ఉల్కాపాతమా? ఉపగ్రహం ముక్కలా? రాకెట్ అవశేషాలా? తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఆకాశంలో కనిపించిన వింతకు కారణమేంటి?

రాకెట్ అవశేషం
    • రచయిత, ప్రవీణ్ ముధోల్కర్
    • హోదా, బీబీసీ కోసం, నాగ్‌పూర్ నుంచి

శనివారం సాయంత్రం, రాత్రి అంతరిక్షంలో కనిపించిన కాంతులతో మహారాష్ట్ర ప్రజలు షాకయ్యారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఆకాశంలో ప్రకాశవంతమైన కాంతులు కనిపించాయి.

ఇది ఉల్కాపాతం అంటూ చాలామంది సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. ఉల్కలు ఆకాశం నుంచి రాలుతున్నాయంటూ పోస్టులు చేశారు. కొందరేమో ఇవి ఉపగ్రహాల ముక్కలు అయ్యుండొచ్చని, మరికొందరేమో ఇవి భారతదేశంపై విదేశాల నిఘా పరికరాలు అని ప్రచారం చేశారు.

''శనివారం రాత్రి చంద్రపూర్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం నుంచి కొన్ని ఎర్రటి వస్తువులు పడటాన్ని స్థానికులు చూశారు. లబ్దోరి గ్రామ పంచాయితీ భవనం వెనుక రాత్రి 7.45 గంటలకు ఒక లోహపు గుండు పడింది. ఎనిమిది అడుగుల చుట్టుకొలత ఉన్న, బరువుగా ఉన్న ఆ గుండు పడటంతో భూమికి గుంట పడింది. ఈ గుండును స్థానిక పోలీసు స్టేషన్‌కి తీసుకెళ్లాం'' అని సింగ్డెవాహి తహసీల్దార్ గణేశ్ జగ్దాలే బీబీసీకి చెప్పారు.

వీడియో క్యాప్షన్, ఆకాశం నుంచి రాలిపడిన అగ్ని గోళాలు.. ఉల్కలా? ఉపగ్రహ శకలాలా?
ఏప్రిల్ 2వ తేదీ శనివారం రాత్రి ఆకాశంలో కనిపించిన కాంతి
ఫొటో క్యాప్షన్, ఏప్రిల్ 2వ తేదీ శనివారం రాత్రి ఆకాశంలో కనిపించిన కాంతి

గొండ్‌పిప్రి, సింగ్దెవాహి, చిమూర్ తాలూకాల్లో కూడా ఆకాశం నుంచి ఏవో కిందికి పడుతున్నట్లు గ్రామస్తులు చూశారని ఖగోళ శాస్త్రవేత్త సురేశ్ చొప్నే తెలిపారు.

ఆకాశం నుంచి కిందికి రాలిపడిన ఆ వస్తువులు ఒక ఎలక్ట్రాన్ రాకెట్ బూస్టర్‌కి చెందినవని ఎంజీఎం ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ సెంటర్ డైరెక్టర్, ఖగోళ శాస్త్రవేత్త శ్రీనివాస్ ఔంధ్కర్ బీబీసీతో అన్నారు. న్యూజిలాండ్‌లోని మహియా ద్వీపకల్పంలో ఒక రాకెట్ ప్రయోగ కేంద్రం ఉంది. ఈ కేంద్రం నుంచి భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6.11 గంటలకు రాకెట్ లాబ్ అనే కంపెనీ తమ ఎలక్ట్రాన్ రాకెట్ ద్వారా బ్లాక్‌స్కై అనే ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించిందని శ్రీనివాస్ తెలిపారు. ఆ సమయంలో అంతరిక్షంలోకి ప్రయోగించిన రాకెట్ ఇదొక్కటేనని, కాబట్టి ఈశాన్య మహారాష్ట్రలో ఆకాశం నుంచి రాలిపడుతున్నట్లు కనిపించినవి ఈ ఎలక్ట్రాన్ రాకెట్ బూస్టర్ పరికరాలేనని వెల్లడించారు.

భూమిపై పడి మండిపోతున్న అవశేషం
ఫొటో క్యాప్షన్, భూమిపై పడి మండిపోతున్న అవశేషం

''ఈ బూస్టర్‌లు భూ వాతావరణంలో 30 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తులోకి వచ్చినప్పుడు ఘర్షణకు లోనవుతాయి. అప్పుడే వాటికి మంటలు అంటుకుంటాయి. ఆకాశంలో కనిపించిన కాంతి, దాని ప్రకాశాన్ని బట్టి ఇది ఉల్కాపాతం, ఫ్లయింగ్ సాసర్ కాదని స్పష్టంగా చెప్పొచ్చు'' అని శ్రీనివాస్ ఔంధ్కర్ తెలిపారు.

