సూర్య కాశీభట్ల: నిజజీవితంలోనూ సెరెబ్రల్ పాల్సీ ఉన్న ఈ మహేశ్‌బాబు ఫ్యాన్‌కు బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం ఎలా వచ్చింది?

విద్యాబాలన్‌తో సూర్య

ఫొటో సోర్స్, Prime Video

బాలీవుడ్ థ్రిల్లర్ సినిమా జల్సాలో సెరెబ్రల్ పాల్సీతో జీవిస్తున్న కుర్రాడిలా కనిపించిన సూర్య కాశీభట్ల నిజ జీవితంలోనూ ఆ వ్యాధితో బాధపడుతున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద సినీ పరిశ్రమల్లో ఒకటైన బాలీవుడ్‌లో ఇలాంటి అరుదైన సినిమాలో అతడికి ఎలా చోటు దక్కిందో, అతడి ప్రయాణం ఎలా జరిగిందో సుధా జీ తిలక్‌తో మాట్లాడుతూ వివరించారు సూర్య.

ఆహార ప్రియుడైన సూర్య వెజిటేరియన్. పియానో వాయిస్తాడు. క్రికెట్ కూడా ఆడతాడు. త్వరలో కంప్యూటర్ ప్రోగ్రమింగ్ కూడా నేర్చుకోవాలని అనుకుంటున్నాడు.

టెక్సాస్‌లో ఉండే అతడికి సొంత ఇన్‌స్టా హ్యాండిల్, యూట్యూబ్ ఛానెల్ ఉన్నాయి. ప్రస్తుతం అతడి ఫాలోవర్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది.

విద్యా బాలన్, షెఫాలీ షా లాంటి ప్రముఖ బాలీవుడ్ నటులతోపాటు అమెజాన్ థ్రిల్లర్‌ జల్సాలో సూర్య నటనపై కూడా ప్రశంసలు కురుస్తున్నాయి.

సూర్య కాశీభట్ల

ఫొటో సోర్స్, Prime Video

‘‘నాకు సెరెబ్రల్ పాల్సీ ఉంది. కానీ కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి అది అవరోధం కాదు’’ అని జూమ్ ఇంటర్వ్యూలో సూర్య చెప్పాడు.

ముంబయి నగరంలో సున్నితమైన భావోద్వేగాల చుట్టూ తిరిగే కథ జల్సా. దీనిలో ప్రముఖ న్యూస్ యాంకర్ కుమారుడు ఆయుష్ పాత్రలో సూర్య కనిపించాడు. వీడియో గేమ్‌లు ఆడుకుంటూ, సంగీతం వింటూ, అమ్మమ్మతో మొండిగా ప్రవర్తిస్తాడు ఆయుష్. అయితే, ఓ కారు ప్రమాదం కథను మలుపులు తిప్పుతుంది.

యూట్యూబ్ వీడియోల్లో క్యాస్టింగ్ డైరెక్టర్ మొదట సూర్యను చూశారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌పై సూర్య వీడియోలు చేసేవాడు. క్రికెట్ పాఠాలు చెప్పేవాడు. పాటలు కూడా పాడేవాడు.

తల్లి సునీత సనగరంతోపాటు ఓ కుటుంబ సన్నిహితుడు కూడా ప్రోత్సహించడంతో సూర్య ఆడిషన్‌కు వెళ్లాడు.

సూర్య కాశీభట్ల

ఫొటో సోర్స్, Prime Video

ఆడిషన్‌కు వచ్చిన వంద మందికిపైగా నటుల్లో నుంచి సూర్యను డైరెక్టర్ సురేశ్ త్రివేణి ఎంచుకున్నారు. కరోనావైరస్ వ్యాప్తి మొదలైన సమయంలోనే సూర్య ముంబయికి వచ్చి వర్క్‌షాప్స్‌లో పాల్గొన్నారు. అవి చాలా సరదాగా ఉండేవని, వాటి నుంచి చాలా నేర్చుకున్నానని తను వివరించాడు.

విద్యా బాలన్‌తో సూర్య ఇట్టే కలిసిపోయేవాడు. సినిమాలో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం కనిపిస్తుంది. తెరపై కూడా వీరు తల్లీ, కొడుకుల్లా చక్కగా కనిపిస్తారు.

