లైబీరియా టాక్సీ డ్రైవర్: రోడ్డు పక్కన దొరికిన రూ.38 లక్షలు తిరిగిచ్చేశాడు.. ఆ తర్వాత అతడి జీవితమే మారిపోయింది

- రచయిత, జోనాథన్ పాయె-లేలెహ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియాకు చెందిన ఇమ్మాన్యుయేల్ తులో కథ చదివితే చందమామలో వచ్చే మంచి నీతి కథలా ఉంటుంది.
19 ఏళ్ల తులో ఆకాశం రంగు చొక్కా, నావీ బ్లూ రంగు నిక్కరు యూనిఫాం వేసుకుని తనకన్నా వయసులో చాలా చిన్నవాళ్లయిన తోటి విద్యార్థులతో క్లాసులో కూర్చున్నాడు.
చిన్నప్పుడే స్కూలు మానేసిన తులోకు మళ్లీ బడిలో చేరడం సంతోషకరమైన విషయమే.
గత ఏడాది వరకు తులో మోటర్‌బైక్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అదే అతడి జీవనాధారం.
ఓరోజు తులోకు రోడ్డు పక్కన ఒక ప్లాస్టిక్ సంచీలో 50,000 డాలర్లు (సుమారు రూ. 37,84,042) కనిపించాయి. సంచీలో అమెరికా డాలర్లు, లైబీరియా నోట్లు ఉన్నాయి.
ఆ డబ్బును మడతబెట్టి జేబులో పెట్టేసుకోవచ్చు. కానీ, తులో అలా చేయలేదు. తన అత్తకు ఇచ్చి దాచమని చెప్పాడు.
డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి జాతీయ రేడియోలో సహాయం అడిగినప్పుడు తులో ముందుకొచ్చాడు. దొరికిన డబ్బును ఆ వ్యక్తికి అందజేశాడు.
తులో నిజాయితీకి మెచ్చి రిక్స్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు ఇచ్చారు. లైబీరియాలో అత్యంత ప్రతిష్టాత్మక పాఠశాలల్లో ఇదీ ఒకటి.
అంతటితో అయిపోలేదు. లైబీరియా అధ్యక్షుడు జార్జ్ వీహ్ తులోకు 10,000 డాలర్లు (సుమారు రూ. 7,56,823) బహుమతిగా ఇచ్చారు.
ఒక స్థానిక మీడియా సంస్థ యజమాని కూడా తులోకు కొంత డబ్బు ఇచ్చారు. ఇందులో కొంత భాగం శ్రోతలు, వీక్షకులు అందించినదే.
డబ్బు దొరికిన ఆనందంలో ఆ వ్యక్తి, తులోకు 1,500 డాలర్ల విలువైన కానుకలు ఇచ్చారు.
వీటన్నింటి కంటే ముఖ్యంగా, అమెరికాలో ఒక కాలేజీ, తులోకు పూర్తి స్కాలర్‌షిప్‌తో సీటు ఇచ్చింది. సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేయగానే తులో అమెరికా వెళ్లి ఆ కాలేజీలో చేరవచ్చు.

'స్కూలు బావుంది'
రిక్స్‌లో చేరడం చాలా బావుందని తులో అంటున్నాడు.
135 సంవత్సరాల క్రితం లైబీరియన్ సమాజంలోని ఉన్నత వర్గాల కోసం ఏర్పాటు చేసిన బోర్డింగ్ పాఠశాల అది. అట్లాంటిక్ సముద్ర తీరం నుంచి 6 కిమీ దూరంలో పచ్చని పరిసరాలతో ఉన్న అందమైన భవనం అది.
"స్కూల్‌లో ఎంజాయ్ చేస్తున్నా. రిక్స్ పెద్ద స్కూలు అని కాదు, అక్కడ చదువు, క్రమశిక్షణ బావుంది" అని తులో చెప్పాడు.
చాలామంది లైబీరియన్ పేద పిల్లల్లాగే తులో కూడా తొమ్మిదేళ్లకే బడి మానేసి పనిలోకి వెళ్లాల్సి వచ్చింది.
తులో తండ్రి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. దాంతో, తులో తన అత్త ఇంటికి చేరుకున్నాడు.
తరువాత, కొన్ని ఏళ్లకు తులో మోటర్‌బైక్ డ్రైవర్‌గా మారాడు. దానితోనే డబ్బులు సంపాదించేవాడు.
బడికి వెళ్లి చాలా కాలమైపోయింది కాబట్టి ఇప్పుడు స్కూలు చదువు తులోకు అంత సులభం కాదు. అతడికి చాలా సపోర్ట్ కావాల్సి ఉంటుంది.
