అఖండ సినిమా రివ్యూ: ‘ఒకడు ప్రకృతి.. ఇంకొకడు ప్రళయం’

అఖండ చిత్రంలో నందమూరి బాలకృష్ణ

ఫొటో సోర్స్, facebook/nandamuri balakrishna

    • రచయిత, రేఖ పర్వతాల
    • హోదా, బీబీసీ కోసం

భారీ అంచనాల మధ్య బోయపాటి, బాలకృష్ణ ''అఖండ'' సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1500 థియేటర్లలో రిలీజ్ అయింది.

సింగిల్ స్క్రీన్ థియేటర్ల కన్నా మల్టీప్లెక్స్ థియేటర్లు అడ్వాన్స్ బుకింగ్‌లోనే దాదాపు ఫుల్ అయిపోయాయి.

''బోత్ ఆర్ నాట్ సేమ్'' అనే ఒక్క డైలాగ్ చాలు తెలుగు సినిమాల్లో 'బోయపాటి-బాలకృష్ణ' సినిమాలు వేరని చెప్పడానికి. ఎందుకంటే లాజిక్కులకు దూరంగా మ్యాజిక్కులు చేస్తూ బాలయ్య అభిమానులను ఉర్రూతలూగించేలా అఖండ సినిమా ఉంది.

అయితే, కథ పరంగా పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. యపాటి మ్యాజిక్ సెకండాఫ్‌లో బాగానే పనిచేసింది.

బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్

ఫొటో సోర్స్, Akhanda Unit

ఫొటో క్యాప్షన్, బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్

ఆ ఊరి మోతుబరి రైతుకు ఇద్దరు కవల పిల్లలు పుడతారు. ఆ ఇద్దరి పిల్లల్ని చూసి ఒక స్వామీజీ ‘ఒకడు ప్రకృతి, మరొకడు ప్రళయం’ అని చెబుతారు.

ప్రకృతిని మీ దగ్గర పెట్టుకొని ప్రళయాన్ని ఆ దేవుడికి ఇమ్మని, ఆ శిశువుని తీసుకొని వెళ్తారాయన. ఆ శిశువు కాశీలో 'అఖండ సికిందర్ అఘోర' (బాలకృష్ణ) గా పెరుగుతాడు. అతనే సెకండాఫ్ మొత్తం కథ నడుపుతాడు.

ఇక రెండో పాత్ర మురళీకృష్ణ (బాలకృష్ణ) ప్రకృతిని కాపాడుతూ ఫ్యాక్షనిజాన్ని వదిలేసి వ్యవసాయం చేయమని రైతులను ప్రోత్సహిస్తుంటాడు.

ఈ మంచి పనులకు ఇంప్రస్ అయ్యి, అదే జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన శరణ్య (ప్రగ్యా జైశ్వాల్) మురళీ కృష్ణను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది.

విలన్ ఒక మఠాధిపతిని చంపి, ఆ మఠాన్ని ఆక్రమించి అతనే గురూజీలా చలామణి అవుతూ రెండో విలన్ వరదరాజులు (శ్రీకాంత్) తో మైనింగ్ చేయిస్తూ అడ్డొచ్చినవారిని అతి కిరాతకంగా హతమారుస్తూ ఉంటాడు.

ప్రభుత్వ అనుమతులు లేకుండా యురేనియం తవ్వకాలు చేయడం వల్ల ఆ గ్రామ ప్రజలు ప్రాణాలకు ముప్పు ఉందని తెలుసుకున్న మురళీ కృష్ణ, తవ్వకాలను ఆపాలని ప్రయత్నించి వరదరాజులు మూలంగా అరెస్ట్ కావడం.. ఈ క్రమంలో హిందూ మతాన్ని కాపాడాలని గుళ్లను పునరుద్ధరించాలని ధ్యేయంగా సాగిపోతున్న 'అఖండ' సమాజంలోకి రావడం జరుగుతాయి.

ఆ తరువాత మురళీకృష్ణ కుటుంబాన్ని అఖండ ఎలా కాపాడాడు? విలన్‌ను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది స్క్రీన్ మీద చూడాల్సిన మిగతా కథా విషయం.

అఖండ చిత్రంలో నందమూరి బాలకృష్ణ

ఫొటో సోర్స్, facebook/nandamuribalakrishna

ఇప్పటివరకు బాలకృష్ణ చేయని పాత్ర

చిరంజీవి - కోదండరామిరెడ్డి, అక్కినేని - దాసరి, ఎన్టీఆర్ - రాఘవేంద్రరావు లాంటి కాంబినేషన్స్ లాగా బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ తెలుగునాట మ్యాజికల్ హిట్ కాంబినేషన్ అని మరోసారి 'అఖండ'తో నిరూపించారు.