సూర్య అలవోకగా నటిస్తాడని విద్యా బాలన్ అన్నారు. ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణా తీసుకోకపోయినప్పటికీ సూర్య నటన చాలా సహజంగా ఉంటుందని షెఫాలీ షా చెప్పారు.

‘‘నాకు సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం. వాటి నుంచే నేను నటన నేర్చుకుంటుంటాను. అర నిమిషం సీన్‌కు కూడా చాలా మంది కలిసి పనిచేస్తారు. అంతా చాలా బాగా అనిపిస్తుంది’’ అని సూర్య వివరించారు.

వీడియో క్యాప్షన్, RRR మూవీ రివ్యూ: ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి సినిమా ఎలా ఉందంటే..

భారత సినిమాల్లో వికలాంగుల పాత్రల్లోనూ అన్ని అవయవాలు బాగున్నవారే నటిస్తుంటారు. కానీ, జల్సా ఆ నియమాన్ని బద్దలుకొట్టింది. వికలాంగుల పాత్రలు వారికి ఇవ్వాలని, ఆ జీవితాల్లో ఉండే సున్నితమైన అంశాలు వారికే తెలుస్తాయని చాలా మంది అభిప్రాయపడుతుంటారు.

‘‘ఆ దిశగా జల్సా సినిమాలో సూర్యను తీసుకోవడం మంచి అడుగుగా చెప్పుకోవచ్చు. సినిమాలో అతడి పాత్రను చాలా గౌరవప్రదంగా చూపించారు’’అని దిల్లీకి చెందిన జర్నలిస్టు, వికలాంగుల ఉద్యమకర్త మధుసూదన్ శ్రీనివాస్ చెప్పారు.

సూర్య తండ్రి కృష్ణ కాశీభట్ల ఐటీ నిపుణుడు. సూర్య చుట్టుపక్కల మంచి వాతావరణం ఉండేలా అతడి తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. కుటుంబానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సూర్య అభిప్రాయాన్ని కూడా వారు పరిగణలోకి తీసుకుంటారు. అతడిని వేరుగా చూడకూడదని వారు నిర్ణయించుకున్నారు.

నాలుగేళ్ల వయసున్నప్పుడే తాను నటుడిని కావాలని నిర్ణయించుకున్నట్లు సూర్య తన తల్లిదండ్రులతో చెప్పాడు. టెక్సాస్‌లోని తన స్కూల్‌లో జరిగే ఫ్యాన్సీ డ్రెస్ పోటీలకు చక్కగా తయారై వెళ్లడమంటే తనకు చాలా ఇష్టం.

వీడియో క్యాప్షన్, ఉత్తరాదిని ఊపేస్తున్న తెలుగు సినిమా

తెలుగుతోపాటు ఇంగ్లిష్, హిందీ కూడా సూర్య మాట్లాడగలడు. బాలీవుడ్‌తోపాటు తెలుగు సినిమాలు కూడా అతడికి ఇష్టం. సైన్స్ ఫిక్షన్, మర్డర్ మిస్టరీలంటే తనకు చాలా ఇష్టం.

సూర్య ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ అవ్వాలని అనుకుంటున్నాడు. అయితే, సినిమాలో నటించిన అనుభూతులను తను ఎప్పటికీ మరచిపోలేనని వివరించాడు.

‘‘సెరెబ్రల్ పాల్సీతో బాధపడే యువకుడి పాత్రకు నన్ను తీసుకోవడంతో.. నాలాంటి వారిని సినిమాల్లోకి వచ్చే దిశగా ప్రోత్సహించినట్లు అవుతోంది’’ అని సూర్య వివరించాడు.

‘‘బాలీవుడ్ పరిశ్రమలో అన్ని వర్గాలకూ చోటు కల్పించే ప్రయత్నంలో నేను భాగం కావడం చాలా సంతోషంగా ఉంది.’’

బాలీవుడ్ హీరోలు హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్‌లతోపాటు టాలీవుడ్‌ హీరో మహేశ్ బాబు అంటే సూర్యకి ఇష్టం.

ఫేవరెట్ సూపర్‌హీరోలు ఎవరు అని అడిగితే.. ‘‘నా తల్లిదండ్రులే’’ అని సూర్య సమాధానం ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)