అసలు కాలుష్యం కంటే టీవీ చానళ్లలో చర్చలు మరింత కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి: సీజేఐ ఎన్వీ రమణ

దిల్లీ కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

దిల్లీలో కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

కాలుష్య నియంత్రణకు యాంటీ స్మాగ్ గన్స్, దుమ్ము తగ్గించే విధానం ఉపయోగించి ధూళి నియంత్రణ చర్యలు చేపడతామని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అధ్యక్షతన ఏర్పాటైన ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు.

దిల్లీలో కాలుష్య నియంత్రణపై కమిషన్ సమావేశం నిర్వహించింది. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పట్టణాభివృద్ధి మంత్రులు మిగతా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పరిష్కారాలు వెతకడంపై చర్చించారని మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.

"అసలు కాలుష్యం కంటే, టీవీ చానళ్లలో పెడుతున్న చర్చలు మరింత కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి" అని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు.

"ఫైవ్ స్టార్, 7 స్టార్ హోటళ్లలో కూర్చున్న వారు రైతులపై ఆరోపణలు చేయడం విచారకరం. ఒక యంత్రం కొనడానికి ఎంత డబ్బు అవసరం అవుతుందో మీకు తెలుసా" అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.

బాణాసంచా పేల్చడం వల్ల పెద్దగా కాలుష్యం ఏర్పడదని, కోర్టు కూడా దాన్ని తనిఖీ చేయవచ్చని దిల్లీ ప్రభుత్వం తరఫు లాయర్ డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు చెప్పారు.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Reuters

అత్యవసర పరిస్థితిని ఎదుర్కోడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, భవిష్యత్తులో ఎలాంటి చర్యలు చేపడతారో చెప్పాలని సుప్రీంకోర్టు ధర్మాసనంలో మరో జడ్జి జస్టిస్ డాక్టర్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ లాయర్ సింఘ్విని అడిగారు.

"ధూళికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించాం. చాలా మంది నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించి, వారిపై చర్యలు కూడా తీసుకున్నాం" అని ఆయన సమాధానం ఇచ్చారు.

తాము దీర్ఘకాలిక చర్యలపై ఆసక్తి చూపడం లేదన్న అత్యున్నత న్యాయస్థానం, ఇప్పటి పరిస్థితిని ఎదుర్కోడానికి తక్షణ, అత్యవసర చర్యలు చేపట్టడంపైనే ఆసక్తి చూపుతున్నామని చెప్పింది.

"మేం చాలా చూశాం. జరిగింది చాలు.." అని సీజేఐ రమణ అన్నారు.

"మాకు వాస్తవాలు, గణాంకాలపై ఆసక్తి లేదు. కాలుష్యం తక్షణం తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో మాత్రమే మేం చూడాలనుకుంటున్నాం" అని అన్నారు.

దిల్లీలో వంద శాతం వర్క్ ఫ్రం హోమ్ ఉంది. మేం ఫైనాన్స్ కూడా ఇచ్చామని సింఘ్వి కోర్టుకు చెప్పారు.

కమిషన్ సూచించిన వాటన్నింటినీ తాము అమలు చేశామని, ఆదేశాలన్నీ అనుసరించామని హరియాణా ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు చెప్పింది.

"కమిషన్ ఏం చేయడం లేదు, ఎలాంటి సమర్థవంతమైన చర్యలూ చేపట్టడం లేదు" అని పిటిషనర్ ఆదిత్య దూబె తరపున వాదించిన సీనియర్ లాయర్ వికాస్ సింగ్ ఆరోపించారు. స్వయంగా కోర్టు ద్వారా కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని సింగ్ అభ్యర్థించారు.

"తక్షణం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. స్టెరాయిడ్స్, ఇన్‌హేలర్స్‌ లేకుండా, నేను నగరంలో మామూలుగా శ్వాస తీసుకోలేకపోతున్నాను. దిల్లీకి ఊపిరాడడం లేదు. నగరం పూర్తిగా ఊపిరాడని స్థితిలో ఉంది. దిల్లీకి వెంటనే పరిష్కారం చూడాలి" అని వికాస్ సింగ్ కోర్టుకు విన్నవించారు.

దిల్లీ కాలుష్యం

ఫొటో సోర్స్, Getty Images

ఈ సమావేశానికి వాతావరణ విభాగం నిపుణులు కూడా హాజరయ్యారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు చెప్పారు.

"నవంబర్ 21 నుంచి పరిస్థితి మెరుగ్గా ఉంటుందని, గాలి వీయడం, మిగతా అంశాలపై అది ఆధారపడి ఉంటుందని వాళ్లు చెప్పారు" అని మెహతా తెలిపారు.

"అయితే, మీరు చెప్పేదాన్ని బట్టి నవంబర్ 21 నాటికి ప్రకృతి మిమ్మల్ని(మెహతా) కాపాడ్డానికి వస్తుందంటారు".. అని జస్టిస్ సూర్యకాంత్ ఆయనతో అన్నారు.

"మీ కార్యాలయాలు మూసేయమని మేం అడగడం లేదు. ఒకవేళ 50 మంది క్లాస్ 4 లేదా క్లాస్ 3 ఉద్యోగులు ఉన్నారని అనుకుంటే, అప్పుడు వారు ప్రభుత్వ రవాణా వాహనాల్లో ప్రయాణించవచ్చు. అది సాధ్యమేనా, ప్రభుత్వం దానికి ఏర్పాట్లు చేయగలదా" అని జస్టిస్ సూర్య కాంత్ మెహతాను అడిగారు.

"బ్యూరోక్రసీ ఒక లాంటి జడత్వాన్ని పెంచింది. వాళ్లు కొన్ని చర్యలు తీసుకోవాలనుకోవడం లేదు. వాహనాన్ని ఎలా సీజ్ చేయాలని మాత్రమే చూస్తున్నారు. ఇది ఒకలాంటి ఉదాసీనత. అది బ్యూరోక్రసీ వల్లే పెరిగిందని చెప్పడానికి చింతిస్తున్నాను" అని సీజేఐ రమణ అన్నారు.

నవంబర్ 24న సుప్రీంకోర్టు ఈ అంశంపై తదుపరి విచారణ జరపనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)