మురళీకృష్ణ పాత్ర బాలకృష్ణ చేసిన అనేక పాత్రల్ని గుర్తు చేసేలా ఉంటే 'అఖండ' పాత్ర మాత్రం ఇప్పటి వరకు బాలకృష్ణ చేసిన ఏ పాత్రను మనకు గుర్తు చేయదు. ఆ పాత్రని కొత్తగా మలిచారు.

బాలకృష్ణ పర్ఫార్మెన్స్, డైలాగ్స్ స్క్రీన్ మీద చూసి తీరాల్సిందే. అంత అద్భుతంగా ఆ పాత్రని బోయపాటి తీర్చిదిద్దారు.

కానీ బాలకృష్ణ హీరోయిజం చూపించడంపై పెట్టిన దృష్టిని కథపై పెట్టినట్టుగా అనిపించలేదు.బాలకృష్ణ కనిపించే ప్రతీ సీన్ ఎంట్రీ సీన్‌లా, ప్రతి ఫైట్ క్లైమాక్స్‌లా అదిరిపోయేలా ఉంటుంది.

అఖండ చిత్రంలో నందమూరి బాలకృష్ణ

ఫొటో సోర్స్, dwarakacreations

‘హింస ఎక్కువైంది’

"ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యగే" అనే ఒక్క వాక్యంతో ఈ సినిమా మొత్తం ఉంది. కలి పురుషుడి వల్ల ధర్మం దారి తప్పినప్పుడు ఆ ధర్మాన్ని రక్షంచడానికి దేవుడు అవతరిస్తాడనడం మనం విన్న విషయమే.

ఆ కలి ఈ సినిమాలో విలన్. ధర్మాన్ని దారి తప్పేలా చేస్తాడు విలన్. ఈ కారణంగా దేవుడు 'అఖండ' రూపంలో వచ్చి విలన్‌ను చంపి ధర్మాన్ని రక్షిస్తాడు.

బాలకృష్ణ ఎక్కడ మాట్లాడినా మాటకు ముందు, మాటకు తర్వాత ఒక హిందూ శ్లోకం చెప్పడం ఆయనకు బాగా అలవాటు. ఆ అలవాటుని ఈ 'అఖండ' రచయితలు బలంగా మార్చుకుని రాసిన కథ, మాటల్లా అనిపిస్తాయి.

సినిమాలో ప్రకృతి, వ్యవసాయం గురించి మంచి విషయాలు చెప్పినప్పటికీ సెకండాఫ్ మొత్తం మత ప్రబోధంతో కూడుకున్న హింస ఎక్కువగా ఉంది.

ప్రగ్యా జైశ్వాల్, బాలకృష్ణ

ఫొటో సోర్స్, facebook/pragyajaiswal

నేపథ్య సంగీతం

తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపించేందుకు వాడిన శబ్దాలు బోయపాటి ఎలివేషన్స్‌కి ప్రాణం పోశాయి.

ఇక హీరోయిన్ పాత్ర ప్రాధాన్యం ఏమీ లేదు. తన పాత్ర గురించి చెప్పాలంటే తను మొదట 'కలెక్టర్' తర్వాత మురళికృష్ణ భార్య తరువాత పిల్లకు తల్లి అంతే, మిగిలింది స్క్రీన్ మీద చూడండి.

బోయపాటి బాలయ్య మీదే పూర్తిగా ఫోకస్ చేశారు. మిగిలిన పాత్రలు అంత గొప్పగా ఏమిలేవు.

శ్రీకాంత్ విలన్ రోల్ 'లెజండ్' జగపతిబాబుకు వచ్చినంత పేరు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే విలన్స్ పాత్రలు చాలా పేలవంగా రాసుకున్నారు.

లాజిక్కులతో మాకు పని లేదు. బోయపాటి - బాలయ్య మ్యాజిక్స్ కావాలంటే 'అఖండ' అద్భుతంగా మీకు పండగ వాతావరణాన్ని కల్పిస్తుంది.

ఫైట్స్ చిత్రీకరణ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి.

అస్పాం, ఒడిశాలో జరిగిన మైనింగ్ మలినాలను రివర్స్ బోరింగ్ పద్దతి ద్వారా మళ్ళీ భూమిలోకే పంపించే విధానాన్ని సినిమాలో బాగా చూపించారు. అది ఎంత ప్రమాదమో స్క్రీన్ మీదే చూడాలి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)