రిక్స్‌లో తులో 6వ తరగతిలో చేరాడు.
"మొదట్లో కొంచం సిగ్గుపడేవాడు. క్లాసులో ఏమీ చెప్పలేకపోయేవాడు. కానీ, మేం అతడిపై శ్రద్ధ పెట్టాం. అంతకుముందు తులో పెద్దగా ఏమీ చదువుకోలేదు. అందుకే అతడిని ఎన్రిచ్‌మెంట్ ప్రోగ్రాంలో పెట్టాం. అది అతడికి తోడ్పడుతోంది" అని తులో క్లాస్ టీచర్ తాంబా బాంగ్‌బెయోర్ బీబీసీకి చెప్పారు.
మరో ఆరేళ్లల్లో తులో స్కూలు పూర్తిచేస్తాడు. అప్పటికి అతడికి 25 ఏళ్లు నిండుతాయి.
కానీ, వయసు వ్యత్యాసాన్ని తాను పట్టించుకోవట్లేదని, తన క్లాస్‌మేట్స్ అందరూ చాలా "స్నేహంగా ఉంటున్నారని" తులో చెప్పాడు.
బోర్డింగు స్కూల్లో ఉండడం కొత్త అనుభావాలనిస్తోందని అన్నాడు.
"బోర్డింగ్ స్కూలు హాస్టల్‌లో ఉండడం బావుంది. ఎప్పుడో ఒకప్పుడు మనం సొంతంగా జీవించడం నేర్చుకోవాలి కదా. అది ఇప్పుడే నేర్చుకుంటున్నా" అన్నాడు తులో.
భవిష్యత్తులో యూనివర్సిటీలో 'అకౌంటింగ్' సబ్జెక్ట్ చదువుకుంటానని తులో చెబుతున్నాడు.
అవినీతి పేరుకుపోయిన దేశంలో, అధికారులే జాతీయ వనరులను కొల్లగొడతారని పేరున్న చోట, తులో కనబరచిన నిజాయితీ, వివేకం ఉదాహరణలుగా నిలుస్తాయని పలువురు భావిస్తున్నారు.
'నిజాయితీగా ఉండడం మంచిది'
అంత డబ్బును తులో తిరిగి ఇచ్చాడని చాలామంది నవ్వారు. అతడు ఎప్పుడూ పేదవాడిగానే మిగిలిపోతాడని జోకులు వేశారు కూడా.
ఆ డబ్బుతో తను ధనవంతుడు కాగలడేమోగానీ "ఇప్పుడు తనకు దొరికిన అవకాశాలు ఎప్పటికీ దొరకవు" అని తులో అంటాడు.
"దేవుడికి కృతజ్ఞతలు. నిజాయితీగా ఉండడం నేర్పించిన నా తల్లిదండ్రులకు రుణపడి ఉంటాను. నిజాయితీగా ఉండడమే మంచిది. మీది కానిదేదీ మీరు తీసుకోవద్దు" అంటూ యువతకు సందేశం ఇస్తున్నాడు.
స్కూల్‌లో తులో ఫుట్‌బాల్ టీంలో చేరాడు. తన వయసున్న పిల్లలతో కలిసి ఆట ఆడుతున్నాడు.
అలాగే, మిగతా పిల్లలు కూడా తులో మంచి స్నేహితుడని చెబుతున్నారు.
తులో లాగే చిన్నప్పుడే స్కూలు మానేసిన పిల్లలు లైబీరియాలో ఎందరో ఉన్నారు. తులోకు మళ్లీ చదువుకునే అవకాశం రావడం సంతోషంగా ఉందని కొందరు అన్నారు.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్‌లోని బుచా వీధుల్లో ఎటు చూసినా శవాలే.. ‘చేతులు వెనక్కి విరిచికట్టి, తల వెనుక కాల్చారు’
- ‘ఇక్కడ కోర్సు చేస్తే ఏదో ఒక ఉపాధి దొరకడం ఖాయం.. పెద్దగా చదువుకోని గ్రామీణ యువతకు ఇది మంచి అవకాశం’
- ఉల్కాపాతమా? ఉపగ్రహం ముక్కలా? రాకెట్ అవశేషాలా? తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆకాశంలో కనిపించిన వింతకు కారణమేంటి?
- పుడింగ్ మింక్ పబ్: హైదరాబాద్ పార్టీలో డ్రగ్స్ కలకలం.. ఎవరెవరు ఆ పార్టీలో ఉన్నారు?
- పాకిస్తాన్: ఒకే అంశంపై ఇమ్రాన్ ఖాన్‌ది ఒక మాట.. సైన్యానిది మరో మాట
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













