలు చదువుకుని ఉద్యోగాలు చేస్తే, వరకట్నానికి ఉండే డిమాండ్ తగ్గడం కోసమే చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేయడాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇలా చేయడం వల్ల పరోక్షంగా ప్రయోజనాలున్నాయి." అని ఆ చాప్టర్లో రాశారు.

ఇంకా, "అంద వికారమైన అమ్మాయిలను ఆకర్షణీయమైన వరకట్నంతో అందమైన లేదా అంద వికారంగా ఉన్న అబ్బాయిలకు ఇచ్చి పెళ్లిళ్లు చేయవచ్చు" అని కూడా అందులో రాశారు.

ఇది చాలా మందిని ఆగ్రహానికి గురి చేసింది.

న్యాయవాది డాక్టర్ దీపా నాయర్
ఫొటో క్యాప్షన్, న్యాయవాది డాక్టర్ దీపా నాయర్

"ఇలాంటి పాఠాల ద్వారా యువతకు ఏం నేర్పిస్తున్నాం?"

"ఇలాంటి పాఠ్యాంశాల ద్వారా యువతకేం నేర్పిస్తున్నాం? అందంగా లేని అమ్మాయిలకు ఎక్కువ కట్నం ఇచ్చి అబ్బాయిని కొనుక్కోవచ్చనే ఆలోచనకు బీజం వేస్తున్నామా?" అని హైదరాబాద్ కు చెందిన న్యాయవాది డాక్టర్ దీపా నాయర్ ప్రశ్నించారు.

ఈ విషయం పై డాక్టర్ దీప మాట్లాడుతూ, "పుస్తకాల్లోఇలాంటి పాఠాలను చేర్చడం వరకట్నం పేరుతో మరిన్ని నేరాలకు పాల్పడేందుకు దారి తీస్తాయి తల్లితండ్రులు కట్నం ఇచ్చి కూతుర్ల పెళ్ళిళ్ళను చేయడం కంటే, వారిని చదివించి ఆర్ధికంగా స్వతంత్రులను చేసేందుకు చూడాలి" అని అన్నారు.

ప్రియాంక చతుర్వేది రాసిన లేఖలో ఏముంది?

పాఠ్యాంశాల్లో వరకట్న ప్రయోజనాలను చేర్చడాన్ని నిరసిస్తూ రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది విద్యా శాఖ మంత్రికి లేఖ రాశారు.

"ఇటువంటి అవమానకరమైన, సమస్యాత్మక సమాచారం పాఠ్య పుస్తకాల్లో ఉండటం దేశానికి, రాజ్యాంగానికి సిగ్గు చేటు"

"కట్నం తీసుకోవడం, ఇవ్వడం చట్టరీత్యా నేరం అయినప్పుడు ఇలాంటి కాలం చెల్లిన ఆలోచనలను పుస్తకాల్లో పొందుపరచడం దురదృష్టకరం" అని ప్రియాంక పేర్కొన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"ఇటువంటి తిరోగమన ఆలోచనలను విద్యార్థులకు నేర్పించడం పట్ల ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం మరింత విచారకరం. వరకట్న వ్యవస్థను ప్రోత్సహించడం నేరం. దీని పై సత్వర చర్య తీసుకోవాలి" అని ఆమె డిమాండ్ చేశారు.

ఇటువంటి పుస్తకాలను వెంటనే సిలబస్ నుంచి తొలగించాలని కోరారు. మహిళలకు వ్యతిరేకంగా ఉండే ఇటువంటి కంటెంట్ ను భవిష్యత్ లో కూడా ప్రచారం చేయకుండా చూసేందుకు పాఠ్య పుస్తకాలను ప్యానెల్ సభ్యులు సమీక్ష చేయాలని సూచించారు.

ప్రియాంక చెప్పిన అభిప్రాయంతో దిల్లీకి చెందిన కెరీర్ 360 కోచింగ్ సంస్థ డైరెక్టర్ పేరి మహేశ్వర్ కొంత వరకు ఏకీభవించారు.

"పుస్తకంలో వరకట్నాన్ని సమర్ధిస్తూ రాసిన అంశాన్ని ఆమోదించడం ద్వారా ప్యానెల్ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైంది" అని మహేశ్వర్ బీబీసీతో అన్నారు.

"రచయితల అభిప్రాయాలు, జీవన నేపథ్యం కూడా వారు రాసే రచనల్లో ప్రతిబింబిస్తాయి" అని ఆయన అన్నారు.

రూట్స్ కాలేజీ చైర్మన్ బీపీ పడాల
ఫొటో క్యాప్షన్, రూట్స్ కాలేజీ చైర్మన్ బీపీ పడాల

ఈ అంశం సిలబస్‌లో ఎందుకు?

పుస్తకంలోని ఆరో అధ్యాయంలో పొందుపరిచిన అంశాలను పూర్తిగా తెలుసుకోవలసిన అవసరముందని హైదరాబాద్‌లోని రూట్స్ కాలేజీ చైర్మన్ బీపీ పడాల బీబీసీతో చెప్పారు.

"భారతీయ సంస్కృతిలో అనాదిగా పాటిస్తున్న వరకట్న ఆచారం గురించి చర్చించడం తప్పు కాదని అంటూ, అసలు ఈ అంశం నర్సింగ్ సిలబస్ లో ఎందుకు చేర్చాల్సి వచ్చిందో అర్ధం కాలేదు" అని పడాల అన్నారు.