నాగ్‌పూర్ నగరం నుంచి కూడా రాత్రి 7.47 గంటల ప్రాంతంలో ఈ అంతుచిక్కని కాంతి కనిపించింది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన కథనం ప్రకారం ఆకాశం నుంచి 5-7 కాంతి పుంజాలు భూమివైపు దూసుకొచ్చాయి. నాగ్‌పూర్ ప్రజలు చాలామంది ఈ కాంతి భూమివైపు వస్తున్నప్పుడు ఫొటోలు, వీడియోలు తీశారు. దాదాపు 15 సెకండ్ల పాటు తాము ఈ కాంతి ప్రయాణాన్ని స్పష్టంగా చూశామని ప్రత్యక్ష సాక్షులు బీబీసీతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, వీడియో: న్యూయార్క్‌ ఆకాశంలో వింత కాంతి.. ‘ఏలియన్స్ రాకకు సంకేతమా?’

''ఆకాశంలో కనిపించిన కాంతికి భారత వాయుసేనకు, ఇండియన్ ఆర్మీకి ఎలాంటి సంబంధం లేదు. భారత వాయుసేన అధ్యయనాలు, విన్యాసాల వల్ల ఈ కాంతి రాలేదు'' అని భారత వాయుసేన అధికార ప్రతినిధి రత్నకర్ సింగ్ బీబీసీతో అన్నారు.

''ఏప్రిల్ 2వ తేదీ రాత్రి 7.50 గంటల ప్రాంతంలో ఈ కాంతి కనిపించింది. ఆకాశంలో ఉత్తర దిక్కు నుంచి తూర్పు దిక్కుకు ఇది ప్రయాణించింది. విదర్భ ప్రాంతంలో ఆకాశం గుండా ఇది ప్రయాణించింది. ఈ కాంతికి సంబంధించిన ముక్కలు కొన్ని భూమిపైనా పడ్డాయి. అయితే, ఎక్కడ పడ్డాయి అన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం. తొలుత ఏదో పాత ఉపగ్రహమో, రాకెట్ బూస్టర్ ముక్కో అన్నట్లు కనిపించింది'' అని ఖగోళ శాస్త్రవేత్త సురేశ్ చొప్నే తెలిపారు.

సింగ్దెవాహి వద్ద భూమిపై పడిన అవశేషం
ఫొటో క్యాప్షన్, సింగ్దెవాహి వద్ద భూమిపై పడిన అవశేషం

''కొన్ని ఉల్కల ముక్కలు ఒక్కోసారి అంతరిక్షం నుంచి భూ కక్ష్యలోకి వచ్చేస్తాయి. అలా భూ వాతావరణంలోకి వచ్చినప్పుడు ఘర్షణకు లోనై మండిపోతాయి. ఒక్కోసారి మంటలు అంటుకోకుండానే భూమ్మీద పడతాయి. ఇలాంటి ఉల్కలు పడటం వల్లనే పూర్వకాలంలో డైనోసార్లు చనిపోయాయి'' అని ప్రొఫెసర్ సురేశ్ చొప్నే అన్నారు.

''అయితే, ఉల్కలు ఆకాశం నుంచి రాలిపడటానికి ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి, శనివారం ఆకాశంలో కనిపించింది ఉల్కాపాతం కాకపోవచ్చు. ఏదైనా స్పేస్‌క్రాఫ్ట్ ముక్కలు కానీ, స్పేస్ లాబొరేటరీ, శాటిలైట్ ముక్కలు కానీ రాలిపడి ఉండొచ్చు'' అని ప్రొఫెసర్ సురేశ్ చొప్నే బీబీసీతో అన్నారు.

అయితే, స్థానికులు మాత్రం ఈ అంతుచిక్కని కాంతిని చూసి అవాక్కయ్యారు. కొందరు ఆసక్తి కనబరిస్తే, మరికొందరు గందరగోళానికి లోనయ్యారు. ఈ కాంతి ప్రయాణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

నాగ్‌పూర్‌తో పాటు ఖామ్‌గావ్, యవటల్, భండార, అమరావతి, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఈ కాంతిని ప్రజలు చూశారు.

వీడియో క్యాప్షన్, ఆ ఉల్క భూమిని ఢీకొట్టకపోతే డైనోసార్లు ఇప్పటికీ ఉండేవా? మానవ జాతి ఉనికిలోకి వచ్చేదేనా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)