"ప్రాచీన సంప్రదాయంలో స్వచ్చందంగా అమలులో ఉన్న సంప్రదాయం ఆధునిక భారతదేశంలో వెర్రి తలలు వేసే విధంగా రూపాంతరం చెందింది. ఈ విధానాన్ని చర్చించడంలో తప్పు లేదు. కానీ, ఒక దురాచారాన్ని సమర్థిస్తూ రాయడం మాత్రం సరైంది కాదు" అని ఆయన అన్నారు.

"అందంగా లేని అమ్మాయిలకు ఎక్కువ కట్నం ఇవ్వడం ద్వారా పెళ్లిళ్లు చేయవచ్చని చెప్పడం సహేతుకంగా లేదు. దీనిని ఖండించాలి' అని అన్నారు.

బెంగళూరులోని ఓ ప్రముఖ కళాశాల 2017లో వరకట్నం ఇవ్వడం వల్ల ప్రయోజనాలున్నాయని విద్యార్థులకు ఇచ్చిన నోట్స్‌లో పేర్కొనడం వివాదాస్పదంగా మారింది.

ఆ కళాశాల ప్రొఫెసర్ కిరణ్ జీవన్ దీనిపై బీబీసీతో మాట్లాడుతూ, "మా పాఠ్యాంశంలో అది భాగం కాదు. కాలేజ్ వెబ్‌సైట్‌లో విద్యార్థులకు ఉపయోగపడే 20 పుస్తకాలను రిఫరెన్స్ కింద ఇచ్చాం. అందులో సామాజిక సమస్యలు అనే పుస్తకం ఒకటి. అందులోనే ఆ వివరాలున్నాయి. అది వేరే కాలేజీ టీచర్ రాశారు" అని చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ట్విటర్ వేదికగా చర్చలు

తాజాగా నర్సుల పాఠ్యపుస్తకంలోని వరకట్నం ప్రయోజనాల అంశంపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. కొందరు దీన్ని సమర్థిస్తూ, మరికొందరు వ్యతిరేకిస్తూ పోస్టులు పెడుతున్నారు.

వరకట్న వ్యతిరేక చట్టం కింద 2020లో 10,366 కేసులు నమోదు కాగా 6966 వరకట్న మరణాలు నమోదైనట్లు నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి. ఇవి 2018, 2019లో నమోదైన గణాంకాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయని నివేదిక చెబుతోంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక వరకట్న కేసులు నమోదయ్యాయి.

"పాఠ్య పుస్తకాల్లో ఇలాంటి అంశాలను చేర్చడం ద్వారా సమాజానికి తప్పుడు సంకేతాలను పంపిస్తున్నాయి" అని దీప అన్నారు. .

"ఒక వైపు గృహ హింస, వరకట్న నేరాలు పెరుగుతుంటే ఇలాంటి పాఠాలు కనిపించడం అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకునేందుకు కూడా దారి తీస్తాయి. కట్నం ఇవ్వలేని ఆర్ధిక స్థోమతలో ఉన్న తల్లితండ్రుల పరిస్థితి ఏంటి" అని ఆమె ప్రశ్నించారు.

"ఒక సమాజంగా అందరూ కలిసి ఇలాంటి పద్ధతులను తిప్పి కొట్టాలి. వరకట్న నిషేధ చట్టం వరకట్న ఆచారాన్ని రూపుమాపడంలో దారుణంగా విఫలమయింది. దీనికి తోడు రచయతలు పాఠ్య పుస్తకాల్లో, రచనల్లో తిరోగమన భావజాలాన్ని ప్రవేశపెడితే అది మరింత ప్రమాదకరం" అని డాక్టర్ దీప అన్నారు.

"ఇది చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఇలాంటి వాళ్ళపై డౌరీ ప్రొహిబిష‌న్ చట్టం కింద కేసు పెట్టాలి. ఆ పుస్తకాలు వెనక్కి తీసుకోవాలి. ఆమె ఎప్పుడూ టెక్స్ట్ బుక్స్ రాయకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలి. ఇన్సెన్సిటివ్‌గా రాసినందుకు మహిళలకు క్షమాపణలు చెప్పాలి. ఇంకెవ్వరూ ఇలాంటివి రాయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి" అని సామాజిక కార్యకర్త, స్త్రీవాద పత్రిక భూమిక సంపాదకురాలు సత్యవతి కొండవీటి అన్నారు.

పాఠ్యపుస్తకంలోని ఇలాంటి విషయాలు రాయడాన్ని ది ట్రయిన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఖండించింది. మార్కెట్‌లో ఈ పుస్తకం అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు జేపీ బ్రదర్స్ మెడికల్ పబ్లిషర్స్ తెలిపింది. ఈ సమాచారాన్ని నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులొకరు బీబీసీ ప్రతినిధి ఇమ్రాన్ ఖురేషీకి వెల్లడించారు.

వీడియో క్యాప్షన్, తూర్పుగోదావరి: 'కీడుపాక'ల స్థానంలో దివ్యకుటీరాలు నిర్మిస్తే విమర్శలు ఎందుకు వస్తున్నాయి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)